శ్రీ చెన్నకేశవ గారి శ్రీ వాణీ కంద శతకం
కందాన్ని అందంగా నడుపుతూ డా.సి చెన్న కేశవ రాసిన శ్రీ వాణీ శతకం రమణీయం .దీన్ని ప్రసిద్ధ కవి రచయిత,మిత్రుడు శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మగారికి అంకితమిచ్చారు .శ్రీ సరస్వతి దేవి అందమైన ముఖ చిత్రంతో మంచి ముద్రణతో శతకం ఈ దసరాలలో సార్ధకం గా ఉంది.ఇందులో ఆధ్యాత్మిక సామాజికసందేశం ఉందని కవి చెప్పుకొన్నారు .
మొదటి పద్యం లో ‘’శ్రీ రామ భక్తి పూర్ణుడ –గోరిక నిను బద్యమల్లి కొలిచెద తల్లీ !కూరిమి మాకొసగవేక-ర్పూరపు గుప్పయగు పల్కు పొందిక వాణీ ‘’ఆని భక్తిగా పలికి ,వేరు దైవాలను కొలవక నిన్నే వేడుతున్నాను ,కలిగిన వాడినికాకపోయినా ,’’కలమదురఫణితి’’నుతిస్తాను.,నీవలువలు పూలు తెల్లనివి .తియ్యగా చల్లగా పాడుతాను .
‘’శృంగగిరిలో స్థిర పీఠం పై వెలశావు ‘’,శబ్దమే పరమాత్మ కళ ,రాగ తాళాలతో పాటు భోగ శోకాలు కూడా నీవే .వేశ్యలకు అందం గృహిణులకు జఘనం,రాజులకు పందెం ,చెలులకు లాస్యం అందం రాణింపు తెస్తాయి .చదువల మర్మ తెలియక చదివి ‘’చవటలం అయ్యాం’’ ఆని వేదన చెందాడు కవి .నీతులు చెబుతూ గోతులు తీసే వారిని గుర్తించటం బ్రహ్మ ప్రళయం జాగ్రత్త .’’గుడిలేని గ్రామ వాసం ‘’ ,మడిలేనిబ్రతుకు’’ వ్యర్ధం . సంగీత మర్మమేమి జననీ ‘’ఆని ప్రార్ధించారు .’’బట్ట అనే జగతి చినిగితే కుట్టటం సాధ్యమా ?ఆని ప్రశ్నించారు .ఎక్కడ చూసినా ఏదోఒక గుడి ఉంటుంది –‘’జగతికి ఆధారమైన మగువకు గుడిలేక పోవటం ‘’వింతగా ఉందమ్మా అన్నారు .
ఆకలికి రుచి ,పోకడకు నాశనం,రోకలి కి పోటు,తెల్లని కాకి ఉండవు .దానం దాతకు ప్రాణం , మానం శోభ మానవుడికి .దానం చెయ్యటం మానకు ‘’’’మానము వీడక బ్రతుకుము మహిలో వాణీ !’’అన్నారు .విద్య సతి ,పతి మోక్షం ,సఖుడు ,విద్యయే పరమాత్మ ఆని ధర్మ సూక్ష్మ౦ చెప్పారు కవి .చివరి 106వ కందం లో మంగళం పాడారు .
ఎక్కడా కుంటని ధార శతకమంతా ప్రవహించింది .క్లిష్టత లేదు .శ్రావ్యత ఇంపుగా ఉంది. భక్తి నిర్భరత పుష్కలం .’’వాణీ ‘’మకుటం శోభాయ మానం .
కవి బెజవాడ భావనారాయణ కాలేజి హిందీ శాఖాధి పతి .జర్నలిజం లో డిప్లమో హోల్డర్ .కవిత్వ,కథ నాటక రూపకాల పంట పండించిన హాలికుడు. ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డీ .ఈశతకంతో పాటు ఆరు రచనలు చేసి ముద్రించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-24-ఉయ్యూరు .

