ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101
43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్ -3(చివరిభాగం )
చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్ కాలేజీ పేపర్ నే బ్లాక్ బోర్డ్ గా చేసి దాన్ని వ్యక్త పరచింది .1912ఏప్రిల్ లో ‘’ది వేల్సియన్ ‘’పత్రికలో ‘’20వ శతాబ్దపు అతి గొప్ప సంఘటన ‘’అని రాసింది .నెపోలియన్ వాటర్లూ తర్వాత ప్రపంచం లో అతి ముఖ్యమైనది చారిత్రాత్మకసంఘటన చైనా విప్లవం . 400మిలియన్ల ప్రజలు జీవితం ,స్వేచ్చ ,సంతోషాలను దారుణంగా తిరస్కరించిన సుదీర్ఘ రాజరికం నుండి విముక్తి పొందారు .క్రూర దోపిడీ దారులైన వంశ పాలకుల కబంధ హస్తాలనుండి బయట పడ్డారు .అతి సంపన్నమైన చైనా దేశాన్ని అతి బీదరికం లోకి నెట్టేసిన దారుణ పాలన చెరనుండి విముక్తులయ్యారు .’’మంచు’’ ప్రభుత్వం అంటే వినాశనం ,రాజ్య బహిష్కరణ ,అనాగరిక పాలన . నెపోలియన్ ‘’చైనా కదిలితే ప్రపంచాన్ని కదిలిస్తుంది ‘’అన్నాడు .ప్రపంచ జనాభాలో నాలుగవ వంతున్న చైనా దేశం మానవ జాతి అభ్యుదయానికి దారి చూపాల్సి వచ్చింది .
ఇవన్నీ చింగ్ లింగ భావనలే అయినా అవి అపరిపక్వమైనవి .12-2-1912న సామ్రాజ్య వాద శాసనం చక్రవర్తి ని త్యజించి ,ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది .వెంటనే చైనా రిపబ్లిక్ పిత ,చైనా మొదటి అధ్యక్షుడి గా రాజీనామా చేశాడు .మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసినా చీఫ్ మేజిస్ట్రేట్ గా ఉండే శక్తి సామర్ధ్యాలు తనకున్నాయా అని సందేహించాడు .ముందు దేశం లోని ఇబ్బందికర పరిస్తితులను చక్క బరచాలి .తనకేమో పరి పాలన లో అనుభవం లేదు .లోపాలు ,అసంతృప్తులను తొలగించాలి .మొత్తం అధికారం తన చేతిలో లేదు .ఈ పరిస్థితులలో ప్రజా హృదయం తెలిసినవాడు అందరినీ సమైక్య పరచే వాడు ప్రెసిడెంట్ గా ఉండటం అవసరం .అందుకని తన వారసునిగ ఉదారవాద నాయకుడు, చింగ్ ప్రభుత్వాన్ని అనేక సంస్కరణల కోసం ఒప్పించిన’’ యువాన్ షై కై’’ ని ఎంపిక చేశాడు .తన పదవిని వీడుతూ సన్యట్ సేన్ ‘’ఉత్తర ,దక్షిణ ప్రాంతాలు చక్ర వర్తి పదివీ త్యాగం వలన ఏకీ కృతమైనాయి .యువాన్ రిపబ్లిక్ ను సమర్దిస్తానని వాగ్దానం చేశాడు .రాజ్యంగా వ్యవహారాలలో ఆయనకు అనుభవం ఉంది ,ఆయనకుప్రజాస్వామ్యానికి పూర్తీ విధేయుడని,ఈ పాలనా బాధ్యతలు ఆయనకోసమే ఎదురు చూస్తున్నాయి ‘’అని వీడ్కోలు ప్రసంగం చేశాడు .
