గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

149-ప్రాచ్య కళాశాల స్థాపించిన శ్రీ ఎస్ టి జి . వరదాచార్యులు

జననం –విద్య

శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళవరదాచార్యుల వారు అంటే ఎవరికీ తెలియదుకాని ఎస్. టి .జి .వరదాచార్యులు అంటే యిట్టె అందరికి తెలిసి పోతుంది .ఆ పేరుతో అంత ప్రాచుర్యం పొందారు .కృష్ణా జిల్లా బందరు దగ్గరున్న చిట్టి గూడూరు లో విద్యా వైదుష్యాలకు నెలవైన సంపన్న వైష్ణవ కుటుంబం లో వరదా చార్యుల వారు 4-8-1892జన్మించారు .మచిలీ పట్నం హిందూ హై స్కూల్ లోను ,  అక్కడి నోబుల్ కళాశాలలో  ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజి  లోను  విద్య నభ్యసించి సంస్కృతం లో ఏం. ఏ .ఆనర్స్ డిగ్రీ పొందారు .

గీర్వాణ సేవ

డిగ్రీ పొందిన తర్వాత విజయనగరం మహా రాజా వారి సంస్కృత కళాశాలలో కొంతకాలం ,ప్రదానాధ్యాపకులుగా పని చేశారు .తర్వాత ప్రాచ్య పాఠశాలల (ఓరియెంటల్ స్కూల్స్ )పాలనా వ్యవహారాలను పర్య  పర్య వేక్షించే అధికారిగా వ్యవహరించారు .

స్వంత గ్రామం లో ప్రాచ్య కళాశాల స్థాపన

ఆ తర్వాత స్వగ్రామం చిట్టి గూడూరు చేరి తమ తండ్రి గారి పేరిట ప్రాచ్య కళాశాలను ప్రారంభించారు .నిర్వాహక సమితికి అధ్యక్షులుగా ఉన్నారు .ఉవ్వెత్తున ఎగసిన భారత జాతీయోద్యమ కాలం లో  జాతీయ విద్యను బోధించాలనే సంకల్పం తో జాతీయ విద్యా పరిషత్తును ఏర్పరచి కార్య దర్శిగా ఉండి జాతీయ కళాశాల ను మచిలీ పట్నం లో ఏర్పాటు చేశారు .దీన్ని తీర్చి దిద్దటం లో  ఆచార్యులవారు తీసుకొన్న శ్రద్ధా చొరవ మాటల తో వర్ణించ లేనంత గొప్పది .

భద్రాచల రామాలయ  జీర్ణోద్ధరణ

వరదాచార్యుల వారు ఆగమ శాస్త్రం లోను నిష్ణాతులు .భద్రాచలం లోని శ్రీ సీతా రామ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కమిటీ ఉపాధ్యక్షులై అహరహం శ్రమించి నిర్మించారు .

ఆచార్యుల వారి గీర్వాణ రచన

వరదాచార్యుల వారు తెలుగు శతకాలను ఏడింటిని సంస్కృతం లోకి అనువదించారు .వీటిని ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి ముద్రించిం వెలువరించింది .’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’అనే తులనాత్మక భాషా శాస్త్ర గ్రంధాన్ని ఆచార్యుల వారు సంస్కృతం లో రచించి అనన్య కీర్తి సాధించారు .అది పరమ ప్రామాణిక గ్రంధం గా పేరు పొందింది .

గౌరవ పురస్కారాలు

రాష్ట్ర, రాష్ట్రేతర విశ్వ విద్యాలయాలలో ‘’పాఠ్య గ్రంధ నిర్ణయ పరిషత్తు’’ లో సభ్యులుగా అధ్యక్షులుగా వరదాచార్యుల వారు పని చేశారు .వీరి సమర్ధతకు తగిన పదవి .ఇది ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమి వరదా చార్యుల వారికి  1969 విశిష్ట సభ్యత్వం అందజేసి గౌరవించింది . ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది 90 ఏళ్ళు సార్ధక జీవనం గడిపిన  విద్యా వరదు లైన శ్రీ వరదాచార్యుల వారు 2-11-1982న శ్రీ వైకుంఠ౦   చేరుకొన్నారు. ..

