మా వదిన గారు -కొన్ని జ్ఞాపకాలు -2(చివరి భాగం )
ఒకసారి మా వదిన గారి సంతకం కోసం నన్ను మా నాన్న పోలసానిపల్లికి పంపారు .బెజవాడనుండి రైల లో భీమడోల్ వెళ్ళి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి పోలసానిపల్లి వెళ్ళాలి. అప్పటికే రాత్రి అయింది చివరి బస్ దొరికింది .అప్పటికీ కండక్టర్ కు ఈ రూట్ నాకు కొత్త పోలసానిపల్లి సెంటర్ లో దింపమని చాలాసార్లు చెప్పాను. రోడ్డుకు అటూ ఇటూ చెట్లు .కీకారణ్యం లా ఉంది .స్ట్రీట్ లైట్స్ లేవు .నామాట మర్చిపోయాడు పోలసానిపల్లి దాటి రెండుకిలోమీటర్లు వెళ్ళాక బస్ ఆపి దిగమన్నాడు .నాకు దారికొత్త అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఈ అడవిలో దిగితే నేను ఎలా వెడతాను ?అన్నాను ఏమనుకోన్నారో డ్రైవరూ కండక్టర్ ,నాకోసం బస్ ను రివర్స్ లో ఆ రెండు కిలోమీటర్లు వెనక్కి మళ్లించి పోలసానిపల్లి సెంటర్ లోఆపారు. బతుకు జీవుడా అనుకొంటూ దిగి మా వాళ్ళ ఇంటికి వెళ్ళా .భోజనం పెట్టారు తిని పడుకొని, ఉదయం మా వదిన గారి సంతకం నేను తెచ్చిన కాగితాలమీద పెట్టించుకొని మళ్లీ బయల్దేరి ఉయ్యూరు చేరాను .చిన్న తిరుపతికి భీమడోలు నుంచి పోలసానిపల్లి మీదుగా రోడ్డు ఉంది. వేరే రూట్ గుండుగొలను లో పాసింజర్ రైల్ దిగి ,మా రామారావు గూడెం అగ్రహారం మీదుగా ద్వారకా తిరుమల వెళ్ళవచ్చు .మా అగ్రహారం వెళ్ళాలంటే ఇదే దారి .ఒకటి రెండుసార్లు మా నాన్న గారితో అగ్రహారం వెళ్లాను అక్కడ మాకు ఒక పెంకుటిల్లు బావి ఎడ్లు వ్యవసాయం ఒక నిఖామాన్ ఉండేవారు .చందూరి సుబ్బారావు గారు అక్కడి మా పొలం వ్యవహారాలూ చూసేవారు .ఆయన భార్య కమలమ్మ ఆమెను అక్కయ్య అని ఆయన్ను బావగారు అనీ పిలిచే వాడిని .వాళ్ళే మాకు భోజనం టిఫిన్ చేసి పెట్టేవారు .ఆ ఇంట్లోనే మా పడక . రైతులనుంచి కౌళ్ళు వసూలు చేసుకొని బండీలో గుండుగొలను వెళ్ళి అక్కడ పాసెంజర్ ఎక్కి బెజవాడ చేరి ఉయ్యూరు వచ్చేవాళ్ళం .ఒక్కో సారి మానాన్న నన్ను ఒక్కడినే పంపేవారు .బండీ స్టేషన్ కు రాకపోతే ‘’లెఫ్ట్ అండ్ రైట్ ‘’ తప్పదు .అదీ కీకారాణ్యమే .చెట్లు జీభూతాలుగా ఉండేవి .ఇరువైపులా దట్టమైన చెట్లు .అదో అనుభవం .అగ్రహారం లో మా పెంకుటి౦టికి దగ్గర్లో ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉండేది. అగ్రహారం పంటలు వర్షాధారం .పొగాకు బాగా పండేది .కౌలు ఇచ్చినవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎగగోట్టిన వాళ్ళు ఎగగోట్టారు .రోఖం కోటప్ప అనే ఆతను నాకు బాగా గుర్తు దట్టమైన మీసాలు టో ఉండేవాడు ఇవ్వని వాళ్ళలో ఇతనూ ఉన్నాడు .ఇవ్వని డబ్బుకు ప్రామిసరి నోట్ రాసిచ్చేవారు .కోటప్ప నోటు మొన్నటిదాకా మా దస్తావేజులలో ఉంది .ఈ రిస్క్ పడలేక మా నాన్న గారు అగ్రహారం భూములన్నీ అమ్మేశారు .అప్పుడు నేనూ ఆయన వెంట వెళ్లాను .చందోలు సుబ్బారావు గారి కి మానాన్న మూడు ఎకరాలపొలం ఇంతకాలం నమ్మకం గా పొలాలు చూసినందుకు రాసిచ్చారు .ఆ దంపతులు కొంతకాలం అక్కడే ఉండి, ఆతర్వాత ఏలూరు వెళ్ళిపోయారు .అప్పుడప్పుడు సుబ్బారావు గారు ఉయ్యూరు వచ్చేవారు .మా ఇంట్లో శుభకార్యాలకు ఆయనా భార్యా వచ్చేవారు .అప్పుడు అసలు నీటి వసతి లేదు .ఇప్పుడు బోర్లు వేసి మంచి పంటలు పండిస్తున్నారు .