సత్య కధా సుధ—2


                                      సత్య కధా సుధ—2

            ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి ‘’ అని కుంతీ దేవి తన కొడుకులు కురు క్షేత్ర యుద్ధానికి బయల్దేరి నప్పుడు ఆశీర్వ దించి పంపింది .అందుకే లోకం లో ఒక సామెత వచ్చింది ‘’పాండవుల ఆదాయం కౌరవుల తద్ది నాలకు చాల లేదు ‘’అని .అంటే పాపం అంత కష్టపడి అరణ్య ,అజ్ఞాత వాసాలు చేసి ,యుద్ధం చేసి ,చేసిన ప్రతిజ్ఞ లను నేర వెరచు కొని రాజ్యాన్ని పొందినా వాళ్ళకు దక్కింది చాలా తక్కువే .

               ఒకే పనిని చాలా మంది చేస్తారు .కాని ఫలితాలు వేరు వేరు గా ఉండటం గమనిస్తాం .దానికి కారణం ఏదీ మనకు కని పించదు .దీన్ని అర్ధం చేసు కోవా టానికి ఒక కధ చెబుతాను ఒక ఊరిలో ఇద్దరన్న దమ్ములున్నారు .పేదరికం ఇద్దర్నీ బాధిస్తోంది .దాని నుంచి బయట పద టానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు .పెద్ద వాడి భార్య తమకు ఆ ఊళ్ళో ఏమీ లభించటం లేదని ,ఇతర గ్రామానికి వెళ్లి సంపాదన కు ప్రయత్నించ మని సలహా ఇచ్చింది .అలాగే అతడు బయల్దేరి వెళ్లాడు .బాగా నడిచి ఒక మర్రి చెట్టు కింద అలసట తో నిద్ర పోయాడు .చీకటి పడబోతుండగా దగ్గర్లో ఉన్న చెరువు లో స్నానం చేసి తాను తెచ్చు కొన్న అన్నం తిందాము  అను కొన్నాడు .స్నానం చేసి వచ్చి చుస్తే తను తెచ్చు కొన్న అన్నం మూట లో అన్నం లేదు .కాని అందులో ఒక పళ్ళెం ఉంది .కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .ఆ పళ్ళాన్ని నేల కేసి కొట్టాడు .అది బోర్ల పడింది .అందులే షడ్రసో పెత మైన భోజన పదార్దాలున్నాయి .కమ్మగా భోజనం చేసి ఇంటికి చేరాడు . భార్యతో విషయం చెప్పాడు .మర్నాడు ఊరి వారందరినీ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అందరికి ఆశ్చర్యమేసింది .అందరు వచ్చారు .ఇంట్లో  గాడి పోయ్యి లేదు వంట వండిన తీరు లేదు .అంతా పంక్తుల్లో కూర్చున్నారు .గోవింద నామ స్మరణ చేస్తూ ,అందరి తో చేయిస్తూ అన్దరి ముందు పళ్ళెం బోర్లిస్తున్నాడు వరుసగా .అపుడు ప్రతి వాడి ముందు అన్ని భోజన పదార్ధాలతో ఉన్న విస్తరి కని పించింది .సుష్టుగా  అంతా భోజనం చేసి కృతజ్ఞత తెలిపి వెళ్లారు ‘’.అన్నయ్య జీవితం వడ్డించిన విస్తరి ‘’అయినదని తమ్ముడు తెలుసు కొన్నాడు .తానూ అలా కావాలని ఆలోచించాడు

          తమ్ముడి భార్య తోడి కోడలి దగ్గర విషయం అంతా సేకరించి భర్తకు చెప్పి పొరుగూరికి వెళ్లి సాధించ మని బోధించింది .అతను అలానే వెళ్లాడు .అన్నకు జరిగి నట్లుగా నే అతని అన్నం మూటలో పళ్ళెం కని పించింది .అందులో భోజన పదార్ధాలు సర్వం ఉన్నాయి అన్నయ్య వాటిని ఇక్కడే తిని తప్పు చేశాడని భావించి తిన కుండా ,ఆకలి తో ఇంటికి చేరాడు .మర్నాడు వూరి వారందర్నీ భోజనానికి పిలిచి పళ్ళానికిపూజ చేసి ఒక్కొక్కరి పళ్ళెం ముందు పళ్ళాన్ని బోర్లించి తిరగేస్తున్నాడు .అందరి తో గోవింద స్మరణ చేయిస్తున్నాడు .కాని పళ్ళెం నుంచి భోజన పదార్ధాలున్న విస్తళ్ళు రాలేదు .హతాశు డై పోయాడు .  .అయితే ఇద్దరు మంగలి వాళ్ళు మాత్రం పళ్ళెం నుంచి  వచ్చారు .ప్రతి వాడిని పట్టు కొని వద్దన్నా విన కుండా ఆడా మగా తేడా లేకుండా బుర్రలు గొరిగి వదులుతున్నారు .పారి పోయేవీలు లేని పరిస్తితి లో వాళ్ళున్నారు .కనుక ఒకే పనిని ఒకే విధానం లో ఇద్దరు చేసినా ఫలితాలు ఒకే రకం గా ఉండవని అర్ధం అవుతోంది .మనం చేసిన మంచీ ,చెడు మన ఉన్నతికి, అధోగతికి కారణాలవుతాయి అని మర్చి పోకూడదు .అదృష్ట వంతుల్ని చెరిచే వారు ,దురదృష్ట వంతుల్ని బాగు చేసే వారు లేరు