సశేషం

150- కామ ప్రబంధం రాసిన రాజయోగి –దక్షణా మూర్తి పరమ హంసస్వామి

ఒక అనామక మంగయ్య  పరమ హంసగా మారాడు అంటే ఆశ్చర్యం వేస్తు౦ది కాని ఇది పక్కా నిజం .అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చరిత్ర .

బాల్యం

విజయనగరం దగ్గర మెట్ట లో న్యాయ వాది సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 మంగయ్య గారు జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు కనిపించి  ఏమికావాలని ఆయన కోరితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని మంగయ్య కోరితే బలవంతం గా సిద్ధుడు హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దాన్ని అనుస్టించటం వల్ల  మంగయ్యకు వాక్సుద్ధి కలిగింది .ఊరవతల గుట్టలలపై ఏకాంతం గా ఎప్పుడూ కూర్చునే వాడు .ఒక రోజున ఎవరిదో బంగారు నగ పోతే మంగయ్యను అడిగితే నగ ఇక్కడికే వస్తుందని చెప్పాడు .ఇంతలో ఒక కాకి ఆ నగను ముక్కుతో కరచుకొని తీసుకొచ్చి ఆయన ఉన్న చెట్టుపై చేరి కిందికి జార విడిచింది .ఈ విషయం తెలుసుకొన్న ఊరి జనం మంగయ్య కారణ జన్ముడు మహాత్ముడు అని భావించారు .

ఉపనయనం –విద్య

మంగయ్యకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు .పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ,తెలుగు ,ఆంగ్లం నేర్చుకొన్నాడు .ఒక సారి ఇంటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన మీద పడింది .అందులో ఉన్న పదార్ధాన్ని ఒళ్లంతా రాసుకొన్నాడు .ఆ కాయను బొడ్డులో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువుగా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం వెళ్లి హైస్కూల్ లో చేరి సెకండరీ విద్య పూర్తీ చేసి ,ఇంటికి వచ్చి తండ్రి దగ్గర శైవ మంత్రాలను ఉప దేశం పొందాడు .

పెళ్లి –రాజయోగ ,హఠయోగ విద్య

పదహారవ ఏట మంగయ్యకు పెళ్లి అయింది .రైల్వే లో పని చేసే ఒకాయన రాజ యోగం క్షున్నం గా నేర్పాడు .యోగ ప్రభావాన్ని చూపించమని స్నేహితులు బలవంతం చేశారు ..అదే సమయం లో ఒక బండీవస్తుంటే దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమని సవాలు చేశారు .మంగయ్య యోగ శక్తితో ఆ బండీని అనేక సార్లు ముందు, వెనకలకు నడిపించి ఆశ్చర్య పరచాడు .కొంతకాలం తర్వాత బాలానంద పరమ హంస అనేసిద్దేశ్వర బ్రహ్మ చారి అనే  ఉత్తర దేశీయుని వద్ద రాజ ,హఠయోగ రహస్యాలు ఆకళింపు చేసుకొన్నాడు .

