నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -4õ
ఉపాధ్యాయ వృత్తి
ఇంటివద్ద ప్రైవేట్ చెపుతున్నా సరైన ట్రెయినింగ్ లేకపోవటం వలన విద్యార్ధులు పల్చబడగా ,ఒంగోలులో ట్రెయినింగ్ స్కూల్ లో విద్యార్ధిగా చేరారు నరసదాసు గారు .దాసుగారున్నది బ్రాహ్మణ హాస్టల్ .మడీ ఆచారం పాటించటానికి తప్పక పాటించేవారు .మిగిలిన వారు అవన్నీ పాటిస్తూ నీతి బాహ్యంగా వ్యవహరించేవారు .ఇది దాసు గారికి నచ్చక ,తన ప్రవర్తన చేత వారిని అంతర్బహిశుద్ధులుగా తీర్చి దిద్దారు .అన్నిటా ఫస్ట్ గా ఉండటం వలన విద్యార్ధి లీడర్ గా ఉపాధ్యాయ విద్యార్ధుల అధికారుల మన్నన పొందారు .రాత్రి 9నుండి 12వరకు భజనలో పాల్గొన్నారు .శ్రీరామనవమి శ్రీ కృష్ణాష్టమి శ్రీ శంకర జయ౦తు లను ఘనంగా నిర్వహించారు .ఉపన్యాసాలు హరికధలు చెప్పించారు .ఇలా బ్రాహ్మణ హాస్టలు ను సదాచార కోష్టంగా మార్చారు .
విద్యాధికారి ,క్రైస్తవుడు అయిన వర్గీస్ ఒక సారి తనిఖీకి వచ్చాడు .స్క్ల్లు హాస్టలు తనిఖీచేశాడు చాలామంది విద్యార్ధులు గైర్ హాజరయ్యారు .హెడ్ మాస్టర్ లీడర్ దాసుగారిని పిలిపించి కారణం అడిగారు.తాము భోజనం చేయలేదనీ ,భోజనహాస్టలు అపవిత్రం అయిందని ,పుణ్యాహవాచనం చేయించాలని, అప్పటిదాకా తాము భోజనం చేయమని చెప్పారు .చేసేదిలేకరెండురోజులు సెలవిచ్చాడు హెడ్ మాస్టర్ .అందరి తరఫున పుణ్యాహవాచనం కార్యక్రమం దాసు గారే నిర్వహించి ,మళ్ళీ విద్యాలయాన్ని సక్రమంగా నడి చెట్లు చేశారు .దాసుగారి నిష్టాగారిష్టాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి .ట్రెయినింగ్ లో ఉండగా దాసు గారు ఎందరో మహాత్ముల ఆశీస్సులు పొందారు .మహాభక్తులు బొమ్మరాజు సీతారామయ్యగారిని దర్శించి నమస్కరించగా పరమ వాత్సల్యంతో ఆయన దాసుగారిని ఆప్యాయంగా కౌగలించుకొని ,శరీరమంతా నిమురుతూ ‘’నువ్వు శుద్ధ సాత్విక మూర్తివి .ఆధునికులకు సంసార బాధలు నివారించే మాధవుడిని చేరే సాధనం బోధించే మేదావి అవుతావు ‘’అని దీవించారు .బొమ్మరాజు జానకి రామయ్య ,మల్లవరపు సుబ్బారావు ,నీలంరాజు ఆది మూర్తి ,విక్రాల రామ చంద్రా చార్యులు వంటి పెద్దలు హాస్టలుకు వచ్చి ఆశీర్వదించేవారు .వారి సేవాభాగ్యం దాసుగారికి దక్కింది .
