‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం
1
శ్యామ కృష్ణా !నాకోసం నువ్వేం చేశావు చెప్పు!
నన్ను నీప్రేమలో పడేసి పిచ్చిదాన్నిగా చేసే శావు
నువ్వు నా హృదయం లో ఉంటున్నావు
ప్రతి చోటా నీ కోసం వెదికే పనిఎందుకు కల్పిస్తావు నాకు ?
నాకెందుకు ఈ బాధ??
నువ్వు లేకుండా నా మనస్సు రెపరెపలాడి పోతుంది .
నిన్ను నేను పొందాను
అయినా నీకోసం చూస్తూనే ఉన్నాను
నాతో ఎందుకీ దొంగాటలాడుతున్నావ్ ?
నాకు నీప్రేమామృతాన్నిచ్చి మురిపించి మరపించావు
నువ్వు నన్ను నీ ప్రేమ గీతం గా మారుస్తున్నావు
ఈ’’శ్యామ’’ నీ గురించే కలవరిస్తోంది , నీపిచ్చిలో పడి కొట్టుకొంటోంది
2
శ్యామ కృష్ణా ! నా మాట కొంచెం విను
నువ్వు హాయిగా మెత్తని పరుపు మీద పడుకొంటావ్
నేను మాత్రం నిద్ర లేని ఏకాంత దారుణ రాత్రులను గడుపుతున్నాను
నేను ఎవరికి ఫిర్యాదు చేయాలో నీకు చెప్పను
ప్రేమించిన నువ్వు నన్ను గెలిచావ్ ,నేనే ఓడిపోయాను దారుణం గా
ఇప్పుడే నాకనుల ముందు ప్రత్యక్షం కావాలి నువ్వు
నీ నేత్రామ్రుతాన్ని తనివార గ్రోలాలి నేను
ఈ ‘’శ్యామ’’ మనో వాక్కాయ కర్మలా నీకు వశమై పోయింది .
శ్యామ కృష్ణా !దయచేసి బదులివ్వు
వియోగి యోగి కంటే ఎలా తక్కువ వాడవుతాడు ?
యోగి శరీరం యోగాగ్నిలో కాలి బూడిదవుతుంది
నిన్ను ప్రేమించే వియోగి హృదయం నీ ప్రేమలో రగిలి బూడిద అవుతుంది
యోగి కాషాయం కడతాడు
వియోగి నీ ప్రేమనే తనువూ మనసులకు కట్టుకొంటాడు
యోగి సమాధి లోకి వెళ్ళటానికిఎంతో కష్టపడతాడు
వియోగి ప్రతి కదలికతో తేలిగ్గా భావనాసమాధి చెందుతాడు
యోగి గుడిసె లో నివశిస్తాడు
నిన్ను ప్రేమించే వారి హృదయమే ఒక దివ్యమైన గుడిసె , దేవాలయం
యోగి శారీరక బాధలనుభవిస్తాడు
నిన్ను కోరిన వియోగి మానసిక క్షోభ అనుభవిస్తు తట్టుకొంటాడు
యోగి మంత్రాలను జపిస్తాడు
నిన్ను ప్రేమించే యోగి స్మృతి అంతా ప్రేమలో నిమగ్నమై ఉంటుంది
యోగి శాశ్వత దివ్య జ్యోతి ని చూడాలని ఆశిస్తాడు
ప్రేమికుడు నీతో శాశ్వత కలయిక లో పరవశిస్తాడు
ఈ ‘’శ్యామ ‘’కు వేరే బంధువులెవరూ లేరు
శ్యాముడోక్కడే ఆమె ఏకైక దిక్కు ,గతి .
నీకు నా మీద దయ అనేది ఉంటె
శ్యామ కృష్ణా
నా కోసం రావటానికి ఇక ఆలస్యం చేయద్దు ..
ఈ రెండవ కీర్తన ‘’శ్యామా మాతాజీ ‘’బొంబాయి లో రెండు వేరు వేరు చోట్ల అంటే ‘’అంధేరీ’’ లోను ,’’మలాద్ ‘’లోను ఒకే సారి భౌతికం గా కనీపించి గానం చేసి అందర్నీ ఆశ్చర్య పరచింది .. తాను బొంబాయి లోని మలాద్ లో మాత్రమె కీర్తన లను గానం చేశానని ,అంధేరీ లో చేయ లేదని ఆమె చెప్పింది .కాని అంధేరీ లో ఆమె పాడినట్లు ఫోటోలు ,పేపర్ వార్తలను మర్నాడు ఆమె కు చూపించారు .అలా ”ఆ లీలా కృష్ణుడే” రెండో చోట తన రూపం లో వచ్చి పాడి ఉంటాడని ఆమె అందరకు చెప్పింది .
24-10-1916 లో ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో అంటే శ్రీ కృష్ణ జనం స్తానం లో జన్మించింది శ్యామా మాతాజీ .పెళ్లి అయి ఎనిమిది మంది సంతానాన్ని కన్నది. ఒకఆడపిల్ల మాత్రమె బతికింది . .అత్తగారు వంశాంకుర మైన మగ పిల్ల వాడికోసం ఆమెను’బృందావనం లోని ’ 108శ్రీ బాబా రాదా స్వామీజీ మహారాజ్’’దగ్గరకు ఆశీర్వాదం పొందటానికి తీసుకెళ్ళింది. ఆయన అనుగ్రహించి ‘’హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ‘’మంత్రాన్ని ‘’రోజుకు లక్ష సార్లు’’ఆరు నెలల కాలం జపించమని ఉపదేశించాడు .ప్రతి రోజు ఉదయం మూడు గంటలకు లేచి జపం ప్రారంభించేది .మళ్ళీ రాత్రి రెండింటి దాకా చేసేది లక్ష పూర్తీ కావటానికి .అంత నియమం గా ఆమె జపించి శ్రీ కృష్ణుని దివ్య దర్శనం పొందింది మగ సంతానం సంగతే ఆమెకు గుర్తు లేదు . దీనితో అత్తగారి ఆరళ్ళు పెరిగాయి .తట్టు కోలేక బృందావనం కు, ఆ తర్వాతా కాశి కి ఎవరికి చెప్పకుండా వెళ్లి పోయింది . .అనుక్షణ సమాధి లో గడిపేది ..ఎన్నో అద్భుతాలను చూపేది. పై సంఘటన అలాంటి దివ్య శక్తులలో ఒకటి .శ్రీ కృష్ణ దివ్య విభూతిని అనుక్షణం అనుభవించేది .ఆమె కీర్తనలు అద్భుతం గా ఉన్నందున ఈ అనువాదం చేసి మీకు అందిస్తుస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-13- ఉయ్యూరు

