రజాకార్ల ఉద్యమాన్ని ఎదిరించిన ఉద్యమకారుడు ,మహావక్త ,స్వాతంత్ర్య సమర యోధుడు ,మా భూమి పత్రిక నిర్వాహకుడు ,భారతీయ కళాపరిషత్ స్థాపకుడు త్రిభాషలలో కథా , గీత,జీవిత చరిత్ర ,నవలా రచయిత-హీరాలాల్ మోరియా
హీరాలాల్ మోరియా జూలై 13, 1924 న ఖమ్మంలో జన్మించారు. మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. మోరియా తండ్రిగారు కలప వర్తకులైనా సాహిత్యాభిరుచి కలిగినవారు. ఖమ్మంలో పుట్టి పెరిగిన హీరాలాల్ మోరియా ఏడవతరగతి వరకు ఖమ్మం ఉన్నత పాఠశాలలో చదివారు. వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఉన్నత పాఠశాల నుంచి ‘రెస్టికేట్ చేయగా హైద్రాబాదులోని కేశవ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో చేరి మెట్రిక్ పూర్తిచేశారు. చదువుకునే రోజులనుండే సాహిత్యం పట్ల అభిరుచి కల్గిన మోరియా గార్కి దాశరథి, కవి రాజమూర్తి లాంటి వాళ్ళ స్నేహం కూడా వారి అభిలాషను పెంచగలిగింది. మాతృభాష మరాఠి అయినప్పటికీ తెలంగాణలో అప్పుడు ఉర్దూ ప్రధాన భాషగా ఉండడం వలన ఉర్దూలో ఎనలేని పాండిత్యం సంపాదించారు. స్వయంకృషిలో ఆంగ్లభాషలో కూడా మంచి పట్టును సాధించారు[1].
నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం రోజుల్లో ముఖ్యంగా రజాకార్ల దురంతాలను శక్తివంతంగా ప్రతిఘటించిన స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆరంభదినాల్లోనే అనగా మోరియా ఇరవై సంవత్సరాల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ ఆదేశం ప్రకారం ఖమ్మం జిల్లాలో మొదటి సారిగా సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యారు. మోరియా చక్కటి ఉపన్యాసకుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో మోరియా ఉపన్యాసం ఎక్కడ వున్నా ప్రజలు తండోపతండాలుగా, ప్రభుత్వ నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా గుమిగూడుతుండేవారు. తన ఉపన్యాసాలలో నైజాం నవాబు నిరంకుశ పరిపాలనను గురించి, అతనుకు తొత్తులైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, జమిందార్ల గురించి- వారి దోపిడి విధానాలను వివరిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అరటిపండు వొలిచినట్టు వివరించేవారు. నిజాం ప్రభువు దుష్టపరిపాలన ప్రజాబలం ముందు ఆగదని ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో జరిగిన ప్రజా పోరాటాల్లో ప్రభువులు ఏవిధంగా పతనమై పోయిందీ, ప్రజలు ఎలా గెలిచారో వివరించి చెబుతూ వుండేవారు. వీరు ఉపన్యాసాలతో విద్యార్థులను, కార్యకర్తలను ప్రజలను ఉత్తేజితులను చేసేవారు. మోరియా కాంగ్రెస్‌వాది కావడంతో గాంధీ మార్గం – అహింసా పద్ధతులలోనే తన పోరాటాన్ని వ్యక్తం చేసేవారు. మోరియా రాజకీయ గురువు, తెలంగాణా వీరకేసరి సర్దార్ జమాలాపురం కేశవరావు గారితో నిర్విరామంగా ఉద్యమ కార్యక్రమాలలో తలమునకలుగా వుండి కూడా అంతర్ముఖంగా ఆలోచిస్తూ ఏదో ఒక కథో, కవితో నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా అల్లుతూ వుండేవారు. పత్రికలకు పంపుతూ వుండేవారు. మోరియా, సర్దార్ కేశవరావుతో కలిసి మధిరలో సత్యాగ్రహం చేసి అరెస్టు అయి వరంగల్లు సెంట్రల్ జైలులో నిర్బంధింపబడ్డారు. అటు తర్వాత సంవత్సరం పాటు నిజామాబాద్ సెంట్రల్ జైలులో అనేక కష్టాలనుభవించారు. జైలు సౌకర్యాల మెరుగుకోసం, ఖైదీల హక్కుల కోసం కూడా సత్యాగహ్రం చేశారు. 1938లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1939లో యువజన కాంగ్రెస్‌ను స్థాపించి దాని వ్యవస్థాపక కార్యదర్శిగానూ, అధ్యక్షుడు గానూ వ్యవహరించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. 1947-48కాలంలో హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగాపాల్గొన్నారు. 1948 అక్టోబరు వరకు వరంగల్ జైలులో శిక్ష అనుభవించారు. 1960లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులైనారు. 1964లో విధానమండలికి ఎన్నికయ్యారు. సమరయోధుడిగా ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వంచే తామ్రపత్రం పొందారు. 2006 అక్టోబరు 13న మరణించారు.
