సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –3

     సంగీత సద్గురు   శ్రీ త్యాగ రాజ స్వామి –3

                                         కీర్తి -సందర్శనం -పరంపర 

త్యాగ రాజు గారు ఏ వినూత్న కీర్తన విని పిస్తారో నని ,ఎదురు చూసే వారట ఆ రోజుల్లో బాగా తెలివి గల వారికిఉన్నత మైన సంగీతం ,సామాన్యులకు ప్రాధమిక రీతులు,స్వర జ్ఞానం లేని వారికి దివ్య నామ సంకీర్తన ల తో శిక్షణ నిచ్చే వారట త్యాగయ్య గారు .శిష్య బృందాన్ని వెంట వేసుకొని ,దేశం లోని దివ్య క్షేత్రాలన్నీ సందర్శించారు .ఆయా దేవతలపై చక్కని కీర్తనలు రచించి ,వారి సన్ని దానం లో పాడే వారు .ఆ కాలమ్ లో కాశీ నగరం లో ”గోపీ నాద భట్టాచార్య ”గొప్ప హిందుస్తానీ సంగీత విద్వాంసులు .త్యాగయ్య కీర్తి విని చూడ టానికి వచ్చారు .అంతటి వ్యాప్తి కలిగింది ఆయన సంగీతానికి .రామేశ్వరం లో రామ లింగేశ్వరుని దర్శించి , తిరు వైయుర్ చేరారు .త్యాగయ్య అద్భుత గానాన్ని విని ,పులకరింత తో తాను ధన్యుడనయానని భట్ట చార్య ,త్యాగయ్య తో అన్నారట .ఉత్తర దేశం లోత్యాగయ్య  కీర్తనలు  ఎంత ప్రాచుర్యం పొందాయోఆనందం   వివరించి చెప్పారట.వినయవిభూషణుడు అయిన   త్యాగ రాజు ”దాశరధీ !నీ ఋణము తీర్ప నా తరమా,పరమ పావన నామ -ఆశ ,దీర దూర దేశములకు ,ప్రకాశింప జేసిన రశిక శిరోమణీ ”అంటూ ,రామానుగ్రహాన్ని ప్రస్తుతించాడు .త్యాగయ్య కు ,మంత్ర ,జ్యోతిష ,శాస్త్రాలలో మంచి ప్రవేశం వుంది .గుంటూరు జిల్లా పొన్నూరు నివాసి ,రెవిన్యూ ఉద్యోగి ,శ్రీ రామ మంత్రో పాసకులు ,కమ్మటి కీర్తనల రచయిత ,మహా భక్తుడు అయిన తూము నరసింహ దాసు గారు 1821  లో త్యాగ రాజు గారిని దర్శించి ,అతిధి గా కొన్నాళ్ళు శ్రీ వారి సన్ని దానం లో గడి పారు .త్యాగయ్య గారి పూజా విధానం ,సంగీత వైభవం స్వయం గా చూసి ముచ్చట పడ్డారు .భక్తి పులకాకితం గా దాసు గారు ,త్యాగయ్యను ఇలా ప్రశంశించారు ఒక కీర్తనలో —
”కేశవానంద సంకీర్తనావళి వింటి ,–భావసిద్ధియు శుద్ధ భక్తీ గంటి
భక్తులు ,శిష్యులు బలసి కొల్వగా గంటి ,–వాగ్మాదురీ వైభవంబు గంటి
వినయ ,సత్సంపద్వివేకంబు గంటి -శ్రీ రామ పదభక్తి చెలువు గంటి
అజు కంద రాని అనుభవమును గంటి –తన్మయత్వంబాత్మ తనరగ గంటి
అరసి ,కనుగొంటి త్యాగ రాయార్యు నందు ”-ఇద్ధ సద్గుణ పుంజ మింకేన్ని యైన
దివ్య మహిమాతి శాయములుతేజరిలుట -కంటి హర్షాబ్ది నోలాడుచుంటి మదిని
తే.గీ.” రామ పద భక్త త్యాగయార్య వరునికిని–సమము గా నేర రేవ్వారీ క్ష్మాతలమున
ప్రేమ నా ఘనుడొక సారి పిలిచే నేని –రాముడు ”ఓహో” యనుచును మార్పలుకు నంట”.
