హాం రేడియో విజ్ఞాన సర్వస్వం

 

హాం రేడియో విజ్ఞాన  సర్వస్వం

ఉయ్యూరు హైస్కూల్ లో నా జూనియర్ ,నా ప్రాణ స్నేహితుడు సూరి నరసింహం తమ్ముడు సూరి శ్రీరామ మూర్తి ,ఢిల్లీ లో టెక్నీషియన్ గా పని చేస్తూ ,వారానికో సారి నాకు చాలా వివరంగా ఇన్లాండ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడు .ఆతర్వాత  ఎమెచ్యూర్ రేడియో అనే హాం రేడియో ను ఇండియాలో వ్యాప్తి చేసే సంకల్పం తో చాలా శ్రమ పడి,స్వయం కృషితో ,తీవ్రమైన అధ్యయనం తో,అధికారులవివిధ దేశాల పెద్దల , పరిచయాలతో దాన్ని సాధించి పయనీర్ అనిపించుకొన్నాడు .అతడు ఉయ్యూరు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి తన హాం రేడియో ప్రగతిని వివరించే వాడు. నాకు అది గ్రీక్ అండ్ లాటిన్ గా, కోతలు గా అనిపించేవి .క్రమంగా అతని గురించి పేపర్లు రేడియో టివి ఇంటర్వ్యులతో అతడి గొప్ప తనం ఏమిటో అర్ధమైంది ఆరేడియో సభ్యులు యెంత విశ్వ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలను ముందే కనిపెట్టి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ముందు చూపుతోసమన్వయము చేస్తూ బాధితులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ ,ప్రభుత్వాల ,ప్రజల ,ప్రజా సంస్థల అభిమానం పొందుతున్నారో అర్ధమైంది అతడిపై ఆరాధనా భావం ఏర్పడి అంతటివాడు నాకు ఆప్తమిత్రుడైనందుకు గర్వమూ కలిగింది .అతడు రాసిన ఆర్టికల్స్ నాకు పంపేవాడు వచ్చినప్పుడు హాం సమాచార విషయాలు తెలియ జేసేవాడు ఫోటోలతో సహా .కృష్ణా  జిల్లా హైస్కూల్స్ ,కాలేజీ లలో దాన్ని పరిచయం చేయటానికి చాలా తంటాలు పడ్డాడు కానీ పెద్దగా ఎవరికీ ఎక్కిన దాఖలా లేదని పించింది అంతా ‘’లైట్ తీసుకొన్నారు ‘’అయినా పట్టు వదలని విక్రమార్కుడుగా ఈ ‘’పొట్టిసూరి’’ అనే  శ్రీరామమూర్తి త్రివిక్రముడై విశ్వ హృదయం లో చిరస్థానం సంపాదించి ,చిర యశస్సు నార్జించాడు .మా ఉయ్యూరు కు ’’ హాం చిత్ర పటం’’ లో ముఖ్య స్థానం కల్పించాడు .ఉయ్యూరు కు చెందిన ‘’కేమోటాలజీ పిత డా కొలచల సీతారామయ్య ‘’ గారిపై నేను పుస్తకం రాసి సరసభారతి ద్వారా ప్రచురించి ఉయ్యూరు కాలేజి లో ఆవిష్కరింప జేసినప్పుడు సూరి అతని భార్య ,సీతారామయ్య గారి బంధువులు కూడా పాల్గొని విజయవంతం చేశారు .మేమిద్దరం ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా టచ్ లోనే ఉంటున్నాం .

  నిన్న సాయంత్రం అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చి  సూరి తాను రాసిన ‘’ALL ABOUT AMETEUR RADIO –HAAM RADIYO ‘’ అనే430 పేజీల  ఉద్గ్రంధం నాకు అందజేసి ,నేను ఇచ్చిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడూ తీసుకొని సంతోషించాడు ఒకగంట సేపు తన అనుభవాలు గుది గుచ్చి మాట్లాడాడు .ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడో శాఖా చంక్రమణం చేసి ముగించటం సూరి ప్రత్యేకత .చెప్పిన దాంట్లో సార్వకాలిక సత్యాలు అనుభవాలు అనుభూతులే ఉంటాయి .ఈ మధ్య నేను రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య’’ధారా వాహిక నెట్ లో చదివి బెస్ట్ కాంప్లిమెంట్ కూడా చేసిన సహృదయుడు సూరి .

