వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6
శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక మైపోతున్నాయి .బహుజన హితాయ ,బహుజన సుఖాయ అన్నది మాటల్లోనే తప్ప చేతల్లో కని పించటం లేదు . మనిషి స్వేచ్ఛ క్రమేపీ కుంచించుకు పోతుంది .మనిషి ఒంటరి వాడై పోతున్నాడు . అన్నిటా వైఫల్యం ,వైవిధ్యం బాధిస్తుంది .ప్రేమ తగ్గి ప్రతీకారం పెరిగి విశృంఖలత వీర విహారం చేస్తుంది .సామాజిక న్యాయం గగన కుసుమం అవుతుంది .దేశం మనకేమిచ్చింది అన్న ప్రశ్న లే ఎక్కువ అవుతాయి .అంతర్యుద్ధాలు ,అంతర సంఘర్షణలు పెరిగి దిక్కు తోచని పరిస్తితి ఏర్పడుతుంది .మార్గం తెలీదు ,గమ్యం అర్ధం కాదు .నిత్యం జీవిక కోసం పోరాడే స్థితి .ఇలా సామాజికాంశాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి .ఇందు లోంచి బయట పడటం అసాధ్యం అనే భావం బలీయం అవుతుంది .ఇప్పుడే సాహిత్య కారుడి అవసరం మరీ ఎక్కువ అవుతుంది .మనిషి ని చైతన్య పరచి ,జడత్వం వదిలించి ,మార్గ నిర్దేశం చెయ్యాలి .ధైర్యాన్ని అందించాలి .ఈ పరిస్థితిల్లో మన తెలుగు కధకులు తమ ధర్మాన్ని బాగానే నిర్వహించి సమాజ హితైషు లని పించు కొన్నారు . సమస్యల మూలాలను తడి మారు . అస్తిత్వపు విలువలను గుర్తు చేశారు .ఆరాటం నుంచి పోరాటం వైపు నడిపించారు .జీవితానికి ,బలపడ టానికి తగిన బలాన్ని కలం తో అందించారు ..
సమాజం లో ఆబల ఉద్యోగం చేస్తున్నా అబలే అని పించు కొన్నది .ఆమె శ్రమకు విలువ నివ్వటం లేదు .ఆర్ధికం గా అణగార్చటం పెరిగింది .లైంగిక వేధింపు లేక్కువైనాయి .వీటన్నిటిని అచ్యుత వల్లి ,భార్గవీ రావు లు ‘’ముత్యాల చెరువు’’,పందిరి’’,’’ పురిటి నెప్పులు’’ కధల్లో చిత్రించారు ..దళిత స్త్రీ ల దీన గాధలే ఇవన్నీ .అవిద్యను ,ఆర్ధిక అసమానతలను పోగొట్టి ,జన జీవన స్రవంతి లోకి తెచ్చే మార్గాలను వివరించారు .ఎవరు ఎవరికి ఎంత చెప్పినా ,మానవ మనస్తత్వం డోలాయ మానం గానే ఉండి ముందుకు కదల లేని స్థితే .సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే రచనలూ వచ్చాయి .
