

రైళ్లను కూల్చిన వర్షం…
- 06/08/2015
ఉగ్రవాదుల హత్యాకాండకు అలవాటు పడినట్టుగానే మన దేశ ప్రజలు రైలు ప్రమాదాలకు సైతం అలవాటు పడిపోయారు. గాయాలు మొద్దుబారిపోతున్నాయి. ప్రకృతి బీభత్సం ప్రాణాలను తీస్తోంది, మానవ నిర్లక్ష్యం ప్రాణలను బలిగొంటోంది. ప్రకృతి బీభత్సం మానవ నిర్లక్ష్యం పెనవేసుకున్నప్పుడు సంభవించే భయంకర పరిణామం మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పునరావృత్తమైంది. రెండు రైళ్లు ఒకేసారి ఒకేచోట కూలిపోవడం ఊహించని దుష్పరిణామం. ముంబయినుండి వారణాసికి వెడుతుండిన కామాయనీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పడిపోయిన కొద్ది నిముషాలలోనే జబల్‌పూర్‌నుండి ముంబయికి వెడుతుండిన జనతా ఎక్స్‌ప్రెస్ కూడా అదే ప్రదేశంలో ఇనుప దారి తప్పిపోవడం అధికార యంత్రాంగం వారి నిర్లక్ష్య ఫలితం! వర్ష బీభత్సం గురించి మేఘాలు బద్దలు కావడం గురించి మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం వారి నిర్లక్ష్యం గురించి నోరెత్తలేదు! ఎందుకని? ఆ రాష్ట్రంలోని హర్దా జిల్లాలో మంగళవారం రాత్రి అకాల మృత్యువు పైశాచిక నృత్య విన్యాసాలను ప్రదర్శించింది. అనుకోని చోట ఊహించని సమయంలో విరుచుకుని పడిన వర్ష బీభత్సం కారణంగా రెండు రైళ్లు పట్టాలు తప్పడం ఘోరమైన జాతీయ వైపరీత్యం! అకాలంలో అకస్మాత్తుగా బద్దలైన మేఘాలు అపూర్వ రీతిలో సృష్టించిన జల బీభత్సం స్థానిక ప్రజలను విస్మయంతో ముంచెత్తింది. ఈ విస్మయ విషాదం కొనసాగుతుండిన సమయంలో ఇనుపదారులు కుంగిపోవడం మరో దిగ్భ్రాంతికర పరిణామం! ఇనుపదారులు కుంగిపోయిన కారణంగా రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో పక్కకు వంగిపోయాయట, పట్టాలనుంచి పక్కకు ఎగిరి పడ్డాయట! కుండపోత వర్షం వరదలను సృష్టించి ప్రాణాలను బలిగొనడం నిరంతరం పునరావృత్తవౌతున్న ప్రాకృతిక విషాదం. అయితే వర్ష బీభత్సం రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణీకుల ప్రాణాలను బలిగొనడం మరింత భయంకర పరిణామం. పదుల సంఖ్యలో మృతులు…వందల సంఖ్యలో క్షతగాత్రులు!
వరదల కారణంగా పట్టాలు కొట్టుకొనిపోయాయి! కనీవినీ ఎరుగని రీతిలో హర్దాజిల్లాలో వర్షం కురిసిందట! ఇలాకురవడం మానవులు ఊహించని సంగతి కావచ్చు! కానీ ఇంత భారీ వర్ష బీభత్సం వల్ల ఎక్కడైనా ఒకచోట కాని అనేక చోట్ల కాని రైలు పట్టాలు కొట్టుకుని పోవచ్చునన్న అనుమానం రైల్వే యంత్రాంగం వారికి అంకురించకపోవడమే క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. రైళ్ల రాకపోకలకు ముందుగా స్టేషన్‌ల మధ్య ఇనుప దారులను తనిఖీ చేసే సిబ్బందికి కూడ మాచెక్ నదిపై వంతెన కుంగిపోయిందని కాని, పట్టాలు పక్కకు తొలగిపోవడం కాని కనిపించకపోవడం విడ్డూరం. వంతెన ఎప్పుడు కుంగిపోయింది? పట్టాలు ఎప్పుడు తొలగిపోయాయి? సిబ్బంది తనిఖీ చేయడం మానుకుని వర్షంలో తడవకుండా స్టేషన్లలోనే కూర్చుండిపోయారా? లేక సిబ్బంది తనిఖీ చేసిన సమయంలో మంచిగా కనిపించి వంతెన, సమీపంలోని ఇనుపదారి రైళ్లు రావడానికి నిముషాల ముందు అకస్మాత్తుగా కుంగిపోయాయా? కొట్టుకుని పోయాయా? లేక రైలు బరువును వేగాన్ని తట్టుకోలేక వంతెన ఒరిగిపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు! పట్టాలను తనిఖీ చేసే సిబ్బంది విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించి ఉండినప్పటికీ అది తాత్కాలిక వైపరీత్యం. వంతెన, దాని సమీపంలోని రైలు పట్టాలు భారీ వర్షాల వల్ల కుంగిపోయే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని గ్రహించి, గ్రహించినప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయించని ఉన్నత అధికారులది దీర్ఘకాల నిర్లక్ష్యం! ఈ దీర్ఘకాల నిర్లక్ష్యమే రెండు రైళ్లను పడగొట్టింది, అనేకమంది ప్రయాణీకులను మాచక్ నదీ జలాల పాలుచేసింది.
