అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య

అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య

దరిశి చెంచయ్య తెలుగులో మొదటి అరాచకవాది.  అకళంక దేశభక్తుడు, నిరాడంబర గాంధేయవాది, కాంగ్రెస్ వాది, , వామపక్ష వాది. వీటన్నింటికీ మించి మహోన్నతమైన మానవతావాది!

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ. తెలుగులో ఏకైక గదర్ వీరుడు. మొదటి తెలుగు దేశ అనార్కిస్టు యోధుడు. కథకుడు, చరిత్ర కారుడు, అద్భుతమైన రచయిత!

లాలా హర్ దయాళ్, జితేంధ్ర నాధ్ లాహరీ, శ్యాంజీ కృష్ణవర్మ, బిపిన్ బిహారీ గంగూలీ వంటి దేశీయ యోధులతో పాటు ప్రిన్స్ క్రోప్టకిన్, బకూనిన్, సన్ యెట్ సేన్ వంటి విదేశీ విప్లవకారుల్ని సైతం తన స్వీయచరిత్ర లో పరిచయం చేశారాయన!

చెంచయ్య మిత్రుడు సర్దార్ బలవంత సింగ్ కి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం లో మొదటి మార్క్సిస్టు ఇండాలజిస్టు, తెలుగు వారు మరిచిన విస్మృత మహా మేధావి డా. కె. బి. కృష్ణ గారి గురించి కూడా ఉంది!

తీవ్ర జాతీయవాద స్పూర్తితో మొదలై, అంతర్జా తీయ అరాజకవాద రాజకీయాల స్పూర్తితో తీవ్రవాదిగా ఆరితేరి, జాతీయోద్యమంలో గాంధేయవాదిగా మారి, కమ్యూనిస్టు గా చివరాఖరకు సాంస్కృతికోద్యమకారునిగా మిగిలిన ఆయన కథ అద్వితీయం!

వైశ్యులలో  మొట్టమొదటి కులాంతర వివాహ నిర్వహణ మొదలుకొని , కాంగ్రెస్ పార్టీ సభలు, అభ్యుదయ రచయితల మహాసభ, ప్రజా నాట్యమండలి , కందుకూరి వీరేశలింగం గారి శతవార్షికోత్సవం..ఇలా ఎన్నో చారిత్రక సంఘటనల ఖజానా ఆయన ఆత్మకథ!

“ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమం” అవస రమనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పిన చెంచయ్య, తన చిట్ట చివరి శ్వాస వరకూ సమాజం కోసమే తపించారు. అందు కోసం సర్వం త్యజించారు!

ద్భుతమైన ఆయన ఆత్మకథ “నేనూ – నా దేశం ప్రచురించబడి 70 సంవత్సరాలు అవుతోంది. 1952 లో ముద్రణ పొందిన ఆ గ్రంథం తర్వాత ఎన్నోసార్లు ప్రచురించ బడిన  తెలుగులోనే గొప్ప స్వీయచరిత్ర అది!

విచిత్రం ఏమంటే అన్ని పక్షాలలోని మంచిని స్వీకరించినప్పటికీ ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసే పని చెంచయ్య చేయకపోవడంతో ఈ రోజు ఆయన్ని ఏ సంఘాలు పట్టించుకున్నది లేదు!

స్వీయచరిత్ర తో పాటు చెంచయ్య కొన్ని కథలు కూడా రాసారు. “మీరూ నేనూ” పేరుతో అవి ప్రచురించబడినాయ్. 1990 లో నల్లూరి వెంకటేశ్వర్లు గారు పూనుకుని దర్శి చెంచయ్య గారి శతజయంతి సభలు వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక సావనీర్ కూడా ప్రచురించి పంచారు!

తెలుగు సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషి చేసిన దరిశి చెంచయ్య గురించి ఈ రోజు తెల్సింది తక్కువ. ఆయన జీవితం, కృషికి సంబంధించిన స్పూర్తిని భావితరాలకి తెలియజేయడం ఈనాటి అవసరం!