గణితం నుంచి వేదాంతం లోకి

మద్రాస్ వెళ్లి క్రిస్టియన్ కాలేజి లో చేరి గణితం లో బి .ఏ. చదివాడు .ఒక సారి కాలేజి లో జరిగిన డిబేటింగ్ పోటీలో గణిత ఉపన్యాసకుడు ‘’సైకాలజీ లో  ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్ ‘’ అని వాదిస్తే  ,కోపం తో లెక్కల సబ్జెక్ట్ ను వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొని చదివాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ‘’ఘట్టాన్ని పేరులో  ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .ముఖ్య శిష్యుడయ్యాడు .గురు శిష్యులిద్దరూ తరచుగా కావ్య గోష్టితో కాల క్షేపం చేసేవారు .ఒకసారి ప్రయోగం కోసం ఈ గురు శిష్యులు గంజాయి దమ్ము కొట్టారు .గురువు శాస్త్రి గారు దిమ్మ తిరిగి పడిపోయారు .శిష్యుడు  నిమ్మకాయ నీళ్ళు తాగించి పైత్యం వదిలించాడు .ఇద్ద్దరూ ఒక సారి శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి అందులో దుష్యంతుడు శకుంతలకు చేసిన అన్యాయాన్ని సహించలేక  పూర్తిగా చూడ కుండా  లేచోచ్చారు .బి ఏ .పూర్తి అయ్యే సరికి మంగయ్య లోని తర్క శక్తి పట్ట పగ్గాలు లేకుండా శిఖరారోహణం చేసింది .

లౌకిక ఉద్యోగాలు –అలౌకిక సాధన

నాడీ శుద్ధి,  కుంభక ప్రాణాయామం సాధిస్తూ మంగయ్య ఒంటి పూట భోజనం మాత్రమె చేస్తుంటే క్షయ రోగం పట్టుకుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని కొడుకు రోగం తగ్గించాడు .మంగయ్యకు తండ్రి మేధా దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేశాడు .మంగయ్య పర్లాకిమిడిలో పోలీస్ హెడ్ క్లార్క్ గా కొద్దికాలం  పని చేశాడు .ఉద్యోగం వదిలేసి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శిగా పని చేశాడు .ఒక సిద్ధుడు మంగయ్యకు శ్రీ స్వప్నాన్జనేయ ,శ్రీ వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియ జేశాడు .

స్కూల్ మేష్టారు మంగయ్య

భార్య ,పిల్లల్ని మామ గారింట్లో వదిలేసి మంగయ్య మద్రాస్ వెళ్లి ఎల్. టి . ట్రెయినింగ్ (ఉపాధ్యాయ శిక్షణ ) లో చేరాడు  .మంగయ్య రాసిన ఇంగ్లీష్ రచనలు చూసి అతని ప్రతిభకు సంమోహితుడై ‘’ఈరాక్ ద్రు’’అనే ఆంగ్ల దొర గుండెలు బాదుకొన్నాడు .తర్వాత నిజాం రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా చేరి పని చేశాడు .ప్రభుత్వం మంగయ్య ప్రతిభను గుర్తించి బి .ఎడ్. జిల్లా కేంద్ర ఉన్నత విద్యాలయానికి హెడ్ మాస్టర్ గా నియమించింది .

శ్రీ కృష్ణ సాక్షాత్కారం –మహిమా ప్రదర్శన

మంగయ్య నిజామాబాదు లో ఉన్నప్పుడు గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ఈయన వద్ద  ‘’సమాధి భేదాలు ‘’నేర్చుకొన్నారు .మంగయ్య ఋగ్వేద ,యజుర్వేదాలను గురుముఖతా అభ్యసించారు .రామస్వామి అయ్యర్ ‘’వాసు దేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దీని వలన మంగయ్య గారికి శ్రీ కృష్ణ సాక్షాత్కారం కలిగింది  .హైదరాబాద్ గౌలి గూడా లో కాపురమున్నారు .ఇద్దరు స్నేహితులకు వేర్వేరు చోట్ల ఒకే సారి కనిపించి ఆశ్చర్య పరచారు .హరిహత్  దంపతులు శివ జపం చేస్స్తుంటే అనుకోకుండా ప్రత్యక్షమై మంగయ్యగారు రుద్రాభి షేకం చేసి మై మరపించారు  .శిష్యుడు ఒకడికి మంగయ్య గారు అగ్ని జ్వాలల మధ్య కనిపించారు. భయ పడి వాడు పారి పోతుంటే మళ్ళీ యధాస్థితికి వచ్చారు .పశు సంవర్ధక శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివ లింగం ఇచ్చి ఆ తర్వాత వరుసగా పదకొండు లింగాలు ఇచ్చారు. గృహస్తాశ్రమ జీవనం గడుపుతున్నా మంగయ్యగారు శ్రీ రామ శ్రీ  కృష్ణులు లాగా బ్రహ్మ చారులే. విదేశీ డాక్టర్లు ఈ విషయం పై పరి శోధన చేసి నిర్ధారించారు .

