సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
–శీర్షిక -శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం –
4-శ్రీ కోగలి రాజ శేఖర్ –విజయవాడ -9491737060
ఉగాదికి స్వాగతం
దేవుని చిత్తం –రుతువుల వృత్తం –జీవిపుట్టుక పునాది –కాలగమనాలకు ఆది
తీయతీయని బెల్లం –ఘాటుకారపు మిరియం –చేదు వేప చిగుళ్ళు –పుల్లనైన మామిళ్ళు –పచ్చిజామ వగరు
ఉప్పుతో రుచులు ఆరు –సస్క్రుతికి చాటింపు –షడ్రుచుల మేళవింపు
తీపి సంతోషానికి –చింత దుఖానికీ –మామిడి ఆశ్చర్యానికీ –వగరు అసహ్యానికి –
కారం కోపానికి –ఉప్పు భయానికి –రుచులు మరిగిన దేహం –చూపు తమ ప్రభావం
పచ్చడిలో దాగుంది శాస్త్రీయత –అది ఆయుర్వేదపు ఘనత .
వేప చేదు నివేదన-చెడు బ్యాక్టీరియా నిర్మూలన
చింత మామిడి తురుము –అంటువ్యాధులు తరుము
షడ్రుచుల పచ్చడి సేవన –దేహాంతర ప్రక్షాళన
ప్రతికొమ్మా పువ్వులతోస్వాగతం –ప్రతిపువ్వు పులకరి౦పుల పరిమలి౦పు
ప్రతిపల్లె ఆనందపు సంబరం –ప్రతి యింట మామిళ్ళ తోరణం
శుభంగా వచ్చే శోభ కృత్ ఉగాది –తెలుగువారి సంతోషాల సారధి .
పసివారి ఆటల అరుపులు – ముత్యాలముగ్గుల మెరుపులు
పూజించే హృదయాలకు హారతి –మంచిమార్పు కోరుతుంది జగతి
ప్రగతికి జయ మంగళం –శోభ కృత్ కు ఆలింగనం .
5-శ్రీ చెన్నాప్రగడ విఎన్ ఎన్ శర్మ –విజయవాడ -9440 587567
శుభం పలుకుదాం
వేయి శుభములు కలుగకపోయినా –ఎన్నో కొన్ని అందించిన
శుభ కృత్ నామ సంవత్సరమా నీకు జేజేలు .
ఎన్నెన్నో ఉన్నత చదువులు చదివినా –పట్టభద్రులకు కొలువులు లేవు
ఎంతటి సుగుణాల రాముడైనా –ఈడొచ్చిన పిల్లాడికి పెళ్ళి కావటం లేదు
అతివలపై ఆగని అఘాయిత్యాలు –అంగడి సరుకుగా మారిన ప్రశ్నా పత్రాలు
అంతు చిక్కని నేతల స్నేహాలు ,స్కాములూ
ఎన్నాళ్ళు భరించాలి ఈ నేరాలూ ఘోరాలూ ?
ఇవి మచ్చుకు కొన్నే మరకలు
నాణానికి రెండవ వైపులా మరికొన్ని మెరుపులూ ఉన్నాయ్
మెండుగా వర్షాలు కురిపించి నిండుగా పంటలు పండి౦చావు
కర్షకుల ఇంట సిరులోలికించి –కడగండ్లు అంతమొందించావు
మహమ్మారి వ్యాదులెన్ని వచ్చినా – దేతుగాఎదురొడ్డిన సత్తామనది.
సినీనట దర్శక దిగ్గజాలను కోల్పోయినా –ఆస్కార్ కు ఆస్కారమిచ్చి ఘనకీర్తి పొందావ్
ఓశుభ కృత్ నీకు వీడ్కోలు
మనజీవితాలను శోభాయమానం చేయడానికి
తరలివస్తున్న శోభ కృత్ స్వాగతం ,సుస్వాగతం.
