వందేళ్ళ తెలుగు కధ -౩
‘’గ్రామీణ జీవన విధానం శిధిల మై పోతున్న తీరును పులికంటి కృష్ణా రెడ్డి కధలు గా రాసి ‘’మరపు రాని ఊరు ‘’ను చేశారు .మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రతి బిమ్బించే కధ ‘’ఊర బావి ‘’ కొలకలూరి ఇనాక్ రాశారు .వారికి మనో ధైర్యం కల్పించారు .మహిళ సంసారం లో పడే యాతనను వసుంధర ‘’మచ్చలు ‘’లాంటి కధల్లో చూపారు.ప్రత్యక్ష దైవ స్వరూపుల్లా భావించే వైద్యుల డొల్ల తనాన్ని బీనా దేవి ‘’ఫస్ట్ కేస్’’లాంటి కధల్లో అద్దం పట్టారు .ముప్పాళ రంగ నాయకమ్మ ఒక ఫైర్ బ్రాండ్.భర్త తో పాటు భార్యకూ సమాన స్థాయి ఉండాలని తన కధల్లో తెలియ జెప్పారు .శివ రాజు సుబ్బ లక్ష్మి కూడా దంపతుల మధ్య స్నేహ సేతువు ఉండాలని ఆరాట పడింది .నారీ జన అంత రంగ భేరి మోగించింది .అదే ధోరణి లో అబ్బూరి చాయా దేవి కధలూ ఉన్నాయి .తెలంగాణా లోని వర్గ చైతన్యాన్ని వట్టి కోట ఆళ్వారు స్వామి ,కాళోజి ,సురమౌళి, కదల ద్వారా కలిగించారు .అంపశయ్య నవీన్ ,మలయశ్రీ ,కొద్ది గానే కధలు రాశారు .అప్పటికి ఇంకా మాండలికం ఊపు అందు కోలేదు.తెలంగాణా ఉద్యమం ఉద్ధృతం గా జరిగినా ,ఆ నేపధ్యం లో కధలు రాక పోవటం ఆశ్చర్యమే .భూస్వాముల దౌర్జన్యం ,మధ్య తరగతి చేత కాని తనం ,కింది వర్గాల నిస్సహాయ స్థితి పై కధలు ఆలస్యం గా వచ్చాయి .’’ బద్లా ‘’అనే కధా సంకలనం 1972-73 లో వెలువడటం తో కింది తరగతి ప్రజలకు ఆత్మ విశ్వాసం కలిగి ,తిరగ బడటం ప్రారంభించారు .
సంఘానికి ,మనిషి కి ఉన్న అనుబంధాన్ని ,సామాజిక సంక్షోభాన్ని చిత్రించే ఉత్తరాంధ్ర కధకుల్లో పురిపండా,ఉప్పల,భ.రా.గో.,అల్లం ,బలివాడ పేర్కొన దగిన వారు .ఎంత చేసినా తీరు మారని జీవిత విషాదాలను వీరు అద్భుతం గా చిత్రించారు .బడుగు జీవులు సాహిత్యం లో స్థానం పొందారు .కధా విషయం వారి చుట్టూ తిరిగి పెద్ద పీట వేసింది .ఈ కధా ప్రవాహం ఇలా కోన సాగుతూ ఉంటె ,సమాజం కోసం ,వ్యక్తుల కోసం త్యాగం భూమిక గా కధలు వచ్చాయి .అమరేంద్ర రాసిన ‘’జీవన జ్యోతి ‘’కధ లో కృష్ణ తాను పుట్టింది తన కోసం కాదని అనుభవ పరి పాకం తో హృదయం పరిపక్వం అవటం కోసం జీవిస్తూ ,జీవన పధం లో నిత్య యాత్రికుడు గా మిగిలి పోతాడు .మణి అనే అన్ధురాలికి కళ్ళు తెప్పించ టానికి స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకొంటాడు .ఆ స్నేహితుడి మరణం ఇతన్ని జైలు పాలు చేస్తుంది .విడుదల అయిన తర్వాతా ,మణి,ఆ డాక్టరు వివాహం చేసుకొన్నట్లు తెలిసింది .వారికి పిల్లాడు కూడా పుట్టాడని అర్ధమైంది .వాడు బజార్లో ఆడు కొంటుంటే ,ప్రమాదం నుంచి తప్పించి మణి కి అప్ప గిస్తాడు .ఆమెను చెల్లెలు గా భావిస్తాడు .ఆమె పాలిటి జీవన జ్యోతి అయాడు కృష్ణ .అప్పటికే కధ కొంత మార్గాన్ని మార్చు కొన్నది .సందట్లో సడేమియా లా శృంగార కధలూ విజ్రుమ్భించాయి .కృష్ణా పత్రిక లాంటి వాటిల్లోనూ అవి చోటు చేసు కొన్నాయి .1964
కృష్ణా పత్రిక రజతోత్సవ సంచిక లో ‘’ఆధునికాంధ్ర సాహిత్యం లో ఏదో వేడి సాతాలింపు సెనగలు మాత్రమే పని చేసి ,ఉద్రేకాలతో ప్రజల్ని గిలిగింతలు పెట్టి మత్తు లో పడేస్తూ ఉన్నాయి .,మంచి ప్రమాణాలు ,సంఘ ఆరోగ్యానికి ,క్షేమానికి ,శుభ పరిణామాలకు పనికి వచ్చే రచనలు చేయాలి ,నిర్మాణా త్మకత ఉండాలి ‘’అని ప్రఖ్యాత రచయిత్రి శ్రీ మతి ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ గారు ఆవేదన వెలి బుచ్చారు .
