శతక భాగవతంశ్రీ పిసిపాటి సోమయ్య కవి

శతక భాగవతం
శ్రీ పిసిపాటి సోమయ్య కవి రచించిన శతకభాగవతం 1942లో నూజివీడులోని గౌరీ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల పేర్కొనలేదు .కంద పద్యాల్లో భాగవత కథా శతకం రాశాడు కవి ..’’కృష్ణ ,పరమాత్మ హరీ ‘’అనేది మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీ కళ్యాణ గుణాకర-లోకేశ్వరసాధు భక్త లోక యన౦
తా
నీ కథల స్మరియి౦తును –బ్రాకట సద్భక్తి గృష్ణ పరమాత్మహరీ ‘’
తర్వాత భాగవతాన్ని సంస్కృతంలో రాసిన వ్యాసుని తెలుగులో రాసిన పోతనను స్మరించి ,అప్పటికే శతక రామాయణం శతక భారతం రాశానని ,ఇప్పుడు భాగవత శతకాన్ని కూడారాసి అర్పిస్తున్నాననీ విన్నవించాడు .శిరములు కన్నులు కరములు శత వేలు కలిగి సర్వాతీతుడవై జలధిలో ఉంటావు .ధర్మానికి విఘాతంకలిగినపుడు ప్రతియుగం లో అవతరించి ధర్మోద్ధరణ చేస్తావు .మొదట పెనుమీనంగా విలయాబ్ది విరించి కునుక, వేదాలను అపహరించిన హయగ్రీవుని మలపినావు .’’నిద్దుర మానిన వేలుపు -పెద్దకు నిగమముల చిక్కు విచ్చుచు మగుడన్ –‘’ముద్దుగా తెచ్చిచ్ఛి విపద్దశ బాపావు .సత్యవ్రత రాజుకు బ్రహ్మమార్గం తెలిపావు .ప్రళయాబ్దిలో మనువు ,విత్తనాలు ఓషధులు మునులు మునిగిపోతుంటే,పెద్ద నావతో వచ్చి తేల్చి కాపాడావు .
తర్వాత క్షీరసాగర మధనం ,కూర్మావతారం ,అమృతాన్ని మోహిని రూపంలో దేవతలకుపంచి దనుజుల పరిఢవం చేశావ్.సనకసనందులు విష్ణుద్వారపాలకులకుశాపం ఇవ్వటం వారు భూలోకంలో పుట్టటం ,భూమిని చాపచుట్టగా చేసి సముద్రంలో దాక్కున్న హిరణ్యాక్షుడిని మహావరాహ రూపం లో మర్దింఛి కోరపై భూమిని నిలిపితే భయపడిన భూదేవిని భయం పోగొట్టటం ,హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడి ప్రహ్లాద వరదుడవటం చక్కగా వర్ణించాడు కవి .వామనుడవై బలిని మూడడుగుల భూమి కోరి ,మూడో పాదం ‘’నతుడై శిరమం జూపిన –మతియుతుబలి దైత్యు బొగడి –మానుగానతని సుతలమునకు బనిపి ‘’దేవతలను బ్రోచాడు హరి .రాముడుగా ‘’ఒరులేరును విరువంగానెరుగని శివధనువు దునిమి –మిధిలా వరు సద్మ౦బున – సీతను’’ పరిణయమాడావు .తర్వాత రామాయణ కథ అంతాకందాలలో అందంగా నడిపారు . తర్వాత కృష్ణావతారం .’’అష్టమ గర్భంబున బహు –లాష్టమిగల రోహిణీ సమన్విత రాత్రి న్-సృష్టిం గంటివిధర్మ –భ్రష్టుల దండింప కృష్ణ పరమాత్మహరీ ‘’అని చక్కని చిక్కని పద్యం రాసి శ్రీకృష్ణజననం చెప్పారు .అక్కడినుంచి కృష్ణ కథ మొదలెట్టి ,నంద యశోదల గారాబు పట్టిగా పెరగటం ,పూతన శకటాసురాది రాక్షస నిధనం వర్ణించి బాల కృష్ణుని లీలావినోదాలను తనివార వర్ణించి ,కాళీయ మర్దనం గోపికా వస్త్రాపహరణం ,గోవర్ధనోద్ధరణం మేనమామ కంసవధ ,’’లేపనముల నంది కుబ్జకు –బాపంబుల బాపి దేహ వక్రత బోవ సద్రూపం ‘’ఇచ్చాడు
