రజనీ ప్రియ -2(చివరిభాగం )

రజనీ ప్రియ -2(చివరిభాగం )

కించిత్ శీలభంగం ,తండ్రి మరణం తో దీనజన సేవ రాజభోగాలలో మర్చిపోయింది రజని .హూణ భటులు పెట్టె బాధలు ఓర్చుకోలేక విలపిస్తున్న పాణిజ ఏడ్పులు వినిపించి .ఆమె తన చిన్నతనం లో తన స్తన్యాన్ని ఇచ్చి ఓదార్చిన మాతృమూర్తిగా గుర్తించి,తాను  పొందిన పతనం అంతా గుర్తుకొచ్చి ,పశ్చాత్తాపం పొంది ,ఆమెను విడిచిపెట్టమని సేవకులను ఆజ్ఞాపించింది .ఆ ఆజ్ఞ వాళ్లకు చేరకముందే వారిరధం ఆమె పైగా వెళ్లి ముసలి తండ్రిలాగానే పాణిజ కూడా చనిపోయింది .’’మా తల్లి దండ్రులలాగ పాలించాల్సిన నువ్వు ,మా ప్రాణాలు తీస్తూ హాయిగా ఎలా సుఖం గా ఉన్నావే ?’’అని పాణిజ ప్రశ్నించినట్లనిపించింది రజనిక్ .దీనితో మళ్ళీ ముసలి సన్యాసి దగ్గర పెరిగిన ముగ్ధ అయింది .

  తోరమానుడి ఘాతుకాలకు బందీలై భరింపరాని కస్టాలు పొందుతున్న కారాగారం చూడటానికి వెళ్ళింది .అందులో సునంద అనే పిచ్చిది ‘’సంపదల్ వలచియమ్ముడు బోతివే రాణి వైన రండా’’అని తన్ను గేలి చేస్తూ ప్రశ్నించిన మాట కలచివేసింది.పాణిజ వలన కొంత మారి ఇప్పుడు ఈ సునంద ప్రశ్నతోపూర్తిగా మారిపోయింది  రజనీ ప్రియ .సునంద వృత్తాంతం అంతా విని ఆమెకేమీ హాని తలపెట్టవద్దని హెచ్చరించి ఆమెను అంతఃపురానికి చేర్చమని ఆదేశించింది ఆ దయామయురాలు .సునంద తన శీల రక్షణకోసం తనప్రాణ ప్రదమైన భర్తను ,పిల్లల్ని బలిఇచ్చిన ధీరురాలు .రజని చరిత్రకు ఈమె చరిత్ర పూర్తిగా ప్రతియోగం అంటే కాంట్రాస్ట్ .తన అపరాధ జ్వాలను చల్లార్చుకోవటానికి బుద్ధుని దగ్గరకు  వెళ్ళాలను కొన్నది .

  ఆ నాటి రాత్రి రజనికి కంటి కునుకు లేదు .మనసంతా భగవాన్ బుద్ధుడే ఆక్రమించాడు .తెల్లవారుజామున వచ్చిన కలలో తధాగత బుద్ధుడు ‘’ఆర్తావన దీక్ష బ్రాణముల నర్పణ జేసిన గాని మానవుల్ లేవగలేరు. ఒక అత్యంత కష్టమైనా పరీక్షకు నిలిస్తే సంకల్పం సాధ్యం  ‘’అనే ప్రబోధం  చేశాడు .అప్పటికే త్యాగాన్ని చేయాలనుకొన్న రజని బుద్ధుని ప్రబోధం తో ,పశ్చాత్తాపం తో ప్రక్షాళన పొంది ,క్రూర కఠినాత్ముడైన  తన భర్త హూణుడిని కూడా వాదం లో లొంగ దీసే ధైర్యం కలిగింది .

