ముకురం -1
ముకురం అంతే అద్దం.ఈ ముకురం లో లోకాన్ని ప్రతిఫలిప జేయాలనే ఉద్దేశ్యంతో పెట్టిన శీర్షిక ఇది .ముందుగా చానెల్స్ పై రాస్తున్నాను .వ్యక్తీకరించేస్వేచ్చ ఉంది కదా ,చానల్ మనదే కదా అనే భావంతోఇవాళ చానళ్ళు కొన్ని అతిగా ప్రవర్తిస్తున్నాయి .వీటిపై నియంత్రణకు చట్టాలున్నా అవి వీటినేమీ చేయలేక పోతున్నాయి .ముఖ్యంగా ప్రసిద్ధ సినీ హీరో హీరోయిన్లు’’ చనిపోకపోయినా’’ చనిపోయినట్లు చానల్స్ లొ ప్రసారం చేయటం నైతికంగా ఎంత పతనం చెందామో తెలియ జేస్తోంది .వాళ్ళు బయట పడి ‘’మేము బతికే వున్నామురా నాయాళ్ళలారా ‘’అని మొత్తుకుంటూ గడ్డి పెట్టాల్సి వస్తోంది .ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా ?కోర్టు తీర్పులు రాకపోయినా వచ్చేసినట్లే వాయి౦చేస్తున్నారు ,వీళ్ళే బెయిళ్ళూ ,జైళ్ళూ నిర్ణయి౦చెస్తున్నారు . అబద్ధాన్ని పదిసార్లు ప్రసారం చేస్తే నిజమని నమ్ముతారని భావిస్తున్నారు .జనం చెవిలో కాబెజీలు పెడుతున్నామనిఅనుకోవటం లేదు. జనం కూడా కాబెజీని పూర్వకాలం లొ లా కలువ అని భ్రమపడుతున్నారు .వీటిపై నియంత్రణ ఎలా ఎవరు చేయాలో తెలీదు .
సినిమాలలో పొగ తాగుతున్నప్పుడు, మందు కొడుతున్నప్పుడు మాత్రం అవి హానికరం అంటూ పక్కనో కిందో ప్రకటనలు వస్తాయి .మర్డర్లు జరిగేటప్పుడు హింస పనికి రాదు అన్న ప్రకటన ఎప్పుడన్నా వస్తుందేమో నని ఎదురు చూసేవారికి అది మాత్రం కనిపించదు . అవి వేస్తె , సినిమాలు ఆడవని భయమా? .సిగరెట్ మద్యం ప్రకటనలున్నా అవేమీ ‘’తగ్గేదేలా’’ అంటూ విజ్రుమ్భిస్తూనే ఉన్నాయి గా .అందుకని హత్యలు కొట్లాటలు హింస అంటూ ప్రకటిస్తే మాత్రం ఆగుతాయా అని నట నిర్మాత డైరెక్టర్ల అభిప్రాయమా ?ఆప్రకటనలకు డబ్బు ఎందుకు’’ బొక్క ‘’ అని నిర్లక్ష్యమా ?చానల్స్ ను చూసి బాగు పడాలనే అభిప్రాయం తగ్గిపోతోంది .బండబూతులు అసెంబ్లీ మెంబర్లు మంత్రులు బరి తెగించి మాట్లాడు తుంటే వాటికి ప్రాధాన్యత నివ్వటం ,ప్రభుత్వం ,నియంత్రణ వ్యవస్థ పట్టించుకోకపోవటం మన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పోటు కాదా?కౌరవ పక్షపెద్దల ఉపేక్ష వలన కురు వంశం సర్వ నాశనమైంది అని తెలిసీ ఎందుకీ ఉపేక్ష ?సరైన సమయం లొ చర్య తీసుకోకపోతే జాతి నిర్వీర్యమై పోదా ?ప్రజాస్వామ్యానికి స్వేచ్చ ఎంతటి అవసరమో సంయమనం కూడా అంతే అవసరం .మన స్వాతంత్ర్యం అవతలి వారి స్వీచ్చకు అడ్డు కారాదు అనే రాజనీతి గ్రహించకపోతే భ్రష్టు పట్టి పోతాం .కనుక ప్రజల అప్రమత్తత ,అవసర నిరసన తప్పక వీటిని అదుపులో పెట్టగలవు . ఈ దిశలో ఆలోచిద్దాం అందరం .చేతులుకాలాక ఆకులకై దేవుళ్ళాట మంచిదికాదు కదా .
మరో విషయంతో మళ్లీ కలుద్దాం –
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-24-ఉయ్యూరు

