శ్రీకురుమూర్తి(శ్రీకూర్మ ) నాథ శతకం

‘’కాకుల్మున్గును ,నేను మున్గుదును ,కొంగల్చేయు ధ్యానంబు మి-ధ్యాకల్పంబుగ ‘’అని దొంగ స్నానాలు జపాలు మేలు చేయవు .’’నీవున్నేనును ఒక్కటే యనగ యత్నింతు ర్విమూఢాత్ములా-హా వాలాయముబుట్టి జచ్చు జనులయ్యా ‘’సోహ’’మన్మాటయేలా –వాసి౦గను ,నీ పదాబ్జమ్ముల మ్రోల న్మ్రోక్కుచుం గా౦తుభద్రావాప్తి ‘’అని స్వామి చరణమే శరణం అన్నారు .బాలకృష్ణ లీలలూ వర్ణించారు .స్వామి గుహలో ఎందుకు దాగాడో తెలిసిందట .మత్తేభం లో సరిగమలతో చిరస్మరణీయ పద్య రాజం చెప్పారు కవి –‘’

‘’సరిగా నీపని సాగనీ ,గరిప,దా ,సాగారి సద్ధామ ,మా –గరిమన్ సామ నిదానిగా ,సమపధం గా సాని నీ సారి ,మా

దరిగానీ ,మరి దారి ,సన్నిగమపా , దాసాగమాపా ,సదా – దర మొప్ప౦గురు మూర్తి నాద సురవంద్యా పాహిపాహి ప్రభో ‘’

కురవ గ్రామం లో కుమ్మరికి సాక్షాత్కరించి కురుమూర్తి అనే పేరు సార్ధకం చేసుకొన్నాడట స్వామి .ఛందో వ్యాకరణాలపై పట్టు లేకపోయినా స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండబట్టి ఈ శతకం రాయగలిగానని అత్యంత వినయంగా 108వ చివరి పద్యం లో చెప్పి నారాయనరాయ కవి శతకం ముగించారు .సర్వ శాస్త్ర పాండిత్యం, ఛందో వైవిధ్యం ,లోకరీతి, భక్తి స్వభావం, శరణాగత తత్త్వం అన్నీ పుష్కలం గా ఉన్న శతకం ఇది .చదివి ఆనందం అనుభవించ వచ్చు .

శతకం జనం లో ప్రచారమైనదో లేదోకాని ‘’సరిగమ ‘’పద్యం మాత్రం బాగా వ్యాప్తి చెందింది .

శ్రీ కూర్మ దేవాలయ విశేషాలు

శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యమునందలి వరాహక్షేత్రములోని పాతాళసిద్ధేశ్వర క్షేత్రమే. ఇచటకల స్వయంవ్యక్త లింగమూర్తి బౌద్ధ మత ప్రభావం ఈప్రాతంలోలేని సమయంలో కళింగ దేశాధీశుడుఇన విజయసిద్ధి ప్రతిష్టించాడు.ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి, దర్సన మాత్రమున లింగాకృతి కన్నులకు కట్టి యుండును.

శ్రీకూర్మం, అరసవల్లి, సిమ్హాచలం మొదలగునవి ప్రధమంలో శైవమతమునకు పుట్టినిల్లు. అయినప్పటికీ ఈనాడు వైష్ణవక్షేత్రాలుగా ఉన్నవి.శ్రీకూర్మాలయం, సింహాచలాలలో గల శిలాశాసనాలను బట్టి ఆకాలమున నరహరి తీర్ధులచే వైష్ణవమతము కళింగమున వ్యాపించెనని తెలుస్తున్నది. ఈతని కాలమునాటి శిలాశాసనములు శ్రీకూర్మంలోనూ, సింహాచలం లోనూ చాలా ఉన్నవి.

దీనిని క్రీ.శ. 12వ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్ధయాత్ర సందర్భంగా కళింగదేశం వచ్చాడని, శైవలలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలీలగా వాగ్వివాదంలో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీకూర్మనాధుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలోగల ప్రన్నామృతం వలన తెలుస్తున్నది. నాటినుండి పాతాళసిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీకూర్మనాధ ప్రశస్తి ప్రబలింది. విష్ణుమూర్తిని కూర్మావతార రూపాన ఇచట పూజించటం వలన ఈదేవాలయాన్ని శ్రీకూర్మనాధాలయమనీ ఆగ్రామాన్ని శ్రీకూర్మమని పిలుస్తున్నారు.ఈ దేవాలయం చుట్టూగల స్తంభాల మంటపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు కలవు. దేవకోష్టమునందు త్రివిక్రమ, పరశురామ, బలరామ, సరస్వతి, కుబేర, మహిషాసురమర్దిని, ఇంకనూ అనేక శంఖచక్రధారియైన విష్ణుమూర్తి విగ్రహాలు కలవు. ఈ దేవాలయమునందు రెండు ధ్వజ స్తంభాలు కలవు. విమానం చోళ రాజుల వాస్తు శిల్పకళారీతులలో నిర్మించారు. చక్కగా కుదురుటచే కాబోలు కుదురుకు కూర్మము చిలుకునకు సింహాచలము అను లోకోక్తి వచ్చినది. శ్రీకూర్మ పురాణం శైవసంప్రదాయసారమై ఉన్నది. దీనిని రాజలింగకవి మండచిట్టి కామశాస్త్రి ఆంధ్రీకరించారు. ఈ క్షేత్ర మహాత్యాన్ని దత్తాత్రేయులవారు వ్యాసమునీంద్రులకు వివరించారనీ, అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరిదత్తాత్రేయులకు శ్రీకూర్మనాధ మహాత్యాన్ని గూర్చి స్వప్నంలో చెప్పినత్లు చెబుతారు.

ఇచ్చటి శిలాశాసనముల వలన నాల్గవ శతాబ్దం నుండి పదునాల్గవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గాంగరాజుల చరిత్ర పూర్తిగా తెలుస్తున్నది. క్రీ.శ. 1273లో పాలించిన తూర్పుచాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు తన ఆస్థానకవి అయిన నన్నయ్య భటారికుని సంస్కృతంలో కల భారతాన్ని తెనుగదించవలసినదిగా కోరినట్లు తెలిపే ఒక శాసనం కలదు. ఆనాటి సాంఘిక, రాజకీయ, పరిస్థితులను వివరించే అనేక శాసనములు కూడా ఇక్కడ కలవు.

తిరునాళ్ళు, ఉత్సవాలతో ఆస్తికులు ఆచరించే జీవిన విధానమే స్మార్తము. దీనిలో ఏ మతం వారైనా పాలు పంచుకొనే అవకాశం ఉంది. కాకతీయుల కాలంలో విరివిగా ‘స్మార్తము’ ఆచరించే కాలంలో, బౌద్ద క్షేత్రంగా వెలుగొంది, అనంతర కాలంలో వైష్ణవ మత ప్రదేశంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకూర్మం తో పాటు సర్పవరం, బాపట్ల కూడా ఇదే రీతిన బౌద్ధ మత కేంద్రాల నుంచి వైష్ణవ మత స్థలాలుగా మారాయి..

రథ సప్తమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-21-ఉయ్యూరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.