సత్య కధా సుధ—9

  సత్య కధా సుధ—9

          పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి సముదాయిస్తూ ‘’హుళక్కి ,హుళక్కి హాయి ‘’అని పాడుతుంది కదా .ఆమె అర్ధం ఏమిటంటే ‘’నాయనా ! ఈ లోకం లో హాయి అంటే ఆనందం  హుళక్కి అంటే ఏమి లేదు –నిండు సున్నా ‘’అని  ప్రపంచ సత్యాన్ని తెలియ జేస్తుందని వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పిందన్న మాట .

                లండన్ నగరం లో ఒక చోట  ఉపన్యాసాన్ని ఇవ్వటానికి సిద్ధ పడ్డాడు చికాగో హీరో వివేకానంద స్వామి .వేదిక మెట్లు ఎక్కుతుండగా ,కొంత మంది జనం ఆయన అవతారాన్ని చూసి ‘’mad ,mad ,mad  ‘’అని అరుస్తున్నారట .ఆయనేమీ లెక్క చేయకుండా తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించి నోళ్ళు మూయించాడు ‘’some mad after money ,some mad after women ,Iam mad after god ‘’దానితో వాళ్ళ జ్ఞాన నేత్రాలను తెరిపించాడు దైవీ  శక్తిని బోధిస్తూ .

              వాయువు ప్రేరణ వల్లనే మేఘాలు కమ్ము కుంటాయి .అదే వాయువు వల్ల మేఘాలు తొలగి పోతాయి .ఒకే వాయువు మేఘాలు దగ్గరకు చేరటా నికీ ,విడి పోవటానికీ కారణం అవుతున్నాయి .అలానే మానవుడు మనసు లో రాగాన్ని పెంచు కొని రాగి అవుతున్నాడు .రాగాన్ని వదిలించుకొని విరాగి అయి ముక్తి పొందుతున్నాడు .దీన్ని వివరించే చక్కని శ్లోకం –

‘’వాయునా నీయతే మేఘః  పునః తేనైవ మోక్షతే –మనసా కల్ప్యతే బంధః మోక్షః తేనైవ కల్ప్యతే ‘’

            బౌద్ధ గురువు ,రస సిద్ధుడు ఆచార్య నాగార్జునుడు యోగ శక్తి తో ,ఔషధ శక్తి తో దాదాపు నాలుగు వందల సంవత్స రాలు జీవించి ,చివరికి ‘’అనవసరంగా శ్రమ పడ్డాను ‘’అని గ్రహించి  ఈ  లోకం నుండి విముక్తుడ య్యాడట .

          ఒక జ్ఞాని what can make me afraid? death is a joke to me’’అన్నాడు ఆనందం గా .

              ఒక రాజు గారి కి ఒకడే వడో వెయ్యి మైళ్ళ అవతల,మహా పర్వత శిఖరం మీద అమృత గంగ ఉందని తాగిన వారికి మరణం లేదని తెలియ జేశాడు .ఇంకేముంది –రాజు సైన్యంతో శ్రమ పడి  అంత దూరం వెళ్లి .పర్వతా రోహణం చేసి శిఖరం చేరే సరికి దారిలో చాలా మంది నడవ లేక ,ఎక్క లేక చని పోయి రాజుగారితో పాటు ఒక్క పది మందే మిగిలారట .చివరికి అమృత గంగను చేరాడు .ఒక చెంబు తో  ముందుగా రాజు గారికి భటుడు ఆ జీవన గంగ ను అందించాడు .అక్కడే ఎత్తైన చోట కూర్చొని ,భగవన్నామ స్మరణ చేసి తాగటానికి చెంబు పైకెత్తాడు . ఇంత లో ‘’ఆగండి ఆగండి ‘’అని పిచ్చి కేకలు విని పించాయట  .ఆ వైపు చూశాడు రాజు .అరిచే  వాళ్ళందరూ గోచి పాత రాయుళ్ళు ,వికృతా కారాలతో పిచ్చి చూపులతో కళ్ళు పీక్కు పోయి పళ్ళు లేక నడవ లేక తూలీ పోతూ కన్పించారట .వాళ్ళందరూ రాజు దగ్గరకు చేరి ‘’తాగ కండి బాబూ !ఆ అమృత గంగ తాగి చావటానికి వీలు లేక ,బతక టానికి శక్తి లేక చావు బతుకుల మధ్య గిల గిల లాడుతున్నాం .చావు రాదు. బతికే శక్తి లేదు.మేం చేతు లారా తెచ్చు కొన్నాం .మీరు దాని బారిన పడి  మా లాగా కావద్దు ’’’అని గోల చేశారట.రాజు గారికి జ్ఞానోదయం అయింది .చెంబు విసిరి ఆ నీళ్ళలో పడేశాడు .తనతో పాటు మిగిలి ఉన్న వారితో కిందికి దిగి రాజ్యం చేరు కొన్నాడట .అందుకే ఒక మహానుభావుడు ‘’death is a most important event of life ,man has sufficient time to know how to die ‘’అన్నాడు .

