మనమెరుగని మహా భక్తులు  -2 1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

మనమెరుగని మహా భక్తులు  -2

1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

తగిన వధువుతో దాసుకు వివాహం చేసి కొత్త ఇల్లు కట్టించి అందులో గృహప్రవేశం చేయించారు శాస్త్రి దంపతులు .గృహ కృత్యాలమీద ఆసక్తి లేని దాసు భార్యను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి చేరేవాడు .కొంతకాలానికి శాస్త్రి చనిపోయాడు .కుటుంబ భారం దాసుపై పడినా పెద్దగా పట్టించుకోలేదు .రేపల్లె ,భట్టిప్రోలు వైశ్యులు ఆకుటుంబ భారం తామే వహించారు .రాం భజన చేస్తూ దాసు కాలం  వెళ్ళ బుచ్చుతున్నాడు .దాసు భార్య గర్భవతి అయింది .ఆమెకు భట్టిప్రోలు వైశ్యులు ఆమెకు  చీని చీనా౦బరాలు సమకూర్చి ఒక బ్రాహ్మణుడికిచ్చి పంపారు. దాసుకు ఆబ్రాహ్మణుడు దారిలో కనిపిస్తే అవి తీసుకొని తానె ఇంటికి వెళ్లి భార్యకిస్తానని చెబితే నమ్మి ఇచ్చేశాడు ఆబాపడు .ఆమూట నెత్తిమీద పెట్టుకొని రామభజన చేస్తూ ఇంటికి వస్తుంటే దారిలో ఒక చెట్టు కింద నిండు చూలాలైన భిల్లస్త్రీ కనిపిస్తే ‘’అమ్మా నన్ను సోదరునిగా భావించి వీటిని తీసుకో’’అని నెత్తిపైఉన్న మూటను ఆమెకిచ్చేసి బ్రహ్మానందం పొందుతూ ఎక్కడెక్కడో తిరిగాడు .ఈ విషయం తెలిసిన భట్టిప్రోలు ప్రజలు మళ్ళీ అన్నిటినీ సమకూర్చి స్వయంగా తామే ఇంటికి వెళ్లి దాసు భార్యకు  ఇచ్చి సంతృప్తి చెందారు .కొడుకు పుట్టగా రామారాయుడు అనే పేరు పెట్టారు .

  పుత్ర జననానికి సంతోషించి ,భక్తజనాలతో కలిసి గ్రామాలు తిరుగుతూ భజనలు ఉపన్యాసాలతో ప్రజలలో ఆధ్యాత్మిక భావ వ్యాప్తి చేశాడు దాసు .గుంటూరులో శిష్యులు చాలామంది చేరారు .ఒకసారి రేపల్లె ఏడాది కాలంగా వర్షాలేలేవు .జనం బాధ పడుతుంటే అనుకోకుండా అక్కడికి వచ్చిన దాసు ‘’భయం వద్దు .ఒక మూడు గంటలలో వర్షం కోసం రామాజ్ఞ అయింది ‘’అని చెప్పి స్వగ్రామం వెళ్ళాడు .దాసు మాట నమ్మని ప్రజలు శివాలయం లో సహస్రఘటాభిషేకానికి ఏర్పాట్లు చేశారు .సరిగ్గా దాసు చెప్పిన సమయానికే బ్రహ్మాండమైన వర్షం కురిసి అందరికి ఆనందం కలిగి దాసు మాట కు విలువ పెరిగి౦ది.

  శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ శ్రీరామనవమికి భద్రాచలం చేరి సీతారామ కల్యాణం కనులారా చూస్తూ భజన చేద్దామనుకొంటే పందిళ్ళలో ఇసుక వేస్తె రాలనంత భక్తజనం ఉండటం చూసి ,ఆలయ ముఖమండపం చేరి తాళాలు త౦బు రాలతో ఆనంద భైరవి రాగం ఆట తాళం లో ‘’కనులకు కనపడవేమి శ్రీరామా ?రామయ తండ్రీ !ఇంత కన్నడ సేయ గ కారణమేమి ?’’

