రాష్ట్ర విభజన జరిగి 15 మాసాలు అవుతున్నా రాజకీయాలలోనే కాకుండా కింది స్థాయిలో కూడా విద్వేషాలు కొనసాగుతున్నాయా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజు కోకపోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సీమాంధ్రులు సుముఖత చూపకపోవడమే కారణమని ఈ మధ్యనే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు పూర్వం సెంట్రల్ ఆంధ్ర నుంచి ప్రతి నెలా 30 నుంచి 40 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టేవారనీ, ఇప్పుడు ఒక్క పైసా కూడా రావడం లేదని ఆయన వాపోయారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఒక ఉత్పత్తుల సంస్థ అధిపతి మాట్లాడుతూ, మా ఉత్పత్తులకు ఏపీలో కూడా పంపిణీదారులు ఉన్నారు. అయితే విభజన తర్వాత వారు వాణిజ్య పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి సంబంధిత కార్యాలయాలకు వెళ్లినప్పుడు ‘‘మీరు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు డీలర్‌షిప్ ఎందుకు తీసుకున్నారు? ఇతర రాష్ర్టాలలో అవే ఉత్పత్తులు ఉంటాయి కదా! వాటి డీలర్‌షిప్పులు తీసుకోవచ్చు కదా! తెలంగాణ ఉత్పత్తులకు డీలర్స్‌గా ఉంటే ఏదో ఒక మిషతో మీకు ఇబ్బందులు కలిగిస్తాం’’ అని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కూడా ఇటువంటి సమస్యే ఎదురవుతోంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలు ఏపీకి వెళ్లినప్పుడు అక్కడి రవాణా శాఖ అధికారులు కేసులు పెట్టి చలాన్లు వేస్తున్నారు. ఏపీలో రిజిస్టర్ అయిన వాహనాలకు తెలంగాణలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విద్వేష ధోరణి ప్రజలలో కంటే ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో ఏపీ- తెలంగాణ ఉద్యోగుల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ ధోరణి వల్ల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా వారు ఇవన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుందాం. ఈ రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టే స్థోమత తెలంగాణవారికి అంతగా లేదు. హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాదివారికి సొంత ఇల్లు అనేది చివరి ప్రాధాన్యం. డబ్బుంటే వారు వ్యాపారాలలోనే పెట్టుబడి పెడతారు. తమ పిల్లల పేరిటే కాకుండా వారికి పుట్టబోయే వారి కోసం కూడా ఇళ్ల స్థలాలు, ఫ్లాట్‌లు కొని పెట్టుకునే సంస్కృతి సీమాంధ్ర ప్రజలకే సొంతం. దీంతో ఇప్పటివరకు వారు తమ ఆదాయాన్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతూ వచ్చారు. విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అనేక ఇబ్బం దులు పడుతున్నారు. ఇదివరకే చేపట్టిన ప్రాజెక్టులు అమ్ముడు కాకపోవడం వల్ల వాటిని పూర్తిచేయడం కోసం అప్పులు చేస్తూ పోతున్నారు. ఈ రంగంలోని పెద్ద కంపెనీలు పరిస్థితిని తట్టుకోగలుగుతున్నాయి గానీ, చిన్న చిన్న కంపెనీలకు చెందినవారు మాత్రం చిక్కుల్లో పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగడం అవసరమా? ఇండియా-పాకిస్థాన్ తరహాలో ఏపీ-తెలంగాణ ప్రజలు పరస్పర ద్వేషం పెంచుకోవడం అవసరమా? అందరం తెలుగువారమే అని నోటి చివరి నుంచి వస్తున్న మాటలు మనస్సులోంచి ఎందుకు రావడం లేదు? తమిళులు, కన్నడిగులను, చివరకు ఉత్తరాదివారిని కూడా సహిస్తున్న మనం సాటి తెలుగువారిని ఎందుకు సహించలేకపోతున్నాం? ఎవరికి ఇష్టమైనా, కాకపోయినా 58 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వాళ్లమే కదా! విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పినవారైనా ముందుకు రావచ్చు కదా! విద్వేషాల వల్ల రాజకీయ నాయకులకు పబ్బం గడుస్తుండవచ్చు గానీ, వ్యాపారాలు చేసుకునేవారు నలిగిపోతున్నారు.

సీఎంలతో ఆరంభం..
