హేలాపురి (ఏలూరు )శతకం

హేలాపురి (ఏలూరు )శతకం

ఏలూరుగా పిలువబడే హేలాపురి పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని .కళలకు సంస్కృతికి నిలయం .కవిపండిత కీర్తి స్థానం .వితరణకు వేదిక .ధర్మానికి పట్టుగొమ్మ .అలాంటి హేలాపురి పై గొడవర్తి తిరు వేంగళాచార్య శిష్యుడు ,మృదు మధురాంధ్ర కవిత్వ సాంద్రుడు ,బొడ్డు వంశం లో జన్మించిన నారసింహ కుమారుడు ,కమనీయ సుగుణ సుకవి సమాజుడు ,సజ్జన ప్రముఖార్య సత్కారుడు బొడ్డు లక్ష్మీ నారాయణ కవి ‘’హేలాపురి శతకం ‘’రాశాడు .దీన్ని నవనీత చోరుడు ,రాధికా సతి వినోదుడు  వేణు గోపాల స్వామికి సభక్తికం గా అంకితమిచ్చాడు కవి .ఇంతకు మించి కవి తన గురించి చెప్పుకోలేదు .ఏ సంవత్సరం లో రాశాడో,ఇంకేమైనా రాశాడో  కూడా తెలియదు .అయితే కవిత్వం లో ఆరి తేరిన పండితుడని తెలుస్తోంది .వివిధ ఛందో భేదం గా ,ద్రాక్షాపానక రస వంతంగా కవిత్వం చిందించాడు .

  ముక్త పద గ్రస్తం లో ఆరితేరిన కవి ముందుగా ‘’శ్రీకర రమ సదార్చిత పాద రాజీవ,రాజీవ కేతన రాజ వినుత –వినత తనూ జాత వితన వితతావన వనరుహానన ,మానధన కృతార్ధ –అర్ధాంగ ధర రాధా ధారాది ధారణ రణ ధురీణ గణ నిదాన –దాన శౌండా సుర దర్ప ఖండ ప్రచండ చండ గుణోద్దండ కాండ కాండ –కాండ భవభావభావనా ఖండ వరద –వరదయానిది మాం పాహి పాహి యనుచు –లలిత మణి  భాసురంబు హేలాపురంబు –వేణు గోపాలు తోడి తేవే లతాంగి ‘’.ఇందులో చివరి పాదమే శతకానికి మకుటం .తర్వాత పద్యాలన్నీ ఇదే ధోరణిలో సాగాయి .’’హరికోటి కోటి భాసుర కర  కోటీర మంబు నింపొందుశిరంబు వాని –ఘనమించు మించు మేఘము గూడుకొను  మాడ్కి రత్న శోభితమౌ యురంబు వాని ‘’అని  వేణు గోపాకృష్ణ మూర్తిని స్తుతించాడు .తర్వాత మానవ జీవిత పరమార్ధం ఏమిటో –‘’హరిని శ్రీహరిని శ్రీహరిని బ్రోచిన వాని చిరము సేవించిన శిరము శిరము —-దరముమందరము సుందరము సుందరము దాల్చిన వాని కరముకరము  ‘’అంటూ పోతనగారి బాణీలో రాశాడు .’’దినకర శశి నేత్ర దివ్యాభరణ గాత్ర నిరుపమాన చరిత్ర ధర పవిత్ర ‘’అని రాసి అష్టభార్యా సమేతుడిని –‘’అలరుక్మిణీ సత్యభామా హృత్పద్మమోహాబ్ధికానంద భ్రు౦గాబ్జు డనగ –మిత్ర వి౦ద సుదంతి నేత్రాబ్జ కరలతాతతికింపురవి కల్ప తరువానంగ-భద్ర కాళింది యవ్వన వనకుచ గిరుల్మురియు మత్తేభ జీమూతమనగ-వర లక్షణా జా౦మ్బవత్యోష్ఠ బింబ ఫలా భీష్ట శుక వరదా యన౦గ-షోడశసహస్ర చేడెల శుభు డనంగ-వెలయు రాధిక లోలుని వినుతి జేతు’’అని కృతిభర్త వేనుగోపాలుని కమ్మగాస్తుతించాడు బొడ్డుకవి .

