కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తూంటారు – మన సంప్రదాయంలో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటూ కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చొని మోక్షం కోరుకోవడం, ప్రపంచాన్ని పటిం్టంచుకోకపోవడం, సమాజ సేవపై దృష్టి లేకపోవడం స్వార్థం కాదా? అని అడుగుతూంటారు. ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనల్ని ప్రశ్నించే వాళ్లు ఎలాంటి సమాజసేవ చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేయడం. రెండవది ఆత్మజ్ఞానం అంటే ఏమిటో వివరించి చెప్పడం. మొదటి సమాధానం ప్రశ్నించినవాడికీ వర్తించేదే. నిజానికి ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నించేవారు అతి తక్కువగా ఉన్నా ఇది సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న కావున అసలైన సమాధానం తెలుసుకోవాలి.
తత్త్వశాస్త్రంలో ‘నేను ఎవరు’? ‘నేను’ అనే పదానికి అర్థమేమిటి? అనేది మొదటి ప్రశ్న. ఇంగ్లీషులో ‘నేను’ అనే దానికి ‘ట్ఛజూజ’ అంటాం. సంస్కృతంలో దీన్నే ‘ఆత్మ’ అంటాం. ఆత్మజ్ఞానం అంటే నేను అనే స్ఫురణ మనకు ఏ వస్తువుపై ఉంది అనే దాన్ని గూర్చి విశ్లేషణ.
నేను అనగానే మొట్టమొదటగా మనదేహం గుర్తుకువస్తుంది. దేహం అంటే స్థూల శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహం. మనిిషికే కాక ప్రతి జంతువుకూ నేను అనే భావన దేహంపై ఉంటుంది. దీనికి తోడు మనిషికి ఫలానా పేరు, సీ్త్ర లేదా పురుషుడు, ఫలానా కులానికీ, మతానికీ, దేశానికీ చెందినవాడిని, ఫలానా వృత్తిలో ఉన్న వాణ్ణి అంటూ అనేక విధాలుగా నేను యొక్క అర్థం ఉంటుంది. దీనికి తోడు మన డిగ్రీలు, సమాజంలో మన స్థాయి, మనం సాధించిన విజయాలు లాంటివన్నీ కలిపి ఒక identity ఉంటుంది. నేను అనగానే శరీరంతో పాటు వీటన్నింటిపైనా కూడా నేను అనే భావన ఉంటుంది. తత్త్వశాస్త్రం ఈ భావనను ప్రశ్నిస్తుంది. పై వర్ణనలో దేహం మొదటిది, సమాజం మనకిచ్చిన వ్యక్తిత్వం రెండోది. మనిషి యాదృచ్ఛికంగా ఒకానొకచోట పుట్టినా అతని చుట్టూ ఉన్న సమాజం అతనికి ఒక కులము, మతము, జాతి మొదలైన విశేషణాల్ని అంటగడుతుంది. ఎంతో స్వేచ్ఛగా పుట్టిన మనిషిపై సమాజం రుద్దిన భావాలు ఇవి. ఇవన్నీ ఒక విధమైన బంధాలు. అందుకే ఫ్రెంచి తత్త్వవేత్త రూసో అనే అతను “Man is born free but everywhere he is bound in chains ‘ అన్నాడు, వీటన్నింటినీ కాదని అసలైన నేను ఏమిటి అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.
పై ప్రశ్నకు రెండు స్థాయిల్లో సమాధానం లభిస్తుంది. సులభంగా అర్థం కావడానికి డిగ్రీస్థాయి, హైస్కూలు స్థాయి అని చెప్పుకోవచ్చు. డిగ్రీస్థాయిలో ఉన్నవాడికి పరమాత్మ అని పిలువబడే చైతన్యమే ఈ ప్రపంచంలాగ కనిపిస్తుంది అని చెబుతుంది. అందులో భాగంగా నీవు అనుకునేది కూడా ఆ పరమాత్మయే అని చెబుతుంది. ప్రపంచంలో ప్రతి జీవీ ఆ పరమాత్మ స్వరూపమే అని చెబుతుంది. దీనిపై ఎంతో విస్తృతమైన విశ్లేషణ, వివరణ ఉంది.