ఈ పరిస్థితి మారాలంటే, రెండు తెలుగు రాష్ర్టాల మధ్య, ప్రజల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య తొలుత సయోధ్య ఏర్పడాలి. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్కరకు రాని సెంటిమెంట్ల వల్ల అధికారంలో ఉన్నవారికి లాభం కలుగుతూ ఉండవచ్చు గానీ, అది తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి ఉపయోగపడదు. తెలుగు రాష్ర్టాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాల వల్ల మనం ఇతరుల దృష్టిలో చులకన అవుతున్నాం. పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ-ఏపీల్లో పెట్టుబడుల కోసం జరుగుతున్న పోరాటం, ఆరాటం హాస్యాస్పదంగా ఉందని ఒక పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోటీ పెట్టి లాభపడటానికి మా వాళ్లు ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అలా లేదు. తెలంగాణలో పెట్టుబడులు రాకుండా ఉంటే మంచిదని ఆంధ్రా వాళ్లు, ఏపీలో పెట్టుబడులు రాకుండా ఉంటే బాగుండునని తెలంగాణ వాళ్లు భావించే దుస్థితి ఏమిటి? ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావు మధ్య మొదలైన ఓటుకు నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ యుద్ధం వల్ల జాతీయ స్థాయిలో మనం నవ్వుల పాలవుతున్నాం. ఈ రెండు కేసులలో డ్రైవర్లు, గన్‌మన్లకు సంబంధిత దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఈ ప్రహసనంవల్ల ఇరువురు ముఖ్యమంత్రులూ పలుచన అవుతున్నారు. ఈ రెండు కేసులనూ కొనసాగించదలచుకుంటే వాటి మంచి చెడులను దర్యాప్తు సంస్థలకు వదిలివేయాలి. అలాకాకుండా ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టుగా ఇరు ప్రభుత్వాలూ వ్యవహరిస్తున్నాయి. మూడు నెలలుగా ఇదే గొడవ. దీంతో అసలు సమస్యలు మరుగునపడిపోతున్నాయి.
రెండు రాష్ర్టాలూ కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు రెండు రాష్ర్టాల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తూ వచ్చిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులు నీళ్లు లేక బావురు మంటున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులలో నీటి లభ్యత ఇకపై ప్రశ్నార్థకం కాబోతోంది. లేని, రాని నీటి కోసం కొట్లాడుకుంటున్న తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ దుస్థితికి కారణాలపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. కృష్ణా నదిపై ఇటు కర్ణాటకలో, గోదావరి నదిపై అటు మహారాష్ట్రలో అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టులను పొందింది కూడా మన తెలుగు వారే! ఆ రాష్ర్టాలలో ఏమి జరుగుతున్నదో మన కాంట్రాక్టర్లను అడిగితే పూసగుచ్చినట్టు చెబుతారు. తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగిం చబోతున్న ఈ అంశాన్ని పట్టించుకోకుండా గిల్లి కజ్జాలతో కాలక్షేపం చేయడం వల్ల తెలుగు జాతికి అపకారం చేసినట్టు కాదా! లేని నీళ్ల కోసం మనం కొట్లాడుకోవడం ఏమిటి? రావ లసిన నీళ్లను రాకుండా అడ్డుకుంటున్న వారిని నిలువ రించకపోవడం ఏమిటి? మీడియా పుణ్యమా అని కర్ణాటకలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం గురించి తెలిసివచ్చింది. ఆలమట్టి డ్యామ్ నిర్మాణాన్ని అయిదు మీటర్ల ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అదే జరిగితే కృష్ణా జలాలపై మనం ఆశలు వదులుకోవలసిందే! గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి నిలువరించగలిగారు. అప్పుడు కర్ణాటకకు చెందిన దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు నేతృత్వంలో ముఖ్య మంత్రుల కమిటీని వేయించి, కర్ణాటక ప్రయత్నాలను ఆపగలి గారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరగాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో కలిసి రావాలి. ఇరువురు ముఖ్య మంత్రులు ముందుగా ఒకచోట కూర్చుని పరిస్థితిని సమీ క్షించాలి. కృష్ణా, గోదావరి జలాల్లో మనకు రావలసిన వాటా పొందడంపై సంయుక్త కార్యాచరణకు వ్యూహ రచన చేయాలి. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాగా లభించే 900 పైచిలుకు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులకు రూప కల్పన చేయాలని కేసీఆర్ తరచుగా అధికారులను ఆదేశిసు ్తన్నారు. నీరు ఉంటే కదా ప్రాజెక్టుల రూపకల్పన చేయడానికి! శ్రీశైలం నుంచి 300 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలుగా ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి అక్కడ నీళ్లు ఉండొద్దా? కర్ణాటకలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే పుష్కరానికి ఒక్కసారి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండే అవకాశం లేదేమో! వర్షాభావ పరిస్థితులలో కూడా ఏపీని అదుకోవడానికి గోదావరి జలాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏపీకి సాగు, తాగు నీటి సమస్య దాదాపుగా తీరినట్టే! తెలంగాణ పరిస్థితి అందుకు విరుద్ధం. ఎగువన ఉన్నప్పటికీ గోదావరి జలాలను ఒక పరిమితికి మించి వినియోగించుకోలేని భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురిసే వర్షాల వల్ల వచ్చే నీరంతా భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆశయం మంచిదే కానీ నీళ్లు ఉండాలి కదా! పుష్కర స్నానం చేయడానికే గోదావరిలో నీళ్లు లేక కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలాల్సిన పరిస్థితి చూశాం. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జలాశయం అడుగంటడంతో ఇప్పుడు అక్కడ పశువులు మేత కోసం తిరుగుతున్నాయి. ఈ కఠోర సత్యాలను విస్మరించి రాజకీయ గారడీలు చేసుకుంటూ పోవడం వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతుంది.
