ఉయ్యూరు బ్రాహ్మణ్యానికి అండా దండ
ఉయ్యూరులో బ్రాహ్మణ్యానికి అండా దండ గా ఉన్న అయిదుగురు యువకుల సేవ అనిర్వచనీయం .మంచికి ఎలానో అందరూ సాయం చేస్తారు .కానీ చావు వంటి వాటికి దగ్గరకు రావటానికి భయపడతారు ఎవరైనా .కానీ వీరు మాత్రం ముందు నిలబడతారు .ఆసరా ఇస్తారు .భరోసా కలిగిస్తారు.అన్నీ తామే అయి పని చేస్తారు .ఎవరింట్లో అయినా మరణ వార్త తెలిస్తే ,కబురు చేస్తే వెంటనే వచ్చి వాలి పోతారు .బాధిత కుటుంబం ఇక దేని గురించి బెంగా, భయం పడక్కర్లేదు .తమ ఆత్మీయులను కోల్పోయిన దుఖం లో నుంచి వారు కోలుకోవటానికి తోడ్పడతారు . వీళ్ళు యే పనీ పాటా లేని వారుమాత్రం కాదు .ఉన్నతమైన మంచి ఉద్యోగాలు చేసుకొంటూ ,అందరి మన్ననలు అందుకొంటూసమాజంలో పేరు ప్రతిష్ట ఉన్నవారే వీరు .కానీ ఆపదలో తోడుపడటం వారికి సహజమైన గుణం అయింది .అదే మా ఊరి బ్రాహ్మణ్యానికి వెన్ను దన్ను అయింది .సాధారణంగా వారి సేవలు ఆరోజు మాత్రమే ఆ కుటుంబం గుర్తుంచుకొంటుంది.ఆ తర్వాత వారిని మర్చే పోతారు ఇది సహజం .
ఇంతకీ ‘’మా వూరి పాండవులు”’ ,ఎవరు? కబురు ఫోన్ లో చెవిలో వేయగానే వెంటనే స్పందించి ,షామియాన ,మొబైల్ మార్చ్యురి ,కుర్చీలు వగైరా గబగబా ఆర్డర్ ఇచ్చి సిద్ధం చేస్తాడు వేమూరి సదాశివ .అవసరమైతే పార్ధివ దేహానికి అంత్య సంస్కారం కోసం’’ బ్రహ్మ’’ గారిని మాట్లాడి పెడతాడు .ఆయన రాసిచ్చిన లిస్టు ప్రకారం వస్త్రాలు ,పాత్రలు బియ్యం నువ్వులు నెయ్యి కర్పూరం ఏర్పాటు చేస్తాడు.ఆఇంటికి వెళ్ళి ఇంకా ఏమేమి కావాలో ఆరా తీసుకొని వెంటనే నిమిషాలమీద సమకూరుస్తాడు .అవసరమైతే శవవాహకులను మాట్లాడిపెడతాడు .అతనికి చెప్పామంటే ఇక యజమానికి పూర్తి భారోసాయే .ఇవి సరే ‘’పంచకట్ల సవారి’’ అంటే ‘’పాడె ‘’కట్టటం అందరికీ తెలిసిన విద్యకాదు. దానికి కావాల్సిన వెదురు గడలు,చీల్చిన ముక్కలు కట్టటానికి తాడు , ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి .ఇవి రాగానే వాటిని కట్టి తయారు చేయాలి .ఆపని ధైర్యంగా అందరూ చేయలేరు .దీనికి ఆదిరాజు హనుమంత్ మంచి నేర్పరి .ఒకపక్క శవానికి సంస్కారం జరుగుతుంటే ఒక్కడే కూర్చుని అన్నీ సమకూర్చి ‘’శవ సవారీ ‘’తయారు చేసేస్తాడు .అది అతనికి బాగా డెఅలవాటైన విద్య అనిపిస్తుంది .తులసి మండలు వేసి శవాన్ని దానిపై పడుకోబెట్టించటం ,ఆతర్వాత శ్మశానానికి యజమానికి తోడుగా వెళ్లటం ,అక్కడ చితిపై పడుకోబెట్టటానికి సాయపడటం ,’’కపాల మోక్షం ‘’ అయిన శబ్దం విని తోడు వచ్చిన వారందరితోపాటు స్నానం చేసి మళ్లీ తన స్కూటర్ పై వెళ్ళిపోవటం చూస్తె మనకు అతనిలో ఎంతటి నిబద్ధత ఉందో తెలుస్తుంది .మూడవ వాడు దినవహి ప్రసాద్ .