ఉచిత హిందీ విద్యాలయం బాలికా పాఠశాల నిర్వహించిన హిందీవిశారద , అతి నిరాడంబర సేవా తత్పరురాలు , తామ్ర పత్రగ్రహీత -శ్రీమతి యలమంచిలి బసవమ్మా దేవి (విహ౦గ కు ప్రత్యేకం )

పదహారేళ్ళ వయసులో స్వాతంత్రోద్యమ౦ లో చేరి ,ఉచిత హిందీ విద్యాలయం బాలికా పాఠశాల నిర్వహించిన హిందీవిశారద , అతి నిరాడంబర సేవా తత్పరురాలు , తామ్ర పత్రగ్రహీత -శ్రీమతి యలమంచిలి బసవమ్మా దేవి (విహ౦గ కు ప్రత్యేకం )

గుంటూరు జిల్లా రేపల్లెతాలూకా కాట్రగడ్డ గ్రామం లో శ్రీ బొబ్బా బసవయ్య ,శ్రీమతి వెంకమ్మ దంపతులకు 1913లో బసవమ్మ జన్మించారు .వ్యాసాశ్రమం పీఠాధిపతులు శ్రీ విమలానంద స్వామి ఈమె సోదరులు .ఆమె వివాహం 12 వ ఏటనే 1926లో శ్రీ యలమంచిలి వెంకటప్పయ్య గారితో జరిగింది .విద్యాభిలాషి ,హిందీ పండితులులైన ఆయన భార్యకు తెలుగు ఇంగ్లీష్ హిందీలు బోధించారు .వీటితోపాటు జాతీయభావాలు సమాజ సేవాసక్తి నేర్పారు .

   1930 లో గాంధీజీ శాసనోల్లంఘనకు పిలుపు నివ్వగా స్త్రీపురుషులంతా ఆవేశంతో ఉప్పు వండి, శాసన ధిక్కారం చేశారు .శాంతి దళ శిబిరాలు నెలకొల్పి వాలంటీర్లకు శిక్షణ నిచ్చారు శ్రీమతి ఉన్నవ లక్ష్మీ బాయమ్మ గారు .ముద్ద బంతి పూవులాంటి బసవమ్మా  దేవి అ పల్లెటూరు నుంచి గుంటూరు వచ్చి ,అరహారేళ్ల వయసులో ఆ శిబిరం లో చేరారు .స్వయంగా శాకాహారి అయిన ఆమె కాఫీ టీ ఉల్లిపాయ చింతపండు కారం వంటి అనేక పదార్ధాలు విసర్జించారు .అన్ని నియమాలు పాటిస్తూ ఊరూరా తిరిగి ఉద్యమ ప్రచారం చేస్తూ ,శిక్షణ పొందుతూ ,మెప్పు పొందుతూ ఉన్నారు .ఇంతలో తల్లి ఆరోగ్యం క్షీణించిందని తెలిసి ఆఖరు దశలో ఉన్న ఆమెను చూడ టానికి వెళ్ళగా చివరి చూపు దక్కి తల్లి మరణించింది .ఇంటినిండా సోదరులు సోదరిలు  బంధు గణం శోక సముద్రంలో  ఉన్నా ,శిక్షణ పూర్తికాకపోతే దేశ సేవ సరిగ్గా పూర్తి చేయలేనేమో అనే భయంతో ,రెండు మూడు రోజులకే గుంటూరు వెళ్ళి శిక్షణలో చేరి పూర్తి చేశారు .అంతటి పట్టుదల మనోనిగ్రహం ఆమెవి .

  శిక్షణ పూర్తికాగానే అనేక చోట్ల పికెటి౦గులు నిర్వహించారు .వాడ వాడలా ప్రచారం చేశారు .పోలీసులు ఆమెను చూసీ చూడనట్లు వదిలేశారు .కొంతకాలానికి అలజడి తగ్గి ,ఆమె మళ్లీచదువులో ప్రవేశించారు.దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి మధ్యమ పరీక్షలో నాలుగు రాష్ట్రాలలో ప్రధమ రాలుగా నెగ్గి రికార్డ్ స్థాపించారు .బహుమతులు అందుకొన్నారు .తర్వాత విశారద పాసయ్యారు .

 1932లో మహాత్ముడు శాసన ధిక్కారానికి అనుమతి నివ్వగా ,ప్రజలంతా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు .బసవమ్మా దేవి అన్నగారి ప్రోత్సాహంతో ఆరితేరిన తన ఆడపడుచు  సరళాదేవి ఉత్సాహంగా శిక్షణ పూర్తి చేసి జాతీయోద్యమం లో చేరగా,ఆమెకు అండగా నిలిచి మంచి ప్రోత్సాహమిచ్చారు .పోటీలుపడుతూ పికేటి౦గులు చేశారు .ఈ వదినా మరదళ్ళు మైనేని వారి పాలెం లో 16-1-1932 న అరెస్ట్ అయి ఆరు నెలలు రాయవెల్లూరు జైలు శిక్ష శిక్షకు గురయ్యారు .తామేదో పెద్ద పరీక్షలో ఘన విజయం సాధించినట్లు సంబర పడి సెంట్రల్  జైలులో ప్రవేశించారు. మూడు నెలల తర్వాత కన్ననూరు జైలుకు మార్చగా రెండు చోట్ల శిక్ష అనుభవించారు .వీరితోపాటు శ్రీమతి బెన్నూరి కృష్ణ వేణమ్మ , కాట్రగడ్డ రామ సీతమ్మ వంటి వీర నారులతో కలిసి’’జైలన మిగుల సుఖము ‘’ అని హాయిగా పాడుకొంటూ జైలు శిక్ష ఆనందంగా అనుభవించారు  .

