మనమెరుగని మహా భక్తులు -1
1-కోటం రాజు నాగేశ్వర దాసు -1
భాస్కర మంత్రి శాయమాంబ లకు పుత్రుడు కోటం రాజు నాగేశ్వర దాసు చిన్నప్పుడే తల్లీ తండ్రీ చనిపోయారు .పోషించే వారు ఎవరూ లేకపోవటం తో సదా చార సంపన్నుడు రామభక్తుడు ఎల్లేపెద్ది పాపన్న శాస్త్రి తీసుకొని వెళ్లి పెంచాడు .పరమ సాధ్వి అయిన అతని భార్య సుబ్బ మాంబ పిల్లాడిని చాలా ప్రేమగా పెంచింది .ఒక ఏడాదికి అ దంపతులకు ఒక కొడుకు కూతురు పుట్టారు .ఇదంతా నాగేశ్వరుని చలువే అని పొంగిపోతూ మరింత జాగ్రత్తగా నాగేశ్వరదాసును పెంచారు .
అయిదవ ఏట నే బడిలో వేశారు .లౌకిక విద్యలపై ఆసక్తి లేక నాగేశ్ ఒకపూటమాత్రమే బడికి వెడుతూ ,రెండో పూట ఏకాంతం గా ధ్యానం చేసేవాడు .ఎవరితోనూ ఆడుకోకుండా ముద్దుమటలతో పెంచినవారికి ఆనందం పంచకుండా నిరంతర భగవధ్యానం లో గడిపే అతడిని చూసి పాపన్న పిచ్చి పట్టిందేమో నని అనుమానం తో మందూ మాకు ఇప్పించాడు .ప్రయోజనం శూన్యం .ఎక్కడెక్కడో తిరిగే అతడిని వెదికితెచ్చి భోజనం పెట్టేది తల్లి .ఎనిమిదవయేట ఉపనయనం చేశారు .సంధ్యావందనం చేయటానికి గురువు వద్దకు పంపిస్తే ,గురువు సుబ్బావధానులు కూడా శ్రద్ధగా కూర్చోబెట్టి సంధ్యావందనం చేయించేవాడు .ఆమంత్రాల అర్ధం చెప్పమనేవాడు ఇప్పుడు కాదు అని ఆయన అంటే అర్ధం లేని చదువు వ్యర్ధం అని అంటే అర్ధ తాత్పర్యాలు బోధించేవాడు .ఒకరోజు ‘’అన్ని వేళలా దేవుడిని స్మరించేవాడు పవిత్రుడు కదా?’’అని అడిగితే ఆచారాలు పాటించకపోయినా ,తననే నమ్మితే అతడే సదా చారం కలవాడని కృష్ణ పరమాత్మ చెప్పాడని గురువు వివరించాడు .మరో సారి భగవన్నామ జప మహా భాగ్యం ఉంటె మంత్రాలతో పని లేదనీ చెప్పాడు .ఆమాటకు చిరునవ్వు తో సంధ్యావందన మంత్రాలు పూర్తిగా చెప్పమని కొరగా ఆశ్చర్యం తో నేర్పాడు .ఆకాశాత్పతితం తోయం ‘’శ్లోకానికి తాత్పర్యం అడిగితె చక్కగా వివరించాడు గురువు .ఇక తనకు మంత్రాలతో పని లేదని చెప్పి ,అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగేశ్వరుడు .ఈ విషయమంతా వెళ్లి పాపన్న శాస్త్రికి గురువు చెప్పేశాడు
నిత్యం సంధ్యావందన జపహోమాలు చేసే పాపన్న శాస్త్రి రోజూ ఆధ్యాత్మ రామాయణం పారాయణం చేసేవాడు .ఒక రోజు దానికోసం వెదికితే కనపడకపోతే ‘’పిచ్చినాగన్న పనే ‘’అయి ఉంటుందని కొడుకునుపంపి వెదికింఛి నాగేశుని ఇంటికి పిలిపి౦చి ఆపుస్తకం ఏమైంది అని అడిగితే తనదగ్గరున్న సంస్కృత తాళపత్ర గ్రందాన్నీ ,దానికి తెలుగులో పద్యరూపంగా అనువాదం చేసిన కొత్త రచనను తండ్రికిచ్చాడు .రెండవదాన్ని ఎవరు రాశారని అడిగితే‘’శ్రీరామ చంద్ర మూర్తి ‘’అని బదులిచ్చాడు .అప్పుడు అతడి పరమభక్తికి సంతోషించి అతడి పద్యానువాదానికి అబ్బురపడి గట్టిగా ఆలింగనం చేసుకొని ఆనందించాడు శాస్త్రి .ఎంతకాలం నుంచి రాస్తున్నావు ?’’అని అడిగితె ‘’నిన్న రాత్రి రామాజ్ఞ అయినప్పటి నుంచి ‘’అన్నాడు దాసు .పాపన్న ఆన౦దానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది .
