గాయకులలో కొందరు బహుళ ప్రజాదరణ పొందితే, అందులో కొందరు బహుముఖ ప్రజ్ఞను చాటితే ,వారిలో అరుదుగా అతికొద్దిమందిమాత్రమే ఫలప్రదమౌతారు .అలాంటి అరుదైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం .కర్నాటక సంగీతం లో ఏమాత్రం ప్రవేశం లేనిస్థాయి నుంచి అత్యుత్తమ సంగీత గాయకుడుగా రూపు దాల్చాడు .సంగీత జ్యోతి కాంతులు విశ్వ వీధుల్లో ప్రజ్వరిల్ల జేశాడు .’’రాగాలన౦తాలు నీ వేయిరూపాలు –భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు ‘’అన్న శంకరాభరణం చిత్రం లోని వేటూరి పాటకు నిలువెత్తు గాన జ్యోతి గా భాసింఛి భారతీయ లౌకికవాదాన్ని విశ్వవ్యాప్తం చేశాడు .అలుపెరుగని గాన రవళితో అర్ధ శతాబ్దం తనదైన ముద్ర వేశాడు .అందులో ముప్పై ఏళ్ళు తనకు సాటి ఎవరూ లేరని 40వేల పాటలు 16భాషలలో పాడి నిరూపించాడు .వయసు మీదపడుతున్నా యువకోత్సాహం చల్లారలేదు .భావోద్వేగం తో నవ్వు, విషాదం .దుఖం , ప్రేమ ,శృంగారం ఒలికించిన పాటలు చిరస్మరణీయాలు .అందులో విషాదాన్ని అత్యద్భుతంగా అతని స్వరం ఆవిష్కరించింది ..అమెరికన్ కవి లాంగ్ ఫెలో అన్నట్లు అతని మరణం మన హృదయాలపై మరణ మృదంగ ధ్వని విన్పించి నిద్ర పుచ్చాయి .గానమే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించిన సార్ధకజీవి బాలు .ఘంటసాల మాస్టారి ‘’పాడుతా తీయగా ‘’ను తానూ అంతగా పాడి, ప్రపంచ దేశాల వర్ధమాన గాయనీ గాయకులచేత గానం చేయించి, భారతీయ సినీ సంగీత లహరి ని ఎల్లలు దాటించి ప్రవహింప జేసిన కారణ జన్ముడు గానగంధర్వ బాలు అనే పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.
ఈ విశ్వ గాయకుడు ‘’బాలు’’ కు గోదావరి జిల్లా రచయితల సంఘం (గోరసం )అధ్యక్షుడు,కవి కధకుడు, నిత్యోత్సాహి శ్రీ శిష్టు సత్య రాజేష్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల 88 కవులచే ఘననివాళి గా కవితా కల్హారాలు పూయించి , ‘’గాన గందర్వుడు బాలు ‘’గా చక్కని పుష్పమాల కూర్చి విశిష్ట నివాళి అందింఛి అందరికీ మార్గదర్శి అయ్యాడు .ఇక్కడ 88 సంఖ్య ను’’ దేవతా సంఖ్య’’ అంటే ఏంజెల్ నంబర్ అంటారు .కనుక ‘’సంగీతదేవత’’కూడా ప్రత్యామ్నాయం కావచ్చు .ఇందులోని కవితలు బాలుని విభిన్న కోణాలలో ఆవిష్కరి౦చి అతని బహుముఖ ప్రజ్ఞాశీలతను మనముందుంచుతాయి .’’ఆతను నడిచిన బాట౦తా పాటల పరిమళమే ‘’అని రాదికారాణి అంటే ,అతడిది రసామృతమనీ .అక్షర ప్రతిరూపమనీ ‘’స్వాతి,అతనిపేరులోని అక్షరాలకూర్పుతో రాజేష్ ‘’గమకానికి చిరునామా ,భారత స్వర సౌధం ‘’అనగా. శీనమ్మ’’సంగీతసామ్రాజ్ఞానికి మకుటం లేని మహారాజు ‘’అనీ హావభావ రాగ మనోహరగానమని ముక్కా ,శృతి లయలగతులు మార్చాడని స్వర్ణలత ,’’పాటే మంత్రం ‘’అని రాజ్యలక్ష్మీ ,’’శ్రోతకు స్వరాభిషేకం ,పాటకు పట్టాభి షేకం చేసిన గాన త్రివిక్రమ విక్రముడు ‘’అని పరిమి ,’’ప్రణవ నాదానికి ప్రాణం పోసిన భిషగ్వరు ‘’ డని వీరమణి వీర తాళ్ళు వేశారు ‘’నూతన గళాలకు నడకలు నేర్పిన గానమయూరి ‘’అని శైలజ ,’’ఆగాన లహరికి వెన్నెల జలపాతం వెలవెల బోతుంది ‘’అని మాకే ,’’గాన తేజస్వీ ,పాటల తపస్వీ ‘’అని మంజీత ‘’పాటతో హాయి నింపే శాంత ముగ్ధుడు ‘’అంటూ కవిత,’’సప్తస్వరాల గుప్త నిక్షేపం ‘’అని దుర్గా ,’’ప్రేమికులను ,శ్రామికులను మెప్పించిన గానం ‘’అని ముద్దు ,’’పాటను ఇష్టపడిపాడాలికాని కస్టపడి కాదు ‘’అని సుద్దు చెప్పాడని పద్మావతి ,’’పండిత పామర హృదయనేత పండితారాధ్యుడు’’అంటూ పరాంకుశం ,’’ఒక్కడై వచ్చి ఒక్కడై వెళ్లి శూన్యం మిగిల్చాడు ‘’అని బొక్కేల,,’’గాయక ,నట ,సంగీత దర్శక బాలు ‘’అని రామారావు ,’’వినమ్రతకు నిలువెత్తు నిదర్శనం ‘’అని శైలజ మొదలైన వారంతా తమ మనోభావాలకు కమ్మని కవితా మాలలల్లి విశ్వగాయకుడు బాలు కు విశిష్ట నీరాజనం పట్టారు .ఈ కవితా కదంబం చక్కగా ఉన్నా చిక్కగా లేక, వదులొదులుగా ఉందేమో అనిపించింది .మంచి ప్రయత్నం. రాజేష్ తోపాటు కవులందరికీ అభినందనలు .
గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-20-ఉయ్యూరు