ఎక్కడనున్నావో నాస్వామి నాకి౦కెవరయా దిక్కు సర్వాంతర్యామి ‘’

గుహుడు కడిగిన పదము లేవి ?జనకకూతురు కూర్చున్న వామాంక మేది?పయిడి ముగ్గుల గొలుసు లేవీ ?చేత బట్టిన మంచి తీరు కమానులేవీ ?మంచి పచ్చల పోగులేవీ ?తళుకు మించిన నీ వ్రేళ్ళ యుంగరము లేవీ ?ఘంట మొలనూలుఏదీ ? బొజ్జ గదల తళుకు మను కౌస్తుభమేదీ ?ముద్దులు గులుకు మోమేదీ ,జగన్మోహనమైన మీచిరు నగవేదీ ?వరదుడిచ్చిన హారమేదీ ?తూము నరసింహు డర్చించు చరణము లేవీ ?శ్రీ భద్రాచల విహార ,తులసీ దళ హార ,హే సింధు గంభీర ,పరమ దయారస పూర ,నాగేశ్వర దాస మందార జగదేక వీరా ‘’అని తన్మయం లో కీర్తి౦చగానె ,కల్యాణం లోఉన్న విగ్రహాల షోడశ కళలను లేపి ,దాసు ముందు ఆవహి౦ప జేసి ఆన౦దించాడు కళ్యాణ రాముడు .అది కనులారా చూసిన దాసు కాఫీ రాగం ఆట తాళం లో –‘’నాపాలి భాగ్య మేమందు ,రఘునాధుడు కనిపించే ముందు ,పాపము లెల్ల బాపు శ్రీరాముల రూపము కనులకు రూది గా గనిపించే ‘’అని భక్తీ తన్మయం లో గానం చేశాడు .ఈ విషయం తెలిసిన తూము నరసింహ దాసు స్వయంగా వచ్చి దాసును సగౌరవంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వెళ్లగా ఆవిగ్రహాలు మళ్ళీ షోడశ కళలతో విరాజిల్లాయి .నాగేశ్వర దాసు మహాత్మ్యాన్ని అక్కడి వారందరూ గ్రహించి అపూర్వం గా సత్కరించి గౌరవించారు .

 భద్రాచలనుంచి మళ్ళీ తీర్ధ యాత్రలు చేస్తూ శ్రీరంగం చేరి రంగడిపై శతకం రాసి అంకితమిచ్చాడు నాగేశ్వర దాసు .ఇల్లు వదిలిన ఎనిమిదేళ్ళకు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు .మర్నాడే దాసు గారబ్బాయి అకస్మాత్తుగా చనిపోయాడు .హరి భజన చేస్తూ పుత్ర శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్లి ఖననం చేసి ,నిర్విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు దాసు .బంధువులు ఓదారుస్తుంటే ‘’రుణాను బంధ రూపేణ పశు పత్ని సుతాలయః ‘’అన్న వాక్యం బోధించి ,రామనామం చేయించాడు .

  ఒక సారి తండ్రి తద్దినం రోజున భోక్తలను పిలవటానికి వెడుతుంటే ,ఒక బీద వర్తకుడు తనషాపులోని చెన్నూరు పుట్నాలను ఇస్తే ,తింటూ ,పురోహితుడు ధర్మ సూరి ఇంటికి వెళ్లి తద్దినానికి ఆహ్వానిస్తే వినీ విననట్లు నటించి ‘’దాసుగారు ఏదో భుజిస్తున్నారే ?”’అన్నాడు .’’తడవర్తివెంకయ్య శ్రేష్టిభక్తితో సమర్పించిన’’ తప్త చణక శకలాలు ‘’భక్షిస్తున్నా. ఇవాళ మానాన్న గారి ఆబ్దికం .భోక్తకు రమ్మని ప్రార్ధన ‘’అన్నాడు .’’తండ్రి తద్దినం రోజున కొమటిచ్చిన  సెనగపప్పు తింటూ నన్ను భోక్తకు పిలుస్తావా ?నేనే కాదు ఊళ్ళో ఏ బ్రాహ్మణుడు మీ ఇంటికి  భోక్త గా రాడు’’అని కటువుగా చెబితే బ్రతిమాలినా వినిపించుకోకపోతే ,చేసేది లేక ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పి వంట చెయ్యమన్నాడు రామాజ్ఞతో అంతా సవ్యంగా జరుగుతుందని భరోసా ఇచ్చాడు దాసు .ఆమె అలాగే అని వంట చేసింది .ఇంతలో ఇద్దరు దూరాధ్వగులైన-అంటే దూర దేశం నుంచి వచ్చిన బాటసారు లైన  బ్రాహ్మణులు వస్తే వారినే భోక్తలుగా నియమించి తద్దినం పూర్తి చేశాడు దాసు .ఇలాంటి అతి మానుష కార్యాలు చేసిన భక్త నాగేశ్వర దాసు 72వ ఏట పునరావృత్త రహిత శాశ్వత బ్రహ్మలోకం చేరారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.