  ఒక పిచ్చిదాన్ని అంతఃపురానికి రజని తెచ్చిందన్న వార్త తోరమానుడు విని’’పేదల ప్రాణములు బీల్చి అహమ్మున వీగుచూ –  రధమ్ము నెక్కి పురమందు  చెలంగుట యే రాచ మర్యాద ‘’గా భావించే ఆ దురంహకారి  పరువు తీసింది పిచ్చిది అనిపించగా ,భార్య రజనీప్రియ దగ్గరకు వెళ్లి అతి శాంతం గా ‘’శాంతమొప్ప నసి నేనియు దాల్పని అశోకుని ‘’ఆదర్శంగా చేసుకోమని హితవు చెప్పింది .శాంతికరున వినయాలే రాజులకు అలంకారం అనీ ,సంపద గర్వకారణమనీ  చెప్పింది  .వాడు ‘’ఖడ్గమ్ము లేక రిపుల్ చత్తురే ?వేడుకొంటే జనం మాట వింటారా .వేదా౦తు లపాలి భూమి పరహస్తగత మయిన పుస్తకం లా అవుతుంది ?అని నిలదీశాడు –రాజతంత్రం నీతి ఒకే ఒరలో ఇమడవుఅన్నాడు .ఆమె  ‘’కత్తియేరాజ్యపాలనకు కాగల సాధనం అని క్రొన్నెత్తురు త్రావు క్రూరుడు రాక్షసుడే కానీ రాజు కాడు’అలాంటి వాడికి యమధర్మరాజు కూడా ఏం శిక్ష విధించాలోసందేహ పడతాడు ’అని వాదించింది.’’శాంత విధి వేలోసంగెడి జనం  ఖడ్గాన్ని చూసి ఒక్క కానీ కూడా ఇవ్వరు అన్నది .ఈబొధలు వాడిలో అహంకార ఆవేశ కోపాలను మరింత రెచ్చగొట్టాయి  .

  రజనీప్రియ తనను ప్రణయ  వాహినిలో తేలుస్తుంది అను  కోన్నాడుకానీ ఇలా ఎదురు తిరుగుతుందని ఊహించలేదు .ప్రణయ వేదనలో తుక తుక ఉడికిపోతూ తనను సుఖపెట్టమని కోరాడు .ఆమె ‘’ఒక్క వ్యక్తిపై నెసగెడు ప్రేమ ,సంకుచిత దృక్పధమందు నశించు కామమై ,వసుధ సమస్త జీవతతిపై బ్రసరి౦ చెడి జ్యోతికానిచో ‘’అని చీకటిలో కూరుకు పోయినవాడికి వెలుగు రేఖలు చూడమన్నది .వాడు వినక ధిక్కరిస్తే ,పాదాలు పట్టుకొనిశిరస్సు వంచి  ‘’దేవుడి మనసు మెప్పించేట్లు ప్రజారంజకం గా పాలన చేయి ‘’అని ప్రాధేయపడింది .ఆ దుష్టుడు ‘’బుద్ధ దేవుని పద యుగ్మ రజః పరిపూతమైన ‘’ఆమె శిరస్సును  అవివేకియై తన్నాడు .బిచ్చమెత్తు కొనే దాన్ని తీసుకొచ్చి రాణి ని చేస్తే ,ఆమె మనస్సులో ఔన్నత్యం ఎలా వస్తుంది అనుకొన్నాడు ఆపతితుడు .