అని ప్రత్యక్ష సాక్షం గా నరసింహ దాసు గారు త్యాగ రాజు గారి భక్తీ సామ్రాజ్య వైభవాన్ని మనకు అందించారు .త్యాగయ్య గారు కూడా ”తూము నరసింహ దాసు ”గారి కీర్తనలను ,అడిగి మరీ పాడించుకొని ,శ్లాఘించారు .
తిరు వాన్కూర్ రాజ్యం లోని ”గోవింద మారార్ ”అనే సుప్రసిద్ధ గాయకుడు ,స్వర ,లయ జ్ఞానం కలిగి ,”ఆరు కాలాల్లో”
పాడ గల ప్రజ్న వున్న వారట .”షట్కాల ”అనే అరుదైన బిరుదు పొందిన వాడాయన .ఆయనే స్వయం గా త్యాగ రాజు గారిని సందర్శించి ,”చందన చర్చిత నీల కళేబర ”అనే జయ దేవుని అష్ట పది ని ఆరు కాలాల్లో (అతి విలంబ ,విలంబ ,మధ్యమ ,ద్రుత ,అతిద్రుత )పాండిత్య ప్రతిభతో ,గాన మాధుర్యం తో ,పాడి త్యాగయ్య గారికే ఆశ్చర్యం  కల్గిన్చారట .కృతజ్ఞతా పూర్వకం గా త్యాగ రాజు గారు ”ఎందరో మహాను భావులు -అందరికీ వందనములు ”అనే కీర్తనను ,శిష్యులతో కలిసి పాడి వందనాలు సమర్పించారట .అంతటి సహృదయత త్యాగ రాజు గారిది .
తమిళం లో ”భక్త నంద నారు ”చరిత్ర రాసిన ”గోపాల కృష్ణ భారతి ”అనే సంగీత విద్వాన్మని కూడా త్యాగయ్యను ,దర్శించి ,”ఆభోగి ”రాగం లో త్యాగయ రాసిన ”మనసు నిల్ప శక్తి లేక ”అనే కృతి పాడి ,ఆనందింప జేశారట .ఆ రాత్రికి రాత్రే ఆయన ”ఆభోగి ”రాగం లో ”సభాపతికి వేరు దైవం ”అనే కీర్తన రాసి త్యాగ రాజు గారికి పాడి విని పించారట .కర్ణాటక సంగీత విద్వాంసులు ఎక్కువగా ఈ కీర్తన పాడుతూ వుంటారు కచేరీ లలో .
అలాగే తిరు వాన్కూర్మః రాజు స్వాతి తిరుణాల్ ఎలాగైనా త్యాగ రాజును దర్శించాలని విశ్వ ప్రయత్నం చేశారట .స్వయం గా తన ఆస్థాన గాయకుడు ”వడివేల్ ”గారిని ,త్యాగ రాజు గారికోసం పంపారట .ఆయన ,చాలా రోజులు త్యాగయ్య గారితో సన్నిహితం గా మసలుతూ ఒక రోజున త్యాగయ గారితో ,అసలు విషయం చెప్పారట .”అల్లాగే -మీ రాజును తప్పక కలుస్తాను .మేమిద్దరం త్వరలోనే ఎక్కడో కలుసు కొంటాం .ఇప్పుడు కాదు ”అని మర్యాదగా చెప్పి పంపించేశారు వడివేల్ గారిని .స్వాతి తిరుణాల్ 26 -12 -1846 లో మరణిస్తే  త్యాగ రాజు గారు 06 -01 -1847 లోఅంటే పదకొండు రోజులకు  శ్రీ రామైక్యం చెందారు .వీరిద్దరూ అద్దరిని అంటే ”అక్కడ ”కలుసు కొని వుంటారు .ఆయన మాట లో   అంత దూరపు చూపు ఉందన్న మాట .
