హంతకులతో చర్చలు -విఫల ప్రయోగాలు

సమాజహితుడు దభోల్కర్‌
‘నేను అందరికోసం పోరాడుతున్నాను, ఏ కొందరి మీదో కాదు, అదీ భారత రాజ్యాంగ చట్టాలతోనే. నా దేశంలో, నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, నాలోనే ఏదో దోషం ఉన్నట్లు కాగలదు’ అని అనేక హత్యాబెదిరింపులను ఎదుర్కొన్న నరేంద్ర దభోల్కర్‌ పోలీసుల భద్రతను తిరస్కరించారు. 2013 ఆగస్టు 20న హత్యకు గురైనారు. మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం, కపట స్వామీజీలు, నకిలీబాబాల వలన సామాన్య ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురౌతున్నారని, వాటిని నిర్మూలించాలనే లక్ష్యంతో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సమితి’ని దభోల్కర్‌ స్థాపించారు. దాని ద్వారా జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసారు.

1945 నవంబర్‌ 1న అచ్యుత్‌, తారాబాయి దంపతులకు పదవ సంతానంగా నరేంద్ర పుట్టారు. సతారా, సాంగ్లి పట్టణాలలో చదివారు. మిరాజ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసారు. పూణేలో వైద్య వృత్తి ప్రారంభించారు. మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని దభోలి గ్రామం జన్మస్థలం కావటం వల్ల దభోల్కర్‌ అయ్యారు. నరేంద్ర భార్య శైల కూడా డాక్టర్‌. వారి మొదటి సంతానం హమిద్‌. ప్రగతిశీల ముస్లిం, ప్రముఖ హేతువాది ‘హమిద్‌ దల్వాయి’పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారు. ముక్తా రెండవ సంతానం.

మహారాష్ట్ర అంటేనే ఎందరో సంఘ సంస్కర్తలు గుర్తుకొస్తారు. 19వ శతాబ్ది, మహారాష్ట్రలో సంస్కర్తల శతాబ్ది. మహా గోవిందరనడే, గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌(లోక్‌ హితవాది), గోపాల్‌ గణేష్‌ అగార్కర్‌, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పండిత రమాబాయి, సాహు మహారాజ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌… ఇలా ఎందరో మహానుభావులు ఆ శతాబ్దిలో పుట్టి, తమ శక్తి మేరకు సంస్కరణ మార్గంలో సాగినవారే. వారి కృషి ఫలితంగానే మహారాష్ట్ర ప్రజల జీవితాన అంతో ఇంతో సామాజిక ప్రగతి సాధ్యమయ్యింది. పీష్వాలు, దేశ్‌ముఖ్‌ల వంటి అగ్రవర్ణ భూస్వాముల సాంస్కృతిక పీడనల నుంచి వారికి విముక్తి లభించినట్లయ్యింది. భారత స్వాతంత్ర పోరాట కాలంలో కూడా సాంఘిక సంస్కర్తలు తమ పని తాము చేస్తూపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా సానేగురూజీ, బాబా అధవ్‌ లాంటివారు ఆ మార్గంలో వున్నారు. వారి ప్రభావం కూడా దభోల్కర్‌ను తట్టిలేపింది.

డాక్టర్‌ నరేంద్ర 1980 వరకు దాదాపు 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా వైద్యుడుగా పేరుపొందారు. దానితో సంతృప్తి చెందక సమాజంలో చేయవలసినది చాలా ఉందని భావించి, గ్రామాల్లో తిష్ట వేసిన కులతత్వాన్ని, దళితులపై కొనసాగుతున్న ఆకృత్యాలను తొలగించటానికి పూనుకున్నారు. ‘ఒక ఊరు – ఒక బావి’ ఉద్యమంలో ప్రవేశించారు. అగ్రకుల ఆధిపత్యం హక్కులను హరిస్తుందని గుర్తించారు.
విద్యార్ధులలో శాసీ్త్రయ అవగాహన పెంపొందించటానికై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అలాగే ‘విజ్ఞాన బోధ వాహిని’ పేరుతో ఒక సంచార పరిశోధనాశాలను మహారాష్ట్రమంతా తిప్పి సైన్సు ప్రయోగాలు చేసి చూపించారు. వీరు స్థాపించిన ‘మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలనా సమితి (కఅూఖి)’ అన్ని మతాలలో వున్న మూఢ ఆచారాలకు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసింది, చేస్తూనే ఉంది. నకిలీ బాబాలు, దొంగ స్వాములు తాంత్రికుల మోసాలను బయటపెడుతూ చేతబడి, జ్యోతిష్యం, వాస్తు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, ‘‘చేతబడి, మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం’’ ఒక దానిని రూపొందించి దాన్ని 2008లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టించారు. కానీ మతవాద శక్తుల ప్రాబల్యంతో ఆ బిల్లు మూలన పడింది. ఈ బిల్లు కేవలం మోసపూరిత, దోపిడీ చర్యల నిరోధానికి మాత్రమే అని వివరించినా ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దభోల్కర్‌ హత్యానంతరం, 2013, ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆర్డినెన్సు రూపంలో విడుదల చేసింది.
ఆనాటి బ్రూనో, కోపర్నికస్‌ల దగ్గర నుంచి ఈనాటి ప్రేమానంద్‌, నరేంద్ర దభోల్కర్‌ వరకు గమనిస్తే…. శాస్త్ర విజ్ఞానం, జనంలో చైతన్యం పెరుగుదలను జీర్ణించుకోలేని మతవాద శక్తుల కుట్ర కనిపిస్తుంది. మతవాదుల చర్యలు రాజ్యాంగ లక్ష్యమైన లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.
నరేంద్ర ఏ విలువల సాధన కోసం, ఏ కలల సాకారం కోసం ప్రాణత్యాగం చేసారో వాటిని సమాజంలో నెలకొల్పటం చాలా అవసరం. ఆ పనిని రాజకీయ పార్టీలు, చట్ట సభలు చేస్తాయని ప్రస్తుత పరిస్థితులలో ఆశించలేము. ఆయన ఉద్యమ ఆచరణ, కార్య దీక్ష దేశంలోని అభ్యుదయ వాదులకు, ప్రగతిశీలురందరికీ ప్రేరణ కావాలి.
– వి.వి. ప్రసాద రావు
జన విజ్ఞాన వేదిక
(రేపు నరేంద్ర దభోల్కర్‌ ద్వితీయ వర్ధంతి)

 
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.