                ఇంకో కధ తెలుసు కొందాం .ఒక పేదయువకుడు దేవుడు గుడి లో పూజారి పెట్టిన ప్రసాదాలు తింటూ గుడి అరుగు మీద రాత్రుళ్ళు నిద్ర పోతూ కాల క్షేపం చేస్తున్నాడు .ఒక రోజు రాత్రి అలానే నిద్ర పోతుంటే ధన లక్ష్మి కలలో కన్పించి ‘’నీ దగ్గిరి కి వస్తాను ‘’అన్నది .అతడికి విరక్తి ఎక్కువ .ఏమీ సమాధానం చెప్ప లేదు .మళ్ళీ కని పించి వస్తాను అంది .దానికి అతడు ‘’తల్లీ ! వస్తానంటున్నావు .మంచిదే .ఎప్పుడు వెళ్లి పోతావో కూడా చెప్పు ‘’అన్నాడు అప్పుడు లక్ష్మీ దేవి ‘’నీ భార్య ఒక రోజు తెల్ల వారు ఝామున తల విర బోసుకొని ,పని వాళ్ళు లేరు ,చేసే వాళ్ళు లేరు బాధ్యత లేదు అని తిట్టు కుంటూ మేడమెట్లు దిగే రోజున నేను వెళ్లి పోతాను ‘’అని చెప్పింది .మెలకువ వచ్చి ,నవ్వు కుంటూ లేచాడు యువకుడు .కాల కృత్యాలు కూడా తీర్చు కొ కుండా నడిచి వెళ్లి పోతున్నాడు .తిన్నగా రాజు గారి అంతఃపురం చేరి ,కావలి వారెవరు లేక పోయే సరికి రాణీ గారి తల్పం మీద అప్పుడే నిద్ర లేచి కూర్చున్న మహా రాణిని చూశాడు .అమాంతం ఆమె ను కౌగలించు కొని  గట్టిగా పట్టు కొన్నాడు .ఆమె పెనుగు లాడుతూ అరుస్తోంది .రాజు గారు పరిగెత్తు కొచ్చి వాడిని నరక టానికి కత్తి పైకెత్తాడు .ఇంతలో రాణి  పడుకున్న మంచం మీంచి కాల సర్పం కింద పడింది .దాన్ని రాజు చంపి ,తన రాణిని రక్షించి నందుకు యువకుడి పై జాలి కలిగి కనక ఆసనం పై వాడిని కూర్చో బెట్టి కనకాభి షేకం చేశాడు రానీ తో సహా .అతని పై కృతజ్ఞతా భావం కలిగింది .మంచి అమ్మాయిని వెదికించి పెళ్లి జరి పించాడు .అన్ని భోగాలు వారికి రాజు సమ కూర్చాడు .కాని యువకుడు తనకున్న రెండు అంగ వస్త్రాలను ,చెంబు ను భోషాణం లో భద్రం గా దాచు కొన్నాడు .కంత కాలం గడిచింది

                        ఒక రోజు అతని భార్య తల విరబోసు కొని మేడ మెట్లు దిగుతూ తనకు కావలసిన వస్తువుల జాబితా అందించింది .తనకు ఈ ఐశ్వర్యం నుంచి విముక్తి లభించే రోజు దగ్గర పడింది అని యువ కుడు తెలుసు కొన్నాడు .నగలను ధనాన్ని మూటల్లో కట్టించి ,పల్లకి ఎక్కించి పుట్టిన ఇంటికి వెళ్లి హాయిగా ఉండ మన్నాడు .ఎందుకో అడగ వద్దు అని శాశించాడు .రాజు గారి భటుడు  వేట రమ్మని  రాజాహ్వానం గా తెలియ జేశాడు .రాజు ,ఈ యువకుడు చాలా సేపు వేటాడి అడవిలో ఒక చెట్టు కింద అలసట చెంది నిద్రించారు .చెట్టు మీద ఉన్న కొంగ రాజు గారిమెడ మీద రెట్ట వేసింది .దాన్ని తొలగించే విధి తనది అని భావించి ,రాజు మొలలో ఉన్న చుర కత్తి తీసి తుడవ బోయాడు .ఇంత లో రాజుకు మెలకువ వచ్చి ,మెడ మీద కత్తి ఉండటం గమనించి తన్ను చంప బోతున్నాడని భావించాడు .యువకుడు ఏదో చెప్ప బోయాడు .విని పించు కొ లేదు .విచారణ జరిగింది .రాజే ప్రత్యక్ష సాక్షి కనుక తీర్పు వెంటనే చెప్పారు శిరచ్చేదం  అని తీర్పు .రాణి  గారు జాలి పడి  అతన్ని విడి ఛి పెట్ట మనికోరారు .అప్పుడు అతను తన భోషాణం లో ఉన్న మూడు వస్తువులను తనకు తెచ్చి ఇప్పించమని కోరి తన కధ అంతా వివ రించాడు .అందరు యువకుని సత్ప్రవర్తన ను గ్రహించారు .కనుక అవ్యక్త పర మాత్మ ఆదేశం మేరకే ,మంచి ,చెడు జరుగు తుంది .మానవుడి భాగ్య రేఖ దీని వెనక ఉంటుంది .అదే దైవీ శక్తి .అందుకే భాస్కర శతకం లో –

   ‘’పూనిన భాగ్య రేఖ చెడి పోయిన పిమ్మట ఎట్టి మానవుమ్దైనను –వాని నెవ్వరు ప్రియంబున బిల్వరు  పలక రెచ్చట న్ ‘’అన్న సూక్తి మర్చి పోరాదు .

        సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ .—7-5-12

         కాంప్ –అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.