శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -7
‘’లతల క్రీనీడ దిలతండు లితములగుచు – గాంత!యీ నిండు రేరేనికరములమరు –నమ్గులీ కీలితేంద్ర నీలాంగు ళీయ-కంబులును బోలె లీలా వనంబు నందు ‘’
దమయంతీ !లతాదుల నీడలతో కలిసిన నువ్వులు ,బియ్యం లాగా అలరారే ఈ నిండు చంద్రుని చేతులు ఇంద్రనీల మణిమయ ఉంగరాలను ధరిస్తున్నట్లు గా ప్రకాశిస్తున్నాయి
‘’తండ్రి కంబోనిది బోలె ధవళనేత్ర –హాని వృద్ధులు గలవీ శశా౦కునకు –రాజబింబ నిభాస్య !కారణ గుణంబు –గార్యమున సంక్రమించుట గలద గాదె’’
ఈ చంద్రుడికి తండ్రి అయిన సముద్రుడికి లాగానే క్షయము ,వృద్ధి ఉన్నాయి .కారణం లో ఉన్న గుణాలు ,పుట్టిన వస్తువుకు సంక్రమిస్తాయి కదా
‘’వహ్ని మొదలగు సకల దైవత గణ౦బు –దృప్తి పొ౦దురీ సుధా దీప్తి యందు –మహిత పుణ్యాత్ము కళ్యాణ గృహము నందు –బోలాతి అభ్యాగతులుతృప్తి పొందునట్లు ‘’
పుణ్యాత్ముని ఇంట్లో అభ్యాగతులు తృప్తి పొందినట్లు గా ,అగ్ని మొదలైన దేవతలు యీ చంద్రునితో తృప్తి చెందుతారు .
‘’ప్రవహ వాయు కురంగ మంబరమునందు-డప్పిగొని ,యీ సుధాంశు మండలము సొచ్చి –యమృత పంకంబులో నంఘ్రు లణ గుటయును –వెడల లేకున్నయది చూడు విద్రుమోష్టి ‘’
‘’ప్రవహం’’ అనే వాయువు యొక్క లేడి ,దాహంతో చంద్ర మండలం చేరి నీళ్ళు తాగుతుంటే ,,అందులోని అమృతంతో కలసిన బురదలో దిగబడిపోయి బయటకు రాలేక పోతోందేమో ..అదే ఇప్పటికీ చంద్రుడిలో మచ్చగా కనిపిస్తోంది.
‘’ఓషధీ సందేశ భాషా ప్రణిది యైన –మృగముగాబోలు నీమృగముతరుణి –రుద్రాగ్రహత్రాస విద్రావితంబైన –మృగము గాబోలు నీ మృగము తరుణి –ప్రవహ నామక మహా పవన వాహన మైన –మృగముగాబోలు నీమృగముతరుణి-రోహిణీ శుద్ధాంత గేహ వర్దిత మైన – మృగముగాబోలు నీమృగముతరుణి- సతత సేవా సమాయాత సకలభువన –భవ్య విపి నౌషధీ లతా పల్లవాగ్ర –భక్షణ క్షీబమై సుదాపాయి యగుచు –మగువ ! యీ చంద్రు నందు నీ మృగము బ్రతికె-‘’
ఈ మృగం చంద్రునిలోని ఓషధీ లతలు అనే నాయికల యొక్క సందేశానికి దూత అయిన లేడి కాబోలు .ఈ మృగం శంకరుని కోపం చేత భయపడి పారిపోయిన మృగం కాబోలు .దక్షయజ్ఞ విధ్వంస సమయంలో వీరభద్రుని ధాటికి తాళలేక పారిపోయిన యజ్ఞ రూప మృగం కాబోలు అని భావం .ఈ మృగం ప్రవహం అనే వాయువుకు వాహనమైన మృగం కాబోలు .రోహిణీ దేవి చేత అంతః పురంలో పెంచ బడిన లేడికాబోలు.ఎప్పుడూ చంద్రుని సేవకు వచ్చిన సమస్తలోకాలలోని శ్రేష్టమైన అడవులలోని ఓషధీ లతల చిగుళ్ళ కొనలను తినటం చేత మదించి,అమృతం తాగుతూ బ్రతికిందేమో .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-24-ఉయ్యూరు

