కిరాతార్జునీయం నాల్గవ సర్గ .
పాశుపాతాస్ర సాధనకోసం అర్జునుడు యక్షుని తోడుగా తీసుకొని ఇంద్ర కీలాద్రి చేరాడు .అక్కడ కనిపించిన ప్రకృతి సౌందర్య వర్ణననమే చతుర్ధ సర్గలో మహాకవి భారవి వివరించాడు.ఆ అందాలు అనుభవిద్దాం
చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టుడైన అర్జునుడు పచ్చగా పండి వరి కంకులతో ఉన్న పంటపొలాలు, వ్యవసాయ దారులు ఉన్న చోటికి వచ్చాడు –
‘’తతః సకూజత్కలహంస మేఖలాం –సపాక సస్యాహిత పాండుతా గుణం –ఉపాస సాదోప జనం జనప్రియః –ప్రియామి వాసాధిత యౌవనాంభువం .
గ్రామ సమీపంలోని భూములు చూసి సంతోషించాడు .బాగా పండి ఒరిగి న వరికంకులతో అందమైన పొలాలు ,బురద తేరి నిర్మలమైన నీటిలో కమాలాలున్న గుంటలు ఆగ్రామ సీమలు శరదృతువు సంపదనంతా అర్జునునికి బహుమానంగా ఇస్తున్నాయా అన్నట్లున్నాయి .చూచి ఆనదించాడు ఫల్గుణుడు .నీటి కుంటలలోని చేపలు గంతు లేయటం మనసును ఆకర్షించింది .చేపలు అటూ ఇటూ తిరుగుతుంటే నీటి కమలాలే విచ్చుకొన్న కళ్ళతో ఆశ్చర్యంగా ఆర్జునుడిని చూడాలని ఆత్రం గా ఉన్నాయి .వాటి చేష్టలు ప్రియురాలి చూపులోని విలాస చేష్టలను కూడా మై మరపించేవిగా మనోహరం గా ఉన్నాయి .
‘’హృత ప్రియా దృష్టి విలాస విభ్రమా –మనోసృజహ్రు శఫరీ వివృత్తహ
నీటి మడుగులలో కమలాలు ,నివ్వరి ధాన్యం అందం బాగా ఆకర్షించాయి .అందు బాటులో ఉండని సుందర దృశ్యం ఎవర్ని ఆకర్షించదు ?’’సుదుర్లభే నార్హతి కోభి నందితుం-ప్రకర్ష లక్ష్మీ మనురూప సంగమే ?
బాగా ఎత్తుగా ఎగిరే చేపలు పొర్లటం తో కమలాలనిండా ఆవరించిన నురుగు తొలగి పోయింది .కమల కిన్జిల్కాలు స్పష్టంగా కనిపించి మెట్ట తామరలా అనుకొన్న అతని అనుమానం తీరిపోయింది .నదుల ఇసుకలు చూసి ఆనందించాడు. రోజూ తగ్గిపోతున్న నీటితో ,నీటి వేగం తగ్గి తీరం లో ఇసుక లో తరంగాల గుర్తులేర్పడ్డాయి .తెల్లని ఇసుక నదులు కట్టుకొన్న పట్టు వస్త్రాల్లాగా ఉన్నాయి.వాటిని చూసి సముద్రుని భార్యలైన నదులు పట్టు వస్త్రాలు ధరించాయా అనిపించాయని భావం –‘’నిరీక్ష్య రేమే స సముద్ర యోషితాం –తరంగిత క్షౌమ విపాండు సైకటం ‘’
తర్వాత మూడు శ్లోకాలో పంట పొలాలు కాపాడే స్త్రీల వర్ణన ఉన్నది –పంటలను కాపాడే కాంత పువ్వు లోని పరాగం పొడితో ముఖం అలంకరించుకొని అందమైన ,కనుబొమల మధ్య మంకెన పువ్వు అలంకరించు కోవటం తో కింది పెదవి ఎర్రబడి చిగురాకు శోభ లా ఉంది .ఎత్తైన పాలిండ్ల చుట్టూ లేత ఎండతో ఎరుపు రంగు పొందిన ఎర్రతామర పుప్పొడి అలదుకొని పని చేస్తున్నందున చెమట తో తడిసి మరీ ఆనందాన్ని కల్గిస్తోంది .చెవులకు అలంకారంగా పెట్టుకొన్న కలువ ను తన కంటి చూపుతో అలంకరిస్తూ ఉన్న కాపు భార్యను చూసి అర్జునుడు శరదృతువు వైభవం సఫలమై౦దను కొన్నాడు .ఈ ఋతు సంపదంతా ఈ గోపికను అల౦క రించిందని భావం –
‘’కపోల సంశ్లేషి విలోచన త్విషా-విభూష యంతీ మవతంస కోత్పలం –సుతేన పా౦డో హ్కమలస్య గోపికాం –నిరీక్ష్య మేనే శరదః కృతార్ధతా