  రజనీప్రియ చెప్పే త్యాగం ఆమెలో ఎంత ఉందొ పరీక్షించాలనుకొని తోరమానుడు ‘’వస్త్ర హీనవై పురమున ‘’తిరిగితే తప్పులన్నీ కాస్తాను అన్నాడు .అనాధ దీన జనం కోసం రజనీప్రియ ఆ పరీక్షకు సిద్ధపడి తనమానాన్ని బలి చేయటానికి ముందుకొచ్చింది .ఆమె త్యాగ గుణానికి ఇదే పరాకాష్ట .వాడి క్రూర హృదయం కరిగింది .బుద్ధభగావానుడు తన్ను రక్షిస్తాడని విశ్వాసంతో ఆపరీక్షను పురం లో చాటింపు వేయమన్నది .ఆమె అపూర్వ త్యాగాన్ని విన్న ప్రజలు ఆమె మానాన్ని కాపాడాలని సర్వమంగళను ఆర్తిగా ప్రార్ధించారు .ఆ రాత్రి రాణి రజనీప్రియ భారమంతా బుద్ధభగవానునిపై వేసి నిశ్చింతగా నిద్రపోయింది .భర్త హృదయం లో భయంకర వేదనా జ్వాలలు ప్రజ్వరిల్లాయి .

  మర్నాడు ఉదయం లేచి శుచియై ,రధం ఎక్కి భగవాన్ బుద్ధుని సందర్శించి తనను తనభర్తను ప్రజలను కాపాడమని అర్ధించింది .బయట వేచి ఉన్నరధ సారధి మనసులో తాను  చేస్తున్నది మహా పాపమని రధం తోలేటప్పుడు తాను  వెనుకకు తిరిగి చూడననీ తన్ను క్షమించమని రాణీ పాదాలపై పడిప్రార్ధించాడు .’’నీ ధర్మం నువ్వు చెయ్యి ‘’అని హితవు చెప్పి ఊరడించినది .

   నగ్నంగా రధం దగ్గరకు  రాణి రజనీ ప్రియ వచ్చిన సమయం లో బుద్ధభగవానుని కళ్ళనుంచి కన్నీరు ప్రవహించింది  .నగ్నరాణిరధం లో పురవీధుల్లో తిరుగుతుంటే ,ఇళ్ళల్లో నుంచి ఒక్కరుకూడా బయటికి రాలేదు .ఒక ముసలి వజీరు మాత్రం ‘’విసపు తల౦పులున్పయికి వెన్నెల లొల్కెడు లేత నవ్వులు ‘’తో తలుపు చాటునుంచి ఆమె నగ్న సౌందర్యం చూడాలనుకోగా రధము నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి వాడి కళ్ళను మాడ్చేసింది .రజనీ ప్రియ దివ్యురాలైంది .ఆమె చరిత్ర అతిలోకమైంది .విహారి వెళ్లి రాజుకు ఈవిషయమంతాచేప్పాడు .తోరమానుడు నివ్వెరపోయి ఆమెను శరణు కోరాలని బయల్దేరి ,ఆమె పాదాలపై పడిన సమయంలో బుద్ధ దేవుని ముఖంలో మందహాస మరీచికలు ముత్యాలదండల్లా  మెరిసిపోయాయి .భక్తజన విజయమే లోక కుటుంబు డైన ఆ శాక్య మహనీయుని వేడుక .లోకం శాంతమై ,సౌఖ్యం పొందటమే ఆ దయామయునికి ఆనందం .

  హూణ రాజు తోరమానుడు  తన తప్పు ఒప్పుకొన్నాడు .రాణి రజనీప్రియ అతడిని మన్నించింది .అప్పటినుంచి క్రూర తోరమానుడు పరమ కారుణికోత్తముడయ్యాడు  ..’ఇదీ రజనీప్రియ కధ.