మహనీయుడు దర్శి చెంచయ్య గారి స్వీయ చరిత్ర, ఒక రకంగా తెలుగు వారి రాజకీయ, సామాజిక సాంస్కృతిక చరిత్ర. కావున 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘నేనూ, నా దేశం’  సమా వేశాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వర్తమాన సాహిత్య సాంస్కృతికోద్యమ అవసరమని నా అభిప్రాయం! అందులో భాగంగా గతంలో రెండేళ్ళ క్రితం ఆయన ఆత్మకథ ని పరిచయం చేస్తూ రాసిన రైటప్, ఆత్మకథ సాఫ్ట్ కాపీ ,మీరూ, నేనూ కథా సంపుటి సాఫ్ట్ కాపీ ఈ మెసేజ్ తో పాటు పంపుతున్నాను. ఔత్సాహికులు ఎవరైనా స్పందిస్తే సంతోషం!

నేనూ నా దేశం : మహోన్నత సందేశం!!

తెలుగులో ఆత్మకథలు, స్వీయచరిత్రల  అంతగా లేదు. రాసే ధైర్యం ఉన్నవారు కూడా అరుదే. కానీ, వచ్చిన వాటిలో తప్పనిసరిగా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో చెంచయ్యగారిది ఒకటి. తన ఆత్మకథని “బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరికొయ్య కెరయైన అమరజీవి సర్దార్ బలవంత సింగుకు, ఆయన భార్య కు ” అంకితమిచ్చిన చెంచయ్య ‘నేనూ – నా దేశాన్ని ‘ చారిత్రక డాక్యుమెంట్ గా మలిచారు.

“తాను రచయితను కాదన్న సంకోచం శ్రీ చెంచయ్య గారికి వున్నట్టుంది. కాని, ఆయన సూటిగా ఆలోచిస్తారు. సూటిగా బ్రతుకుతారు. అందువల్ల సూటిగానే వ్రాయగలరు. రచయిత కావడానికి దీన్ని మించిన అర్హత నా మట్టుకు నాకు తెలియదు.” అంటారు పీఠిక లో నార్ల వెంకటేశ్వరరావు గారు. లాలాహర్ దయాళ్ అనార్కిజంతో మొదలై గదర్ వీరోచిత పోరాట నుండి స్వాతంత్రోద్యమం వరకూ పరుగులు చేస్తూ సాగిపోతుందీ రచన.

నెల్లూరు జిల్లా కనిగిరిలో (ప్రస్తుతం ప్రకాశం) పుట్టి, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి అక్కడ గదర్ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా చారిత్రక పాత్ర నిర్వహించిన ఏకైక ఆంధ్రుడాయన. ఢిల్లీ, కన్ననూర్, లాహోరు, కలకత్తా, నెల్లూరు, కోయంబత్తూరు, సింగపూరు, బేంకాక్ జైళ్ళలో ఉన్నారు. ఎనిమిదేళ్ళ జీవితం చెరశాలలో గడిచిపోయింది.

స్వాతంత్ర్య పూర్వ భారతదేశపు ముఖచిత్రం మొదలుకొని స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్యానంతరం సమాజ మార్పు కోసం వెల్లువెత్తిన వివిధ ఉద్యమాల వరకూ అనేక విషయాలు, విశేషాల సమాగమం దర్శి చెంచయ్య గారి ‘నేనూ నా దేశం’.

“నా చేతిలో మిగిలివున్న కొద్ది ధనాన్ని నేనెంతో పొదుపుగా వాడాల్సిన స్థితి ఏర్పడింది. అందువల్ల రోజూ హారిసన్ కంపెనీలో రొట్టెను కొనుక్కుతిని, కొళాయి నీళ్ళు తాగుతూ కొన్ని వారాలు గడిపాను.” (పేజి 171)

“అసలు ఇతరుల ఆర్దిక సహాయాన్నర్ధించి జీవించడం ఆత్మగౌరవాన్ని చంపుకోవటమేనని నా అభిప్రాయం. కాబట్టి జట్కా బండి తోలుకొని స్వతంత్రంగా జీవించినా గౌరవప్రదమేనని నిశ్చయించుకున్నాను.” (పేజి 172) అంటారు.