6-శ్రీమతి ఎస్.అన్నపూర్ణ –విజయవాడ –
జీవనయానం
జీవన యానం –మన జీవన తేజం
కష్టాల కడగళ్ళు దాటి –శుభ కృత్ ఇచ్చిన నవ జీవంతో
ఆశల ఊసులు కళ్ళల్లో మెదులు తుండగా
కొత్త ప్రయత్నాల సూర్యకిరణాల ఉత్తేజం
తోడూ నీడగా సఫల మనో రధులమై
నూతన ఆవిష్కరణలూ,ఆనంద దీపావళి హేలలో డోల లూగి
శోభ కృత్ వత్సర నూతన వసంతానికి
ఆహ్వానం పలుకుతూ సుమదురంగా
గానం అందిస్తూ గండు కోయిలలు
శుభం భూయాత్ అనిపలుకుతున్న చిలుకలజంటల
శోభతో మంగళం మహాత్ .
7-శ్రీ టి.రవీంద్ర –విజయవాడ -9490712065
పట్టాభి షిక్తుడు
కొందరికి శుభం అంటే ముగింపు అని అర్ధం
మరికొందరికి శ్రీకారం అని భావం
పాత దానికి పడే శుభం కార్డు –మరో కొత్తకు శ్రీకార పర్వం .
పాతఅనుభవాల పవర్ హౌస్ ల నుంచి-కొత్తదారులు కా౦తులీనుతాయి
పాతయుగపుశిలాజాలనుంచి
మంగళ యాన్ మహా సంకల్పం దాకా
గతించిన కాలం నేర్పిన పాఠాలు ఎన్నో .-వార్తలకెక్కని వర్తమానానికి రహదారులయ్యాయి
శుభ కృత్ పాతాళం లో పడేసి ఉంటే –ఒక కనపడని పునాదికి పురుడు పోసి ఉండ వచ్చు
మురికి కూపం లోకి విసిరేసి ఉంటే –సత్తువ ఉన్న విత్తనాలను అది గుర్తించి ఉండచ్చు
విస్ఫోటనమని వాటిని దీవించి ఉండొచ్చు
శుభకృ త్ వేసిన అనుభవాల పునాదులపై శోభ కృత్ సౌధనిర్మాణ౦ కొన సాగిద్దాం
శోభ కృత్ శిఖరాగ్రం పై –విజయకేతనాన్ని ఎగరేద్దాం .
కన్నీటి చారల్ని ,చెమట ధారలలో తడిపేస్తూ
చెరగని సంకల్పం అంతర్వాహినిగా
త్రివేణీ సంగమం సృష్టిద్దాం .
పట్టు తప్పినా వాడు కూడా పట్టు బడితే
పట్టభాద్రుడౌతాడని ప్రకటిద్దాం .
పట్టువదలని విక్రమార్కుడు లోన ఉంటే
ఓటమి కాటు పద్దవాణ్ణి సైతం
ఒకనాడు పట్టాభి షిక్తుని చేస్తాడని
సరికొత్త శోభ కృత్ సాక్షిగా నిరూపిద్దాం ,చూపిద్దాం .
8-శ్రీ మొరుమూరి శేషాచారి-గుంటూరు
సాక్ష్యాల సాక్షాత్కారం
నిజాల నిలువు టద్దానికెదురు-నిటారుగా నేను నిలబడ్డాను
నా కనుపాపల్లో గతించిన సాక్ష్యాలు –సాక్షాత్కారాన్ని కోరాయి .
‘’శుభ కృత్ ‘’ల అడుగులు మదిలో సవ్వడి చేస్తున్నాయి
‘’వసంత ‘’పరిమళాలు నాశికాగ్రాన్ని స్ప్రుశిస్తున్నాయి
రంజింపజేసిన రవాలు –శ్రవణాలకు శ్రుతులను బోధిస్తున్నాయి
కడలి వెళ్ళిన కధలెన్నో –కనుబొమల కుదుళ్ళలో కుస్తీ పడుతున్నాయి
మూగ జీవాల మౌనరాగాలు –పెదాలపై పల్లవిస్తున్నాయి
నాకనుపాపల్లో –గతించిన సాక్ష్యాలు –సాక్షాత్కారం కోరుతున్నాయి .