వశ్య వాక్కు మంగయ్య

మంగయ్య గారి పెద్ద కుమారుడి వివాహముహూర్తాన్ని తానె నిర్ణయించి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు ,పండితులు ఈ ముహూర్తానికి కేతు ,కుజ వేధలు ఉన్నాయని  ఆ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు ..ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని మంగయ్య గారు వాదించారు .పెళ్ళికొడుకుని రామాలయానికి తీసుకు వెడుతుంటే పాము అడ్డమొచ్చినది .కదలటానికి వీల్లేదన్నారు స్థానిక పండితులు .’’ఇదే నయ్యా కేతు వేద అంటే ‘’ అని మంగయ్య గారు చెప్పారు .పాము మాయ మై పోయింది  .పెళ్లి కొడుకును కళ్యాణ వేదిక వద్దకు  తీసుకొని వెళ్ళారు . పీటల మీద వధూ వరులను కూర్చో బెట్టారు .ముహూర్తం కోసం పండితులు జుట్టు పీక్కుంటూ గడియారాలను తదేకం గా చూస్తూ ఉండిపోయారు.ఒకళ్ళ టైం నాలుగు ,అని, ఒకళ్ళ గడియారం ఏడు అని ,మరొకరిది ఆగి పోయిందనీ చెప్పారు .మంగయ్య గారు ‘’ఇదేరా బాబూ కుజ వేద అంటే ‘’అని చెప్పి అక్షింతలు తాను  తీసుకొని ,అందరికీ  ఇప్పించి  అందరి చేత అక్షింతలు వేయించి తాను పెట్టిన శుభ లగ్నానికే కుమారుని వివాహం జరిపించారు ‘’ఇప్పుడు మీ గడియారాలు చోసుకోండి ‘’అన్నారు మంగయ్య .అందరి గడియారాలు మంగయ్య గారు పెట్టిన ముహూర్త సమయాన్నే చూపించాయి . అందరూ ముక్కు మీద వేలేసుకొన్నారు దట్ ఈజ్ మంగయ్య .వశ్య వాక్కు  మంగయ్య అయ్యారు .మంగయ్య గారి మహా శక్తికి అఘటన ఘటనా సామర్ధ్యానికి నివ్వెర పోయారందరూ .

మరిన్ని మంగయ్యగారి మహిమలు

దేవీ దాసు అనే వాడికి ఏ .బి. సి. డి. లు కూడా రావు .వాడితో కొన్ని గంటల సేపు ఇంగ్లీష్ లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్యగారు .తనకు’’ షోడశీ’’ మంత్రాన్ని ‘’దేవుజీ మహా రాజు ‘’గారే వచ్చి ఇస్తారని మంగయ్య గారు ముందే చెప్పారు .అందరూ  గణం జయ మహారాజు తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .సమయానికి  గణం జయుడు రాలేదు .దేవూజీయే వచ్చి మంత్రం దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత అమోఘమైనది .

మంగయ్య గారి విద్యా వైదుష్యం –గీర్వాణ రచన

మంగయ్యగారి విద్యా వైదుష్యం నిరుపమానమైనది .ఆంగ్లం లో అయిదు పద్యకావ్యాలు రాశారు .పదహారు ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు .సంస్కృతం లో ‘’కామ ప్రబంధం ‘’,’’దక్షిణ గీత ‘’’’సౌభాగ్య రత్నాకరం ‘’’’అద్వైత పారిజాతం ‘’,’’వ్యావహారిక దర్పణం ‘’వంటి అలౌకిక గ్రందాలనేన్నిటినో రాశారు .సంస్కృతం లో స్తుతి స్తోత్ర రచనా చేశారు .’’ధర్మాస్టకం ‘’వంటి అస్టకాలూ రాశారు .