కాశీకి వెళ్లి సాందీపముని ఆశ్రమం లో అన్న బలరాముడితో చదివి ‘ఎల్ల విద్యల బనుపడ’’నేర్చాడు .చనిపోయిన గురు సుతుని ‘’జము నడిగి తెచ్చి-గురు దక్షిణగా స్థిరభక్తి ‘’తో అందించి లోకానికి మార్గదర్శకుడయ్యాడు .సముద్రంలో ద్వారక నిర్మించి మదురానగర వాసుల్ని యుద్ధభయ౦ లేకుండా కాపాడాడు .రుక్మిణీ కల్యాణాన్ని –‘’సిరి మున్ను గొన్న వడువున –నెరి నోరిచి చైద్య పక్ష నృపతుల నాజిన్-బరిణయమైతి విదర్భే-శ్వర సుత రుక్మిణిని కృష్ణ పరమాత్మహరీ ‘’.ఆతర్వాత శ్యమంతక మణి వృత్తాంతం ,అష్టభార్య వివాహం ,పారిజాతాపహరణం ,ధర్మరాజుతో రాజసూయం జరిపించటం భీష్మ వచనం ప్రకారం అగ్ర పూజ అందుకోవటం ,చైద్యుని చంపటం సూటిగా వర్ణించాడు .
‘’సుదతి దను బంప నడుగుల – బదిలముగాదేచ్చి యీయబత్తి గుచేలుం –డొదవిన కరుణను బలు- సంపద లిడి ‘’స్నేహధర్మాన్ని లోకానికి చాటాడు .ద్రౌపదీ వస్త్రాపహరణం ,అక్షయ వస్త్ర ప్రదానం ,ధర్మాత్ములైన పాండవుల పక్షం లో ఉండి కురుపాండవ సంగ్రామం జరిపించి ధర్మాన్ని కాపాడాడు .ద్రోణ సుతుని అస్త్రం నుంచి ఉత్తర గర్భాన్నికాపాడి పరీక్షిత్తు ఉదయానికి కారకుడవటం వివరించారు ‘’భేదా చారులు దుర్నయ –వాదులు లోకాపకార పరులు జెలగన్ –మేదిని బుద్ధుడవై ‘’పుట్టి నీతిని బోధించాడు .చివరగా కల్కి అవతారం దాల్చాడు హరి .
ఇన్నీ చెప్పి ‘’నీ లీలలలెల్ల బేర్కొన –జాలరు బ్రహ్మాదులరయ సంకర్షణ –‘’నా వల్ల ఏమౌతుంది అని కాడి పారేశాడుకవి .111వ కందం లో ‘’భారద్వాజస గోత్ర వి-హారుని బిసపాటి సుబ్బయార్య తనూజున్ –ధారుణి సోమయ సుకవి గృ-పారతిరక్షించు కృష్ణ పరమాత్మహరీ ‘’అని ముగిస్తూ చివరిపద్యంలో ఫలశ్రుతి రాశారు .
ఈ శతకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘’సుత్తి లేకుండా సూటిగా భాగవతామృత పానం చేయించిన శతకం ‘’ అనాలి .సోమయ్య గారికి సాహిత్యం లో గొప్ప పేరే ఉంది .తన అనుభవం భక్తీ కి కలిపి తన పాండిత్యాన్ని ఇక్షురసంగా మార్చి కవి రాశారు .పండితలోకం గుర్తించే ఉంటుంది .అయినా పరిచయం చేసే సౌభాగ్యం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-22-ఉయ్యూరు ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.