రాత్రిఅయి చాలా సేపు అవటం తో త్వరగాకోస్టాలకు వెళ్ళలేక ,దూడల్ని తలుచుకోవటం వలన పాలుకారుతున్న విశాలమైన పొదుగులున్న ఆవుల మందలు అర్జునునికి ఉత్సుకత కలిగించాయి .తనకు ప్రతి కక్షి అయిన మరో బలిసిన ఎద్దు ను జయించి , తనకు ఎరేలేదన్న విజయ గర్వం తో అమ్భారవం చేస్తూ ఒక వృషభం కొమ్ములతో నదీతీరాన్ని పెకలిస్తోంది .గర్వం రూపు దాల్చిందా అన్నట్లు శరత్తులో మంచి పచ్చికమేసి బలిసిన ఆ ఎద్దు ఆకర్షణం గా ఉందన్న మాట –‘’పరీత ముక్షావ జయేజయశ్రియా –నాదంత ముచ్చై క్షత సింధు రోధసం- దదర్శ పుష్టిం దధతం సశారదీం -స విగ్రహం దర్ప మివా ధిపం గవాం’’
మంచు కురిసి తెల్లగాశుభ్రం గా ఉన్న ఆలమందలు మెల్లగా తమస్థావరాలకు వెడుతుంటే,శరత్కాలపు నదీ తీరం లో ఇసుక తిన్నెలు మొలనుండి జారిపోతున్నవస్త్రాలున్న పిరుదులు కల శోభగా అనిపించింది –‘’శరన్నదీనాం పులినైహ్ కుతూహలం –గళ ద్దుకూలైర్జఘనై రివాదధే’’
ఆలకాపరులు పశువులతో తమ సోదర బందుత్వాన్నిచూపిస్తూ ,ఆడవుల్లోనూ, ,ఇళ్ళల్లో ఉండే ప్రేమ భావాన్నే కలిగిస్తున్నారు. రుజుమార్గం లో ఆవులను అనుకరిస్తున్నారా అని పిస్తోంది –‘’గతాన్పశూనాం సహజన్మ బంధుతాం-గృహాశ్రయం ప్రేమ ,వనేషు బిభ్రతః –దర్శ గోపా ను పధేను పాణ్డవః –కృతానుకారానివ గోభి రార్జవే ‘’
తర్వాత శ్లోకాలలో గోపాలికల వర్ణన ఉంది..గోపికలు కదుల్తున్న తుమ్మెద వంటి ముంగురులతో ,చిరునవ్వు తో వెలసిన కేసరాల వంటి దంతాలతో ,కదిలే చెవి కుండలాలకాంతితో ,ఉదయపు ఎండలో వికసించిన పద్మముఖాలతో ఉన్నారు .పెరుగు చిలికే రైతు స్త్రీలు ఊపిరి పీల్చి వదులుతుంటే రెండు పెదవులు కదులుతూ ,చిగురాకుల తీగల్లా అందంగా ఉన్నారు.కవ్వపు తాడు అటూ ఇటూ లాగుతుంటే పిరుదులు తమాషాగా కదుల్తున్నాయి –‘’వ్యపోధపార్శ్వైరపవర్తి తత్రికా –వికర్షణ్ఐ పాణి విహార హారిభిహ్’’
స్త్రీలు పెరుగు చిలుకుతుంటే ,ఇరుగు కుండలలో మద్దెల మోట వంటి ధ్వని వినిపిస్తోంది అది విని ఆడ నెమళ్ళుమేఘ గర్జన అనుకోని ఉన్మాదం తో నర్తిస్తున్నాయి –‘’వ్రజా జిరేష్వ౦బు ద నాద శంకినీహ్ –శిఖండినా మున్మదయత్సు యోషితః –ముహుహ్ ప్రణు న్నేషుమధాం వివర్తనై –ర్నదత్సు కుమ్భేషు మృదంగ మందరం’’
గోపకా౦తల ఉన్నత స్తనాలు ఇటూ అటూ కదులుతూ శ్రమతో కళ్ళు అలసిపోయాయి చిలకటం లో వారు అప్పుడే నాట్యం ఆపిన వారకాంతల్లా కనిపించారు అర్జునుడికి .గ్రామాలు దాటి ముందుకు వెడుతున్నాడు .దారులు వర్షరుతువులోని వంకర టింకరలు పోగొట్టుకొని ,మధ్యమధ్యలో నీరు నిలవటంచేత వంకరగామారి ,ఆరిపోయినచోట చక్కగా ఉన్నాయి. బళ్ళు నడుస్తున్నాయి కనుక రెండు చక్రాల దారి కనిపిస్తోంది. రాకపోకలెక్కువై బురద ఆరి, నేల గట్టిపడింది .ఇళ్ళముందు చక్కని అలంకారాలతో పూల చెట్ల తో అల్లుకున్న పందిళ్ళలో జనం కూర్చుని ఉన్నారు .అదవి ముని ఆశ్రమాలులా ఉన్నాయి . పల్లె ప్రజలు కల్లాకపటాలు లేకుండా మునులు లాగా సాధారణ వేషధారణలో మనసు విప్పి మాట్లాడు కొంటున్నారు .ఇళ్ళల్లోనూ పూలు పండ్ల చెట్లు పెంచుతున్నారు. ఆదరంగా ఇవన్నీ చూస్తూ అర్జునుడు ముందుకు వెడుతున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-20-ఉయ్యూరు

