శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -2
‘’ సలిలనిధి సార్వభౌమ కాష్టాపురంధ్రి –యోల గందంపు బస పాడే నొక్కో యనగ –గమల కిమ్జిల్క రేణు సంకాశ మగుచు-నింగి నేర సంజ కెంజాయ నివ్వ టిల్లె ‘’
సముద్రాలకు సార్వభౌముడైన వరుణుని దిక్కు అనే స్త్రీ పూత పసుపుతో స్నానం చేసినట్లుగా ,సాయం సంధ్యారాగం పద్మ కేసరాలలోని పరాగంతో సమాన౦ గా ఆకాశం లో వ్యాపించింది .
‘’కుసుమంబద్దిన విధమున –బసపున హత్తించి నట్లు బంగారమునన్ –బస నిచ్చిన గతి ,సంధ్యా –వసరంబున నింగి యరుణ వర్ణం బయ్యన్ ‘’
ఆకాశం సాయం సమయం లో కుసుంబా రంగు అద్దినట్లుగా ,పసుపు పూత పూసినట్లుగా ,బంగారంతో ఎరుపును మించిన పసుపు వర్ణంతో ఇచ్చినట్లు ఎర్రగా కనిపించింది .అంటే బంగారు రంగు నీటితో పూత పూసినట్లు ఉన్నది .
‘’అభినవ సంధ్యా తాండవ –రభస రాయచ్చిన్న హిమ ధరాధర కన్యా-ప్రభుహారాస్దుల భంగిని-నభాస్ధలిం దారకా గణ౦బు వొలిచెన్ ‘’
నక్షత్రాలన్నీ అప్పుడే ప్రారబ్ధమైన సంధ్యా సమయం లోని నృత్యంలో సంతోషంతో వేగంగా తెగిన పార్వతీ నాద శివుని యొక్క హారం లోని ఎముకలతో చేసిన పూసలలాగా ఆకసం లో ఉదయించాయి .
‘’చరమాశా నికషోపలా౦ఛనమునన్ సంధ్యా ప్రకాశోదయం –బొరగావించి ,విరించి చెగొనిన సూర్యుం డన్పదార్వన్నెబం-గరపు బూదియకై వియద్విపణి వేడ్కం గాలమన్మచ్చు చె-చ్చెర జెల్లించిన గవ్వ చౌక మనమిం చెందార కాచక్రముల్’’.
కాలం అనే వ్యాపారి పడమటి దిక్కు అనే గీటు రాయి యొక్క కొనపై సంధ్యాకాంతి అనే గీటును గీసి పరీక్షించి బ్రహ్మ వద్ద సూర్యుడు అనే పదహారు వన్నెల బంగారపు పూస ను కొని ,ఆకాశం అనే అంగడిలో వేగంగా గవ్వలను ఇచ్చినట్లుగా చుక్కలు ఆకాశం లో మెరిశాయి .బ్రహ్మ అనే శిల్పి పదహారు వన్నెల బంగారంతో చేసిన సూర్యుడు అనే పూసను ,దుకాణం లో అమ్మగా ,కాలం అనే వర్తకుడు ,దాన్ని పశ్చిమ ఆకాశం అనే గీటు రాయిపై నాణ్యత పరీక్షించటానికి గీటు గీసి ,సంతృప్తితో డబ్బు గా గవ్వ చౌకాలు ఇచ్చాడేమో అన్నట్లుగా చుక్కలు ప్రకాశించాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-24-ఉయ్యూరు