కాలచక్ర గమనాన్ని ప్రత్యక్షం గా  దర్శింప జేసిన మహాత్ముడు మంగయ్యగారు

ఒక శిష్యుడు కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూడాలని ఉందని మంగయ్యగారిని వేడుకొంటే అతనికి కాల చక్ర గమనాన్ని ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లు వైఖరీ వాక్కు తో జపించే మంత్రాన్ని  మంగయ్యగారు పశ్యన్తీ వాక్కు తో  ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో తన మేడ మెట్లు దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్యగారు వైఖరీ వాక్కులో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు.అంటే మంగయ్య గారికి సమస్త జీవ రాశుల జన్మ వృత్తాంతాలు పూర్తిగా తెలుసు అని అర్ధమౌతుంది మనకు .

మంగయ్య గారి ప్రముఖ శిష్యులు

మంగయ్య గారికి జాతి మత భేదాలు లేకుండా ఎందరో శిష్యులైనారు .అలాంటి వారిలో జర్మన్ విద్వాంసుడు ‘’స్పర్జ్ ‘’, నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ‘’బర్నెట్ ‘’,విద్యా మంత్రి ‘’నవాబ్ ఆజం యార్ జంగ్ ‘’,ఇంజనీరింగ్ మంత్రి ‘’మొహిదీ నవాబ్ జంగ్ ‘’,గణితా చార్యుడు ‘’సయ్యద్ సిరజుల్ హసన్ ‘’మొదలైన ప్రముఖులెందరో ఉన్నారు .

మంగయ్య గారి స్పెషాలిటీ

మంగయ్య గారికి ఒక విచిత్రమైన అలవాటు ఒకటి ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షింతలు ఉంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంటూ ఉండేవారు .నడుస్తున్న ,కూర్చున్నా తమలో తాము మాట్లాడుకొంటూ ఉండేవారు ఇవి పరమహంస లక్షణాలు .మంగయ్యగారురాసిన ఒక ఇంగ్లీష్ పుస్తకానికి పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంవారు ‘’ఈ గ్రంధం లోని  అభిప్రాయాలను గ్రహించటానికి ౩౦౦ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు .అంత క్లిష్టమైన లోతైన రచన అన్నమాట .

మంగయ్యే దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

బాల బ్రహ్మ చారి అని పేరు పొందిన ‘’చిన్మయా నంద స్వామి ‘’మంగయ్య గారికి సన్యాస దీక్షనిచ్చి ‘’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమనామాన్ని ఇచ్చారు .స్వామి ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .ఎందుకోకాని అక్కడ మంచి ఫలితం రాలేదు .విశాఖ పట్నం వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసుకొని శ్రీ లలితా దేవి ని ప్రతిష్టించారు .ఆ ప్రాంతం లలితానగర్ గా పేరు పొందింది .

పరమ హంస సిద్ధి

దక్షిణామూర్తి పరమ హంస స్వామి 1954లో 92 వ ఏట సిద్ధిపొందారు .స్వామి ముఖ్య శిష్యులు ‘’వాల్వేకర్ ‘’ఆశ్రమాదికారి అయి అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేసి 1995లో సిద్ధి పొందారు .వీరిని గురువుగారి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు ఈ లలితాశ్రమాన్ని కుర్తాళం పీఠాదిపతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )28-6-1998 లో దత్తత తీసుకొని శ్రీ రామానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలు అప్ప గించారు .