మృదువైన మధురానుభూతులు –చెక్కిళ్ళను చు౦బిస్తుంటే
కష్టాల కూడళ్ళు శిరస్సుపై –కురుల ఝరులై ఉరకలేస్తున్నాయి
కబళించిన కరాళ నృత్యాలు –నా కరాల నరాలను కదలిస్తున్నాయి
ఉదయ కాంతుల ఉజ్వల జీవితాలు –ముఖాన వికాసమైతే
ఆడపిల్లల ఆర్త నాదాలు –హృదయ ఘోషకు మూలాలవుతున్నాయి
ఇక
ప్రకకృతి తన విక్రుతత్వాన్ని విడిచి
శుభ కృత్ ముగింపు వేడుకలకు సన్నాహాలు చేయ మంటోంది
గతించిన సాక్ష్యాలను సాగనంప మంటోంది
నవ వసంత రాగాలతో ‘’శోభ కృత్ ‘’కు స్వాగత గీతాలు
రచించ మంటోంది
నా పాదాలు ఉత్తమ పదాల వైపు అడుగులేస్తున్నాయి .
9-డా .మైలవరపు లలితకుమారి –గుంటూరు -9959510422
స్వాగతం పలుకుదాం
ఆకురాలేశిశిరాన్ని వీడుకోలుపుతూ –అవనికి అందాలు పంచాలని
ఆనందంతో మళ్ళీ వచ్చింది –ఆకు పచ్చని పట్టు చీర కట్టుకొని .
ఎర్రని చిగురులు చీరంచుకాగా –విరిసిన పూలు చుక్కలై మెరియగా
తరువులన్నీ ఒయ్యారాలొలుకగా
మావి చివురులు మేసిన కోకిలస్వామి
గొంతు సవరించుకొని –చిటారు కొమ్మన ఉయ్యాలలూగుతూ
షడ్జమంలో రాగాలాపన చేస్తుంటే
పెద్ద ముత్తైదువ చిలుక పేరంటాలుకాగా
వేయి వెలుగుల సూరీడు –మేలు కొలుపులు పాడ
ని౦బకుసుమాలు అక్షతలు కాగా
నీల గగనమే ఆతపత్రమై భాసింప
విరగబూసిన గున్నమావిమాకు ను
అల్లు కుంటున్న మాధవీ లతను చూసిన
పంచ బాణుడు చెరకు విల్లు సవరింప
పండితుల పంచాంగ శ్రవణాలతో
కవి వరుల కవి సమ్మేళనాలతో
శుభాల నందించిన శుభ కృత్ తరలి వెడుతుంటే
జనజీవితాలను శోభాయం చేయాలని
ఆగమించే శోభ కృత్ కు
ఆనంద భైరవి రాగాలతో స్వాగతం పలుకుదాం.
10-శ్రీమతి తుమ్మల స్నిగ్ధ మాధవి –విజయవాడ -6305871095
ఉత్సవం
భగవత్ స్వరూపమై వికసించిన కాలం –జీవన గమనానికి నాంది
చంద్ర చకోరియై ఆమని పల్లవించి
పదనిస లాల పించే విశిష్టమైన పర్వదినం –ఉగాదియై నిలిచి
వసంతాన విరబూసిన అమూల్య నవ నవో న్వేషణ పర్వదినం.
మధురానంద సందోహ కోలాహలం
మాధవ వేణు గానమై పరవశింపజేసే కాలం
మార్గమై ,విశిష్టత నంద సృష్టికి బీజమైన వేళ
చైత్రం హరి విల్లైపురివిప్పిన మయూరి కేళితో
రంగుల విస్ఫోటనమై –ప్రపంచాన వెలసి౦దీసుదినం.
కట్టుబాట్లెరుగని కుహూ నాదం ప్రణవ నాదమై
సర్వ జగత్తును కొత్త వత్సరానికి ఆహ్వానించింది
సృష్టి ప్రారంభానికి తొలితారకమంత్రమై
విలసిల్లింది శోభ కృత్
శుభకరమై శుభయోగమై
జగతి ప్రశాంతమై పరిఢ విల్లాలని ఆశిద్దాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.