గంగాపుర మహాత్మ్యం -1

గంగాపుర మహాత్మ్యం -1 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న గంగాపురం 2వేల జనం ఉన్న జాగీర్ గ్రామం .అధికారి ముస్లిం .గ్రామం లో చౌదీశ్వరాలయం ,ఒక చెరువు దానిపై పది కుంటలు ఉన్నాయి అందులో న౦బులకుంట వెయ్యేళ్ళ నాటిదని చాళుక్య శాసనం తెలియజేస్తోంది .గ్రామం లో ఎక్కాడ చూసినా శాసనాలు శిదిలాలయాలు ,సుందర విగ్రహాలు విరిగిన విగ్రహాలు కనిపిస్తాయి .ఇదీ గంగాపురగ్రామ నేటి దుస్థితి .గ్రామానికి మైలుదూరం లో ‘’గొల్లత్తగుళ్ళు’’అనే శిదిలాలయాలున్నాయి .దీనికి దగ్గర రెండు మూడు ఊళ్ళల్లో కూడా శిదిలాలయాలు శాసనాలు కనిపిస్తాయి .ఈ గ్రామాలకు దగ్గరలో మీనాంబరి అనే పెద్ద వాగున్నది .ఇది పవిత్రనది అని స్థల పురాణం లో ఉంది .దీని ఒడ్డున అనేక లింగాలు ఒక శివాలయం ఉన్నాయి .ఈవాగు కృష్ణానదిలో కలుస్తుంది . పునరుద్దరింప బడి పూజా దికాలు జరుగుతున్న కేశవాలయం చాళుక్యరాజులు శైవం నుంచి వైష్ణవానికి మారిన కాలం లో అంటే సుమారు వెయ్యి సంవత్సరాలక్రితం నిర్మింపబడింది .బయటి గోడలపై చాళుక్య శాసనాలున్నాయి .ఆలయం లో మాఘ శుద్ధ సప్తమి నుంచి అయిదు రోజులు పెద్ద జాతర జరుగుతుంది . గంగాపుర నిర్మాణం బాగా ప్రాచీనమైనది .అక్కడ ఒకటి రెండు జైన శిల్పాలు కనిపిస్తాయి .శివాలయం వెనక ఒక జైన విగ్రహం కనిపిస్తుంది .గంగాపురానికి పూర్వపు పేరు మాయాపురి అని వెంగయ్య కవి రాసిన నరపతి విజయం అనే రామరాజీయ కావ్యం లో ఉంది.బుద్ధుని తల్లి పేరు మాయదేవికనుక ఆ ప్రేరణతో దీనికి మాయాపురి పేరు వచ్చి ఉండచ్చు .మీనా౦ బరీ తీరం లో ఉ౦ది కనుక మత్సపురి అనే పేరు కూడా ఉంది .’’దురిత కోలాహలం’’ అనే మరో పేరు కూడా ఉంది .చాళుక్యులు గంగాపురి అనే పేర్కొన్నారు .గంగేశ్వర లింగం ఉండేదేమో ?ఇక్కడి శాసనం లో భీమ సముద్రం అనే గ్రామం పేరు ఉంది .ఈపేరున్న చెరువు గంగాపురం లో లేనేలేదు .మాయాపురి పేరును బట్టి ఈ గ్రామమ కనీసం 15వందల ఏళ్ళ నాటిది అంటారు . గొల్లత్తగుళ్ళు గంగాపురానికి మైలు దూరం లో ఈ గొల్లత్త గుళ్ళున్నాయి .ఇప్పుడు ఒకే ఒక గుడి మాత్రమె కనిపిస్తోంది .20అడుగుల ఎత్తున్న ఈ గుడీ కూలటానికి సిద్ధంగా ఉంది .నాలుగు అడుగుల మందమున్న గోడలున్నాయి .ఇటుకరాయి నిర్మాణం .గుడిపక్క రెండు పెద్ద దిబ్బలున్నాయి .బహుశా ఇవి శిధిల ఆలయాలు అయి ఉండవచ్చు .గుళ్ళు అన్నారు కనుక కనీసం ఇక్కడ మూడు గుళ్ళు అయినా ఒకప్పుడు ఉండి ఉంటాయి .ఈ గుళ్ళను గురించి స్థానికులు ఇలా చెబుతారు –పాలు,పెరుగు అమ్మే ఒక గొల్ల ఇల్లాలు భక్తితో ఆస్తింతా ఖర్చు చేసి ఈ గుళ్ళు కట్టించింది .అందుకే గొల్లత్త గుళ్ళు అనే పేరొచ్చింది .కానీ ఇది నిజం కాదు .శైవులలో గోళకి మఠాలు అని వింధ్యకు దక్షిణం లో వ్యాపించి ఉన్నాయి .ఆ గోళకి కాలక్రమం లో గొల్లక్క-గొల్లత్త అయి ఉంటుంది .ఈ మఠాల గురించి మల్లంపల్లి వారు అమరావతీ స్తూపములు పుస్తకం లో వివరంగా రాశారు .ఈమతాలు కడప మండలం , త్రిపురాంతకం ,గుంటూరు మండలం మందడం లో 11వ శతాబ్ది నుంచి ఉన్నట్లు శాసనాలలో ఉంది ‘’అన్నారు .కాకతి రుద్రమ దేవి మండడం లో విశ్వేశ్వర గోళకి మతానికి దానాలు చేసి అన్ని వర్ణాలవారికీ అన్నదానం చేసింది .అందులో విద్యాలయం వైద్యాలయమూ ఉన్నాయి .కర్నూలు జిల్లా త్రిపురాంతకం లో ఒక గోళకి మఠం ఉన్నట్లు స్థానిక శాసనం తెలియజేస్తోంది . గంగాపురం లో శివాలయాలు చాలా ఉండేవని పాల్కురికి సోమనాధుడు పండితారాధ్య చరిత్రలో రాశాడు .అక్కడున్న వెయ్యి మంది శివ భక్తుల గురించి పేర్కొన్నాడు .త్రిభువనమల్ల చక్రవర్తి జ్యోతిషశాస్త్రం లో పరీక్ష పెట్టి భట్టో పాధ్యాయునికి ,పెద్దభట్టుకు దానం చేసినట్లు ఆరాధ్యగురువు ప్రవేశ భట్టారకుడు చెప్పిన శాసనం ఉంది .గోళకి మత స్థాపకులు వీర శైవం లోని పాశుపత మతాన్ని అను సరించేవారు .ఈఠం దేవకీ పురం లో మొదలై దక్షిణ దేశమంతా వ్యాపించింది .వీరిలో విశ్వేశ్వర శివ దేశికుడు కాకతి గణపతి చక్రవర్తికి దీక్షా గురువు .ఈమఠానికే రుద్రమ దేవి దానమిచ్చింది .త్రిభువనమల్లుని దీక్షా గురువు సకల ప్రవేశ భట్టారకుడు కదా .ఆ దీక్షా గురుని గోళకి మఠమే’’గొల్లత్త గుళ్ళు ‘’అయ్యాయి కాలక్రమం లో .గంగాపురం లో పైన చెప్పిన పండితులే కాక శ్రీగిరి పండితుడు ,గణగ రాజ పండితుడు కూడా ఉన్నట్లు తెలంగాణా శాసనం ,చాళుక్య శాసనాలు తెలియ జేస్తున్నాయి .సశేషం ఆధారం –శ్రీ రేడ్రేడ్డి మల్లారెడ్డి రాసిన –గంగాపుర మహాత్మ్యం శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.