జంతు జీవితం పట్ల కూడా సానుభూతి ఉండాలని విశ్వనాధ సత్య నారాయణ గారు ‘’మాక్లీ దుర్గం లో కుక్క ‘’కధ రాశారు .ఆర్ధిక రంగం కుదేలైతే వచ్చే పరిణామాలను మా మంచి కధకులు శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారు ‘’డిప్రెషన్ చెంబు ‘’కధలో చిత్రీకరించారు .డిగ్రీ కంటే హృదయానికి ప్రాధాన్యత నిచ్చారు .’’గన్నేరు పూలు ‘’,’’ఒక్కటే చీర’’కధల్లో సామాజిక దృక్పధం వుంది .వితంతువుల అణగారిన ఆశలను ,దరిద్రం చేసే వికటాట్ట హాసాన్ని ,పేదల నిస్సహాయతను ,ధైర్యం తో కుటుంబాన్ని కాపాడిన మహిళను కళ్ళకు కట్టించారు .నిమ్న జాతుల వెతల్ని చింతా దీక్షితులు గారు ఆనాడే రాశారు .మనుష్యుల మధ్య ఆప్యాయతా ,అనురాగం ,ప్రేమ ,కారుణ్యం వర్ధిల్లి నప్పుడే సమ సమాజం సాధ్యం అని పోలి కేకలు లేకుండా ఆర్ద్రం గా కధల్లో ఆవిష్కరించారు మల్లాది రామ కృష్ణ శాస్త్రి .కధనానికి ఆయువు పట్లు శాస్త్రి గారి కధలు .ఆ నుడికారం ,సోంపు ,తెలుగు పదాల పోహళింపు అనితర సాధ్యం .కృష్ణా తీరాన మల్లాది వారు వీర విహారం చేస్తుంటే గౌతమీ తీరాన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంఘ సంస్కరణ తో ,వ్యావహారిక భాషా పరి పుష్టం గా కధలు రాసి తెలుగు గుబాళింపు తెచ్చారు .ఈ శాస్త్రులు ఇద్దరు తెలుగు కధా ఆకాశం లో సూర్య చంద్రులై కాంతులు ప్రసరించారు .వేడినీ ,వెన్నెలను కుమ్మరించారు .శ్రీ శ్రీ ,ఆరుద్ర కధలు జనం నాడిని పట్టు కొన్నాయి .అవసర మైన చోట్ల నాడిని కదిలించాయి .నరస రాజు కధలు సరస సల్లాపం చేశాయి .కర్తవ్య బోధనా చేసి ,సామాజిక మార్పునూ చూపాయి .చలం కలం పదును తో స్త్రీ సమస్యలను చర్చిస్తే ,తెన్నేటి హేమ లత కూడా గొంతు కలిపి తన ప్రతిభను చాటు కొంది .స్త్రీ వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేసే గొప్ప ప్రయత్నం చేశారు వీరిద్దరూ .కప్పగంతుల మల్లికార్జున రావు ,ఆర్.ఎస్.కే .మూర్తి ,పాలంకి రామ చంద్ర మూర్తి ,కోపూరి పుష్పా దేవి ,భమిడిపాటి కామేశ్వర రావు , ,ప్రోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి ,పోరంకి దక్షిణా మూర్తి , , మొదలైన కధకులు వివిధ సామాజిక అంశాలను తమ కధల్లో ప్రతిబింబింప జేశారు .కావన శర్మ ఆధునిక శాస్త్ర సాకేతికాశాలను వాటి ప్రభావాన్ని కధల్లో ఆవిష్కరించారు .,
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-04-12క్యాంపు
కాంప్—అమెరికా

