ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3
కవిగా జీవనానంద
జీవనాన౦ద దాస్ కవిత్వం లో ప్రత్యేకత అతని భావ చిత్రాలలో నవ్యత .ఇందులో సంప్రదాయం సమకాలీన భావ సమైక్యతా ఉంటాయి .అతని భావ చిత్రాలు టాగూర్ వాటికంటే ప్రత్యేకంగా ఉంటాయి .టాగూర్ భావ చిత్రాలు అనువాదం లో తేలిపోతాయి అంటే పేలవమై పోతాయి .ఈయనవి స్పష్టంగా నిలుస్తాయి.ఇతనికవిత్వం లో పదాలు సందర్భ శుద్ధి దాటి ఎక్కడో ఉండి అధివాస్తవిక భావనాబలం తో కొత్తగా కనిపిస్తాయి ఇతని ‘’మృత్యు పరిష్వంగానికి ముందు ‘’కవిత విశిష్ట మార్గం లో ఉంటుంది .దీని నిండా కళ్ళకు కనిపించే ,చెవులకు వినిపించే చిత్ర ,క్లిష్ట సంకేతాలు౦టాయి .ఆయన అనుభూతుల్లోంచి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్లు ఉంటాయి .అలంకారాల అందం బలంగా మనసులోకి చొచ్చుకుపోతుంది .ఉదాహరణ –‘’నది ఒడ్డున మంచుపూలు వెదజల్లుతున్న –నారీరత్నాలను చూసిన మేం –నీటిలో ఏకాంతంగా ఈదే –చేపకన్నెల నేత్రాలలోకి –అలల ద్వారా చొచ్చుకు పోయిన –ధాన్యపు సుగంధాలు దర్శించాం-ఇంతకూ మించి నేర్చే దీమిటి ? మృత్యు పరిష్వంగానికి ముందు కు ?ఎర్రగా ఎత్తుగా పెరిగిన ప్రతికోర్కేకు పక్కన గోడలా –నల్లటి మృత్యు ముఖం దాక్కుందని నరులైన మనకు తెలీదా ?మనిషి మనసులో పండే కలలూ ,ఐహిక భోగాల బంగారు చాయలూ –ఒక మహా ప్రశాంత నిశ్చలయోగ స్థితిలో –సమతూకం లో ఉంటాయని ప్రజలకు తెలీదా ?’’
ఇలా ఒకదాని వెంట మరో భావచిత్రం పరుగులు తీసి పరాకాష్టకు చేరతాయి .
ఇదే కృష్ణ శాస్త్రి గారి ‘’ఆకులో ఆకునై ,పూవులో పూవునై ‘’కవితలా మనల్ని మెరిపిస్తుంది .కళ్ళను పేము చెట్టు పళ్ళతో పోలుస్తాడు .ముగ్గురు ముష్టివాళ్ళు కవితలో పట్టణవాతావరణం హాస్యం గా పోషించాడు .’’ఎముకముక్క తిన్న కోతి నీటిలో ప్రతిఫలిస్తుంది’’ అంటాడు
‘’ సరోజినీ సమాధి ‘’కవితలో –‘’ఇదుగో ఇక్కడే నిద్రిస్తోంది మన సరోజినీదేవి –ఇంకా ఇక్కడే ఉందేమో నాకు తెలీదు –ఇక్కడే శాశ్వతంగా ఉండేట్లు –సంగీతాన్ని దాచిపెట్టారు ‘ఈ వర్ణనలో శ్మశానం కనిపించదు.సజీవ స్త్రీ ప్రక్కమీద పడుకొన్న భావం కలుగుతుంది .వర్ణన హఠాత్తుగా ఊహా స్థాయి నుంచి ,విశ్వభావన స్థాయికి ఉవ్వెత్తున ఎగిరిపోతుంది —‘’ఆకాశం లో కాషాయ వర్ణ కిరణ శకలం ఒకటి – పరివేషం తో మిలమిల మెరుస్తోంది-నీహారం కప్పిన నిప్పు కన్నెలా –బూడిదలో దాక్కుని కనిపించని పిల్లిలా –కనిపించీ కనిపించని ముఖం మీద చిరునవ్వు చిందులతో –చూపరుల కనువిందు తో ‘’సరోజినీ సమాధిని వర్ణించాడు .