ఒకరోజు నాగేశు తండ్రితో ‘’బాల అయోధ్య కాండలు పూర్తయ్యాయి .అరణ్యకాండ రాయాలి.దానికి దానికి నాలుగు రోజులు ఏకాంతం కావాలి .మన ఇంట్లో ఒక గదిలో నేను కూర్చుని రాస్తాను .ఎవరూ వచ్చి నన్ను ఆటంక పరచవద్దు. నాకు వీలైనప్పుడు వచ్చి భోజనాదికాలు చేస్తాను. అనుజ్ఞ ఇవ్వండి ‘’అని కోరాడు .అలాగే అని ఒకగదిలో అతడిని ఏకాంతంగా ఉంచి అతనికోరికప్రకారమే గదికి బయట తాళం వేసి ముద్రకూడా వేసి రోజూ పని చేసే న్యాయస్థానికి వెళ్ళాడు పాపన్న శాస్త్రి .మూడు రోజులు గదిలోనుంచి బయటకు రాలేదు దాసు .శాస్త్రి కూడా ఏమి జరుగుతోందో అనే ఆందోళనతో మూడు రోజులూ గడిపి నాలుగవ రోజు ఉండబట్టలేక తలపు బద్దలు కొట్టాలనే ప్రయత్నం లో ఉంటే స్నేహితుడు వచ్చి వారించి ఇంకొక్క రోజు ఆగమని చెప్పాడు .సరే అన్నాడు శాస్త్రి .నాలుగవరోజు అసలు నాగేశు బతికి ఉన్నాడో లేదో అనుమానం నాలుగురోజులనుంచి భోజనం లేదని ఆరాటం తో గది తలుపులు బద్దలు కొట్ట టానికిసిద్ధమయ్యారు .ఇంతలో లోపల గొళ్ళెం తీసిన చప్పుడు వినిపించింది .నాగేశ్వరుడు కన్నీరు కారుస్తూ రెండు గ్రంధాలను చేత్తో పట్టుకొని బయటకు వచ్చాడు .కొత్త గ్రంధాన్ని పరిశీలించి చూడగా ఆరణ్యకాండ పూర్తయినట్లు కనిపించి అందరూ అతడిని కావలించుకొని ఆనంద బాష్పాలు కార్చారు శాస్త్రి నాలుగు రోజులనుంచీ భోజనం కూడా చేయలేదు .ఆదుర్దాతో .కొడుకును గట్టిగా ఆశ్లేషించి ‘’నాయనా నాలుగు రోజులనుంచి తిండిలేకుండా ఎలా ఉన్నావు ?’’అనిఆడిగితే ‘’రామ చంద్ర మూర్తి అరణ్యవాస విషయాలను వెల్లడిస్తూ దుఖాన్ని ఆపుకోలేక పోవటం చేత దాన్ని రాసే నేను కూడా దుఖం ఆపుకోలేక రచన సాగక అన్నపానీయాలపై ఆసక్తే లేకుండా పోయింది ‘’అని చెప్పగా అతడి భక్తికి శ్రీరామ కరుణా కటాక్షాలకు ఆశ్చర్యపోయారు .అతడికి చక్కగా తలంటి స్నానం చేయించి ,మంచి పిండివంటలతో భోజనం తయారు చేయించి అందరూ తృప్తిగా భోజనంచేశారు .
నాగేశ్వర దాసు రామాయణం మొత్తం తన 13 వ ఏటనే రాయటం పూర్తి చేశాడు .కృష్ణా సాగర సంగమం దగ్గర మొరుతోటలో వేంచేసిన శ్రీ ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న శ్రీ రంగేశునికి కృతి సమర్పణ చేయాలని భావించి ,ఒక శివరాత్రి నాడు తలిదండ్రులు బంధు మిత్రులతో ఆలయం లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ,అక్కడి పూజారులు అనుమతించలేదు .ఏమాత్రం అవమానంగా భావించకుండా ముఖమండపం చేరి ముక్తేశ్వర స్వామిపై పద్యాలు నిండు భక్తితో చెప్పాడు
–
పద్యాలు పూర్తికాగేనే ముక్తీశ్వర స్వామి లింగ రూపం లో దాసు దోసిట్లో ప్రత్యక్షమయ్యాడు .దాసు పరవశంతో పరమానందంగా నృత్యం చేశాడు .ఆలయం లో లింగం కనిపించక పూజారులు కంగారు పడుతుతూ బయటికి వచ్చి చూసి విషయం తెలిసి దాసుపాదాలపై వ్రాలి క్షమించమని కోరి లింగాన్ని యధాస్థానం లో ఉండేట్లు చేయమని దాసును ప్రార్ధించారు
అని పద్యం చెప్పారు దాసు .ఆలయ పూజారులు సగౌరవంగా దాసును అతని తలిదండ్రులను అందరినీ గర్భాలయం లోకి ఆహ్వానించి ఉచితాసనాలు ఏర్పాటు చేసి గౌరవించారు .తన ఆధ్యాత్మ రామాయణ తెలుగు అనువాదాన్ని నాగేశ్వర దాసు ముక్తేశ్వర సన్నిధానం లో ఉన్న శ్రీ రంగేశునికి సభక్తికంగా అంకిత మిచ్చాడు .
ఆధారం –శ్రీ పంగులూరి వీరరాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు .
—