 ‘’ఈ కావ్యంలో యువకవి సత్యనారాయణ ధారాళమైన శైలితో ,మనోజ్ఞమైన కవిత్వం ప్రవహి౦పజేశాడు .ఔచిత్యమైన ఉపమానాలు కావ్య శోభను పెంచాయి .’’సాంధ్య ప్రాభారుణ  ప్రభా జాల దీప్త –మై తనర్చేడితెలిమబ్బు రీతి ,-పర్ణశాల ముంగిట గావి వస్త్రాలు కట్టి ,తపసు నొనరించు హిమశైల తనయ వోలె ‘’అని చక్కని ఉపమానాలు ఉపయోగించాడుకవి .’’వృద్దు శిరమ్ముపై క్షణిక నాట్యో   ల్లాసమున్ జూపి ,దాటె రదాంగమ్ములు ,దాటెనశ్వములు ,దాటెన్ హూణ వర్గంబులున్ ‘’పద్యం లో క్రూరరధ వేగం ,అది చేసిన భీభత్సం కన్నులకు కట్టించాడు .చాలా చోట్ల కరుణ రసప్రవాహం ప్రవహింప జేశాడు .బుద్ధభగావానుని స్తోత్రాలన్నీ భక్తి రస గుళికలే.

  ప్రకృతి వర్ణనలు కూడా మనల్ని ఆకట్టుకొంటాయి  .’’పశ్చిమా౦బుధి భానుండు వ్రాలె –నంత బాపకల్మష చిత్తసంభరిత జగతి –ద్యాగమూర్తుల నా తమోరాగనిబిడ -మైన దివి వెల్గు దారక లచ్చతచట ‘’అని చక్కని ఉత్ప్రేక్షతో మురిపించాడు .’’ధర్మ సంస్థాపనార్ధమా త్యాగమూర్తి –య౦బరంబులు లేక  నెడరుగు నంచు –కన్ను విప్పగ లేదంట కలువ కన్నె-రాజపద పార్శ్వ సంస్థితరమ్య సరసి ‘’లో ఔచిత్య రామణీయకాలు అనన్య సదృశాలు  .ఈ కవి ఇంతకూ పూర్వమే ‘’తిమ్మరుసు ‘’కావ్యం రాసి అనుభవం పొందాడు .

  ఈ కావ్యం మొదటి ఆశ్వాసం  ‘’శపథం ‘’లొ40పద్యాలు ,రెండవ ఆశ్వాసం ‘’ఆత్మ వంచన’’ లో42పద్యాలు ,మూడవది ‘’పరీక్ష ‘’లో 45పద్యాలు ,చతుర్దాశ్వాసం’’సిద్ధి ‘’ లో  50పద్యాలు ఉన్నాయి .కావ్యం మొత్తం 177పద్యాలు .అన్నీ రస గుళికలే .ఈ కావ్యానికి బ్రాహ్మశ్రీదివాకర్ల వారు రాసిన ముందుమాటలు బంగారానికి తావిఅబ్బినట్లున్నాయి .కావ్య విశేషాలు కవితావిశేషాలు అన్నీ వారేచేప్పారు .కనుక నా శ్రమ తగ్గింది ఈకావ్య పరిచయానికి .చివరిగా గుంటూరు సత్యనారాయణకవిగారి బుద్ధభగవానునిపై రజనీ ప్రియ తో పలికి౦చిన   పద్యాల  తో ముగిస్తాను –

‘’నీ కరుణావలోక కమ నీయ సుధారసవాహ చంద్రికా –నీకము నందు నా  హృదయనీరజమార్ద్ర మొనర్తు వంచు నీ

 రాకకు వేచి నిత్యమనురక్తి భజించి రచించుకొన్న నా నాకము గూల్చి నాడు పతనమ్మును గాంచి హసి౦తువా ప్రభూ ‘’

‘’లోకము నీదు బోధనలలో తన దుఖములన్ జయించి య-స్తోక సుఖమ్ములన్ వరలితూగుచునున్న దటంచు నెంచగా

బోకుము నాటి కష్టములమోఘముగా  పెనుపొందే నేడు నీ -రాకకు వేచి లోక మెటు క్రాగెడినో కనువిచ్చి చూడుమా ‘’

‘’శిల్పులు నీదు మూర్తి మున్ జెక్కెడివేళ –జీవకళ జిల్కిన నీ దరహాస మొక్కటే

నిక్కముగాద నేటికిని నిల్చెనయా అమృతంబు లొల్కుచున్ ‘’.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.