‘’వనలతా సేన్ ‘’అనే ప్రసిద్ధ గీత౦ ప్రారంభం లో –
‘’శతానేక బ్రహ్మకల్పాలు గతం లో కలిసిపోకముందే –ఈ భూమ్మీద కాలం పరచిన గులకరాళ్ళ రాస్తా వెంబడి –ఓపికతోఒంటరిగా ఒక్కడినే ఆనాడు తిరుగుతూ-కోప ఘూర్ణిత సముద్ర ఘోషలు విన్నాను –అవి ప్రళయంగా నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి –సింహళ సముద్ర తీరం నుంచి –చీకటి రాత్రులలో జీవకళలు విరుగుతూ –మలయా జలసంధిదాకా –మత్తుగా నడుస్త్తూoడేవాడిని –వనలతా సేన్ నన్ను ఆలింగనం చేసుకొన్న చోటు లోమాత్రమే –నాకు కలిగింది మనశ్శాంతి ‘’.కాలం వీధుల్లో ఆత్మ చేస్తున్న అనంత ప్రయాణం ఇక్కడ చూపాడుకవి .చివరగా ‘’శతాబ్దాలక్రిందట తెలిసిన దాని కంటే –ఎక్కువ ఏం తెలిసింది నాకు?’’అంటాడు .మన అనుభూతికవి తిలక్ కూడా ఇలానే రాశాడు .అనేక చారిత్రిక అంశాలు కవితలలో మెలి తిప్పేస్తాడు దాస్ .ఈజిప్ట్ దేశాల పురాతన నాగరకత పై కవి ప్రత్యెక మోజు ఉన్నట్లు కనిపిస్తుంది. పతంజలి ,ఆమ్రపాలి ,నాగార్జున, శ్రావస్తి కంఫ్యూషియస్,అత్తిలి వంటిచారిత్రక పాత్రల ,ప్రదేశాల పేర్లు ఆయనకవిత్వంలో చాలాసార్లు ప్రత్యక్షమౌతాయి .’’మకరమాసం చివరి రోజు ‘’కవితలో కాలప్రవాహ చారిత్రిక చైతన్యాన్ని పరిగెత్తే పక్షితో పోలుస్తాడు .ఎడిత్ సిట్ వెల్ కవితలలో ఉన్నట్లే దాస్ కవితలలో జంతు ప్రపంచమూ దర్శన మిస్తుంది –‘’పుండుమీద నెత్తురూ చీమూ బాగా తాగేసి –తళత్తళల రెక్క లాడిస్తూ ఈగ ఎండలో ఎగురుతోంది ‘’అని వర్ణిస్తాడు .అసహ్యంగా కనిపించేదాన్ని అర్ధవంతంగా భాసి౦ప జేస్తాడు .ఆయనకవిత బుద్ధి సూక్ష్మతను కూడా నిద్ర లేపుతుంది .వీరసావర్కార్ ,నారీమన్ వంటి మహాపురుషులు అత్తిలి వంటి పాత్రలతో కలిసి నడుస్తారు .ఆయనది పలాయన వాదం మాత్రం కాదు –‘ఎక్కడో ఉషస్సు మనకోసం వేచి ఉంది ‘’అని ఆశకలిగిస్తాడు.చరిత్ర కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకోలేక ఆత్మఎక్కడి నుంచి వచ్చిందో ,అక్కడికి అంటే మృత్యు గహ్వరం లోకి ,అంధకార గర్భం లోకి వెళ్ళిపోవాలనే ఆకాంక్ష కనిపిస్తుంది .’’బల్లెపు పోట్లకు బలియిన వరాహం లా-భూదేవి వెర్రికేకలు వేస్తోంది ‘’అన్నాడు .’’ఏనాటికీ మెలకువరాని –ఈఅనంత నిద్రా దీర్ఘ సముద్రం లోకి వెళ్ళ దలుచుకున్న నన్ను –ఎందుకులేపుతారు ?ఎందుకు పిలుస్తారు ?’’అంటాడు .’’యుగయుగాలుగా మనిషి తన శవాన్ని తానె మోస్తున్నాడు-రక్తదాహం దాహం తీర్చుకొన్న మానవాత్మ –దుర్వాసనతో దూరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తోంది-రక్షించమని నక్షత్రాలను అర్ధిస్తోంది-ప్రేమకోసం పరితపిస్తోంది –విజ్ఞాన రోచిస్సులను పిలిచి నెత్తురు మచ్చ తుడిచేయమ౦టో౦ది -అసలు అడిగేవాడా ఆత్మ అనేది లేకపోతె “”?అని ప్రశ్నించాడు .
భాషలోని పలుకుబడితో రవీంద్రుని కంటే , భిన్నమైన పలుకుబడిసాధించినా శబ్దార్ధ సామ్యభావనలో టాగూర్ కు చాలా దగ్గరగా వచ్చాడు దాస్ అనిపిస్తాడు .ఆయన్ను ‘’ ఏకాంతకవి ‘’మహాకవి ,యుగకవి ,అన్నారుకానీ ఏ ఇజానికీ చెందిన వాడుగా ముద్ర పడలేదు ..’’ఈ ప్రపంచభీకరారవ౦ ద్వారా వచ్చిన –నాశనం లేని అనాది నాద శక్తి –వెలుగుకు లొంగి ,ఆన౦దానికి పొంగి మూగ పోయిన దానిలా –అనంత కరుణా సముద్రం మీద అలలలతో గుసగుసలాడుతోంది ‘’అని ముగిస్తాడు కవితను .సంప్రదాయంలో మునిగి తేలుతూ ,తామరాకుపై నీటి బిందువుగా తప్పించుకొనే నేర్పరి కవి జీవనానంద దాస్ . హృదయస్పర్శి.భావనా తీవ్రత తో ,కవితా భాగీరధీ పావిత్ర్యాన్ని వివిధ కోణాలలో దర్శించి ,ప్రదర్శించటం ఏ కవికైనా అసాధ్యం కానీ దాన్ని సుసాధ్యం చేశాడు దాస్ .సమకాలీన బెంగాలీ కవులలో ఇంతటి ప్రతిభా వ్యుత్పత్తులను చూపిన కవి లేడు.’’దటీజ్ ‘’జీవనా నంద దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.