నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

  నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3

                                                                                          నన్నే  చోడుడు  

                                                నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ .   కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి కవి .అంతే కాదు మొదటి’’ రాజ కవి’’ కూడా .’’ప్రబంధం ‘’అనే పేరు ను చాలా సార్లు వాడాడు .’’బంధ కవిత్వాన్ని ‘’కవిత్వం లోకి దించిన మొదటి కవి కూడా .పద్యాలను సజీవ చిత్రాలుగా మలిచాడు .కావ్యం అంతా దేశీయ వాసన గుబాళిస్తుంది .శివభక్తుడే కాని ,శైవ మత ప్రచారం చేయని వాడు .పరమత నింధా  చేయని సంస్కారి కూడా . జాను తెనుగు తో బాటు ,’’వస్తు కవిత ‘’లేక ‘’వస్తు కావ్యం ‘’అనే అంశాన్ని మొట్ట మొదట ప్రయోగించాడు .కావ్యానికి అవసర మైన సూక్తులు ,వర్ణనలు ,గుణాలు ,రసాలు ,మొదలైన విషయ సామగ్రి నే ‘’వస్తువు ‘’అన్నాడని విశ్లేషకుల భావన .’’మృదు రీతి సూక్తులిమ్పొంద   ‘’అన్న పద్యం దీనికి ఆధారం .చోడుని పద్ధతిని ‘’కావ్య పద్ధతి ‘’అన్నారు .నన్నయది ఇతిహాస మార్గ మైతే ,నన్నే చోడు నిది కావ్య మార్గం .ఈ రెండూ ఒకే సారి తెలుగు సాహిత్యం లో ప్రారంభమయి నట్లు భావిస్తున్నారు .

                                                                                        కేతన

          మూల ఘటిక కేతన సంస్కృతం లో దండి మహా కవి రచించిన ‘’దశ కుమార చరిత్ర ‘’అనే కావ్యాన్ని తెలుగు లో ‘’దశ కుమార  చరిత్ర ‘’గా రాశాడు .తిక్కన గారికి దీన్ని అంకితం చేశాడు .ఇలా తెలుగు లో ఒక కవి ఇంకో కవి కి అంకితం ఇవ్వటం కేతన తో  ప్రారంభమైంది .కొత్తదారి తొక్కి మార్గ దర్శి గా నిలిచాడు .స్వతంత్ర కేతనం ఎగుర వేశాడు .’’అభినవ దండి ‘’అని పించు కొన్నాడు .నానుడులు ,సామెతలు కుమ్మరించాడు .’’కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప –నరిది బ్రహ్మ కైనా ‘’అని తన కావ్యాన్ని కవి బ్రహ్మ తిక్కన మెచ్చి నట్లు చెప్పు కొన్న ఘటికుడు .’’విజ్ఞానీశ్వ రీయం ‘’అనే ధర్మశాస్త్ర గ్రంధాన్ని కూడా రాసి ,శాస్త్ర రచనకు శ్రీ కారం చుట్టాడు .కధా కావ్యానికి ఆద్యుడు కేతన అని పించు కొన్నాడు .

                                                                                         మారన

       తెలుగు లో పురాణ రచన చేసిన మొదటి కవి మారన  .’’మార్కండేయ పురాణం ‘’ఇతని కావ్యం .ఈయనా తిక్కన గారి శిష్యుడే .కవిత్వ రచన లో తిక్కన ను అనుసరించాడు .అల్లసాని పెద్దనా మాత్యుని ‘’మను చరిత్ర’’కు ప్రేరణ –మారన  గారి మార్కందేయమే .ఈ పురాణం నుంచే పెద్దన ‘’స్వారోచిష మనువు ‘’కధ ను స్వీకరించాడు .పెద్దన కవిత్వం మారన మార్గాన్నే అనుసరించింది.పురాణం అయినా ఆహ్లాదం గా చెప్పగలిగాడు .పురాణ రచనకు ఆద్యుడై ,తరువాతి వారికి మార్గ దర్శి అయాడు మారన  .కవిత్రయం సరసన నిలవ గలిగిన సంస్కారి .నిగర్వి .’’అఖిల విబుధ సభా పర్వమై ,జగజ్జనాలికి గర్వ పర్వ మై ,యధిక పుణ్య యోగి హ్రుచ్చాంతి పర్వ మై యొప్పు దాని ,హరగునో జ్వల మణి అయిన దాని ’’గా మార్కందేయాన్ని రచించానని బుధ జన విధేయం గా చెప్పు కొన్నాడు .శ్లేష తో పర్వాన్ని పురాణాలకు అన్వయించాడు .సుకుమారత్వం ,సూక్ష్మ రీతి మారన  ప్రత్యేకత .సాత్విక గుణ పరి పూర్నుడిగా మారన కవి ప్రశంశ నేయుడు .

                                                                                హుళక్కి భాస్కరుడు

           రంగ నాద రామాయణం ద్విపద రామాయణం అయితే ,భాస్కర రామాయణం చంపూ రామాయణం .కవి పేరు మీదే ఈ రామాయణం వర్దిల్లటం కొత్త దనం .భారతాన్ని కవిత్రయం తెనిగించి నట్లే భాస్కర రామాయణమూ బహు కృతం అయింది .బాల ,కిష్కింద ,సుందర కాండాలను కుమారుడు మల్లికార్జున భట్టు ,అయోధ్య కాండ ను భాస్కరుని శిష్యుడు రుద్ర దేవుడు ,అరణ్య ,యుద్ధ కాండాలలో ఎక్కువ భాగం భాస్కరుడు రాశారు .యుద్ధ కాండ చివరి భాగాన్ని ,భాస్కరుని స్నేహితుడు అయ్యలార్యుడు రాశాడు .కవి చతుష్టయం దీన్ని పూర్తీ చేయటం కొత్తదనం .భారతం ,రామాయణం తెలుగు లో బహుక్రుతం అవటం యాదృచ్చిక చారిత్రార్మక సంఘట నం .నలుగురు రాసినా ,అందు లో భాస్కరుని వంతు స్వల్పమే అయినా ,కావ్యం భాస్కరుని పేరు మీదే ఉండటం కొత్తగానూ ,వింత గానూ వుంది .నన్నయ ,తిక్కన లకు దీటైన కవి అని భాస్కరుడు కీర్తి పొందాడు వాల్మీకానికి చాలా దగ్గరగా ఉండేట్లు ,ఔచిత్య వంతం గా ఉండేట్లు రచన సాగింది .ఇంకో కొత్త విషయం ఏమి టంటే శ్రీ రాముని ఒక మహా మానవుని గా చిత్రించి నూత్న పోకడలు పోయాడు భాస్కరుడు .ప్రౌధత్వం తో పాటు ,వ్యంగ్య వైభవాన్నీ రుచి చూపించాడు .’’బహులాన్ద్రోక్తి మయ ప్రపంచం ‘’అని భాస్కరున్ని  నాచన సోమన సరసన కూర్చో బెట్టాడు ‘’వసు కారుడు ‘’రామ రాజ భూషణ భట్టుమూర్తి  కవి .

      సశేషం —మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –20-5-12.—కాంప్—అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.