కొద్ది కాలం లోనే సన్యట్ సేన్ పొరపాటు చేశానని గ్రహించాడు .యువాన్ ప్రజాస్వామ్యవాది కాదు నియంత అని తేలిపోయింది . ట్రాన్స్ పోర్ట్ అండ్ ట్రేడ్ కు సన్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు .ప్రజాపార్టీ అని పిలువబడే ‘’కౌమిటాంగ్ పార్టీ ‘’వ్యవస్థాపకుడైన సన్యట్ సేన్ ,ప్రాపగా౦డాకు ,సన్నాహానికి అంకితమై పని చేశాడు .అధికారాన్ని అదనుగా తీసుకొని యువాన్ రాజకీయం ఆడి,దారుణంగా ప్రవర్తించాడు .విప్లవానికి ముందే అతను అధికార పగ్గాలు పట్టుకోవ టానికి పధకాలు అమలు చేసుకొన్నాడు ‘’సన్యట్ సేన్ అండ్ చైనీస్ రిపబ్లిక్ ‘’అని పాల్ లించార్జర్ రాసిన పుస్తకం లో యువాన్ ను ,అవకాశ వాద విద్రోహి హంతకుడు ,దారుణ రాక్షసుడు ,ప్రజాస్వామ్య ఘాతకుడు అయిన వాడిగా ‘’చైనీస్ జూడాస్ ‘’అని పిలిచాడు .యువాన్ వేసిన పధకం లో భాగమే సన్ ప్రెసిడెంట్ గా పదవీ త్యాగం అన్నాడు ఆయన .’’చైనా దెశభక్తుల ఎరుపు రక్త ప్రవాహాన్ని మరింత ఎరుపెక్కింఛి పారించిన ‘’యెర్ర’’ వాడు యువాన్ ‘’అంటాడు .వీరిద్దరి మధ్య ఉన్న విభేదం చైనాకు శాపమే అయింది .
ఇబ్బందులు వేగం గా దూసుకోచ్చాయి .ఒక్క ఏడాదిలోనే యువాన్ తో విడిపోయాడు సన్.చైనా ఉత్తర ,దక్షిణాలుగా చీలిపోయింది .తను గద్దెపై కూర్చోపెట్టిన వాడితోనే తలపడాల్సి వచ్చింది .ఇప్పటికే యువాన్ కు సుశిక్షిత అతి పెద్ద సైన్య విభాగ౦ చేతిలో ఉంది .నాంకింగ్ వద్ద జరిగిన యుద్ధం లో సన్యట్ సేన్ కు మళ్ళీ ప్రవాసం తప్పలేదు .1915డిసెంబర్ లో జపాన్ లో ఉన్నాడు .అప్పుడు యువాన్ తనను చక్ర వర్తిగా ప్రకటించుకొన్నాడు .ప్రాంతాలు ఎదురు తిరిగాయి .అనుచరులు చాలామంది అతన్ని వదిలిపెట్టారు .దీనితో దారుణ మారణ కాండ చెలరేగింది నిర్దాక్షిణ్యంగా అతి అమానుషంగా యువాన్ ప్రవర్తించాడు .బందిపోట్లు,దుర్మార్గుల రావణ కాండ పెరిగిపోయింది .ముఠాలు ,కక్షలు కార్పణ్యాలు పెచ్చు పెరిగాయి .దేశమంతా అట్టుడికి పోతోంది .ఆరునెలల ఈ దానవ దారుణ పాలనా తర్వాత యువాన్ చచ్చాడు .సన్యట్ సేన్ చైనా తిరిగి వచ్చాడు .తానూ వదిలి వెళ్ళిన కార్యక్రమాలను కొన సాగించాలనుకొన్నాడు కాని పరిస్థితులు అనుకూలంగా లేవు .దేశమంతా అనేక వర్గాలుగా విడిపోయింది .కొత్త అనాగరక సైన్య ముఠాలు ఏర్పడి ,అదుపులోకి తీసుకోక ముందే అదృశ్యమైనాయి .ప్రతి పల్లె గల్లీ రాజ కీయ నాయకుడూ జాతీయ నాయకుడనిపోజులిస్తున్నాడు .చట్ట న్యాయాలఉల్లంఘన ,దోపిడీ పెరిగిపోయి ప్రజా బాధ ఎవరికి విన్న విచుకోవాలో తెలియని విచిత్ర వింత నికృష్ట పరిస్తితి ఏర్పడింది .
