వందేళ్ళ తెలుగు కధ–2

     వందేళ్ళ తెలుగు కధ–2
 రచయిత  తన అవగాహన మేరకు ఆలోచించి ,ఆలోచిస్తూ రచనలు చేస్తాడు .చదివే వారు కూడా ఆలోచిస్తూ చదివి ,చదివిన తర్వాత కూడా ఆలోచిస్తారు .రచయిత రచనను నైతిక ఆయుధం గా భావిస్తాడు .సృష్టించే శక్తి పెరిగిన  కొద్దీ ,వ్యక్తీ రచయిత అయినట్లే ,చదివే శక్తి పెరిగిన కొద్దీ చదువరే . విమర్శకుడు అవుతాడు .ఇదే రచయితకు చదువరికి ఉన్న సంబంధం అన్నారు ప్రఖ్యాత కధకులు మధురాంతకం రాజా రాం .సమకాలీన సమస్యను సార్వ కాలీనం చేయటమే గొప్ప రచయిత చేసే పని .అవే క్లాసిక్స్ గా మారుతాయి అన్నారు పోలా ప్రగడ వారు .సంఘర్షణ  లేని జీవితం ఉండదు .సమస్య లేని రోజూ ఉండదు .మనిషికి ,సమాజానికి మధ్య సమన్వయము సాధించాలి .ఆ పనిని కధకుడే  చేయ గలడు . మనిషి చరిత్ర అంతా కధే .జీవన ,జీవిత ప్రవాహం లో సమాంతరం గా కధా స్రవంతి ఉండాలి అంటారు శ్రీ విరించి .సమాజం ,సాహిత్యం పరస్పర ఆశ్రయాలు .రచయిత వ్యక్తిత్వాన్ని బట్టి ,సమాజం పై వేసే ముద్ర ,తెచ్చే స్పందన ఉంటాయి .రచన లో తెలుగుదనం ఉత్తి పడాలి .ఇలాంటి స్పృహ తో వచ్చిన కధలన్నీ ,అర్ధ శతాబ్దం ముందు కాలమ్ లో తెలుగు కధా వీధి లో ప్రకాశించాయి .
స్వాతంత్రం వచ్చి న కొత్త ,రాష్ట్రం ఏర్పడిన ఆనందం ,అంతకు ముందు స్వంత  రాష్ట్రం కోసం ఆరాటం ,పోరాటం  ,భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ,మళ్ళీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ ,ఇవన్నీ మన కధల్లో ప్రతి బిమ్బించాయి .ప్రముఖ కధా రచయిత ముని పల్లె రాజు గారి ”వీర కుంకుమ ”కధ ,తెలుగు వారిలో ఆశా దీపాలు వెలిగించింది .భవ్యమైన ,దివ్యమైన రాష్ట్రం వస్తుందని ఆశ పెంచింది .ప్రఖ్యాత కధా రచయిత పాల గుమ్మి పద్మ రాజు గారి ”గాలివాన ”కధ అంతర్జాతీయమైంది .రాయల సీమ లోని పల్లె పట్టుల్లో ఉన్న ముగ్ధత్వాన్ని ,ఆ మనుషుల భావ జాలాన్ని జమదగ్ని ”మరపు రాని కధ ‘గా రాశారు .కృష్ణా జిల్లాలో నీరు పుష్కలం గా లభిస్తుంది .రాయల సీమ లో నీటి చుక్క గగన కుసుమం ..కనుక అక్కడి వాడు ఇక్కడికి వస్తే పొందే ఆనందం ,ఆ ఆనందం తో కృష్ణ లోకి దూకటం ,మునిగి పోవటం కనులను చెమర్చే విధం గా పెద్ది భొట్ల సుబ్బ రామయ్య గారి కధ ”నీళ్ళు ” కన్నీళ్ళే తెప్పిస్తాయి .భార్యా భర్తల మధ్య ఉండాల్సిన అనురాగం ,భర్త అమాయకుడైతే భార్య ఇంటిని ఎలా తీర్చి దిద్దు కొనేది ముని మాణిక్యం గారి కాంతం కధలు  అయస్కాంతం గా ఆకర్షించాయి .ఆడ దాని కన్నీరు అనర్ధం అని ”అలరాస పుట్టిళ్ళు ” కధ లో శ్రీ మతి కళ్యాణ సుందరీ జగన్నాద్
అద్భుతం గా చూపించారు .ఆలు మగల మధ్య ఉండాల్సిన అనుకూలత పై కొమ్మూరి వేణుగోపాల రావు రాస్తే ,మగ వాడి పైశాచిక హస్తాలలో చిక్కు కొని కూడా ,గర్వం గా నవ్వే ,అబల గురించి ,పురాణం సూర్య ప్రకాశ రావు రాశారు .అప్పటికి ఇంకా కులాంతర ,మతాంతర   వివాహాలు కొత్తవే .వాటి సానుకూల,ప్రతి కూలత పై కొనకళ్ళ ”సంప్రదాయం ”కధ రాశారు .స్త్రీ విద్యా ,వితంతు వివాహాలు సాధారణ మై పోయాయి .స్త్రీ తన కాళ్ళ పై తాను నిలబడాలి అన్న ఆలోచన బలీయమై పోయింది .