తిక్కయ్య కలం లోని తియ్యందనాలు ,పోతన గారి శయ్యా సౌభాగ్యం లయ ,అనుప్రాస ,శైలి ,త్యాగయ్య కవిత్వం లో కన్పిస్తాయి .పోతన రాసిన భాగవతాన్ని ,స్వయం గా రాసుకొని త్యాగయ్య ,నిత్యం పారాయణ చేసే వారట .
భద్రాచల రామదాసు గారు అంటే త్యాగయ్యకు భక్తీ తత్పరత మిక్కుటం .ఆయన్ను కీర్తిస్తూ చెప్పిన కీర్తన —
”కలియుగమున వరభాద్రా -చలమున నెల కొన రామ చంద్రుని –పద భక్తుల కెల్లా వరుడనం దగి –వెలసిన శ్రీ రామ దాసు వినుతింతు మదిన్ ”అని” ప్రహ్లాద భక్తి విజయం” లో కీర్తించారు .అంతే కాదు ”నారద ,ప్రహ్లాద ,పరాశర వరుల సరసన”శ్రీ  రామ దాసు” గారికి స్థానం కల్పించారు . .
”నారీ మణికి చీరే లిచ్చినది నాడే విన్నానురా ,ధీరుడౌ రామ దాసు బంధనము తీర్చినది విన్నానురా ”అని భక్తుల మహిమలను వివరించాడు త్యాగయ్య .భక్త జయదేవ ,నారాయణ తీర్ధుల ప్రభావం త్యాగరాజు మీద మిక్కుటం గానే వుంది .ఆ అష్టపదుల ,తరంగాల లోని అద్భుత అనుభూతులను తన కీర్తనలలో పొందు పరిచారు రాజు గారు .
1845 లో భార్య కమల మరణించింది .ఆయన లోని వైరాగ్యం పతాక స్తాయి చేరింది .ఆత్మానందం అనుభవించారు .భవ బంధ విమోచన కోసం ”దయ జూచుట కిది వేళ రా దాశరధీ !మును నీ వాన తిచ్చిన పనులు ఆస గొని ,నే ,మనసారగ నిదానముగా సల్పినాను ,-వర త్యాగ రాజాప్త నను దయ చూచుట కిదే వేళరా ,దాశరధీ ”అని ఆర్తి గా పాడారు .ఆ రాముడు స్వప్నం లో కని పించి ,”పది పూటల లో కాచెదను ”అని అభయ మిచ్చాడు ”.ఆపత్ సన్యాస దీక్ష” పొందారు .”నాద బ్రహ్మా నంద ”అనే దీక్షా నామం ధరించారు .అఖండ దివ్య నామ సంకీర్తన చేస్తూ ”శ్యామ సుందరంగా ”అనే కీర్తన పాడుతూ -పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు అనగా 06 -01 -1847 న త్యాగరాజు గారు పంచత్వం చెందారు .ఆ నాటి నుంచి పుష్య బహుళ పంచమి నాడు ”త్యాగ రాజ ఆరాధనోత్సవం ”తిరువైయార్ లో జరుగు తోంది . ఈ రోజూ త్యాగ బ్రహ్మ గారి 165 వ వర్ధంతి .
బెంగళూర్ నాగ రత్నమ్మ అనే సంగీత శిరోమణి ,భక్తు రాలు ,తన యావదాస్తినీ త్యాగ రాజు గారి స్మ్రుతి చిహ్నం నెల కోల్ప టానికిసమాధి , నిర్మాణానికి ,భవన నిర్మాణానికిధార పోసి  ,సంగీత జగత్తు లో కీరి శిఖ రాన్ని అధిరోహించింది .ఆమె ఈ విధం గా తన జీవితాన్ని ధన్యం చేసుకొన్నది .ఆమెపూనుకోక  పొతే త్యాగ రాజు గారి చిరునామా ఆంధ్రులకు తెలిసేదే కాదు .త్యాగయ్య పాడిన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గుడి .ఆ గుడి లో కావ్య గాన సరస్వతీ దేవి దర్శనం లభిస్తుంది .