(ఆధారం –నేను రాసిన ‘’సిద్ధ యోగి పుంగవులు’’పుస్తకం  )

Inline image 1

 

 

మనవి-   ఆధునిక   సంస్కృత రచయితలైన సర్వశ్రీ కోగంటి సీతా రామాచార్యులు ,కొలచల యజ్న నారాయణ దీక్షితులు అనే క్షేమేంద్ర , ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి , ల గురించి నాకు వివరాలు ఏవీ దొరక లేదు .ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటె ,నాకు తెలియ జేస్తే వారి గురించి కూడా రాస్తాను .నేను మరచి పోయిన ఇంకా ఎవరైనా ఆధునిక సంస్కృత రచయితలు ఉంటె కూడా నాకు తెలియ జేస్తూ వారి వివరాలూ మీకు అందుబాటులోఉంటే నాకు తెలిపి నా గీర్వాణ సేవకు చేయూత నివ్వమని అర్ధిస్తున్నాను .దుర్గాప్రసాద్ -18-6-15-

మరో మనవి – నా గీర్వాణ కవుల కవితా గీర్వాణం గ్రంధం చదివి ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు (హైదరాబాద్ ) నేను మరింత సమాచారం తెలుసుకోవటానికి వీలుగా శ్రీ ఏం.కృష్ణ మాచారియార్ గారుఆంగ్లం లో  రచించి 1937లో ప్రచురించ బడిన ‘’History of classical Sanskrit Liiterature ‘’ గ్రంధాన్ని చదవమని సలహా ఇచ్చారు .ఈ విషయం తెలుసుకొని వెయ్యి పేజీల  ఈ మహా గ్రంధాన్ని నాకు, సరసభారాతికి అత్యంత ఆప్తులైన శ్రీ మైనేని గోపాల కృష్ణగారు దాన్ని కొని ,దానితోపాటు మరికొన్ని సంస్కృత గ్రంధాలను కూడా నాకు మే నెలలోనే అందేట్లు పంపారు. వారి సుహ్రుదయతకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .

పై గ్రంధం ఆధారం గా మిగిలిన  పూర్వ గీర్వాణ కవుల కవితా గీర్వాణ వైభవాన్ని ‘ఈ రెండవ భాగం లో 150 వ కవిగా ‘’వత్స భట్టి ‘’తో  ప్రారంభించి వీలు కుదిరినప్పుడల్లా రాస్తానని   మనవి చేసుకొంటూ ,శ్రీ గోపాల కృష్ణగారికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను  .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్  –19-6-15 –ఉయ్యూరు

151—      ‘’ ప్రశస్తి ‘’రచించిన వత్స భట్టి

మందసార్ సూర్య దేవాలయం లో శిలా ఫలకాలపై ఉన్న ‘’ప్రశస్తి ‘’శ్లోకాలను వత్స భట్టికవి  మాళవ సంవత్సరం లో అంటే 529లో రాశాడని భావిస్తున్నారు . బూలర్ లెక్క ప్రకారం ఇది క్రీ .శ.473-74 అవుతుంది .ప్రశస్తి లో 44 పద్యాలున్నాయి .మొదలు చివర మంగళా శాసనంలు వచనం లో  ఉన్నాయి  .చక్ర వర్తి కుమార గుప్తుని గురించి రాజులు విశ్వ వర్మ ,బంధు  వర్మల గురించి  సూర్య దేవాలయ నిర్మాణాన్ని గురించి  శీతాకాల వర్ణన అందులో కవి రాశాడు .అనేక ఛందస్సులను ప్రయోగించాడు .ఈ రకమైన రచనలు తూర్పు దేశ కవులే చేస్తారని దండి వివరించాడు .మొత్తం కవిత్వం చాలా ధారా శుద్ధితో ఉంటుంది .

