ఎనభై సంవత్సరాల నిత్య చైతన్యశీలి డాక్టర్ వెల్చాల కొండలరావు. ఆయన నిర్వహణా దక్షతకు తార్కాణంగా నిలిచిన విశ్వనాథ సాహిత్య పీఠాన్ని ఆరంభించి ఇప్పటికి దశాబ్ది కాలమవుతోంది. ఈ కాలంలో పీఠం నిర్వహించిన కార్యక్రమాలు, వెలువరించిన సంచికలు సారస్వత ప్రేమికుల ప్రశంసల్ని అందుకున్నాయి.
కొండలరావు తెలుగు ఆచార్యుడిగా పనిచేశారేమోనని చాలామంది అనుకుంటారు. ఆయన దశాబ్దాలుగా తెలుగు భాషా సాహిత్యాల్లో కొనసాగిస్తున్న కృషి వల్ల ఈ అభిప్రాయం ఏర్పడడం సహజమే! కొండలరావు కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్! చిన్ననాడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ ముందున్నారు. కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌గా తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి విలువైన బాటలు వేశారు. తెలుగు అకాడమి సంచాలకులుగా మరచిపోలేని సేవల్ని అందించారు. నిరంతర అధ్యయనశీలి, ఇంగ్లీషుతో పాటు ఉర్దూలోనూ గొప్ప పండితులు. తిలక్ అమృతం కురిసిన రాత్రి కావ్యాన్ని ఆంగ్లంలోకి, గాలిబ్ కవితల్ని తెలుగులోకి అనువదించారు. మరో అరడజనుకు పైగా రచనలు కొండలరావు కలం నుండి వెలువడ్డాయి. నిత్యోత్సాహంతో సాహితీ రంగంలో మునుముందుకు సాగుతున్న కొండలరావుకు ‘విశ్వనాథ సాహిత్య పీఠం’ ఒక సుందర స్వప్నం. ఆ కల నిజమైంది.
కొన్ని సాహిత్య సంస్థలు నామమాత్రమైనవి. మరికొన్ని సన్మానాలతో సరిపెట్టుకుంటాయి. ఇంకా కొన్ని సంస్థలు సంవత్సరానికి ఒకటి రెండు సాహిత్య సభలతో పెద్ద పెట్టున ప్రచారాన్ని తెచ్చుకుంటాయి. ఈ లక్షణాలు విశ్వనాథ సాహిత్య పీఠంలో అసలు కన్పించవు. పీఠం ఎవరినీ ప్రత్యేకంగా సన్మానించిన సందర్భాలు లేవు. పీఠం నిరంతర సాహిత్య సం’చలనం’తో ఉంటుంది.
విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై వెల్చాల కొండలరావు అభిమానం వెలలేని ది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విశ్వనాథకు తగినంత గుర్తింపు రాలేదన్నది కొండలరావు ఖచ్చితమైన అభిప్రాయం. విశ్వనాథ సాహిత్యంపై ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయనీ, సమగ్రమైన అధ్యయనంతో ఈ అపోహలన్నీ తొలగిపోతాయని కొండలరావు అం చనా. ఆయన విశ్లేషణ ప్రకా రం కవిసమ్రాట్టు విశ్వనాథ సాహిత్యంలోని ఎన్నెన్నో కీలక కోణాలపై ఇంకా పరిశోధనలు జరగనే లేదు. విశ్వనాథ వాడినన్ని అన్యదేశ్య (ఎక్కువగా ఉర్దూ) పదాల్ని మరే తెలుగు రచయితా వాడలేదనీ, విశ్వనాథ అద్భుతమైన వాడుక భాషను వాడారనీ, వీటిపై ఎవరూ దృష్టి సారించలేదనీ కొండలరావు చెబుతారు. విశ్వనాథ సాహిత్యంపై వినూత్న రీతి లో పరిశోధించాలనుకునే యువ రీసెర్చ్ స్కాలర్స్‌కు తాము చేయూతనందిస్తామని కొండలరావు చెబుతున్నారు. విశ్వనాథపై పరిశోధనలకు అవసరమైన పూర్తి వాఙ్మయం సాహిత్యపీఠంలో అందుబాటులో ఉంది. విశ్వనాథ మాటల కేసెట్లు ఉన్నాయి. విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు జువ్వాడి గౌతమరావు అపూర్వరీతిలో గానం చేశారు. ఈ పద్యాల్ని విన్న ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, ప్రముఖ కవి అబ్బూరి వరద రాజేశ్వరరావులు గౌతమరావును ఎంతగానో ప్రశంసించారు. ఇది 1992 నాటి మాట. ఈ కేసెట్లు కూడా పీఠంలో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషించిన ఇంగ్లీషు వ్యాసాల బృహత్ సంకలనాన్ని (760 పుటలు) పీఠం ప్రచురించింది. విశ్వనాథపై ఎవరైనా డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మిస్తే అది తెలుగువారికి ఒక చారిత్రక సంపదగా మిగులుతుందని కొండలరావు నమ్మకం.
