శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1

Print allIn new window

శతవసంతాల కవి ‘’సౌందర్యం లో నడుచు నామె ‘’ పై పలికిన కవితా కలకూజితం -1

 డా.రాచకొండ నరసింహ శర్మ ఎం .డి .గారు 98వ వసంతం లో వెలువరించిన నాల్గవ ఆంగ్లకవితా అనువాద మే ‘’సౌందర్యం లో నడుచు నామె’’.60కవితల కర్పూర పరీమళాన్ని వెదజల్లే ఈ సంపుటిని తమ తల్లిగారు కీ శే.రాచకొండ సీతా రామలక్ష్మి గారికి ,తమ పిల్లల తల్లి డా రాచకొండ అన్నపూర్ణా దేవి గారికి అంకితమిచ్చారు .క్రీ .శ.1554నుంచి 1922వరకు ఉన్నకాలం లో పూర్వ సంపుటులలో లేని 30మంది కవులు ఇందులో ఉండటం విశేషం .ఇందులో తెలుగు కవి శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారికీ ,మరిద్దరు అజ్ఞాతకవులకు చోటు కల్పించారు .జ్ఞాన వయో వృద్ధ మూర్తి శర్మగారు ఆ కవులలో దర్శించిన కవితా సౌందర్యాన్ని ,వారిపై ఉన్న ఆరాధనా భావాన్ని వెల్లడించే కవితలు ఇందులో ఉన్నాయి .వారినీ ,వారి జీవితాలను, కవితా తత్వాలను అవగాహన చేసుకొని ,వారు చాటిన అవధులు లేని విశాల దృక్పధాలను లోతులు తరచి చేసిన అనువాద కవితలు .వందవసంతాల కవి శేఖరులు శర్మగారు దర్శించి ,ఆరాధించిన కవితా సౌందర్యమే ఇది .ఈ కవి పలికిన అనువాద కవితా కలకూజితాలే ఈ కవితా సౌందర్యమంతా.ఈ పుస్తకం నాకు శర్మగారు ఆప్యాయంగా పంపగా మార్చి 15 అందింది .నిన్ననే వారిని ఫోన్ లో పలకరించి,వారి అర్ధాంగి మరణానికి సంతాపం తెలియజేసి .పుస్తకాలు అందాయని చెప్పాను .అసలు పుస్తకాలు అందగానే అందినట్లు వారికి మెయిల్ రాశాను అనీ చెప్పాను .చదివారా అని నిన్న అడిగితె ‘’ఇంకా లేదండీ .’’అన్నాను .’’చదివి మీ అభి ప్రాయం రాయండి ‘’అన్నారు’’ అలానే’’ అన్నాను .ఇవాళ మధ్యాహ్నం పట్టుదలగా చదివి ,నా అభిప్రాయానికి పై శీర్షిక పెట్టి రాస్తున్నాను .

   శీర్షిక కవిత –లార్డ్ బైరన్ రాసిన ‘’షి వాక్స్ ఇన్ బ్యూటీ ‘’కి శర్మగారి అనువాద కవిత ‘’సౌందర్యం లో నాడుచునామె’’.కవికి ఆమె తారా విలసిత నిర్మలాకాశ నిశీధి ‘’లాగా ,చీకటి వెలుగుల్లో శ్రేష్టమైనదంతా కలిసి ఉంది .దైవం ఈయని నును లేత కాంతి ఆమె .ప్రశాంత మధుర భావనకు ఆమె నెలవు .మందహాసాలు జయప్రదాలు .పుణ్యకార్యాలు చేసిన కాలాన్ని గుర్తు చేస్తుంది .ఆమెది అమాయక ప్రేమ నిండిన హృదయం .అందుకే బైరన్ కూ శర్మగారికీ నచ్చిందామె. .వినిర్మల తేజో మూర్తి కనుక చదివే మనకూ నచ్చటమే కాదు ఆరాధనా కలుగుతుంది .సార్ధకమైన శీర్షిక .