నాలుగో శతాబ్దం రెండవ భాగం లో దశ పురా –మందసోర్ లోని సూర్య దేవాలయ ప్రశస్తి గౌడీయ విధానం లో ఉన్నట్లు కనిపిస్తుంది .ఈగౌడకవులు తూర్పు భారతానికి చెందిన వారుగా భావిస్తారు .వత్సభట్టి రాసిన ప్రశస్తి లో కవిత్వాన్ని అధ్యయనం చేస్తే కవి మహా కావ్య పరిచయం బాగా ఉన్నవాడని తెలుస్తుంది .ఛందస్సులో గొప్ప పాండిత్యం ఉన్నవాడుగా తోస్తుంది .అతనిలో గొప్ప కవిత్వం ఉందని  మహా కావ్య నిర్మాణం చేసే సమర్ధత ఉందని అనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు .కాని నిరర్ధక పాదపూరక ప్రయోగాలు ,అసందర్భ పదాలు కొన్ని వాడాడు .ఒక్కో చోట వ్యాకరణ మూల విషయాలనే వదిలేశాడు .సంప్రదాయ కవులు పాటించిన నియమాలను కాదని స్వేచ్చ తో కూడా రాశాడు .కొత్త పోలికలనూ చెప్పాడు .మేఘాలకు ఇళ్ళకూ పోలిక చూపాడుకాని అది ఆకర్షించ లేదు .ఇవన్నీ చూస్తె వత్స భట్టి  ,ఆనాటి సమాజం లో ఉన్న యదార్ద స్థితికే అద్దం పట్టాడని పిస్తుంది .

దీన్ని బట్టి చూస్తె 472 నాటికే గొప్ప ప్రశస్తమైన కావ్య సాహిత్యం ఉందని తెలుస్తోంది .ప్రశస్తిలోని పదవ పద్యం పునరావృత్తమైంది .కాళిదాసు మేఘ దూతం లోని 65 వ శ్లోకం ను భట్టి కవి వాడుకున్నాడని ,కాళిదాసులాగానే ఈతనికీ ‘’శుభగ ‘’పదం ఇస్టమని తెలుస్తుంది 11 వ పద్యం కూడా కూడా కాలిదాసుకు కాపీ యేననిపిస్తుంది .కాళిదాసు రఘు మహా రాజును  వర్ణించి నట్లే  వత్స భట్టి  రఘు వర్మను వర్ణించాడు .కనుక వత్సభట్టికి కాళిదాసమహాకవి కావ్య రచనలన్నీ పరిచయమే నని అనిపిస్తుంది .ప్రశస్తిలో కాళిదాస ఋతు సంహారం లోని అయిదవ సర్గ లోని రెండు మూడు శ్లోకాలను శబ్ద ప్రయోగం భావం లలో పూర్తిగా పోలి ఉన్నాయని ప్రొఫెసర్ కీల్హాన్ అన్నాడు కాని అది అసంబద్ధం అని ఈ గ్రంధ రచయిత క్రిష్ణమాచారియార్ అభిప్రాయ పడ్డారు .ఇవన్నీ గమనిస్తే కాళిదాసు క్రీ శ 472కు పూర్వం వాడే అని నిర్ధారణగా చెప్పవచ్చునంటారు ఆచార్య .

వత్స భట్టి రాసిన గ్రంధాలేవీ లభ్యం కాలేదు .మందశౌర  ప్రశస్తి అనేది మాత్రమె శిలాఫలక రూపం లో దొరికింది .ఇందులో అక్కడి సూర్య దేవాలయాన్ని  చేనేత పనివారు క్రీ.శ 437 లో నిర్మించిన వైనాన్ని వర్ణించాడు .మొదట శివుని గూర్చి ప్రార్ధన ఉంటుంది .తర్వాత మంద సౌర ప్రశస్తిని చెప్పాడు .సమకాలీన రాజు అయిదవ శతాబ్దానికి చెందిన  నరపతి వర్మ ను వర్ణించాడు .వత్సభట్టి కవిత్వం పై కాళిదాసమహాకవి ప్రభావం బాగా కనిపిస్తుంది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-15-ఉయ్యూరు

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.