మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )
66-నెమళ్ళ దిన్నె హుస్సేన్ గురు -1850-1929
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి వ్యవసాయ ముస్లిం కుటుంబం లో వనల చిన్న హుంసూర్ ,హుసేన్ బూ దంపతులకు 1850లో హుసేన్ పుట్టాడు .అయిదవ ఏటనే ఏకాంతంగా ధ్యానం చేసేవాడు .వయసుతో పాటు ధ్యానం గ్రంథ పఠనం సాధు సంతతిసేవ పెరిగాయి .పెళ్లిఅయినా మార్పు రాలేదు .అక్కడి శివనాగమయ్య బోధనలతో భక్తీ వైరాగ్యాలు పెరిగాయి .విరాగిలా పిచ్చి వాడిగా తిరిగేవాడు .ఒక రోజు కలలో ఒక పురుషుడు కనిపించి మర్నాడే మార్గదర్శనం జరుగుతుందని చెప్పాడు .అనుకొన్నట్లే మర్నాడు చంద్రోదయకాలం లో ఒక దిగంబర అవధూత వచ్చి హుసేన్ కు సౌఖ్య సూత్రం ,నాదానందం ,పంచ ముద్రలు సాకార నిరాకారాలు పరిపూర్ణం అమనస్కత వగైరా బోధించి ,శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు .
వెంటనే అడవిలో ఒక చెట్టెక్కి కొమ్మపై వెల్లకిలా పడుకొని ధ్యానమగ్నడయ్యాడు.తర్వాత సంసార బంధాలన్నీ తెంచుకొని ,అడవులలో తిరుగుతూ ,ఒక దేవాలయం లో బస చేయగా ఎందరో శిష్యులేర్పడ్డారు .అద్భుతాలు చూపేవాడు 27-10-1929శుక్ల ఆశ్వయుజ బహుళదశమీ ఆదివారం 79వ ఏట హుసేన్ గురుడు దేహం చాలించాడు .మర్నాటి ఉదయం సమాధి చేశారు .తర్వాత మందిరం కట్టి ఉరుసు ఉత్సవం చేశారు .ప్రతి చైత్ర పౌర్ణమి ,ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు ఆరాధనోత్సవాలు జరుపుతారు .
67-ఫిరోజీ మహర్షి -1829-1889
సత్తెనపల్లి మరాఠా వీధిలో నర్సోబీ నర్సూ బాయి దంపతులకు చిదంబర యోగి ఉపదేశించిన ఆదిత్య మంత్రోపాసన ఫలితంగా మొదటికొడుకుగా ఫిరోజీ పుట్టాడు .పెద్దయ్యాక సత్తెనపల్లిలో చిదానంద యోగిని సేవించి తారకమంత్రోప దేశం పొంది యోగరహస్యాలు గ్రహించాడు .తారకమంత్రం దీక్షగా జపిస్తూ , సద్గ్రంథాలు చదువుతూ ,సాధువులను సేవిస్తూ ,పద్యాలు కీర్తనలు రచించాడు .నూజి వీడుకు చెందినఘటకాల వెంకోజీ కుమార్తె వీరాబాయితో వివాహమై ,ఆత్మ దర్శనాభి లాష పెరిగి ,పంచదశి సీతారామాన్జనేయం రామస్తవరాజం ,వాసుదేవ మననం ,ఉపనిషత్తులజ్ఞాన సారం వంటబట్టి౦చు కొన్నాడు .బాలుడిగా ఉండగానే యోగసిద్ధులు పొందాడు
వేదాంత ప్రవచనాలను అత్యంత సులభంగా సుబోధకం గా ఫిరోజీ బోధించేవాడు .దీనితో సుదూర ప్రాంతాలనుంచి జనం వచ్చి వినేవారు . అద్వైతి అయినా అన్ని భావాళ వారినీ మతాలవారినీ ఆదరించేవారు .సంచారం చేస్తూ జ్ఞానబోధ చేసేవారు. 9-7-1889 విరోధి ఆషాఢ శుద్ధ ఏకాదశి మంగళవారం 60 ఏళ్ళవయసులో పెద్దకొడుకు లక్ష్మాజీ రావు కు హితోపదేశం చేసి ,గురు పీఠం నెలకొల్పమని చెప్పి ,బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేశారు .తోటలో సమాధి చేశారు .పూర్వం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆరాధన చేసేవారు .అది వర్షాకాలం కావటం తో ఇప్పుడు లఘు పూజ మాత్రమె ,చేసి మాఘ శుద్ధ ఏకాదశినాడు పెద్ద ఎత్తున ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు .
68-రామ యోగి కవి -1825-1895
మార్కాపురంతాలూకా సుంకేసుల లో కాశ్యప గోత్రీకులైన విశ్వబ్రాహ్మణ దంపతులు పున్నోజు శేషయ్య వీరమ్మ లకు రామయ్య పుట్టాడు .అక్కడే చదివి ,పండితులవద్దసాహిత్య ఛందో వ్యాకరణాలు జ్యోతిష గృహవాస్తు జలవాస్తు ,శల్యవాస్తు విద్యలు నేర్చాడు .స్వర్ణ దారు శిల్ప కళలలో ఆరితేరాడు ,.మంచి కవిత్వం రాసేవాడు .సజ్జన సాంగత్యం లో వేదాంత వాసనా అలవాటైంది .సుబ్రహ్మణ్య బ్రాహ్మణ గురువు వద్ద బ్రహ్మోపదేశం పొంది,మహానందిలో మూడు నెలలు కఠోర సాధన చేశాడు .
తడకనపల్లి స్థిరపడి ,నిస్సంగం గా సంసారం ఈదుతూ అష్టాంగ యోగం లో నిష్ణాతుడై ,బ్రహ్మ సాక్షాత్కారం పొంది ,రాజయోగి అయి ,వాక్సుద్ధి దూరదృష్టి,దూర శ్రవణం అలవడిసాహిత్య వేదాంత రాజయోగాలు శిష్యులకు బోధించాడు .మహా నందీశ్వరుడికి అంకితమిస్తూ చాలా గ్రంథాలు రాశాడు .వాటిలో శంకర శతకం ,మహానంది లింగ శతకం ,వేదాంత సూత్రాలు ,షట్ స్థల దర్పణం,పంచరత్నాలు ,నవరత్నమాలిక ,శంభు శతకం ,లింగ మూర్తి పాట,భ్రమరాంబా దండకం ,రామతారక బ్రహ్మ శతకం ,మహావాక్య ప్రకరణం ,శుద్ధ రాజయోగం ఉన్నాయి .ముందుగానే శిష్యులకు చెప్పి 5-12-1895 మన్మథ మార్గశిర బహుళ తదియ గురువారం 70వ ఏట రామయోగి శివైక్యం చెందారు .తడకన పల్లి లో సమాధి చేసి లింగప్రతిష్ట మందిర నిర్మాణం చేశారు .మార్గశిర బహుళ తదియనాడు ఆరాధన రధోత్సవం వైభవం గా చేస్తారు .
69-సయ్యద్ ఆహ్మదలీ ఖాదర్ వలీ -1868-1948
నల్గొండ జిల్లా గొల్లపల్లి జాగీర్దార్ వంశం లో సయ్యద్ అహ్మదలీ ఖాదర్ వలీ 1868 లో జన్మించి తూగోజి అమలాపురం తాలూకా ముమ్మడి వరం మండలం కొత్తలంకలో 1948 సిద్ధి పొంది కొత్తలంక యోగి గా ప్రసిద్ధుడయ్యాడు .1921 జనాభా లెక్కలప్రకారం ఆయన వయసు 125ఏళ్ళు .కనుక పుట్టింది 1796 గా భావిస్తారు .1850 కుండలేశ్వర గ్రామం గౌతమీ నది ఒడ్డున మిథాయి దుకాణం వద్ద మొదటిసారి గోచీతో కనిపించాడు .శరీరం తడవ కుండా గౌతమీ నదిని రెండు సార్లు దాటటం చూసి సిద్ధ పురుషుడుగా భావించారు .