”ఎటులైన భక్తీ వచుతకే యత్నము సేయవే మానస ”అన్నది త్యాగయ గారి సందేశం .ఆయన ఒక జ్వలిత సంగీత జ్వాల .ఆయన ”అఖండ సంగీత జ్యోతి ”నిరంతరం గా ప్రకాశిస్తూనే వుంది .
ఉత్తర భారత దేశం లో ”తాన్సేన్ సమారొహ్ ”ఎంత ప్రశాస్తో దక్షిణ దేశాన త్యాగ రాధ ఆరాధనోత్సవం అంత ప్రసిద్ధి చెందింది .అదొక ”గౌరవ విభూతి ”గా అందరు భావిస్తారు .1984 లో జరిగిన ఆరాధనో దక్షిణ దేశ సంగీత పాత్కులంతా చేరి ఘన నివాళి నిచ్చారు .అది నభూతో న భవిష్యతి గా జరిగింది .త్యాగయ్య గారి ముఖ్య శిష్యుడు వాలాజి పేట వెంకట రమణ భాగవతార్  ,ఒక శ్లోకం లో భక్తిలో ప్రహ్లాదుని ,వైరాగ్యం లో శుకుని ,గానం లో నారదుని ,సాహిత్యం లో విద్యా వతికి త్యాగయ్య సమానుడు అని కీర్తించాడు  .
”వ్యాసోనైగమ చర్చయా ,మృదు గిరా వాల్మీక జనా మునిహ్ –వైరాగ్య శుక ఏవ ,భక్తీ విషయే ,ప్రహ్లాద ఏవ స్వయం
బ్రహ్మా ,నారద ఏవచా ,ప్రతిమాయో స్సాహిత్యసంగీత యొహ్   -యో రామామ్రుత పాన నిర్జిత శివః తం త్యాగ రాజం భజే ”
పండిత ,పామర జన రంజకం గా ,సంగీతామ్రుతాన్ని అందించిన నాద బ్రహ్మ -త్యాగ బ్రహ్మ .ఆయన సంగీత వారసులు -వెంకట రమణ భాగవతార్ ,లాల్గుడి రామయ్యర్ ,ఉమయాల్ పురం కృష్ణ ,సుందర భాగవతార్ ముఖ్యులు .ఆంద్ర దేశం లో సర్వశ్రీ సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు ,ద్వారం వెంకట స్వామి నాయుడు ,హరి నాగభూషణం ,మంగళం పల్లి బాల మురళీ కృష ,త్యాగ రాజ సంప్రదాయాన్ని నిలిపి ,పోషించి పెంపు చేస్తున్నారు .శ్రీ బాల మురళి” అపర త్యాగ రాజు” గా కీర్తి పొందిన ప్రముఖ వాగ్గేయ కారుడు .శ్రీ దాలి పర్తి పిచ్చిహరి షేక్ చిన  మౌలా ,ఓలేటి వెంకటేశ్వర్లు ,నేదునూరి కృష్ణ మూర్తి ,డాక్టర్ శ్రీ పాద పినాక పాణి ,నల్లాన్ చక్రవర్తుల రామ కృష్ణమా చార్యులు ,నూకల చిన సత్య నారాయణ మున్నగు  ఎందరో విద్వాంసులు కర్ణాటక సంగీతం లో లబ్ధ ప్రతిస్తులై అవిచ్చిన్నం గా సంప్రదాయ ధారను ప్రవహింప జేస్తున్నారు .త్యాగ రాజు గార  న్నట్లు ”ఎందరో మహాను భావులు -అందరికి వందనాలు ”
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్–13 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –3

  1. ఈ రోజు సాయంకాలం టి.టి.డి. వారి ఛానల్లో త్యాగరాజ పంచరత్న కృతులు మనోహరంగా నాట్య రూపంలో అలరించినవి. చాలా బాగున్నది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.