సాహిత్యసేవ
ఖమ్మం జిల్లాలో హిందీ, ఉర్దూ, తెలుగు భాషల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ, అంజుమన్ తహఫుజ్ ఉర్దూ సంస్థలను స్థాపించడంతో పాటు రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాష గుర్తింపుకై ఎంతో కృషి చేశారు. ఖమ్మం జిల్లాలో పెక్కు పత్రికలకు విలేకరిగా పనిచేసిన మోరియా, కొలిపాక మధుసూదనరావు గారితో కలిసి ఒక సంవత్సరం పాటు మా భూమి పత్రికను నడిపారు. ఖమ్మం జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి ఆ సంస్థ తరపున యాభై గ్రంథాలను ప్రచురించడం కూడా అపూర్వమే. దీనితో పాటు లలిత కళల అభివృద్ధి కోసం ‘భారతీయ కళాపరిషత్తు”ను కూడా స్థాపించారు. మోరియా దాదాపు పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులుగా వుండి, సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు. సాహిత్యం పట్ల – సాహిత్య ఉద్యమాల పట్ల ఆసక్తిగా ఉండేవారు.
రచనారంగం
ఇతని మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు భాషపై మమకారంతో రచనలు చేశారు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ భాషలలో కూడా సుమారు 300 కథలు వ్రాశారు. వీరు దాదాపు వేయి గీతాలను రచించారు. సామాజిక స్పృతో నిండిన మోరియా కవిత్వం ప్రభోదాత్మకంగా, సాంఘిక దురాచారాలపై ఖండనగా, రాజకీయ విమర్శగా రూపుదాల్చిన విధానం కనబడుతుంది. వీటితో పాటు ప్రకృతి సౌందర్యం, మన ప్రాచీన కళాఖండాల ఔన్నత్యాన్ని తెలిపే కవితలు కూడా లేకపోలేదు. వీరి కథల సంపుటి బ్రతుకు బాటలు 1958లో దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది[2]. వీరి కథలు తెలుగు స్వతంత్ర, ఆంధ్రపత్రిక, గోలకొండ పత్రిక, ఆంధ్రప్రదేశ్,యువ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
కవితా సంపుటాలు
- ప్రణయసౌధం
- ఇది కదనం కదలండి
- నేను భూదేవి బిడ్డను
- రండి స్వాతంత్ర్య దినోత్సం జరుపుకుందాం
- యువతరం మేల్కొనాలి
- మిన్నేటి పొంగులు
- అమృతపథం
- భాగ్యమతి
- చైతన్యపథం
జీవిత చరిత్ర
- మహాపథం (జమలాపురం కేశవరావు జీవితచరిత్ర)
నవలలు
- గుడిమెట్లు
- తెగని గొలుసులు
- విరగని విగ్రహాలు
- జీవనది
- ఎవరి కోసం
కథా సంపుటాలు
- బ్రతుకు బాటలు
- పరిష్కారం
- మాయని గాయాలు
- మ్రోగని కంఠాలు
- వాడని పూవులు
- ఏక్ మంజిల్ దో రాహే (హిందీ)
- మోరియాకి కహనియా (హిందీ)
- ధర్తీకి పుకార్ (హిందీ)
- పనాహె గారు (ఉర్దూ)
- Man Within The Man (ఇంగ్లీషు)
- Diamonds and Stones (ఇంగ్లీషు)
వ్యాస సంపుటాలు
- సింహగర్జన
- సర్దార్ జ్ఞాపకాలు, సంఘటనలు
- సర్దార్ జీ భావాలు
- దశలు – దిశలు
- మన విద్యారంగం
- మనం మన సమస్యలు
కథల జాబితా
కథా నిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు[3]:
- అభాగ్య కుమారి:అన్నిటికీ సంసిద్ధ[4]
- ఈ మనదేశంలో[5]
- ఉత్తరం[6]
- ఎంత మార్పు తెస్తుంది?[7]
- ఎవరికథ రాయను?[8]
- కథావశిష్టులు[9]
- జీవించాలి[10]
- త్యాగమయి కదంబ[11]
- నడిరాతిరి నల్లమేఘాలు[12]
- నమ్మలేని నగ్నసత్యాలు[13]
- నిర్గంధ కుసుమాలు[14]
- నిర్దాక్షిణ్యం[15]
- పతనం[16]
- పొద్దుతిరుగుడు పూలు[17]
- బతుకు తెరువు[18]
- బ్రతకడం ముఖ్యం
- మందిరానికి, అటూ యిటూ[19]
- మనసులూ మమతలూ[20]
- మనిషిలోని మనిషి[21]
- మాయనిగాయం[22]
- మేం నలుగురం[23]
- లాభసాటి దేశభక్తి
- వదిన చెప్పిందే నిజం[24]
- వాలిన కండ్లు[25]
- వికారంలో ఆకారం[26]
- సులోచనాలు[27]
- సేట్ జీ దూరదృష్టి[28] మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-24-ఉయ్యూరు