సీన్ మారుతోంది!
ఈ పరిస్థితులలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటం అత్యంత అవసరం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు భాగస్వామిగా ఉన్నారు. కృష్ణా నదిపై కర్ణాటక చేపడుతున్న నిర్మాణాలను అదుపు చేయడానికి ఆయన పలుకుబడిని మరోమారు ఉపయోగించుకోవాలి. ఇరువురు ముఖ్యమంత్రులూ రాజకీయాలు పక్కనపెట్టి ఒక్కతాటి పైకి వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. భారీ వరదలు వస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీరు వచ్చే దుస్థితిని పోగొట్టడానికి పాటుపడాలి. ఎగువన ఉన్నవాళ్లు తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకున్నాకే దిగువకు వదిలే విధానం పోవాలి. అందుబాటులో ఉన్న నీటిని దామాషా పద్ధతిలో పంచుకునే విధానం రావాలి. నాగార్జున సాగర్ ఎండిపోయి కనిపిస్తుండగా, ఆలమట్టి రిజర్వాయర్ నిండు కుండలా ఉంది. ఈ పరిస్థితులలో అందుబాటులో ఉన్న నీటిని కూడా పంచుకునే విధానం అమలులోకి రావాలి. కృష్ణా జలాలపై ఆలస్యంగా మేలుకొన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది తెలంగాణ సమస్య మాత్రమే కాదు కనుక ఏపీ ప్రభుత్వం కూడా జత కలవాలి. ఉభయ రాష్ర్టాల ప్రభుత్వాలూ సుప్రీంకోర్టులో ఒకటే వాదన వినిపించేలా కృషి జరగాలి. ముందుగా మనకు రావలసిన వాటాను ఎంతో కొంత సాధించుకోగలిగితే, ఆ తర్వాత ఆ నీళ్లను పంచుకోవడం ఎలా అన్న దానిపై రెండు తెలుగు రాష్ర్టాలూ కొట్టుకున్నా అర్థం ఉంటుంది గానీ లేని, రాని నీళ్ల కోసం గొడవ పడుతూ మైదానాన్ని ఎగువ రాష్ర్టాలకు అప్పగించడం అవివేకం అవుతుంది. ఉభయ రాష్ర్టాలూ ఇలాగే చీటికి మాటికి సిల్లీ విషయాలలో గొడవ పడుతూ ఉంటే పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మన పరిస్థితి మారుతుంది. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచననలో మార్పు వచ్చినట్టుగా కనిపి స్తోంది. హైదరాబాద్‌లో ఉంటూ రోజు గొడవపడే బదులు విజయవాడ నుంచి పరిపాలన సాగించాలని ఆయన నిర్ణయిం చుకున్నారు. ఒక్క ఆదివారం మాత్రమే కుటుంబ సభ్యులతో గడపడానికి హైదరాబాద్ వచ్చి మిగతా ఆరు రోజులు విజయవాడకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని ఆయన రెండు వారాలుగా అమలు చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వెళ్లిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఇరిటేషన్ తగ్గవచ్చు. ‘‘మా గడ్డ మీద ఉంటూ, మా నీళ్లు తాగుతూ మీ పంచాయితీ ఏమిటి?’’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వంటి వారి వ్యాఖ్యలు చంద్రబాబుపై పనిచేసినట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కూడా ఆ రాష్ట్ర తెలుగుదేశం నాయకులకే వదిలివేయాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చా రని చెబుతున్నారు. పాలనాప రమైన విషయాలలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదపడే బదులు సామరస్యంగా వ్యవహరిం చాలన్న అభిప్రాయానికి కూడా చంద్రబాబు వచ్చా రని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే శుభ పరిణామమే. అవును.. ప్రభుత్వాలు వేరు- రాజకీయ పార్టీలు వేరు. తెలంగాణలో టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా తలపడవచ్చు గానీ ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలు తలపడటం ఎందుకు? అయితే ఇద్దరు చంద్రులూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడు కోవడానికి ఇరువురిలో అహం అడ్డువస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఇరువురూ ముఖ్య మంత్రులే కనుక ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మధ్యవర్తులు కావాలి. మామూ లుగా అయితే ఇటువంటి పరిస్థితులలో గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకోవాలి. కానీ ఆయనపై ఇరువురు ముఖ్య మంత్రులకు నమ్మకం ఉన్నట్టు లేదు. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్‌ను త్వరలో తొలగించ వచ్చునని కేంద్రం నుంచి సమాచారం అందుతోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ పార్టీలకు చెందిన వారికి తలా ఒక గవర్నర్ పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం కోటా కింద మోత్కుపల్లి నరసింహులు పేరును తెలుగుదేశం పార్టీ సిఫారసు చేయబోతోంది. బహుశా మరో నెల రోజుల్లో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చు. నరసింహన్ స్థానంలో కొత్తగా వచ్చే గవర్నర్ ఎవరో తెలియదు కనుక ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య మధ్యవర్తిత్వం నెరిపే బాధ్యతను తీసుకోవడానికి కొంతమంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ముం దుకు వస్తున్నారు. ఈ విషయమై ఇరువురు ముఖ్యమంత్రుల వద్ద ప్రతిపాదనలు ఉంచారు. ప్రస్తుతానికి ఇరువురూ ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు చెబుతున్నారు. సమరం కంటే సయోధ్య ఎప్పటికైనా మేలు అన్న సంగతి మన ముఖ్య మంత్రులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెంటిమెంట్ ప్రయోగానికి స్వస్తి చెప్పడం మంచిది. ఏదైనా అతిగా ప్రయో గిస్తే వికటిస్తుంది. తెలంగాణలో కూడా పరిస్థితులు మారుతు న్నాయి. ప్రజల్లో అసహనం మొదలవుతోంది. ప్రతిదానికీ ఏపీని బూచిగా చూపించి ఎంతో కాలం తప్పించుకోలేమన్న నిజాన్ని కేసీఆర్ అండ్ కో గ్రహించాలి. ముఖ్యమంత్రి మాటలకే పరిమితం అవుతున్నారనీ, ఆచరణలో ఏమీ జరగడం లేదనీ ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడకు వెళితే అక్కడ బంగారం చేస్తాననడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. ఆయన అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. తెలంగాణ రాష్ట్రం బలం- బలహీనతలు ఆయనకు ఇప్పటికే అవగతమై ఉండాలి. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా ఇంత వరకు అమలు కాలేదు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలనీ, ఆత్మహత్యలు ఉండకూడదనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బంగారు తెలంగాణ- వజ్రాల తెలంగాణ వంటి మాటలు ప్రజలకు త్వరలోనే బోరు కొట్టిస్తాయి. ఏపీలో కూడా పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్ర బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సింగపూర్, ఇస్తాంబుల్ వంటి నగరాలను నిర్మించకపోయినా సౌకర్య వంతమైన రాజధానిని నిర్మిస్తే చాలునని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు.
విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఇంకెంతో కాలం చెప్పుకోలేరు. అన్యాయం జరిగింది కనుకే చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. 15 నెలల తర్వాత కూడా పాత పాటే పాడటం వల్ల ప్రయోజనం ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు వైఖరి మారిందని చెబుతున్నారు కనుక, కేసీఆర్‌తో సయోధ్య కుదుర్చుకునే విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటే ఇరు రాష్ర్టాల ప్రజలూ హర్షిస్తారు. కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబుకు అనుభవం ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్నేహ హస్తం చాస్తే ఆయన గౌరవం మరింత ఇనుమడిస్తుంది. ఉభయ రాష్ర్టాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అవసరాల ప్రాతిపదికన నీళ్ల వంటి విషయాల్లో పరిష్కా రాలు వెతుక్కోవచ్చు. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు దాయాదుల పోరుగా ముదరక ముందే పరస్పరం స్నేహ హస్తాన్ని అందించుకోవడం ద్వారా తెలుగు జాతి మరింత నష్టపోకుండా విజ్ఞత ప్రదర్శించాలని ఇరువురు చంద్రులనూ కోరుకుందాం. సంధి కుదర్చడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా స్వాగతించవలసిందిగా విజ్ఞప్తి చేద్దాం. ఉభయ రాష్ర్టాలూ పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. లేని పక్షంలో ప్రారంభంలో చెప్పినట్టుగా మన వ్యాపారవేత్తలు, మన పారిశ్రామికవేత్తలు, మన ప్రజలే నష్టపోతారు!
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం: http://www.youtube.com/abntelugutv