ఇతడు యజమానికి మంచి తోడూ నీడా గా ఉంటాడు .నాలుగవ వాడు గోవిందరాజు వేణు . ఇతను కూడా పై వారిలో యే ఒకరు దొరకక పోయినా ఆపని అంతే నిబద్ధతతో చేస్తాడు .వాళ్ళకేమీ తీసిపోడు ఎందులోనూ . ఇక అయిదవ వాడు వీళ్ళందరితో మంచి రాపోర్ట్ ఉన్నవాడు ,వాళ్ళందరి సహకారాన్నీ యజమానికి అందించి కార్యం కొరత లేకుండా సంతృప్తికరంగా చేసే నేర్పున్న ఒకరకంగా లీడర్ ,కన్వీనర్ మా అబ్బాయి రమణ . మా వాడికి చేయించటం బాగా తెలుసు .ఎక్కడా ఏలోటు రానివ్వడు .యజమాని బీద కానీ ధనికుడు కానీ భేదం అనేదిఉండదు ఈ ‘’మావూరి పాండవులకు’’. వంట బ్రాహ్మణ ఏర్పాటు ,లేకపోతె కేటరింగ్ ఏర్పాటు కూడా చూస్తాడు .వీళ్ళ పిల్పు కోసం రెడీ గా ఉండే వారు ఒకరిద్దరు వెయిటింగ్ లిస్టు లో ఉంటారు .అందులో ఒకడు గోసుకొండ వాసు .వీరికి ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం? .కృతజ్ఞత చెప్పటం తప్ప.వాళ్ళు దేనికీ ఆశించని మహానుభావులు .సాయం కోసం నిలబడే వారు . ఇందులో ఒకరు ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ,ఒకరు వైస్ ప్రిన్సిపాల్ ,ఒకరు ప్రైవేట్ కంపెనీ లో బాధ్యతగల ఉద్యోగి, ఒకరు దస్తావేజు రైటర్ ,జిరాక్స్ షాప్ ఓనర్ ,మరొకరు పొదుపు సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ .వీరంతా తమ విధి నిర్వహణలో ఉంటూనే ఇలాంటి ఆపద్ధర్మ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు .వీరందరి సేవకు ధన్యవాదాలు .
ఇంత మంది చేసే పనిని తాను ఒక్కరే చేసి, తలలో నాలుకగా షుమారు ముప్పై నలభై ఏళ్ళ క్రితం మా వూరి బ్రాహ్మణ్యానికి ,ముఖ్యంగా మాకుటు౦బానికి సేవలందించిన స్వర్గీయ చిలుకూరి వెంకటేశ్వర్లు గారిని ఈ సందర్భంగా మర్చిపోతే ,చరిత్ర క్షమించదు .మేమంతా ఆయనకు ఎంతో రుణ పడి ఉన్నాం .
నిన్న మధ్యాహ్నం చనిపోయిన మా వదిన కమలమ్మ గారికి ఇవాళ ఉదయం ఉయ్యూరు లో మా అన్నయ్యగారబ్బాయి రామనాథ బాబు(రాంబాబు ) స్వగృహం వద్ద ఆమె అంత్యక్రియల ఏర్పాటుకు పై ‘’మావూరి పాండవులు ‘’చేసిన సాయం మదిలో మెదిలి రాసిన మాటలివి .ఇవాళ వారికి సహకరించినవారిలో ఇండియన్ బాంక్ రిటైర్డ్ మేనేజర్ శ్రీ గంగయ్య గారు ,మా గుడి అర్చకుడు మురళి ,మా మద్రాస్ మేనల్లుడు,రాంబాబు బావమరది శ్రీను , మా రా౦ బాబు మేనల్లుడు రవి , భార్య గాయత్రి ,రాంబాబు అక్క వేదవల్లి ,మనవడు ,కొడుకు కళ్యాణ్, భార్య కుటుంబం ఉన్నారు .వీరి తోడ్పాటు మరువలేనిది.అలాగే అతడి హైస్కూల్ క్లాస్ మేట్,ఎల్ ఐ సి ఏజెంట్ స్వర్గీయ జోగారావు గారబ్బాయి ,మావాడుపని చేసిన స్కూల్ అటెండర్, సేవలూ మర్చిపోలేనివే .
మా వదిన గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-24-ఉయ్యూరు