పై స్థాయి విచారణను అందుకోలేనివాడికి తనను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ గమనించమని చెబుతుంది. ఇది హైస్కూలు స్థాయి. మనం ప్రతి నిమిషం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, నీళ్ళు, ఆహారం అనేవి ప్రకృతి నుండి తీసుకుంటున్నాం. మనిషి శరీరంలోని ప్రతి అణువూ ప్రకృతినుండి తయారైనదే. మరో విధంగా చెప్పాలంటే వ్యక్తి అనేవాడు ప్రకృతిలో చిన్న అణువు. సముద్రంలో తరంగాన్ని విడిగా చూస్తే అది తరంగమే. మరో విఽధంగా చూస్తే తరంగము అని మనం భావించేది నిజంగా సముద్రమే. ఈ భావన మన మనస్సులో గట్టిగా నాటడానికై ఉపనిషత్తులు అనేక ఉపాసనాల్ని చెప్పాయి. ఉదాహరణకు భూః, భువః, సువః, మహః అనేపదాలు మనకు తెలిసినవే. భూః అంటే భూమి, భువః అంటే చుట్టూ ఉన్న గాలివలయం, సువః అంటే సూర్యుడు, నక్షత్రాలతో కూడిన విశ్వం. వీటన్నింటికీ మూలమైన ఒకానొక cosmic mind ను మహః అన్నారు. మొదటి దశలో నేను అనేది ఈ పరిమితమైన దేహమొక్కటే కాదు ఈ ప్రపంచమంతా అని భావించడం. శరీరంలో ఉన్న చిన్న అణువు నేను శరీరం అని భావించినట్టు. లేదా ఒక తరంగం నేను సముద్రం అని భావించినట్లు. ఇదే భూః అనే ఉపాసన. తర్వాత భూమి చుట్టూ ఉన్న వాయుమండలమంతా కూడా నా శరీరమే అని భావించడం భువః అనే దానిపై ఉపాసన. ఈ విధంగా నేను అని భావిస్తున్నది విశ్వాన్నంతటినీ నిండి ఉన్న cosmic mind కన్నా వేరు కాదు అని భావించడం. ఇది మహః అనే దానిపై ఉపాసన. నేను అనే భావాన్ని దేహానికి పరిమితం చేయకుండా విశ్వానికంతా వ్యాపింపచేయడం ఈ ఉపాసనల ఉద్దేశం. ఈ భూః భువః సువః అనే పదాలు గాయత్రీ మంత్రంలో అందరూ చెప్పుకునేవే.
వేదాంతంలో దీన్నే సర్వాత్మభావం అంటారు. విశ్వమంతటా ఒకే చైతన్యం, ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది అనే భావన. అన్నింటినీ ఒకటిగా చూడడం, అన్నింటిలో బ్రహ్మచైతన్యాన్ని చూడటం అనే భావన మన గ్రంథాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. గీతలో దీన్నే సాత్త్విక జ్ఞానం అన్నారు (18-20). అన్నింటినీ వేరువేరుగా చూడడం రాజసజ్ఞానం(18-21). సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. దీని వల్ల మనకూ, సమాజానికీ ఒరిగేదేమిటి అని ప్రశ్నించవచ్చు. సర్వాత్మభావం ఉన్నవాడు ఆత్మౌపమ్యం అనే గుణంతో అందరినీ ప్రేమిస్తాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు వర్ణిస్తాడు (6-32). ఆత్మౌపమ్యం అంటే ప్రపంచంలో ప్రతి జీవినీ తన ఆత్మగా చూసుకోవడం. దీనిలో వ్యక్తికి ఇన్నాళ్ళూ నేను అనే అంశంపై ఉన్న భావనలన్నీ పటాపంచలౌతాయి. నేను ఫలానా కులానికీ, జాతికీ చెందిన వాణ్ణి మొదలైన భావాలు వీగిపోతాయి. నేను, నాది అనే భావనలు కూడా బలహీనపడతాయి. ప్రపంచం పట్ల అతని దృష్టి మారుతుంది. అతడు చేసే ప్రతి పనీ ప్రపంచంలో ఏ జీవికీ హాని చేయని విధంగా, అందరినీ ప్రేమించే విధంగా ఉంటుంది. ఇలాగ ప్రపంచం మేలుకు పని చేయడాన్నే కర్మయోగం అంటారని మునుపటి వ్యాసాల్లో గమనించాం. పై విధంగా విచారణ చేసేవాడికి ఇలాంటి కర్మయోగబుద్ధి సులభంగా ప్రాప్తిస్తుంది. వ్యక్తిస్థాయిలోనే కాక సమాజస్తాయిలో కూడా దీని ప్రభావం ఉంటుంది. అందరూ ఒకటే అనే భావన మన నరనరాల్లో ఉండటం వల్లనే భారతీయులు అన్ని మతాల్నీ సమానంగా ఆదరించారు, భగవంతుణ్ణి ఏ రీతిలోనైనా పూజించవచ్చని చెప్పారు.
నీవు నీ పొరుగువాడిని ప్రేమించు అని ఒక ఆజ్ఞ ఉందనుకుందాం. ఎందుకు ప్రేమించాలి అని ఎదురు ప్రశ్న వస్తుంది. ఎదుటివాడు మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలనో, లేదా నేను వాడిని నా మార్గంలోకి మార్చుకోవాలనో, లేదా ఇద్దరి మధ్యా శాంతి ఉండాలనో కారణం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి ఆజ్ఞ గీతలో చెప్పిన రాజసజ్ఞానం పరిధిలోకి వస్తుంది. అన్నింటినీ వేరువేరుగా చూడడం, తనను తాను ఎత్తైన స్థానంలో ఉంచుకొని ఎదుటివాడికి తానేదో మేలు చేస్తున్నానని అతణ్ణి తక్కువ స్థానంలో చూడటం జరుగుతుంది. అలా కాకుండా సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు అవ్యాజమైన- అంటే ఎలాంటి స్వార్థపరమైన ఉద్దేశమూ లేకుండా- ప్రేమ చూపగలడు. ఎదుటివాడు నా కన్నా వేరుకాడు అనేది సర్వాత్మభావంతో చూపే ప్రేమ, నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను అనే భావనతో చూపేది భేదభావంతో చూపే ప్రేమ. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. ఆత్మజ్ఞానం అంటే తన identity ని పెంచుకోవడం కాదు, identityని తొలగించుకోవడం అన్నది వేదాంతంలో చెప్పే ముఖ్యమైన సాధన.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