మెట్టప్రాంతమైన ఒంగోలులో వేసవిలో వదగాడ్పులేక్కువ .వీరి స్కూలుకు ఒక మైలు దూరం లో ఒక పంచమ జాతివాడు వడదెబ్బ తగిలి రోడ్డుమీదనే పడిపోయాడని తెలిసి ,ఒక స్నేహితుడితో అక్కడికి వెళ్ళగా అతడు స్పృహతప్పి ఉండటం గ్రహించి .అతడికి గోచీ తప్ప ఏమీలేదు. అదికూడా మలం తో నిండి ఉంది .దాసుగారు దాన్ని తీసేసి శుభ్రంగా కడిగి ,తన అంగోస్త్రాన్ని కప్పి ,అతడిని స్నేహితులిద్దరూ భుజాలపై మోసుకొని సత్రానికి తీసుకు వెళ్ళారు .అక్కడే ఉంచి ,మంచి భోజనం పెట్టించి రెండు రోజులతర్వాత అతన్ని వాళ్ళ ఇంటికి పంపించిన దయామూర్తి నరసదాసుగారు .ఎంతటి నిష్టాగరిష్టులో అంతరి ఉదారహృదయులు దాసుగారు .ఇలా గాంధీ గారి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మానవతా మూర్తి దాసుగారు .
ట్రెయినింగ్ పూర్తి అవజోచ్చింది .టీచర్స్ అసోసియేషన్ జరిపారు .దానికి విద్యాశాఖాధికారి వర్గీస్ అధ్యషత వహించాడు .ఆయన ప్రతి ట్రెయినీని క్షుణ్ణంగా పరిశీలించి నరసదాసుగారిని ఉత్తమ ఉపాధ్యాయునిగా నిర్ణయించాడు .దాసుగారు ఇంగ్లీష్ లో లో వర్గీస్ గారికి స్వాగత సన్మాన పత్రం రాసి చదివి అందరికీ ఆశ్చర్యం కలిగించారు .అప్పటి ఒంగోలు కలెక్టర్ ఆల్ రౌండర్ అయిన ఏం సి పాయ్ ‘’సర్వతో సమర్ధత పతకం ‘’దాసుగారికి ప్రదానం చేశారు .ఆ ఏడాది 1931లో మద్రాస్ ప్రెసిడెన్సిలో నరసయ్యగారు ప్రధమ శ్రేణిలో ప్రధమ స్థానం లో ఉత్తీర్ణులయ్యారు .అప్పటివరకు ఏ ఆంధ్రుడూ సాధించని ఘనవిజయం నరసయ్యగారు సాధింఛి ,జమ్ములపాలెం లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపబడి పని చేశారు .
యోగా భ్యాస మహిమలు
యోగ సాధనంతో శారీరక మానసిక ఆరోగ్యం సాధించాలని నరసయ్యగారు భావించి హఠయోగ ప్రక్రియ చదివి ,స్వయంగా యోగాభ్యాసం చేశారు .పాడి ఆవును కొని ఆవుపాలు , ,ఉప్పు కారం లేని చప్పిడి కూరలతో ,ఆవుపెరుగన్నం మాత్రమె భుజిస్తూ జిహ్వ చాపల్యానికి కళ్ళెం వేశారు .రెండేళ్ళు ఇలా గడపటం తో ఓజస్సు తేజస్సు ఏర్పడి పరమ ఆకర్షణీయులుగా కనిపించారు.జపధ్యానాలతో మరింత శక్తి సాధించారు .పద్మాసనం లో ఉదయం సాయంత్రం 21వేల 600 జపం చేస్తూ ,రాత్రి 11గంటలకు భజన చేస్తూ ,తెల్లవారుజామున 4గంటలకే లేస్తూ యోగ జీవితాన్ని అత్యంత నిష్టా గరిష్టంగా గడిపారు .
ఒకరోజు రాత్రి స్వప్నం లో సీతామాతః సర్వాలంకార భూషిత గా మెరుపు తీగలాగా దర్శనమివ్వగా తదేక దృష్టితో ఆమెను చూస్తూ ఉండగా ఆమె పసిపాపలాగా మారి ఆయన ఒడిలో కూర్చున్నది .ముద్దులొలికే ఆ చిన్నారిపాపను ఎత్తుకొని ముద్దాడ బోగా కల మాయమయింది మెలకువ వచ్చి భార్యకు అంతా చెప్పారు .ఆ పిల్లముచ్చట్లు ఆదంపతులు ముచ్చటగా చెప్పుకొన్నారు .ఇంతలో భార్య శేషమ్మగారికి ప్రసవ వేదన కలిగింది .అప్పటిదాకా ఆమెకు ప్రసవ చిహ్నాలేవీ లేనేలేవు .ఆశ్చర్యంగా ఆడపిల్ల పుట్టింది .సీతా దేవి అనుగ్రహం తో పుట్టిన ఆపాప కు సీతా కల్యాణి అని పేరు పెట్టుకొన్నారు .