రాజమండ్రి కోటి లింగాలవద్ద ఉండే కృష్ణావదూతే వలీ గారి అనుగ్రహం కోసం పరితపించి సేవించి తరించారు .తన పరీక్షలో నెగ్గిన వారినే శిష్యులుగా తీసుకొనేవారు .శుభాశుభ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు చెప్పేవారు .బ్రాహ్మణులతో సహా అన్ని వర్ణాలవారూ శిష్యులయ్యారు .ఖండయోగం ప్రదర్శించేవారు .రంగూన్ సైనికాధికారి ఆదేశం తో బ్రిటిష్ వారు దాడిచేస్తారని కాలజ్ఞానం చెప్పారు .కొబ్బరికాయలకు కొమ్ములు మొలిపించి ఆశ్చర్యపరచారు .22-1-1948 మిలాది నబి మహమ్మద్ ప్రవక్త జన్మ దినం రోజున సర్వజిత్ పుష్య శుద్ధ ఏకాదశి గురువారం జీవ సమాధి చెందారు .ఆయన సమాధి వద్ద వరుసగా మూడు రోజులు నిద్ర చేస్తే సాక్షాత్కరించిన సంఘటనలు చాలా ఉన్నాయి .1947 రాష్ట్రనాయకులు కళావెంకటరావు ,బులుసు సాంబమూర్తి గార్లు వలీ గారిని దర్శించే నాటికి ఆయనవయసు 175ఏళ్ళు అని అంచనా .1953లో సమాధిపై దర్గానిర్మించారు .దేశం నాలుగు మూలలను౦ చేకాక కువైట్ ,పాకిస్తాన్ దుబాయ్ వంటి దేశాలను౦చి కూడా భక్తులు వచ్చి దర్గా సందర్శిస్తారు .
70-కవి యోగి ధేనువ కొండ వెంకయ్య -1851-1936
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గార్లపాడులో ధేనువకొండ పిచ్చయ్య కనకమ్మలకు వెంకయ్య 1851లోపుట్టాడు .ధేనువకొండ వేణుగోపాలస్వామి భక్తుడు .వారసత్వంగా సంగీత సాహిత్యాలు అలవడినాయి . తండ్రి అసంపూర్ణంగా రాసివదలిన ‘’వామన పురాణం ‘’యక్షగానం సమర్ధంగా పూర్తి చేసి తండ్రి మెప్పు పొందాడు .మేనత్తకూతురు కనకమ్మ ను పెళ్ళాడాడు.సంతానం కలగలేదు .నిరతాన్నదానం వలన ఆర్ధిక ఇబ్బండులేర్పడ్డాయి .సిరి సంపదలు సాధించాలని కాశీవెళ్లి మంత్రసిద్ధులను సాధించి పదేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు .
మంత్రోపాసన ధ్యానధారణ తోపాటు హరికథలు యక్షగానాలు రాశాడు .మొదటి రచన ‘’విరాట పర్వం ‘’జంగం కథ ను తన ఇష్టదైవం ధేనువకొండ వేణుగోపాలస్వామికి అంకితమిచ్చాడు .ఎరి నైనా సద్గురువు ను దీక్షితుడై యోగాధ్యయనం చేసి సేవించి ,సన్యాసం స్వీకరించాలనే సంకల్పం తో కుర్తాళ0 వెళ్లి సిద్దేశ్వర పీఠ౦ స్థాపించిన పీఠాధిపతి మౌనస్వామిని దర్శించి ,శివ చిదానంద భారతీ స్వామిశిష్యుడై సన్యాస దీక్షను ‘’శ్రీరామతారక బ్రహ్మానంద అవధూతేంద్ర సరస్వతి ‘’దీక్షానామం పొందారు .తర్వాత తీర్ధయాత్రలు చేస్తూ అనంతపురం తాడిపత్రి చేరి ,కరణం గారి తోటలో విడిది చేసి,లీలలు అద్భుతాలు ప్రదర్శిస్తూ ,ఆదివ్యాధులను నయం చేస్తూ ,జ్ఞానబోధ చేస్తూ జనాలను సన్మార్గం లో పెట్టారు .12-3-1936యువనామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి గురువారం 85వ ఏట కపాల చేదనం చేసుకొని కవియోగి,అవదూతేంద్ర సరస్వతి విశ్వ చైతన్యం లో కలిసిపోయారు .ఘనంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .
మనకు తెలియని మహాయోగులు సమాప్తం
ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే తెలియజేసినట్లు ‘’మనకు తెలియని మహాయోగులు ‘’ధారావాహికకు ఆధారం –శ్రీకొత్తపల్లి హుమంతరావు గారి రచన ‘’మహా యోగులు’’.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-20-ఉయ్యూరు