విశ్వనాథ సాహిత్యపీఠం ఒక్క విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య విశ్లేషణలు – ప్రచురణలకే పరిమితం కాలేదు. మంచి రచనలు చేసిన కవుల్ని రచయితల్ని పం డితుల్ని మేధావుల్ని పీఠం సముచిత రీతిలో గుర్తిస్తుం దని చెప్పేందుకు ‘జయంతి’ సంచికలు తార్కాణాలు.
‘జయంతి’ పత్రికకు జగమంత గతం ఉంది. భారతి, శారద, సుజాత వంటి అత్యున్నతశ్రేణి సాహిత్య పత్రికల వరుసలో నిలబడగలిగే జయంతి తొలుత 1927లో ఆరంభమైంది, ఆగిపోయింది. తిరిగి 1959లో విశ్వనాథ ఆశీస్సులతో గౌతమరావు సంపాదకత్వంలో పునఃప్రారంభమైంది. ఏడాదికి పైగా నడచింది. ఈ స్వల్ప వ్యవధిలోనే తనదైన నిర్మొహమాటమైన ధోరణితో సాహితీ లోకాన్ని ఆకట్టుకున్నది. చాలాకాలం క్రితమే నిలిచిపోయిన ‘జయంతి’ని గురించి రమారమి నాలుగు దశాబ్దాలపాటు ఎవరూ పట్టించుకోలేదు. 2003లో కొండలరావు సంపాదకత్వంలో జయంతి తిరిగి ఆరంభమైంది. ఇది మూడు నెలలకొకసారి వెలువడే సాహిత్య సంచిక. ప్రతి సంచికా విలువైనదే. అపురూపమైనదే. విశేష సందర్భాలలో ‘జయంతి’ ప్రత్యేక సంచికల్ని వెలువరించింది. ‘యాది’ సదాశివ మాస్టారుపై వందల పుటల అపూర్వ సంచిక ఎందరినో అలరించింది. ఇస్మాయిల్, పి.వి.నరసింహారావు, శేషేంద్ర, పఠాభి, సంపత్కుమార వంటి ప్రసిద్ధుల్ని గురించి ప్రచురించిన ప్రత్యేక సంచికలు పది కాలాలపాటు పదిలపరచుకోవలసినవి.
గతంలో కేవలం సాహిత్య విమర్శ పరిశోధనలకే ‘జయంతి’ పరిమితమయ్యేది. సమకాలీన భాష సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా కొండలరావు జయంతిని మార్చి వేశారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులోను జయం తి వెలువడుతోంది. భాషా పరిరక్షణ ఈనా టి తక్షణ అవసరమని కొండలరావు అంటా రు. తెలుగు సాహిత్య విశేషాలు ఇతర భాషీయులకు అందాలని అందుకు అందమైన అనువాదాలకు మించి న సాధనం మరొకటి లేదని ఆయన చెబుతారు. మౌలికమైన భావనలతో భాషా సాహిత్యాలను విశ్లేషిస్తూ వెలువడిన జయంతి సంచికలు ఈ తరానికి బాగా విలువైనవి.
విరామ మెరుగక పరిశ్రమించే డా.కొండలరావు 81వ యేట అడుగుపెడుతున్నారు. ఆయన కవి, రచయిత, అనువాదకుడు, సం పాదకుడు. అంతేకాదు తన తర్వాత తరాన్ని భుజం తట్టి ప్రోత్సహించే సుమనస్వి. స్వంత వూరు కరీంనగర్‌లో ఆయన అభిమానులు, శిష్యు లు, మిత్రులు ఘన సన్మానాన్ని నిర్వహిస్తున్నారు.
తనకు వ్యక్తిగతంగా ఎటువంటి కీర్తి కిరీటాలు అక్కర లేదని విశ్వనాథ సాహిత్య పీఠాన్ని భవిష్య తరాలు బాగా ఉపయోగించుకుంటే చాలునని కొండలరావు చెబుతారు. ‘జయంతి’ పత్రిక పాటిస్తున్న ప్రమాణాలు చెదరకుండా పదిలంగా ఉండాలన్నది ఆయన మరో బలమైన కోరిక.
– డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
(వెల్చాల కొండలరావుకు 80 ఏళ్లు,
‘జయంతి’ పత్రికకు – విశ్వనాథ సాహిత్యపీఠానికి దశాబ్ది -నిండిన సందర్భంగా)