                      ‘’కాశ్యాంచ మరనాన్ముక్తిహ్ ‘’అని అందరికి తెలిసిన విషయమే .కాశీ లో చని పోవటం కూడా మన చేతి లో లేదు అని శూద్రక మహా రాజు కధ తెలియ జేస్తోంది .కాశీ లో మరణించాలి అనే ధృఢ సంకల్పం టో శూద్రక మహా రాజు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి ,కాశీ చేరి అక్కడ ఒక భవనం కట్టించు కొని అందులో ఉంటున్నాడు .ఒక వేళ బుద్ధి మారి ఇంకో చోటుకు పోవాల్సి వస్తుందేమో అని పించి రెండు మోకాలి చిప్పలు తీసేయించుకొని నడిచే పని లేకుండా చేసు కొన్నాడు .ఇక ఏ భయం లేదు .కాశీ  లో మరణం ఖాయం అను కొన్నాడు .

                    శూద్రక మహారాజు  అశ్వ శిక్షణ లో నల మహారాజు అంతటి వాడు .కాశీ రాజు అశ్వ శాలకు ‘’అజానేయం ‘’అనే ఒక కొత్త గుర్రం వచ్చింది .అది ఎవరికీ లోన్గటం  లేదు .చాలా ఇబ్బంది పెడుతోంది .దాన్ని లొంగ దీసి స్వారీ చేసిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని ప్రకటించాడు .ఉండ బట్ట లేక పోయాడు ఆ ప్రకటన విని శూద్రక రాజు .తాను ఆ గుర్రాన్ని అదుపులో పెట్టగలను అని భటుడి తో కాశీ రాజుకు కబురు పంపాడు .మోకాళ్ళు లేవు లేవు ఎలా సాధ్యం అని వాళ్ళు అన్నారు .తనను ఆ గుర్రం మీద ఎత్తి కూర్చో పెట్టండి అన్నాడు .అలానే చేశారు కాశీ రాజ భటులు .అంత వరకు గుర్రాన్ని అదుపు లోకి తేవాలని ప్రయత్నించిన వారందర్నీ ఆ గుర్రం ఎక్క గానే కింద పడేశింది .వాళ్లు భంగ పడి వెళ్లి పోయే వారు .ఈ యన కూర్చున్నాడు కదా అని అందరు సంతోషించి ,గుర్రాన్ని అదుపులోకి టే గలడు అని నమ్మారు కాశీ రాజు తో సహా .గుర్రం రివ్వున దూసుకు పోయింది ఆఘ మేఘాల మీద .శూద్రకుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని జనం ఎదురు చూస్తున్నారు .

                 ఆ పెంకి గుర్రం కాశీ ప్రభావం లేనంత దూరం  సుమారు మూడు వందల మైళ్ళు ప్రయాణించి ,ఒక మర్రి చెట్టును డీకోన్నది .అంతే దెబ్బకు శ్శూద్రక రాజు అక్కడి కక్కడే చని పోయాడు .పాపం కాశీ లో చావాలను కొని ,మోకాలి చిప్పలు కూడా తీసే యించుకొన్న వాడికి కాశీ లో చావు రాలేదు .దిక్కు లేని చావు వచ్చింది .దీనినే భాస్కర శతకం లో చక్కని పద్యం లో చెప్పాడు హుళక్కి భాస్కరుడు –

‘’గిట్టుట కేడ  కట్టడ లిఖించిన ,అచ్చట గాని ,యొండు చో

పుట్టదు చావు !జానువుల పున్కల నూడిచి ,కాశి చావ ,గా

ల్గట్టిన శూద్రకున్ ,భ్రమల గప్పుచు ,తద్విధి గుర్రమౌచు ,ఆ

పట్టున గొంచు ,మర్రి కడ ,ప్రాణము దీసే కదయ్య భాస్కరా “’

             అందుకే కర్తవ్య నిర్వహణ లో ఏమరు పాటు తగదు –మృత్యువు ఎప్పుడు వచ్చి మీద పడుతుందో తెలీదు .ఎప్పుడు చేయాల్సిన పని వాయిదా వెయ్య  కుండా అప్పుడే చేయాలని చెప్పే శ్లోకం –

‘’శ్వః కార్య మద్య కుర్వీత –పూర్వాహ్నే చాప రాహ్నికం –యమస్య కరుణా నాస్తి కృతం వప్యవదాకృతం ‘’

   దీని భావం –రేపు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి .మధ్యాహ్నం పూర్తీ చేయాల్సింది ఉదయమే చెయ్యి .యముడు దయా రహితుడు .అయ్యో పాపం వీడు తన కర్తవ్యాన్ని పూర్తీ చేశాడా అని చూడడు .పని చేసే ట ప్పుడు ముందే పూర్తీ చేసుకోవాలి .

                       మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –13-5-12

                             కాంప్ —అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.