   తర్వాత పుర వర్ణన చేశాడు .షట్ శాస్త్ర పండితోద్దండులు ,భందనో డ్దండ ప్రచండ రాజులు ,రత్నాలు మొదలైన అనేక ధనధాన్యాలు దానమిచ్చే వైశ్యులు ,సతత హరిభక్తి కలిత హరిజనులు హేలాపురిలో ఉన్నారు .వేశ్యలు,సరస్సులు ,పండ్ల తోటలతో కనులకింపుగా పురం ఉన్నది .ఆతర్వాత శ్రీ కృష్ణ బాల్య క్రీడా వర్ణన చేశాడు –‘’వసుదేవ దేవకీ వర సూనుడై పుట్టి ,నంద యశోద లానంద పెట్టి –పాతదితిసుత వ్రాతంబులను గొట్టి  చలపట్టి ఫణిఫణాదులను  మెట్టి –కొదగక కుధరము గొడుగు చాడ్పున బట్టి పాకశాసను శాత భంగ పెట్టి –గొల్లల నెల్లను కూర్మిని చే బట్టి పట్టాభి షేకుడై ప్రబలి నట్టి- జిష్ణు సన్మౌని హృదయ వర్తి ష్ణు- కృష్ణు నతులిత పదాబ్జ యుగము సేవింతు వ.సము’’.బాలకృష్ణుని శిఖిపించం మొలనూలు గజ్జెలు మురళి వాయింపు వ్రజభామినులతో సల్లాపాలు వర్ణించాడు .ఉట్టి లో ఉన్న సరుకు కొల్లగొట్టటాన్ని చక్కని పద్యం లో చెప్పాడు –‘’ –ఉట్టి బెట్టినయట్టి  చట్టి తూటేట్టి నోరట్టి పాలట్టెనోరట్టి పట్టి –అన్నన్న వెన్న పైనున్నదెన్నన్ననీ చిన్న చిన్నగ పిన్నపిన్నకన్నె కెట్టి-నత్తరాయత్తమై కొత్తబిత్తరి హత్త గుత్తముత్తమ గుబ్బ లొత్తబట్టి –ఇమ్ముగా నిమ్ము ఈ సొమ్ము నీ సొమ్ము చేకొమ్ము ముద్దిమ్ము శుభంబు బొట్టి-యంచు చెక్కు న నొక్కి యక్కజంబు –లంత నెంత వచియింతు కాంత నీకు ‘’అంటూ కృష్ణ క్రీడలని అద్భుత పద్యరాజంగా రాశాడు కవి .

   ఆపిమ్మట రాధా కృష్ణ విలాస వర్ణ చేశాడు –‘’కంతు శాస్త్రము జెప్పి ,కలియలకలకు మల్పిగిలిగింత తతిసల్పి వలపు గొల్పి –చక్కర మోవిచ్చి చంగవ నందిచ్చి ముద్దులొద్దిక నిచ్చి ముదము బుచ్చి –తొడ తొడలను దార్పి తడబడక ను జేర్పి బుడి బుడి గడి దేర్పి బడలికోర్పి –మదిని జంకు దొలంగి మచ్చికల గరంగి ,మెనూ మేనున బెరంగి మనము బొంగి –తక్కి నొక్కితిమరుబారి జిక్కు బడితి-ముందుగా నాస బడితి హా మోస బోతి’’  అని మొదలెట్టి అన్ని భంగిమలను కళ్ళముందు కట్టించి ,మూడుకాళ్ల ముదుసలి కూడా రంకె వేసేట్లు శృంగారం దట్టించాడు .ఏ ముద్దు పలణో మళ్ళీ పుట్టి రాసిందేమో అన్నట్లు రతికేళిని సరస శృంగార బంధురంగా రాశాడు బొడ్డుకవి .   

