పరిశోధన’’ ఆనంద మూర్తి’’ శ్రీ వేటూరి -1
తండ్రి చేసిన పరిశోధన కొనసాగించటం చరిత్రలో అరుదైన విషయం .అలాంటి దాన్ని సాధించిన వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమారుడు ప్రొఫెసర్ శ్రీ ఆనంద మూర్తి .తాళ్ళపాక కవుల సంగీత పదాలపై చాలా కృషి జరగాలని భావించి తాళ్ళపాక కవుల సంగీత విజ్ఞానపు మెరుగులు కనుగొనే ప్రయత్నం లో ఏడు కొత్త పాటలు కనిపెట్టారు .ఆనందమూర్తి గారు ఉస్మానియా యూని వర్సిటి ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .టాగూర్ నేషనల్ ఫెలోషిప్ గ్రహీత కూడా .85వ ఏట కాకినాడలో తెలుగు సాహిత్య కృషికి గాను దంటు భాస్కరరావు స్మారక జీవిత సాఫల్య పురస్కారం అందుకొన్నారు.ఆయన పిహెచ్ డి చేసిన ‘’తెలుగు సాహిత్యం పై వైష్ణవం ప్రభావం –అందులో ప్రత్యేకంగా తాళ్ళపాక కవుల ప్రభావం ‘’పరిశోధన గ్రంథం రెండవ ప్రచురణ కూడా ఆవేదికపై జరిగింది .తండ్రిగారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పరిశోధన వారసత్వం కొనసాగిస్తున్నారు ఆనందంగా ప్రొఫెసర్ ఆనందమూర్తి .శాస్త్రిగారు తెలుగు సాహిత్యం తాళ్ళపాకఅన్నమాచార్యులపై పై గొప్ప పరిశోధన చేసినవారని మనకు తెలిసిన విషయమే.తనకు ఫెలోషిప్ వచ్చిన సందర్భం లో మూర్తి గారు ‘’ఈ ఫెలోషిప్ నాకు ఇండియాలో ఏ రిఫరెన్స్ లైబ్రరీకైనా వెళ్లి ,నా పరిశోధన సాగింఛి ,పూర్తి చేయటానికి ఒక పాస్ పార్ట్ లాంటిది .నేను చాలా ప్రయాణం చేసి నా రిసెర్చ్ కోసం ఎంతో నోట్స్ సంపాదించాలి ‘’అన్నారు .
ఆనందమూర్తి గారు పై ప్రాజెక్ట్ వర్క్ తో సరి పుచ్చుకోలేదు .కొన్ని శతాబ్దాల క్రితం ‘’’మారీచ దేశం ‘’అయిన మారిషస్ కు వలస వెళ్ళిన తెలుగు ప్రజల జీవిత విధానాలలో వచ్చిన మార్పులను కూడా తెలియ జేసిన విషయం చాలామందికి తెలియ దేమో .1966-70కాలం లో ఆయన మారిషస్ లో విద్యాశాఖాధికారి గా ఉన్నప్పుడు ట్రెయినింగ్ కాలేజి లో తెలుగు శాఖను ఏర్పాటు చేయటం లో గొప్ప కృషి చేశారు .మరొక నాలుగేళ్ళు 1976నుంచి ,అక్కడే పని చేసి ,ఆదేశం లో జరిగిన సెమినార్లు వర్క్ షాప్ లలో భాగం పంచుకొన్నారు .అక్కడ ఆర్కైవ్ లను పరిశీలిస్తుంటే ‘’ఆంధ్ర దేశం లో కాకినాడ దగ్గరున్న’’ కొరింగ ‘’ లో పొన్నమండ వెంకట రెడ్డికి నాలుగు నౌకలు ఉన్నట్లు ,వాటిని 1827లో అక్కడి నుంచి కూలీలను మారిషస్ కు రవాణా చేసినట్లు కనుగొన్నారు .ఆయన షిప్ ‘’కొరంగి పాకెట్’’ లో అక్కడి నుంచి మారిషస్ కు మొదటి దఫా 300మంది కూలీలను పంపినట్లు రికార్డ్ అయి ఉందని చెప్పారు .కొరంగి నుంచివచ్చిన ఈ తెలుగు వారిని మారిష లో ‘’కొరంగిలు ‘’అని పిలిచేవారట .ఇక్కడి మొదటి తరం తెలుగు వారి పేర్లనే ఇప్పటి తరం వారుకూడా ఇంటి పేరుగా చెప్పు కొంటారు .అక్కడి తెలుగు వాళ్ళ ఇంటిపేర్లు’’ ఓబిగాడు ,అప్పడు ‘’ గా ఉండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుందని మూర్తిగారు అన్నారు
అన్నమయ్య సాహిత్యంపై అధ్యయనం చేశారు .. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశారు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్ శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందారు.
రచనలు
1. తాళ్లపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు
2. తాళ్లపాకకవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు
3. క్షేత్రజ్ఞులు పదసాహితి
4. మన వాగ్గేయకారులు-తొలి సంకీర్తన కవులు
. 2017,ఫిబ్రవరి-7న, కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామ౦ లో, వీరు రచించిన ఆంధ్ర సాహిత్యంపై విష్ణు మత ప్రభావం – తాళ్ళపాక కవులు అను గ్రంధావిష్కరణ జరిగినది. .
గిడుగు వారినీ వేటూరి వారినీ పోలుస్తూ ఆనందమూర్తిగారు ‘’గిడుగు వరద గోదావరి .వేటూరి ప్రసన్న కృష్ణ వేణ్ణ’’అన్నారు బాపిరాజు కృష్ణానదిని ‘’కన్నబెన్న ‘’అని ముద్దుగా పిలిచాడు.గిడుగు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు .వేటూరి నిశబ్ద అనుయాయి ,భాగస్వామి .వారిద్దరు ఆఉద్యమ౦ లో తెలుగు భాష కు జీవం ,తేజస్సు కూర్చిన మహానుభావులు .గిడుగు వెంకట రామమూర్తి గారు వ్యావహారిక భాషోద్యమం లో చివరిదాకా అంతు లేని పోరాటం సలిపి ,1940లో ప్రశాంతంగా ,రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ లాగా మరణించారు అంటారు ఆనంద మూర్తి గారు ..
.సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-20-ఉయ్యూరు