రైళ్లు పట్టాల తప్పడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మితిమీరిన వేగం కూడ ఒక కారణం. గంటల తరబడి ఆలస్యంగా నడిచిన తరువాత విలంబనాన్ని తగ్గించడానికై మితిమిరిన వేగంతో రైళ్లను పరిగెత్తించడం పరిపాటి అయింది. పట్టాలు మార్గం నుండి తొలగిపోవడం, వదులు కావడం కూడ ప్రమాదాలకు కారణం. ఇలా తొలగిపోవడానికి విద్రోహ కాండ అనేక సందర్భాలో దోహదం చేసింది సిగ్నల్స్ ఇవ్వడంలో జరిగిన పొరపాట్లు కూడ రైళ్లు పట్టాలు తప్పడానికి దారి తీసాయి. రెండురైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ-ఆటోమాటిక్ జామింగ్ గురించి ప్రచారవౌతోంది. ఇలా నిరోధక చర్యలు ఒకవైపు వ్యవస్థితవుతున్న కొద్దీ సమాంతరంగా ఊహించని విలయాలు విరచుకుని పడుతున్నాయి. రైలు వంతెన మీద పయనిస్తుండిన సమయంలో ఆ వంతెన కూలిపోవడం ఇలాంటి ఊహించని విలయం.. 2006 డిసెంబర్ రెండవ తేదీన బిహార్‌లోని భగల్‌పూర్ స్టేషన్ సమీపంలో ఇలా వంతెనలు కూలిపోయి పరిగెత్తుతుండిన రైలుబోగీలపై పడి ప్రయాణీకులను నుజ్జు నుజ్జు చేసింది. ఆ వంతెన అలా అకస్మాత్తుగా పడడం వల్ల ముప్పయి ఏడు మంది బలైపోయారు. ఆ వంతెనను కూల్చివేస్తుండిన కార్యక్రమంలో నిర్లక్ష్యం వల్ల ఆ ఘోరం జరిగిపోయింది. అది ఊహించని దుష్పరిణామం! ఎవరికీ అనుమానం కూడ రాలేదు. 2012 జులై 30వ తేదీన నెల్లూరు సమీపంలో వెడుతుండిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ముప్పయి మందికి పైగా మాడిమసైపోయారు. ఈ దగ్ధకాండ ప్రమాదవశాత్తు జరిగి ఉండినప్పటికీ, విద్రో హ చర్య అయినప్పటికీ అది పట్టాల పటిష్టతతో కాని, రైలు వేగంతో కాని ముడివడిన ప్రమాదం కాదు! అందువల్ల అలాంటి ప్రమాదాలు కూడ నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యం పరిధిలోకి రావు…మావోయిస్టులు తదితర నక్సలైట్ల వర్గాలు బీభత్స కృత్యాల కారణంగా కూడ రైళ్లు పడిపోయిన దుర్ఘటనలు జరిగాయి.గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో జిహాదీ బీభత్సకారులు రైలు పెట్టెలకు నిప్పు పెట్టి అనేకమందిని సజీవ దహనం చేసిన దుర్ఘటన, అలాంటి ఘటనలుకూడ పట్టాలతోను, వేగంతోను ముడివడిన ప్రమాదాలుకాదు! ఇలాంటివన్నీ రైల్వే సిబ్బంది ఊహించలేని విస్తృత నిఘా వైఫల్యానికి చెందిన ఘోరాలు! మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదాలు సైతం ఇలా సిబ్బంది నిర్లక్ష్యంతో సంబంధంలేని, ఊహకు అతీతమైన ప్రమాదాలన్న ప్రచారం జరుగుతోంది! కనీవినీ ఎరుగని కుండపోత వర్షం ముంచెత్తుతుందని రైలు సిబ్బంది ఊహించలేదు మరి! కానీ వర్ష బీభత్సానికి పట్టాలు కొట్టుకుని పోవడం ఎవరి నిర్లక్ష్యం? అంత భయంకరమైన జల విలయం సంభవించినపుడు రైళ్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా ఎందుకని రద్దు చేయలేదు?
జాతీయ రహదారుల విస్తరణ జరిగిన తరువాత అధునాతన హంగులు అమరిన తరువాత బస్సులు ఇతర రహదారి వాహనాల ప్రమాదాలు పెరిగిపోయాయి. ఓల్వో బస్సులు విదేశాలనుంచి వచ్చి పడిన తరువాత ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వేతర సంస్థల మితిమీరిన వేగం భయంకర దృశ్యాలను ఆవిష్కరించింది. ప్రపంచీకరణ శక్తులకు అక్రమ లాభాలు ప్రధానం ప్రజల ప్రాణాలు కాదు…రైలు పట్టాలను రైలు ఇంజన్లను ఈ ప్రపంచీకరణ శక్తులకు అప్పగించాలన్న కుతూహలగ్రస్తులు ఈ నేపధ్యాన్ని గుర్తించవలసిన అనివార్యం ఏర్పడింది! రైళ్ల భద్రత విదేశీయ సంస్థల అక్రమ ఆకాంక్షలు పరస్పరం విరుద్ధాంశాలు. పోయిన ప్రాణాలు తిరిగి రావు…
ఆంద్ర భూమి
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