  తర్వాత గ్రీష్మం తో ప్రారంభించి వర్షర్తు ,శరదృతు వర్ణలను ప్రబంధకవులకు సాటిగా దీటుగా రాశాడు –గ్రీష్మం –‘’మువ్వేలుపుల ఇక్క ముదమున బె౦పెక్క నలరు నదీ సమూజిక్క హములు –జలరాసి యుపో ఎంగ జలజ వైరి వెలుంగ లలిపల్లవలు భూజముల జెలంగ-పా౦థులు తహతహ బడు చు జొక్క ‘’ వర్షర్తు-‘’దినమణి రుచిదప్ప దిమిర మొప్పుగ గప్ప వర నదీదములు వైసు నొప్ప –నింగి రంగారంగ నీరదము చెలంగ గేకముల్ గుమి గొని కేరిపొంగ—విరహిణుల నొంచ  మారుడు వావిరి హింసించ’’గా వానాకాలం వచ్చింది .శరత్తు –‘’సారంగ ధరుడు  యిపారంగఛవినేడుమీరంగ జేసే సమీర మీసె-బీరంబు జెంది గంభీరంబు నొంది సరస్సుల్ జెలంగె వారవి దొలంగె –గానమ్ములందు సన్మానంబు లొందుభ్రున్గా నందమందె నీహార మొందె’’అలలా సాగిపోతాయి ఋతు వర్ణన పద్యాలు నాన్ స్టాప్ గా .ఈ ఋతువులలో రాధామాధవుల విరహ వేదన కూడా చూపించాడు కవి .శరత్తు తర్వాత వినోదాలంకార పద్యాలు రాసి ఆతర్వాత చంద్రదూషణం చేయించాడు .తనకవితా ప్రాగాల్భ్యాన్ని తెలియ జేయటానికి అక్షరోపమాన,పంచపాద, సర్వ లఘు,మత్తేభ కంద గర్భిత ,వనమయూర వృత్తాంత,,ఇంద్ర వజ్రా౦త ర్భూత ,స్రగ్విణీ వృత్తాంత ర్భూత ,మత్తకోకిలా౦తపాద ,తరలా౦త ర్భూత సీస పద్యాలు రాసి ,చివర్లో ,విచిత్ర సీస మాలిక అల్లితన కవితా విక్రమాన్ని చాటాడు బొడ్డులక్ష్మీ నారాయణ కవి  .శతకం చివరలో తనను గురించి చెప్పాడు అంతకు ముపద్యం లో మంగళం పాడాడు –‘’ఆశ్రిత పోషాయ యానంద కందాయ మందస్మితాయ తే మంగళంబు-గరుడ తురంగాయ ఘన శేష తల్పాయ భాసమానాయ తే మంగళంబు-రాధా వినోదాయ రాజీవ నయనాయ భవ్య కృష్ణాయ తే మంగళం ‘’

  కవి ప్రతిభకు గీటు రాయి ఈ శతకం .శతకం వ్యాజం గా తన కవితా విశ్వరూపం ప్రదర్శించాడు కవి .ఇంతటి ప్రతిభా వ్యుత్పత్తి ,భావోద్రేకం ,సృజన పుష్కలంగా ఉన్న మహా కవి  మన చరిత్రకారులు ఎలా మర్చి పోయారో ఆశ్చర్యమే . కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ పాత కవిని గురించి పరిచయం చేసే అదృష్టం నాకు దక్కిందని సంతోషంగా ఉంది .శ్రీ గుండు వల్లీశ్వర్ లాంటి ఏలూరు వాసులెవరైనా బొడ్డులక్ష్మీ నారాయణ కవి గురించి పూర్తీ జీవిత విశేషాలు ఇతర రచనల గురించి తెలిసి ఉంటె తెలియ జేస్తే ,ఇందులో పొందుపరుస్తాను .

  రేపు 1-1-2021 శుక్రవారం 2021 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో –

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ – 31-12-20-ఉయ్యూరు ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.