శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం
శృంగార నైషధం అష్టమ ఆశ్వాసం లొ శ్రీనాథం కవి సార్వ భౌముడు తనివి తీరా దశావతార వర్ణన చేశాక ,చంద్రోదయ వర్ణన ను శ్రీ హర్ష మహాకవి ని అనుసరించి అద్భుతంగా చేశాడు .ఆ చంద్ర హాసాన్ని అనుభవిద్దాం .ముందుగా సాయం సంధ్యా సమయ వర్ణణ చూద్దాం .
‘’గగన హరినీల శైల శృంగంబు నుండి –డొల్లి పడే బ్రొద్దు జేగురు గల్లు వోలె-దన్నిపాత సముద్ధూత ధాతు ధూళి –చందనమున ద్రోచె –దివాసావసాన సంధ్య ‘’
ఆకాశం అనే ఇంద్ర నీల మణి మయమైన పర్వత శిఖరంనుంచి సూర్యుడు జేగురు రాయిలాగా కూలి పడ్డాడు .ఆ పడటం తో ఎగసిన గైరికాది ధాతువుల పరాగం గా సాయం కాల సంధ్య కనిపించింది .
‘’కోమల తామ్ర చూలికల క్రొవ్వెర సంధ్యకు బ్రోది వెట్ట,ని-స్సీమ కఠోర తార రుతి జెట్టుపలార్చుచు నర్రులెత్తివి-శ్రామము వోలెగూసెవిలసచ్చరమా చలకూట పక్కణ- గ్రామణి కాకుటీర శిఖరంబుల గుక్కుట చక్రవాకముల్ ‘’
అస్తాచల కూటం లోని పల్లెలలో ఉన్న గుడిసెలపైకెక్కి కోళ్ళ గుంపులు ,ఎర్రని కా౦తులచే ,సంధ్యారాగం ఎక్కువగుతుండగా రెక్కలు ఆడించి గొంతెత్తి ,హద్దులేని భీకర ధ్వని విజ్రుమ్భించేట్లు ‘’కొక్కొరోకో’’అంటూ కూశాయి .
‘’తల బ్రతిబింబ భానుమణి దాల్చిన విహార వనాన్తరంబునన్ –మలగి మలంగి పె౦జిలువ నాతియ భంగి నవీన వారణీ-సలిల భరంబు దోలుకొని చయ్యన వచ్చిన ,జూచి ,భీతిబి- ట్టులికియు బోయె,నత్తరి వియోగము బొంది రథాంగ దంపతుల్.’’
సాయం కాలాలో పాములు ఆహారం కోసం తమకలుగులలోనుంచి బయటికి వచ్చి ,విహరిస్తాయి .తమదగ్గరకు వస్తాయేమో నని పక్షులు భయపడి ఎగిరిపోవటం సహజం .కానీ సూర్యాస్తమయ సమయం లొ చక్రవాక పక్షులు మాత్రం వియోగం పొంది వెళ్ళిపోవటం కూడా సహజం .వాటి కలయిక మళ్లీ సూర్యోదయం అయితేనే .రాత్రి అంతా వాటికి వియోగమే .సాయంకాలం వేళ మొక్కలకు నీరు పెట్టటం రివాజు .అందుకని ఉద్యానవన పాలకులు అప్పుడే మొక్కలకు కాలువలనుండి నీరు వదిలారు .ఆనీరు వంకర వంకరగా తిరుగుతూ ప్రవహిస్తుంటే సాయంకాల సూర్యకిరణాలు ఆజలాలలో ప్రతిఫలిస్తున్నాయి .జలప్రవాహం పైన ప్రతిఫలించిన సూర్యుడు శిరసులోని మాణిక్యం లాగా ప్రకాశిస్తున్నాడు .వంకర టింకరగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం పాకుతున్న నాగ కన్యలా ఉంది .అప్పటిదాకా నది నీటిలో విహరిస్తున్న చక్రవాకాలు ప్రవాహ వేగానికి భయపడి ఎగిరిపోయాయా అని పించింది కవికి .సాయం వియోగం సహజమే అయినా నీటి ప్రవాహానికి భయపడి పారిపోయాయి చక్రవాక మిదునాలు అని కవి ఉత్ప్రేక్షించాడు .
‘’రశ్మి గ్రాహి గరుత్మజగ్రజ కరారబ్దా విరామ భ్రమిన్ –గాశ్మీరాభ కరేష్ట కారుచి పరాగంబున్ ,సహస్రాంశు శా-ణాశ్మంబు న్గదియించెధాత ,నవ సంధ్యా ఖడ్గము న్వేదనా –వేశ్మ స్వాంత రథాంగ దంపతి చమూ విచ్ఛేద లీలార్ధమై ‘’
కత్తులకు సాన పట్టే యంత్రం ఉంటుంది .పదును బాగా ఉండటానికి ఆ చక్రం పైన ఇటుక పొడి,లేక ఇసుక వేసి నీళ్ళు చల్లుతారు . ఆ నీరు ,ఇటుక పొడి కలిసి బురదగా మారి ,ఆ చక్రానికి అంటుకొంటుంది .కాలానికి ఆధారంగా ఉన్న సూర్య బింబం సాన రాయి లా ఉండగా ,సూర్య సారధి అనూరుడు ఆ శాణ చక్రాన్ని ‘’ప్రగ్గాలు ‘’అనే తాళ్ళతో తిప్పుతుంటే ,సాయం కాలం అవుతుండగా ,ఎర్రనిసూర్యకిరణ కాంతి ఇటుకపొడుములా ,బ్రహ్మ అనే శిల్పి చక్రవాక జంటను విడగ గొట్టటానికి ,సంధ్యాకాలం అనే కత్తిని సాన బెడుతున్నట్లు గా కనిపించాడు .చక్రవాక జంట బంధాన్ని చేదించ టానికి సాయంకాలం ఖడ్గం లాగా ఉన్నది అని కవి ఉత్ప్రేక్షించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-24-ఉయ్యూరు .