జానపద కళాకారుల జీవన స్థితి చాలా దయనీయం గా ఉంది .సభలూ సమా వేశాల్లో వాళ్ళ ను వాడు కోవటమే తప్ప వారికి చేసింది చాలా తక్కువ .హస్తకళల ,చేనేత కార్మికుల పరిస్తితీ అంతే .ఆకలి చావులు ,అర కోర జీతాలు అడుగంటి పోతున్న నైపుణ్యం ,గిరిజనుల శ్రమను దోచుకొనే దళారీలు –ఇవన్నీ కధల్లో బాగా చోటు చేసుకొన్నాయి .స్త్రీ జీవితం లోని సున్నితాంశాలను జయప్రభ ,కొండే పూడి నిర్మల ,రజని కధలు గా మలిచారు .పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేశారు .దళితులు పడే బాధల్ని వారి పట్ల లోపిస్తున్న మాన వీయ దృక్పధాన్ని ఎండ్లూరి సుధాకర్ ,రాములు చిత్రించారు .బడుగు జీవుల కధలే రాసి న ఐతా చంద్రయ్య మూలాలను విస్మరించ రాదనీ పదే పదే గుర్తు చేశారు .కాలువ మల్లయ్య గారి వందలాది కధలు చైతన్య స్పోరకాలైనాయి .మాండలీకం మకుట ధారణా చేసింది .తరువాత మాండలీకాన్ని అవసర మై నంత వరకే ఉపయోగించాల ని అర్ధం చేసుకొన్నారు .తమ జాతి చరిత్రను గుర్తు చేసే కధలను ఖదీర్ బాబు ,’’దర్గా మిట్ట ‘కధల్లో రాసి మళ్ళీ కధను చెప్పే పధ్ధతి లోకి మళ్ళించాడు .ఇందులో జీవిత విశ్లేషణ అమోఘం .కధా బలం ఉంది. .సజీవ చిత్రణ ఉంది . .అలాగే రాయల సీమ కరువు ,దుర్భర జీవితాలు ,ఫాక్షనిజం లను కేతు విశ్వనాధ రెడ్డి ,నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చిరస్మరణీయ మైన కధలను రాశారు .సింగమ నేని నారాయణ రాయల సీమ జన జీవన చిత్రాలను కధల్లో బలం గా చూపారు .
గ్రామాలలో జీవనం కష్టమై ,బతుకు బండి లాగటం కష్టం గా ఉంది .పట్నాలకు వలస ఎక్కువైంది .దీని వాళ్ళ బాంధవ్యాలు ,బంధాలు తెగి ప తున్నాయి .సంక్షోభం ,భయంకర పిశాచం గా తరుము తోంది .భూమి బంధం ,పేగు సబంధం సడలి పోతున్నాయి .గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి .వీటన్నిటిని హృదయాలను కదిలించే కధలు వచ్చాయి .సామాజిక స్పృహ వీర విహారం చేసిన చేసిన కధలే .ఎక్కువగారాయలసీమ నుంచి వచ్చిన కధలివి .రైతుల జీవిత పు లోతులను కదలించే కధలుగా రాశారు .రైతుల అంత రంగాన్ని ఆవిష్కరించిన కధలు .మధురాంతకం నరేంద్ర ,శాంతి నారాయణ ,దాదా హయత్ ,ఈ దీన గాధలకు అద్భుత కధా రూపం ఇచ్చారు .చిత్తూరు మాండలికం వీరికి అధికార భాష అవటం గొప్ప మార్పు .చాలా వైవిధ్యం ఉన్న కధలు .అన్ని పార్శ్వాలు ,కోణాలను ఎదుట నిలి పిన కధా స్రవంతి .కళ్ళు చమరుస్తాయి .హృదయం బరువెక్కు తుంది .సమాజం లో మంగలి అవసరం లేని వారు లేరు .కాని వారి జీవితాలను గురించి చెప్పే వారే లేక పోయారు .ఆ కొరత తీర్చారు రాయల సీమ కధకులు గోపాల కృష్ణా ,సాగర్ లు. ఆ ప్రాంతపు జీవ భాష ను కధల్లో పదిలం గా పొదిగారు .యెనలేని గౌరవం కల్గించారు .ఇంత గొప్ప పని తెలంగాణా లో జరగటం లేదని విశ్లేషకుల భావన .తెలంగాణా మూలాలను వెతికి పట్టు కొని ,అక్కడి ప్రజలు గురి అవుతున్న వివక్షత పై కధలు తక్కువ గానే వచ్చాయి .వర్త మాన తెలంగాణా జీవితం ఇంకా పూర్తి గా ఆవిష్కరింప బడ లేదని వారి భావన .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-04-12