  ఇప్పుడే అతడిచ్చిన పుస్తకం తిరగేశా .అద్భుతం అని పించింది .అందులో ఆపుస్తకం గురి౦చి, అతని గురించి విలువైన అభిప్రాయాలు రాసిన మాటలలో సూరిని మీకు ఆవిష్కరించి చూపుతున్నాను .పాప్యులర్ హాం ప్రమోటర్ అమెరికా కు చెందిన-  మిస్టర్ గార్డెన్  వెస్ట్’’ఇది అద్భుతమైన పుస్తకం  ,హాం గురించిన విజ్ఞాన సర్వస్వం .ఇండియాలో, ప్రపంచం లోనూ హాం రేడియో గురించి తెలుసుకొనే వారికి గొప్ప’’ కర దీపిక ‘’  అన్నాడు .డాక్టర్ ఫేజెల్ యు.ఆర్.రెహ్మాన్ –చైర్మన్ NIAR ‘’రచయితకు రాజీవ్ గాంధీ రాజకీయ నాయకుడు కాకముందు నుంచి పరిచయం ఉండటం ,హాం రేడియో విస్తరణపైవారిద్దరూ  సుదీర్ఘంగా ఆలోచనలు చేయటం ,ప్రణాళికకలు రచించటం గురించి అత్యంత విస్తృతంగా రాశాడు .దేశ ప్రణాలికా రచయితలూ ,సిద్ధాంత కర్తలు హాం రేడియో చేసిన అద్భుత కృషిని గుర్తించారు ‘’అన్నాడు .జర్మని కి చెందిన ఫ్రాంజ్ బెర్నేట్ ‘’ఈ పుస్తకం ఆసా౦త౦ చదివాను .ఇది ప్రత్యేక పుస్తకం .ఇండియన్ అమెచ్యూర్ రేడియో గురించి సాధికారమైన వివరణ ఉంది .అంకిత భావం తో యువ హామ్స్ఇండియాలో ,ముఖ్యంగా విపత్తుల సమయం లో చేసిన నిస్వార్ధ సేవను ప్రతి బి౦బి౦చి౦ది ‘’అంటాడు .మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు ‘’చాలాకాలంగా సూరి నాకు పరిచయం .నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో –NIAR స్థాపించటం లో అతడు ప్రవక్త –ప్రోటాగనిస్ట్.దీనిద్వారా అతడు ప్రజలకు అందించిన సేవ నిరుపమానం .ఎందరో ప్రజల ధన,మాన ప్రాణ జీవితాలను కాపాడిన నిస్వార్ధ సేవ అతడిది .అతడి సేవలను ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రపంచ వ్యాప్తం గా బాగా గుర్తించాయి .మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్-‘’సూరి అత్యద్భుత గుణాలు మూర్తీభవించిన నాయకుడు .ప్రపంచ ప్రసిద్ధ NIARస్థాపించటం లో ఆయన దూర దృష్టి, విజ్ఞత కనిపిస్తుంది . సూరి ,ఆ సంస్థ ప్రకృతి సిద్ధమైన విపత్తులలో చూపినచచొరవ ,వేలాది మనుష్యుల జంతువుల ప్రాణాలను,ఆస్తులను  కాపాడటం లో చూపిన నైపుణ్యం చిరస్మరణీయం ‘’అన్నారు .’’సాంకేతిక విషయ వివరణలో ఈ గ్రంథం ఒక మహా విజ్ఞాన సర్వస్వమే .క్రిస్టల్ లాడర్ ఫిల్టర్  నుంచి పి.ఎ.ట్రాన్సిస్టర్ దాకా నిర్మాణం ఇందులో వివరంగా ఉన్నది ,సరదాగాఇండియాలో హాం రేడియో గురించి తెలుసుకోవాలన్నా ,ప్రపంచ వ్యాప్త హాం రేడియో గురించి అంతరిక్షం లో హాం సీలు తెలుసుకొని అర్ధం చేసుకోవాలన్న వారందరికీ  ఈ పుస్తక౦ గొప్ప మార్గదర్శి ‘’ అని  గార్డన్ వెస్ట్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు .ఇంతటి విలువైన గ్రంధాన్ని ఎంతో పరిశోధనతో ,పరిశీలనతో రాసిన ఆప్తమిత్రుడు సూరి శ్రీరామ మూర్తి నా దృష్టిలో ‘’హాం సూర్యుడు అంటే హాం సూరి ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.