స్టెల్లా కనుల భాష లో ఏ నిట్టూర్పు తస్కరించబడిందో లేక పుట్టకముందే మృతి చెందినదా అనే అనుమానం .ఓదార్చటానికే రాసినట్లుంది అని పిస్తుంది ఆష్ట్రోఫిల్ కు .ఎక్కువ నిజం తెలుసుకొని బాధ ఎక్కువగా పొందటం కన్నా ‘’అబద్ధానికే బద్ధుడనై ఉంటాను’’అని ఊరడిల్లాడు .అదీ వారిద్దరి మధ్యున్న అపురూప అనురాగం ,ప్రేమ .మనిషి ఒంటరి ద్వీపం కాదు అసలులో ఒక భాగమే .ఎవరిది ఏది పోయినా ,మనిషి చావైనా తనకు ఐరోపా తగ్గినట్లే,తనను తగ్గించినట్లే  అనిపించింది జాన్ డోన్నె కవికి .గంటలు మనకోసమే మోగుతున్నాయని గ్రహించమంటాడు  .ఇదే యూనివర్సల్ బ్రదర్ హుడ్ .మనం కోరే విశ్వ ప్రేమ .కూపర్ కవి  రేపు రేపు మాటలతో వంచి౦ప బడుతూ రేపటి దినాలెన్నో గడిపేశాడు .తరుగులేని ఆమె ప్రేమ ప్రవాహం మరువలేదు .తనకు జవాబు ‘’ఆ మాతృమందహాసమే .గొప్ప వంశాలలో పుట్టాననే గర్వం కంటే ‘’దివంగతులైన తలిదండ్రుల కొడుకు ‘’అనే గర్వం తనకుంది .తన నిరీక్షణ ఫలితంగా అమ్మ చిత్ర పటం కనిపించింది.కనుక కోల్పోయింది కొద్దికాలమే అనే సంతోషం .ఆమె లేకపోయినా ,ఆమె శక్తి తనను ఓదార్చ టానికి లభించిందని ఊరడిల్లిన హృదయం ఆ మాతృ ఆరాధకుడిది  .కలిసి ఉన్న జీవితంతో ఎప్పటికైనా వియోగం తప్పదు.కనుక గుడ్ బై అనొద్దు గుడ్ మార్నిగ్ అని శుభం గా పలకమంటుంది’’అన్నా బార్బౌల్ద్ .విలియం బ్లేక్ ప్రసిద్ధ కవిత ‘’దిలాంబ్ ‘’చిన్నతనం లో అందరం చదూకున్నాం ,పెద్దతనం లో పాఠాలు బోధించాం అందరం .గొర్రె కూన కు దాన్ని ఎవరు చేశారో కవి చెప్పాడు అర్ధమయేట్లు .ప్రభువే ‘తనను గోర్రెకూన అని పిలుచుకొంటాడు .మనమంతా ఆయన పేరు మీదనే పిలువబడుతాం .దైవ కృప దానిపైనే కాదు అందరిపైనా ఉండాలని కోరాడు కవి .ఈ భావాన్ని శర్మగారు బలీయంగా కవితానువాదంలో  వివరించి మూలానికే వన్నె తెచ్చారనిపించింది .

  షేక్స్పియర్ ఆరాధించిన మిల్టన్ కవి అవసరం ఎంతైనా ఉందని భావించాడు .మార్షీ భూమిగా ఉంది ఇంగ్లాండ్ .పురాతన ఆంగ్ల వారసత్వమంతా కొట్టుకుపోయిందని బాధపడ్డాడు .’’మాకు నీతి,స్వేచ్చా ,మంచి నడత ప్రసాదించు .నీ ఆత్మ తారా సదృశం గా సుదూరం లో ఉంది .తిరిగి వచ్చి మమ్మల్ని ఉద్ధరించు ‘’అని వేడుకొన్నాడు షేక్స్పియర్ .మిల్టన్ స్వరం నీరధిలా స్వేచ్చ గంభీరం .సామాన్య మార్గాలలో సంచరించి ,దైవత్వ భావనతో వెలిగి నిమ్నాతి నిమ్నవిధులనే ఎంచుకొన్న మహోన్నత కవి మిల్టన్ అని ఆంగ్ల నాటక పితామహుడు ఆరాధనతో స్తోత్రం చేశాడు .విలువలు పతనమై పోతున్న ఇంగ్లాండ్ ను ఉద్ధరించమని వేడుకొన్నాడు .అలాగే 20వ శతాబ్దం లో టీఎస్ ఇలియట్ కూడా ఇంగ్లాండ్ పతన సంస్కృతిపై క్షోబించి ‘’వేస్ట్ లాండ్ ‘’రాశాడు .

డ్యూటీ యెంత క్రూరమైనదో చెప్పే ‘’కాసబియాంక ‘’కవిత ఫెలిషియ  హామన్స్.రాసి కన్నీరు తెప్పించింది .’’ది బాయ్ ష్టుడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ ‘’అనే కవితే ఇది .ఈ కవితలో ఆ దృశ్యాన్ని కనులముందు నిలిపారు ఒరిజినల్ కవీ ,అనువాద కవీనూ.’’కాలుతున్న పడవమీద తండ్రి ఆజ్ఞతో డ్యూటీ లో నిల్చున్న  ఆ బాలుడు తప్ప అందరూపారిపోయారు .అతడు పుట్టుకతోనే ప్రభంజనానికి పాలకుడు లా  ఉన్నాడు  వాడిలో వీరులరక్తం ప్రవహిస్తోంది .బాలుడైనా సేవా గర్వం ఉంది ముఖం లో .కింద తండ్రి కాలి చనిపోయాడు  .కానీ కదలటానికి ఆజ్ఞ లేదు .’’నా పని అయిపోయిందా నాన్నా ‘’అని అరుస్తున్నాడు .’’తండ్రి పని అయిపోయిందని’’ తెలీదు ఆలేత వాడికి .కర్రలుకాలి భయంకర శబ్దాలు చేస్తున్నాయికానీ తండ్రి నుంచి సమాధానం లేదు ఎన్ని సార్లు అరచినా .’’నేనిక్కడే ఉండాలా నాన్నా ‘’?చివరి సారి అతడి నోటిలో నుంచి వచ్చింది. మంటలు చుట్టు ముట్టాయి .జండా కాలిపోయింది పడవ దగ్ధమైంది చివరకి ఆమంటలు కసబియాన్కాను కాల్చేశాయి .బాలుడేక్కడ అని నావ తెరచాప ,చుక్కాని, జెండా, నావను చిద్రం చేసిన సముద్ర అలలను, గాలుల్నీ అడగమంటు౦ది  హృదయవిదారకంగా కవయిత్రి .’’అక్కడ నశించిన అన్నిట్లో –అత్యంత ఘనమైనది –విశ్వాసం నిండిన ఆ చిన్ని హృదయం ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చి సేవాధర్మం ఎంత కఠినమో తెలియ జేసే కవిత ఇది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-22-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.