విశ్వ పుత్రిక తోరూ దత్-3
బెంగాల్ వాతావరణం
ఆంగ్లేయులు బెంగాల్ ను స్వాధీనం చేసుకొన్నప్పుడు జనం లో ప్రతిఘటన పెద్దగా కనిపించ లేదు .భావాల్లో ఆలోచనా విధానం లో మార్పులు రావాలని ఆ ప్రజ కోరారు .బెంగాల్ బ్రిటన్ తో పాటు సమాన హోదా పొందిందని భావించారు .భావ పునరుద్ధరణ కావాలన్నది అందరి కోరిక .’’ఆధునిక జనకుడు’’ రాజారామమోహన రాయ్ తన దేశాన్ని కొత్త జీవంతో నింపే ప్రయత్నం చేశాడు .ప్రాక్ పశ్చిమ స్నేహహస్తం నవ సాహిత్యం లో ప్రవేశ పెట్టాడు .ఫ్రాన్స్ దేశం ఎగరేసిన జాతీయ పతాకం చూసి సంతోషం పట్టలేక ఎగిరిగంతులేసి కాలు విరగ కొట్టుకున్నాడు .మత విద్యా జాగృతికి సంస్కరణకు ముందు నిలిచాడు .బెంగాల్ విద్యా వైజ్ఞానిక మత సా౦ఘికరంగాల్లో పునర్జన్మ పొందటానికి రామ మొహనుడే ముఖ్య కారణం .1817లో ఆయనా ,బెంగాల్ సంస్కరణ వాదులుఆంగ్ల మిత్రులతో కలిసి ఆంగ్ల బెంగాలీసమైక్యాన్ని చాటే మొదటి హిందూ కాలేజి 100మంది విద్యార్ధులతో ప్రారంభించారు .మరుసటిఏదాది కేరీ వార్డ్,మార్ష్ మన్ అనే మిషనరీలు షెరాపూర్ కాలేజి పెట్టారు .ఈ ముగ్గురు బెంగాల్ పునరుజ్జీవనానినికి జీవితాలు ధారపోసిన మహనీయులు .దీని మొదటి ప్రిన్సిపాల్ డా డఫ్.రెండవవాడు డేవిడ్ లేష్టర్ రిచర్డ్ సన్.
తొరూ దత్ కుటుంబానికి చెందిన నీలమణి దత్తుకు కేరీ మంచి మిత్రుడు .18వ శతాబ్ది ఉత్తరార్ధం లో హైందవ విద్యావంతుల్లో నీలమణి ఒకడు .రామమోహన్ మిషనరీలతో కలిసి తిరిగినట్లే ఈయనా వాళ్ళతో తిరిగాడు .హిందూ జీవితం పై ఈ మిషనరీల ప్రభావం ఆ రోజుల్లో బాగా ఎక్కువే .ఇక్కడ ప్రారంభమైన నవీన వైజ్ఞానికోద్యమం క్రైస్తవ విధానంతో కలిసి సాగింది .హీబ్రూ గ్రీక్ భాషల్ని చదివి రామమోహన్ బైబిల్ మూలం చదివి బాగా అర్ధం చేసుకొన్నాడు .ఆనాటి విద్యావంతులు చాలామంది గ్రీక్ లాటన్ ఫ్రెంచ్ జర్మని భాషల్ని ఆసక్తిగా నేర్చుకొన్నారు .
కేరీ ఇండియాలో స్థిరపడటానికి నీలమణి దత్ చాలా సహాయం చేశాడు .ఎవరూ లేని అతనికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడుకూడా .భార్య పిచ్చిది .పిల్లలు రోగగ్రస్తులు .ఈ సహాయాన్ని కేరీ ఎన్నడూ మర్చిపోలేదు .మాణిక్ తలా వీధిలో నీలమణి ఇల్లు’’రాం బాగన్ ‘’ ఉండేది.ఇదే కేరీకీ స్వగృహమే అయింది .ఇదే తర్వాత తోరూ దత్ ఇల్లుకూడా అయింది .సంపన్నుడైన నీలమణి పూజలు దానాలు ధర్మాలు బాగా చేసి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నప్పుడు కెరీయే ఆదుకొన్నాడు .
హిందువులను ఇంగ్లీష్ రచనా వ్యాసంగం బాగా ఆకర్షించింది .బెంగాల్ మొదటి తరం కవులలో హెన్రి లూయీ వివియన్ డెరోజియా(1809-1831)ఒకరు .హిందూకాలేజిలో గుమాస్తాగా చేరి లెక్చరర్ అయ్యాడు .తల్లి హిందూ తండ్రి పోర్చుగీస్ ..ఆయన ‘’జన్ఘీరా పకీరు –ఇతర రచనలు ‘’కావ్యం రాసి బాగా ప్రసిద్ధుడయ్యాడు .ఆకాలేజి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ ‘’లిటరరీ గెజిట్ ‘’సంపాదకుడు .ఇతడు రాసిన ‘’బెంగాలీ పత్రాలు ‘’ ఆనాటి బెంగాలీ కవులపై విశేష ప్రభావం కలిగించాయి . .
1874లో తోరూ బెంగాలీపత్రికలో డేరోజియాపై ఒక వ్యాసం రాసింది .కాశీప్రసాద్ ఘోష్ అనే కవి డేరోజియా ను అనుసరించి ఇంగ్లీష్ లో పద్యాలు రాసేవాడు .ఈయనే మొదటి బెంగాలీ ఆంగ్లకవి .ఈయన రచించిన షాయర్ మొదలైన కవితలు 1830లో ప్రచురితమయ్యాయి .1835కు పూర్వం మోహన్ లాల్ ,హసన్ ఆలీ ,రాజ గోపాల్ అనే ముగ్గురు కవులు ఉండేవారు .రాజనారాయణ దత్ ప్రాచీన గాధా పద్ధతిలో రాసిన ‘’ఓస్మిన్’’,అరేబియన్ టేల్ ‘’1844లో రిచర్డ్సన్ కు అంకితమిచ్చాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-22-ఉయ్యూరు–