“వైశ్యులు ఎంతో ధనం సంపాదించుకున్నారు. ప్రజల సొమ్ము వారి హస్తగతమవుతోంది. వారేమో అధిక భాగ్యవంతులవుతూంటే ప్రజలు మరీ బీదలవుచున్నారు. ధనార్జనయందు తాపత్రయమేకాని సంస్కారమందు కోరికే కనబడదు వైశ్యుల్లో.”(పేజి 258) కంచె ఐలయ్య మీద పడేడ్చే కోమట్లు, వైశ్యుడిగా పుట్టి విశ్వనరునిగా ఎదిగి దశాబ్దాల క్రితం మొహం పగిలేలా చీవాట్లు పెట్టిన చెంచయ్య గారు జీవితాంతం కులాన్ని అసహ్యించుకున్నారని గ్రహించాలి. వైశ్యుల్లో మొదటి వితంతు వివాహం ప్రోత్సాహకర్తగా ఉన్నాయిన, ” ఇండియాలో అన్ని కులాల్లాగే వైశ్య కులం కూడా వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉంది …(పేజి 190) అన్నారు.

కాంగ్రెస్ , సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ల నేపధ్యంతోపాటూ ఆర్.ఎస్.ఎస్. క్రూరత్వాన్ని కూడా దగ్గర్నుంచి చూసారాయిన. ” గాంధీ గారి హత్యతో కొందరు సంతోషపడుతున్నారనే విషయం నాకెంత విషాదాన్ని కలిగించిందో వ్రాయలేదు”( పేజి 358) వీరేశలింగం శతవార్షికోత్సవాన్ని మద్రాసు లో జరిపించడంలో చెంచయ్య గారి పాత్ర ఉంది.

“విద్యాధికులైన సభ్యులలో పెద్ద మార్పు రాసాగింది. అదేమంటే పదవీ వ్యామోహం (కెరియరిజము) ఈ దుర్గుణం ఇండియాలో ప్రతి రాజకీయ పార్టీలోను ప్రవేశించి ఆ పార్టీ లను నాశనం చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలో పొడచూపిన ఈ దుర్గుణాన్ని వెంటనే అణచివేయకపోతే పార్టీ నైతిక దృష్టి క్షీణించిపోతుంది.(పేజి 365) అన్నాయన

 “నేను కమ్యూనిస్టు పార్టీ లో సుమారు పది సంవత్సరాలున్నా వాస్తవంగా కమ్యూనిస్టు కాలేకపోతిని….” (పేజి 366-67) లో నిజాయితీగా రాసుకున్నారు.”

వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమైన ఆయన,”సంపాదించడమనేది కష్టజీవులను దోచుకోవడమేననే భావం నాలో కలిగినందుననే సంపాదన మానేసాను. …‌‌భోజనం ఖర్చు తగ్గించుకొంటూ వచ్చాము. పాలు, నెయ్యి, నూనె, కూరగాయలు, పండ్లు వగైరా తగ్గించాము. ఇంతచేసినా ఆర్ధికంగా సవరించుకోలేకపోయాము…….ఆర్థికంగా తీరని కష్టాలు కూడా రాజకీయ జీవితాన్ని మానుకొనుటకు ఒక కారణం”(పేజి 368)

తదనంతరం సాహిత్య సేవ చేయడానికి నిర్ణయించుకున్న వారు జీవితాంతం సమాజం హితం కోసమే మసిలారు. మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు (?) లాలా హర్ దయాల్ అసాధారణ జీవితసంగతులు మొదలుకొని

మొట్ట మొదటి మార్స్కిస్టు ఇండాలజిస్టు కాట్రగడ్డ బాలకృష్ణ అసామాన్య పాండిత్యం వరకూ ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సంగతుల విలువైన గ్రంధం దర్శి చెంచయ్య గారి “నేనూ, నా దేశం”. అంతా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.