ఎన్టి రామారావు గారి హయాం లో వచ్చిన మార్పు ఇది .బంగారం పండుతోంది పొలాలలో .మా ఆంజనేయస్వామి గుడి శిదిలమైతే అదే ప్రదేశం లో సుబ్బారావు గారి అల్లుడు కొలిచిన ప్రసాదరావు గారు అత్తగారు అంటే మేము అక్కయ్యా అనిపిలిచే కమలమ్మ గారు చనిపోతూ ‘’గబ్బిట వారి ఋణం మనం తీర్చుకోలెం. వారి స్థలం లో ఆంజనేయస్వామి గుడికట్టించండి ‘’అని చెప్పి వాగ్దానం తీసుకోన్నదట .ఆప్రకారం ప్రసాదరావు గారు పిల్లలు బంధువులు ఖర్చుపెట్టి మంచి భక్తాన్జనేయస్వామి విగ్రహం ప్రతిష్టించి మాట నిలబెట్టుకొన్నారు .సుమారు పది పన్నెండు ఏళ్లనుంచి మేము చిన్న తిరుపతి వెళ్ళినప్పుడల్లా తిరుగు ప్రయాణం లో మా రామారావు గూడెం అగ్రహారం పిల్లలకు చూపిస్తూ ఉండేవాళ్ళం .ఈమధ్య కారులో వెళ్ళి మా స్వామిని దర్శించి పూజలు చేసి వస్తున్నాం .మా పిల్లలూ వెళ్ళినప్పుడల్లా అలానే చేస్తున్నారు. అక్కడ దుగ్గిరాల రమాదేవి అనే లేడీ పూజారిని ప్రసాదరావు ఏర్పాటు చేశారు .ఆమె ,ఆమె తమ్ముడు కుటుంబం గుడిని చూసుకొంటున్నారు .మళ్లీ మా దేవుడు మంచి వైభవం లోకి రావటం మా కుటుంబం చేసుకొన్న పుణ్య ఫలితమే .ఒకసారి ప్రసాదరావు గారు, భార్య భారతి ఉయ్యూరు లో మా సువర్చలాన్జనేయస్వామి ఆలయం దర్శించి హనుమజ్జయంతి కార్యక్రమం లో పాల్గొన్నారు .మమ్మల్నీ ఒకసారి అక్కడి కార్యక్రమానికి రమ్మంటే వెళ్ళాం .భారతి నన్ను మామయ్యా అనీ మా శ్రీమతిని అత్తయ్యా అనీ పిలిస్తే ప్రసాదరావు గారు బాబాయిగారు పిన్ని గారు అని పిలుస్తారు .ఇప్పటికే చాలా శాఖా చంక్రమణం చేశాం .
మా అన్నయ్యగారి అమ్మాయి వేదవల్లి ఉయ్యూరు హైస్కూల్ లో చేరి ఎస్ ఎస్ ఎల్ సి పాసై బెజవాడ స్టెల్లా కాలేజిలో ప్రీ యూనివర్సిటి లో చేరి హాస్టల్ లో ఉంటూ చదివింది .ఇంతలో మానాన్న గారు చనిపోవటం కుటుంబ బాధ్యత నాపై పడటం జరిగింది .వేదవల్లి పియుసితప్పింది .ఆరోగ్యం కూడా బాగుండకపోతే చదువు మానిపించాం .చిరివాడ లో వేలూరి వెంకటేశ్వర్లు గారి పెద్దబ్బాయి రామకృష్ణ కు ఇచ్చి మా దంపతులం వివాహం చేశాం .ఆతను అప్పటికి బికాం పాసయి ఉన్నాడు .ప్రైవేట్ కంపెనిలో విశాఖలో పని చేసేవాడు .అల్లుడు చాలా మంచి వాడు .మా అమ్మాయి కాపురానికి విశాఖ తీసుకు వెళ్ళాం .తర్వాత గరివిడి ఫెకర్ కంపెనిలో చేరి జీవితాంతం అక్కడే పని చేసి గొప్ప పేరు తెచ్చుకొన్నాడు .కాలనిలో కంపెని వారి ఇల్లు కూడా కొనుక్కున్నాడు . వేదవల్లి మళ్లీ ప్రైవేట్ గా చదివి డిగ్రీ పాసై బిఎడ్ చేసి కంపెని వాళ్ళ స్కూల్ లో సోషల్ టీచర్ గా పని చేసి రిటైర్ అయింది .ఈలోగా ఏం ఏ .తోపాటు లా కూడా చేసింది .ఇదంతా స్వయం గా సాధించింది భర్త ,పిల్లల సహకారంతో. ఒక రకం గా ‘’స్వయం సిద్ధ’’ మా అమ్మాయి వేదవల్లి .వాళ్ళ పిల్లలు రవి హరి మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలలో పెద్దాడు రవి హైదరాబాద్ లో చిన్నాడు హరి అమెరికాలో స్థిరపడ్డారు .వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి .పిల్లలూ కలిగారు .అల్లుడు రామకృష్ణ నిరుడు మార్చిలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి హైదరాబాద్ లో పెద్దకొడుకు ఇంట్లో చనిపోయాడు కార్యక్రమాలు గరివిడిలోనే చేశారు .
మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు ఉయ్యూరు హైస్కూల్ లో టెన్త్ పాసై ,ఉయ్యూరుకాలేజిలో ఇంటర్ చదివి పాసై తర్వాత ఇక్కడ కాలేజీ ఎత్తేస్తే బందరులో డిగ్రీ చదివి పాసయ్యాడు .తర్వాత భోపాల్ యూనివర్సిటిలో ఫిజిక్స్ లో ఏం ఎస్ సి .చేసి పాసయ్యాడు . వీడి చదువంతా మా కుటుంబమే చూసింది . కొంతకాలం గుంటూరు జిల్లా చిలుమూరు కాలేజి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేసి ఆతర్వాత ,వాడి ఫ్రెండ్ వెంట్రప్రగడ సత్తిబాబు సలహాపై ఉయ్యూరులోని కెసిపి వారి హైస్కూల్ ఆర్ కె .ఎం లో సైన్స్ మాస్టర్ గా చేరి రెండేళ్ళ క్రితం రిటైర్ అయ్యాడు .తర్వాత మా పెద్దక్కయ్య లోపాముద్ర బావగారు కృపానిధి దంపతులచిన్నకూతురు జయలక్ష్మి తో వివాహం చేశాం .అంటేమేనరికం .ఒక కొడుకు- కళ్యాణ్. వీడి పెళ్ళికూడా జరిగింది .ఉయ్యూరులో ఫ్లోరా స్కూల్ దగ్గర స్థలం కొని రెండు అంతస్తుల బిల్డింగ్ అన్ని వసతులతో కట్టుకొన్నాడు రాం బాబు .మా పొలాలు అన్నీ జాయింట్ గా మాకూ , వాడికీ, మాతమ్ముడికి ఉన్నాయి .పదిహేను ఏళ్ళక్రితం ఉయ్యూరు పొలం, కిందటి నవంబర్ లో కాటూరు పొలం అమ్మి ముగ్గురం సమానం గా పంచుకున్నాం .నా వాటాలో వచ్చిన డబ్బును మా అబ్బాయిలు నలుగురికి,మా అమ్మాయికి ఇచ్చి నేను ఒక వాటా తీసుకొన్నాను .అంటే ఆరువాటాలుగా సమానంగా తీసుకోన్నామన్నమాట .
మా వదిన గారిని కొడుకు రాంబాబు కంటికి రెప్పలా చూసుకొన్నాడు .వాడికి బై పాస్ జరిగింది .భార్యకు కంటి చూపుకు తేడా వచ్చింది .అయినా నిబ్బరంగా బాధ్యతగా అందరిని జాగ్రత్తగా చూసుకొంటున్నాడు. మా వదిన గారు ఓపికున్నంత వరకు వంట చేసి పెడుతూనే ఉండేది .మా ఆవిడ ఎప్పుడైనా హైదారాబాద్ వెడితే వాళ్ళింట్లోనే నేను రెండు పూటలా భోజనం చేసేవాడిని .ఇది వాడు కాలనీలో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు .అంటే సుమారు పాతిక ఏళ్ళక్రితం .తల్లి ఆరోగ్యం విషయంలో మంచి శ్రద్ధ చూపేవాడు .ఎప్పటికప్పుడు డాక్టర్ తో చెకప్ చేయిస్తూ ఇచ్చినమందులు వేస్తూ ,అవసరమైతే వంట చేస్తూ, లేకపోతె కర్రీ పాయింట్ నుంచి కూరలు వగైరాలు తెస్తూ టిఫిన్ లు తెచ్చిపెడుతూ గాజును కాపాడినట్లు తల్లిని కాపాడుకొన్నాడు .ఈ నెల 6వ తేదీ కి రెండురోజులముందు మావదినగారికి జలుబు ,ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే డాక్టర్ ను ఇంటికి పిలిపించి చెకప్ చేయించి మందులు వాడాడు .గుణం కనపించక పోతే , హాస్పిటల్ లో చేర్పించటానికి డాక్టర్ సలహా పై అంబులెన్స్ మాట్లాడి , భోజనం చేసి తీసుకు వెడదామని ఇంటికి రాగానే మా వదిన అమాంతం చేయి చాపి దగ్గరకు తీసుకొని చేతిలో ప్రాణం వది లేసింది .ఇంతటి అనాయాస మరణం పొందటం ఆమె అదృష్టం .ఆకుటు౦బ౦ చేసుకొన్న పుణ్యం .ధన్యజీవి మా వదిన గారు కమలమ్మ గారు .అంతటి బాధ్యతతో తల్లి ఋణం తీర్చుకొన్న మా రాంబాబు అభినంద నీయుడు .మా వదిన గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ –
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-8-1-24-ఉయ్యూరు

