హరికధ పాఠశాల స్థాపన

హరికధ పాఠశాల స్థాపన

శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారు ఆకాశవాణిలో ఉద్యోగం అయిపోగానే రామచంద్రాపురం దగ్గర  చెల్లూరులో ఉన్న షుగర్ ఫాక్టరీ లో చేరారు .సర్వరాయ సుగర్స్ మేనేజర్ శ్రీబులుసుప్రభాకర బుచ్చికృష్ణ సత్యనారాయణ రావు గారు గోదావరిజిల్లా పరిషత్ అధ్యక్షులుగా పుష్కరకాలం పని చేశారు .వీరికి  ప్రాచీన సంస్కృతిపై మక్కువ ఎక్కువ .’’సత్యనారాయణ ద్వయం’’ చాలా దగ్గరయ్యారు .

  తండ్రిగారి స్మారక చిహ్నంగా సర్వరాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యాజమాన్యం లో ఒక హరికధా పాఠశాల ,ఒక వేదపాఠశాల 1973లో స్థాపించారు .చాలామంది హరికధకు పాఠశాల ఏమిటి అని ఆశ్చర్యపోయారు .పెద్ద హరిదాసుదగ్గర శిష్యరికం చేసి నేర్చుకోవటం వర్ధమాన హరిదాసులకు అలవాటు .అప్పటికే శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు సుప్రసిద్ధులు .వారిది విలక్షణ బాణీ.కష్టతరమైన శిక్షణతో ఉంటుంది .అది క్రమ౦గా నశించిపోతోంది .కనుక ఆదాస సంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఒక విద్యాలయం కపిళేశ్వరపురం లో పెట్టాలి  .స్థాపన ,పోషణా బులుసు సత్యనారాయణ గారేఅయినా అన్నిబాధ్యతలు అన్నీ గుమ్మలూరు వారిపైనే పెట్టేశారు .

  అప్పటికి నారాయణ దాసుగారి హరికధను బోధించే శిష్యులెవరూ లేరు .ఉన్నవారు బాగా ముసలివారైపోయారు .పాతపట్నం తాలూకా భగీరధీ పురం లో శ్రీ వడ్లమాని నరసింహ దాసుగారు ఒక్కరే ఉన్నారు .వారి దగ్గరకు వెళ్లి గుమ్మలూరు వారు విషయం చెప్పి ఒప్పించి ,కపిళేశ్వరపురం పాఠశాలకు రప్పించారు .రెండేళ్ళు విద్యాలయం బాగానే నడిచింది .1977లో వడ్లమాని దాసుగారికి పక్షవాతం వచ్చింది .బోధించే సామర్ధ్యం కోల్పోయారు .మరొకరిని నియమించారు .అయినా వడ్లమాని దాసుగారికివైద్యం కోసం  ఒకటిన్నర సంవత్సరాలు జీతం ఇచ్చి కృతజ్ఞతలు చూపించారు .ఈ విషయాన్ని సత్యనారాయణ గారు అంగీకరించి ఉదారబుద్ధి చూపారు .దాసుగారు ఆరోగ్యం చేకూరగానే పార్వతీపురం దగ్గర కృష్ణాపురానికి సకుటుంబం గా తరలి వెళ్ళిపోయారు .వడ్లమాని దాసుగారు నేర్పిన మూడేళ్ళలో నారాయణదాసుగారి సంప్రదాయంలో హరికధలు నేర్చి చాలామంది బాగా చెలామణి అయిన భాగవతారులు భాగవతారిణులు ఉన్నారు .

  నారాయణ దాసుగారి మొదటివర్ధంతి రాజమండ్రిలో గురుకులం లో పెద్ద ఎత్తున జరిపారు. ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి 1979 జనవరి లో ప్రారంభించిన ‘’హరికథాసప్తాహం’’ సందర్భంగా శ్రీ వడ్లమాని నరసింహదాసు గారి ని ఆహ్వానించి ఘన సన్మానం చేయించారు గుమ్మలూరు సత్యనారాయణ గారు .1982లో శ్రీమంగళం పల్లి బాలమురలీకృష్ణ  సంగీత నాటక అకాడెమి అధ్యక్షులయ్యాక ఒకప్రసిద్ధ హరిదాసు కు 5వేలరూపాయలు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించినపుడు గుమ్మలూరువారు బాల మురళిని ఒప్పించి ఆ పారితోషికాన్ని వడ్లమాని నరసింహదాసుగారికి  అంది౦పజేసెట్లు తీర్మానం చేయించారు .1981లో వచ్చిన వంశధార నది వరదలలో భగీరధపురంలోని నరసింహదాసుగారిఇల్లుకూలి కొట్టుకు పోయింది .నిరాశ్రయులయ్యారు .కృష్ణాపురంలో బంధువులింట చేరాల్సిన దయనీయ పరిస్థితి కలిగింది   ఈ పరిస్థితులన్నీ తెలిసి గుమ్మలూరువారు బులుసుసత్యనారాయణ గారు ,,మంగళం పల్లివారు, కార్యదర్శి .కేవిసుబ్బారాగారు ఈ ఘనకార్యానికి కర్తృత్వం వహించి వడ్లమాని దాసుగారిని ఆదుకొన్నారు దాసుగారు ఊహించని ధన సహాయం ఇది .తర్వాత రెండేళ్లకే దాసుగారు చనిపోయారు .

ఆధారం –శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి ‘’నా సహస్రమాస జీవితయాత్రా చరిత్ర ‘.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-26-ఉయ్యూరు–

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.