ఆర్ధిక స్థితి గతులు అధ్వాన్న మై పోవటం తో ,కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక ఆడ పిల్లల తలిదండ్రులు వాపోతున్నారు .వీరి వేదనలను శ్రీమతి పరిమళా సోమేశ్వర్ ”క్రోటన్ మొక్కలు ”కధలో చిత్రీకరించారు  .మగ వాడి విచ్చలవిడి తనాన్ని క్లబ్బులు ,రేసులు ,తాగుడు ,గురించి కధలూ విచ్చల విడి గానే వచ్చాయి .అసలైన మధ్య తరగతి జీవితం గురించి వాకాటి పాండురంగా రావు ,కలువకొలను సదా నంద మంచి కధలు రాసి అభిమానం పొందారు .సామాజిక స్తితులు వెగటు పుట్టిస్తే  ,ఓర్పు నశించి ,తిరుగు బాటు వస్తుంది .ఈ నేపధ్యం లో కధా రారాజు కా.రా.మాస్టారు ”చావు ;;కధ రాసి ఒక మలుపు తిప్పారు .వారి” యజ్ఞం ” కధ సమస్యకు పరిష్కారమే .ఈ కధకు విశేష గౌరవం వచ్చింది .సినిమా గా కూడా తీశారు .భారత ప్రధానిగా పని చేసిన పీ.వి.నరసింహారావు గారు అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం పై ”మంగయ్య అదృష్టం ”కధ రాశారు అన్న సంగతి చాలా మందికి తెలియక పోవచ్చు .స్త్రీ విద్య అవసరం గురించి ,భండారు అచ్చమాంబ ”ధన త్రయోదశి ”కధ రాసి అసలు తెలుగు కధ దీనితోనే ప్రారంభమయిందా అని పించారు కూడా .
ఉప్పల లక్ష్మణ రావు ”నిద్ర లేని రాత్రి ”కధ లో తెలంగాణా సాయుధ పోరాటం గురించి రాశారు .సైనిక పటాలం చేసే వికృత చేష్టలను ప్రముఖ రచయిత మల్లాది ”మంత్ర పుష్పం ” కధ గా  చెప్పారు ”.బల్ల కట్టు ” కధ లో మాధవ పెద్ది గోఖలే రవాణా లో వచ్చిన సామాజిక మార్పులను చిత్రించారు .ఆయన జాన పద శైలి అనితర సాధ్యం అని పిస్తుంది .ఉమ్మడి కుటుంబాలలో ఉన్న పొర పోచ్చాలు ,వాటి వల్ల కుటుంబ వ్యక్తులపై పడే ప్రభావాలను త్రిపురనేని గోపీ చంద్ తన కధల్లో ప్రతిబింబింప జేశారు .తిలక్ కధల్లో స్త్రీ స్వయం నిర్ణ యాధి కారి గా కని పిస్తుంది .అటు తెలంగాణా లో మిలిటరీ చర్య పై నెల్లూరి కేశవ  స్వామి ”యుగాంతం ”కధ రాస్తే ,కాళోజి నారాయణ రావు ”లంకాపునరుద్ధారణ  ”పేరుతొ రావణ కాష్టం ,నిత్యాగ్ని హోత్రం గా సైనిక చర్యను కధ రాసి వర్ణించారు .మానవ జీవన సంఘర్షణ నేపధ్యం గా స్మైల్ ”ఖాళీ సీసాలు ”కధలు రాస్తే ,లంపెన్ ప్రోలిటారేట్ జీవితాలపై రా.వి.శాస్త్రి కధలు రాశారు .ఆడ మగ ల మధ్య మంచి సంబంధాన్ని ”సైరంధ్రి ”కధ లో కో’కు’.వివరిస్తే ,ధనిక వర్గ దాష్టీకాన్ని ,దాని ద్వారా పెరిగిన అవినీతి నేరాలు ,కళ్ళకు కట్టించారు రా.వి.శాస్త్రి .నక్సల్ బరీ పోరాటం వీరులకు వీర గంధం పూసే రచనలను వి.ర.సం.వారు బాగా చిత్రీకరించారు .సమాజం లో మార్పు వారి  వల్లే సాధ్యం అని నమ్మారు .గిరిజన పోరాట వృత్తాంతాలతో ఉత్తరాంధ్ర కధకులు కధల్లో తీర్చి దిద్దారు .వారి వెన్నంటి నిల బడ్డారు .ఉనికి ,మారుతున్న తీరులలో అభద్రతా గురించి ప్రముఖ కధకుడు చా.సో.”జంక్షన్ లో బడ్డి ”కధ రాశారు.
సశేషం
        మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ —24 -04 -12
                   క్యాంపు -అమెరికా 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.