కిరాతార్జునీయం-
అయిదవ సర్గ-3(చివరి భాగం) .
శంకరుడు పార్వతి పాణి గ్రహణం చేసేటప్పుడు శివుడి చేతి కంకణం వంటి సర్పం జారి పడితే , భయపడిన శుభావహమైన ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తోరగ ప్రతి సరేణ కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి వ్యాపించగా ,పైనుండి సూర్య సహస్ర కిరణాలు కిందికి ప్రసరించి ,కలిసిపోయి సూర్యుడికి ఉన్న ‘’సహస్ర రశ్మి ‘’అనే సంఖ్యా పదం దాటి పోయింది .త్రిపురాసుర సంహారం చేసిన శివుని సంతోష పరచటానికి కుబేరుడు ఇక్కడ కైలాస పర్వతం లో అలకా పురిని ఉన్నత శిఖరాలతో నిర్మించాడు.ఇక్కడికి రాగానే సూర్యుడు ఆకాలం లో అస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు .అంటే గోపురాలు అంత ఎత్తుగా ఉన్నాయని భావం –‘’స ఏష కైలాస ఉపా౦తసర్పిణః-కరోత్య కాలాస్తమయం వివస్వతః ‘’ .
పర్వత శిఖర వివిధ మణి కాంతులు శరత్తులో నీరు తగ్గటం వలన మేఘాలలో అస్పష్టంగా ఇంద్ర ధనుస్సును పూరించటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి .శంకర శిరసులోని చంద్రుని కాంతి, కొత్తగా చిగిర్చిన చెట్ల చిగురాకులను తడిపేవి .అమృతం స్రవించే చంద్ర కిరణాలతో కృష్ణ పక్షం రాత్రులలో కూడా అరణ్యాన్ని తెల్లగా చేస్తున్నాయి .కైలాస పర్వతం విశాలమైన దుప్పటి లాగా వనాన్ని బంగారు కాంతి మయం చేస్తోంది..బంగారు మయాలైన గుహలు మీ తండ్రి ఇంద్రునికి చాలా ఇష్టం అందుకే ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయి౦దన్నాడు యక్షుడు అర్జునునితో .—ఆయ మానేక హిరణ్మయ కందర –స్తవ పితుర్దయితో జగతీ ధరః ‘’’ఇంద్ర కీలాద్రి నుంచి సూర్యకాంతి రెండింతలై ,దగ్గరలోని భూ ప్రదేశాలను కాంతిమంతం చేస్తోంది అది మెరుపుల కాంతిని అనుక రిస్తో౦దని పిస్తోంది .
మదజలం తో తడిసిన చందన వృక్షాలు ఐరావతం వచ్చి వెళ్ళిన జాడ తెలియజేస్తోంది .దాని రాపిడికి భయపడి పాములు పారిపోయాయి .ఇంద్ర నీల మణుల కాంతితో సూర్య కాంతి కలిసిపోయి గుహ కాంతి విహీనమైంది . అది సూర్య కాంతిని చీకటి కప్పేసినట్లున్నది .ఇంద్ర నీల పర్వతం పై శాంత స్వభావం ఉన్న వాడైనా ,అప్రమత్రంగా శస్త్రం తో సిద్ధంగా ఉండాల్సిందే అని మహర్షి వ్యాసుడు నీకు ఉపదేశించి నట్లు ఇక్కడ అర్జునా నువ్వు తపస్సు చేయాలి .మంచి పనులకు విఘ్నాలుఎదురౌతాయి .కనుక సర్వ సన్నద్ధంగా తపం చేయి –‘’భవ్యో భవన్నపి మునేరిహ శాసనేన –క్షాత్రే స్థితః పధి తపస్య హత ప్రమాదః –ప్రాయేణ సత్యపి హితార్ధ కరే విధౌ హి-శ్రేయాంసి లబ్దు మసుఖాని వినా౦త రాయైహ్’’
అర్జునా !గుర్రాల్లా చంచలమైన నీ ఇంద్రియాలు చెడు మార్గం లో పోనివ్వకు. తపస్సులో ఉన్న క్లేశాన్ని తొలగించి శంకరుడు నీ ఉత్సాహం పె౦పొ౦ది౦చు గాక .లోక పాలకులు నీ సాధన అనుస్టానాన్నిఅధికంగా ఫలవంతం చేయుగాక –‘’మా భూ న్న పధహ్రుతస్త వే౦ద్రియాశ్వాః-సంతాపే దిశతు శివాఃశివాం ప్రసక్తీం-రక్షం తస్తపసి బలం చ లోక పాలాః-కళ్యాణీ మదిక ఫలాం క్రియాం క్రియాసు ‘’
‘ఇలా యక్షుడు చెప్పాల్సిన హితోక్తులన్నీ చెప్పి ,తన స్థానానికి వెళ్ళిపోయాడు .అర్జునుడు ఉత్కంఠ పొంది ఆలోచనలో పడ్డాడు.ఇస్టు లైన సత్పురుషుల ఎడబాటు బాగా బాధ కలిగించటం సహజమే కదా –‘’ ‘’ఇత్యుక్త్వా సపది హితం ప్రియం ప్రియార్హే –ధామ స్వం గతవతి రాజరాజ భ్రుత్యే –సోత్క౦ఠం కిమపి పృదా సుతః ప్రపద్యౌ –సంధత్తే భ్రుశ మరతిం హి సద్వియోగః ‘’
పరిపూర్ణమైన ఉత్సాహ లక్ష్మీ సమేతుడై అర్జునుడు ఆ ఇంద్ర కీలాద్రి పర్వతం చేరాడు.దాన్ని ఏ బలం తోనూ అతిక్రమించ లేం.ఇది సత్వర ఫలితాలనిచ్చేదికూడా .తానూ చాలాకాలం గా దర్శించాలనుకొన్నదీ కూడా ఈ ఇంద్ర కీలాద్రే .అందుకే ఇక్కడ తపస్సుకు ఎన్నుకొన్నాడు అర్జునుడు –‘’తమనతిశయనీం సర్వతః సార యోగాత్ –దవిరహిత మనేకానాం కభాజా ఫలేన –అకృశమకృ శ లక్ష్మీ శ్చేత సా శంసితం స –స్వమివ పురుషకారం శైల మభ్యా ససాద ‘’
ఐదవ సర్గ సంపూర్ణం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-20-ఉయ్యూరు

