శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -4
‘’శుద్ధ కాంచన పిండంబు సూర్యు దిగిచి-పూర్ణ శశిబూత బంగారు పూదె నొసగి –సాయమను ధూర్తు వంచించే జగము నెల్ల –దెల్ల బారెడు నదే చూడు తెరవ విధుడు ‘’
కాలం అనే మోసగాడు జగత్తులో ఉన్న సూర్యుడు అనే బంగారు గుండును చూసి ,దాన్ని నొక్కేయాలన్న ఆలోచనతో ,చంద్రుడు అనే వెండిపూసను బంగారు నీటిలో ముంచి ,ఆపూసను లోకానికి ఇచ్చాడు చూడు దమయంతీ .బంగారు గుండుకోసం వెండి పూసా ఇచ్చి మోసం చేశాడు అని భావం.
‘’ఇందు కాన్తంబుల నెబ్భంగి వడిసేనో –నిష్యందకీలాల నిర్ఝరములు – చక్రవాకముల లోచన యుగ్మకముల,నె-ట్లుబ్బెనోవిరహ బాష్పోదకములు –చంద్రాతపమున నె చందాన గురిసె నొ –ధారాళ మగుచు నీహార వృష్టి –విపిన వీదికల ,నేవిధమున గారెనో –శేఫాలి కాపుష్ప సీదు ధార – ఇన్నివిధముల నభి వృద్ధి ఎసగ దేని –యొదిగి పవలింటి యట్టుల యుండుగాక –యూరకెల విజ్రుం భించు నుధదు లేడు -నుత్పలేక్షణ యీ శశా౦కో దయము నందు ‘’.
దమయంతీ –ఈ చంద్ర కిరణాల తాకిడికి చంద్రకాంత శిలలనుండి కారే జలప్రవాహాలు ,రాత్రులలో విరహావస్థ పొందే చక్రవాక పక్షులు కారుస్తున్న కన్నీరు ,వెన్నెలచే కురిసిన మంచు ,వాననీరు ,అరణ్యాలలోని వావిలిపూల మకరంద ప్రవాహాలంతో కలిసి మహానదులు లాగా సముద్రంలో ప్రవేశించటం చేత ,చంద్రోదయం వేళ సప్త సముద్రాలు పొంగుతున్నాయి .
‘’లీలావతి ,యామవతీ-కాళిందీసైకతంబు గగనో దన్వ-ద్వేలా డిండీరము చం-ద్రాలోకం బింత యోప్పునా నివ్వేళన్ ‘’
చంద్ర కాంతి రాత్రి అనే యమునా నది యొక్క ఇసుక తిన్నె అయి ఉండవచ్చు .లేక ఆకాశం అనే సముద్రం యొక్క పోటుకు సంబంధించిన నురుగు కావచ్చు .కాకపొతే ఈ వేళ ఇంతగా ప్రకాశిస్తుందా ?
‘’దేవి తమో మషీ రసము టేట బొసంగక గట్టి వెట్టి యం –కా వలి వ్రాయగా దొడగె నంబర సంపుట కాన్తరంబునన్ –బూవిలుకాని శౌర్యగుణముల్ ,హరిణా౦కుడు ముత్తియంబుల౦ –దావడ ముల రచించిన విధంబున రుక్ఖటికాముఖంబులన్ ‘’
దమయంతీ ! చీకటి అనే నల్లని ద్రావకం తో పూతపెట్టిన ఆకాశం అనే నున్నటి బల్లపై చంద్రుడు తనకిరణాలు అనే సుద్దముక్కల చివరలతో ముత్యాల సరం గుచ్చుతున్నట్లుగా అక్షరాలను వ్రాయటం మొదలు పెట్టాడు .చీకటితో నల్లగా ఉన్న ఆకాశం నల్లని ద్రావకం తో పూత పూసిన బోర్డు బల్లలా కనిపించాడు .అందులోని నక్షత్రాలు చ౦ద్రుడు తన కిరణాలనె చాక్ పీసులతో ,తన మిత్రుడు మన్మధుని శౌర్య ఉద్దీపకాలైన గుణాలు లోకానికి తెలిసేటట్లుగా రాసిన అక్షర పంక్తుల లాగా ప్రకాశించాయి అని భావం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-24-ఉయ్యూరు —