  తెనాలి తాలూకా ఐతా నగరం అనే చిన్నపల్లెలో దంపతులు 1929లో కాపురం పెట్టి, ఉచిత హిందీ విద్యాలయం,ఆదర్శ బాలికా పాఠశాల  నిర్వహి౦చారు .ఉచితమనగానే వచ్చే రాబడి ఏమీ ఉండదు కదా .అందుకని దంపతులు పగలు కూర మజ్జిగతో ,రాత్రిళ్ళు కొంచెం పెసలు, బెల్లంముక్క మజ్జిగ తో గడిపేవారు .అతిధులకూ అదే సత్కారం . 1965వరకు ఇలా విద్యా దానం చేస్తూనే ఉన్నారు .1935లో బసవమ్మా దేవి ప్రయాగ హిందీ సమ్మేళనం వారి ప్రధమ పరీక్షకు చదువుతూ ఉత్తర హిందూ దేశం లో సరయు నది ఒడ్డున బర హజ్ పట్టణం లో ఉన్నారు .అక్కడ మార్వాడీలు ఎక్కువ .ప్రతిరోజూ సరయుస్నానం చేసి అక్కడి మార్వాడీ వనితలకు గీతా పారాయణం చేసి వినిపించేవారు .అనర్గళంగా హిందీలో భావాన్ని వివరించేవారు .కొంతకాలం సేవాగ్రాం మహిళా మండలిలో విద్య నేర్చారు .  గాంధీ తత్వం పూర్తిగా వంటబట్టింది .మార్వాడీ వనితలకు గీతాపారాయణ వినిపిస్తున్నా ,బాబా రాఘవ దాసు ఆశ్రమం లో హిందీ శిక్షణ పొందుతున్నా, ఆమె హరిజన వాడలోనే ఉండేవారు .అప్పుడు లక్నో లో జరిగిన  కాంగ్రెస్ సభలో ఆమె ఆంధ్రదేశం తరఫున స్వదేశీ  వస్తు వస్త్ర ప్రదర్శన నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు .బెనారస్ మెట్రిక్ ,హిందీసాహిత్య సంమేలన్ వారి ప్రధమ ,,ప్రయాగ మహిళా పీఠం వారి ‘’విద్యా వినోదిని ‘’సర్టిఫికెట్లు పొంది ఇంటికి చేరి మళ్లీ స్కూలు నిర్వహణలో నిమగ్నమయ్యారు .

  ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది .పిల్లలను, స్కూలును భార్యకు వదిలి పెట్టి ఆమె భర్త ఉద్యమం లో చేరి ఏడాది జైలు జీవితం అనుభవించారు .తినీ తినకా,నిబ్బరంగానిలబడి పిల్లల్ని పోషిస్తూ హిందీ ప్రచారంలో గడిపారామె .ఆడంబరాలు ఆమెకు గిట్టవు .మట్టిపాత్రలలో వంట. రెండే రెండుజతల ఖద్దరు  దుస్తులు .  దుప్పటి ,చిరుచాప .మూఢాచారాలపై ఏవగింపు ఎక్కువ .మనసునిండా భర్తను ఆరాదిస్తుంటే మంగళ సూత్రం ఎదుకని తీసేశారు ధైర్యంగా .మతపండగల కంటే జాతీయ పండగలు బాగా నిర్వహించేవారు .గాంధీజీపుట్టినరోజున ఒక పాకీ కుటుంబాన్ని ఆహ్వానించి , వారందరికి తలటి  పోసి, కొత్తబట్టలు పెట్టి, వాళ్ళతో సహపంక్తి భోజనం చేసేవారు .దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని తృప్తి పరచేవారు .ఇలా 1965వరకు కొనసాగించారు .

 తర్వాత రక్తపోటుకు గురై కూతురు దగ్గర విశ్రాంతి తీసుకొన్నారు .1975లో ఒకసాయంత్రం తమ కుటుంబం వారికి ఇష్టమైనవన్నీ చేసి .తృప్తిగా తినిపించి రాత్రి పది గంటలకు 62వ ఏట అనాయాస మరణం పొందారు .ఆమె నిరాడంబర సేవ, విద్యా దానం ,దేశ సేవలను గుర్తించి ప్రభుత్వం ‘’తామ్రపత్రం ‘’అందించి గౌరవించింది .

  గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.