నవవిధ భక్తి రసాలను నరసయ్యగారు ఆస్వాదించారు .సఖ్యభక్తిలోశ్రీరాముడు ఆయనతో ఆటలాడే వాడు .ఒకరోజు రాత్రి రాముడు స్నేహితుడుగా వచ్చి ఆయన ప్రక్క పడుకొన్నారు .భార్య అనుకోని కాలు వేస్తె ,రాముడు లేచి ‘’నీమీదున్న స్నేహంతో వచ్చి నీ పక్కన పడుకొంటే ,నామీదనే కాలు వేస్తావా ‘’ఇది నీకు న్యాయమా ‘’అని అలుకతో పలుకగా నరసయ్యగారు తెల్లపోగా, రాముడు ‘’మిత్రమా ! నీపాదం నాకు మోదం చేకూర్చింది .నన్నే నమ్మి భజి౦ చేవారంటే నాకు పరమ ప్రీతి .సుజనుల చరణ ధూళి నాకు పరమ పవిత్రం .దాన్ని ధరించటానికే నీ దగ్గరకు వచ్చాను ‘’అని రామ చంద్రమూర్తి అదృశ్యమయ్యాడు .అమితాశ్చర్యపడ్డారు నరసయగారు .
రామ భజనకు హనుమ ఉపాసన ముఖ్యం .ఆయన రామునికి నామానికి వారధి .అందుకే నరసయ్యగారు హనుమను అత్యంత భక్తితో అర్చించేవారు .ఒకరోజు రాత్రి 11గంటలకు చేసే భజన పూర్తికాగానే భార్య శేషమ్మగారు ‘’మనం బాగా బీద వాళ్ళం. ఇల్లు గడవటం కష్టంగా ఉంది .సంపాదన యావ లేకుండా మీరు రామభజన చేస్తుంటే సంసారం గతేమిటి వయసులో కాక ముసలితనం లో డబ్బు సంపాదించలేరు కదా ‘’అని భజన గురించి కొంచెం అవహేళనగా మాట్లాడితే ఆయన ‘’అన్నిటికీ రాముడే దిక్కు అని నమ్మి ఉన్నాము మనం .ఆయనే చూసుకొంటాడు . ఆందోళన పడకు ‘’అని ఊరడించారు .ఆమెకు తలకెక్కలేదు ‘’రొక్కం లేక పొతే డొక్క నిండుతుండా శుష్కవేదాంతం తో కడుపు ని౦ డుతుండా అని వాకిలి తలుపు గడియ పెట్టటానికి గుమ్మం దగ్గరకు వెడితే ,ఒక కోటి అమాంతం వచ్చి బలంగా ఆమె వెంట్రుకలు పీకింది .భయంతో అరిచి కిందపడిపోయింది .నరసయ్యగారు దీపం తో వచ్చి లేపి ,ఆమె తలమధ్యభాగంలో వెంట్రుకలుకత్తి రించి ఉండటం చూసి ‘’భాగవతాపచారం చేశావు .క్షమాపణ వేడుకో ‘’అనగా ఆమె ‘’నా తలపోటు తగ్గితే నా బంగారు గొలుసు ఇస్తాను .అప్పాలు పానకం చేసి నైవేద్యం పెడతాను అని మొక్కుకోన్నది .వెంటనే ఆమె బాధ అంతా తగ్గింది .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి ఉన్న చిన్న పెట్టెలో 72రూయాలు కనిపించాయి .ఇదంతా ఆంజనేయ మహిమ అని గ్రహించారు ఇద్దరూ .ఆడబ్బును భగవంతుని పటాలు కొనటానికి ఖర్చు చేశారు .ఆరోజు నుంచి వారి బియ్యపు డబ్బాలో ఎప్పుడూ ఒక శేరు బియ్యం నిలవ ఉండేవి .రోజూ చేసే భోజనానికి భగవంతుడు లోటు రానీయడు అని గ్రహించారు దంపతులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-21-ఉయ్యూరు ‘’