చిన్నతనం నుంచే చింగ్ లింగ్ సూంగ్ సన్యట్ సేన్ అంటే మోజు పడింది .ఆమె ఆమె అక్క చెల్లెళ్ళు సేన్ ను బిజీ ,గ్రేషియస్ అంకుల్ –దయా అందమున్న బిజీ అంకుల్ అనేవారు .జార్జియాలో ఉన్నప్పుడు ఆమె చైనా విప్లవ విజయం గురించి రాసింది .ఇప్పుడు సేన్ ను అధికంగా ప్రేమించింది .ఇప్పుడామెకు 20,సేన్ కు 50వయసు .ఆమె కుటుంబం విస్మయం చెంది తిరస్కరించింది .వయసులో ఉన్న తేడాల వల్లకాదు .అప్పటికే సన్ కు వివాహమవటం ,సేన్,చింగ్ లింగ్లిద్దరూ క్రిస్తియన్లు కావటం కారణం .రెండవ భార్యగా ఈమెను పొందటానికి రెండు వైపులా కుటుంబ పెద్దలు ఒప్పుకోవాలి అనేది సంప్రదాయం .అమెరికాలో చదివిన లింగ్ తలిదండ్రులకు మెల్లగా చెప్పింది,బ్రతిమాలింది , ఒత్తిడి చేసింది, బెదిరించింది .అన్నీ ప్రయత్నాలు విఫలమై ఇంటినుంచి పారిపోయి సన్యాట్ సేన్ ను పెళ్ళాడేసింది . .
1920లో సేన్ కాంటన్ లో పని మొదలుపెట్టాడు .దక్షిణ చైనాలో పరిస్థితులు అనుకూలంగా ప్రశాంతం గా ఉన్నాయి .యుద్ధ వీరుడు చెన్ చుయాన్ మింగ్ ,అందరూ ద్వేషించే క్వాన్గ్సి ముఠాను ఓడించాడు .ఈయన సన్ కు స్నేహితుడైనదువల్ల సేన్ మళ్ళీ నిలదొక్కుకోవటానికి వీలైంది .మళ్ళీ సేన్ ను ప్రెసిడెంట్ గా ప్రశంసించి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు కాని అది ఒక్క దక్షిణ చైనాకే పరిమితమైంది .చెన్ను ఉత్తర ప్రాంతం లో కూడా దూసుకు పోయే ప్రయత్నం చేయమన్నాడు .దీనివల్ల సివిల్ వార్ ల వలన దెబ్బ తిన్న ఐకమత్యం మళ్ళీ పునరుద్ధరించటానికి సాధ్యమౌతుందని చెప్పాడు .ఈ విషయమై సందేహించి ముందుకు వెళ్ళటానికి తిరస్కరించాడు .దీనితో మనసు గాయమై తానె ఒక సైన్యాన్ని చేర్పాటు చేసి ఉత్తరం వైపు కదిలాడు సేన్..ధన లోపం వలన తీవ్ర ప్రచారం చేయలేక తిరిగొచ్చాడు చెన్ ను పదవి నుండి తొలగించాడు .అహం దెబ్బతిని సేన్ కు వ్యతిరేకి అయి ఎదురు దాడి చేశాడు .చెన్ సైన్యం చేయిదాటిపోయి,అదుపు తప్పి , ,సేన్ హెడ్ క్వార్టర్ పై దాడి చేశాయి . సన్యట్ సేన్ను పారి పోయేట్లు చేశారు..భార్య చింగ్ లింగ్ ముసలి పల్లెటూరి ఆవిడ వేషం లో తప్పించుకోన్నది .
యుద్ధం ముఠాలు దేశాన్ని బలహీన పరుస్తున్నాయి .అందర్నీ కలప టానికి సేన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రష్యా విప్లవాన్నీ ,దాని వలన జరిగిన దేశాభి వృద్ధిని గమనించాడు .రష్యా విధానం చైనాకు పనికిరాదన్నాడు కారణం ‘’అక్కడ కమ్యూనిజం కాని ,సోవియేటిజం కాని విజయవంతంగా స్థాపించటానికి తగిన పరిస్థితులు లేవు .’’అన్నాడు సేన్.చియాంగ్ కై షేక్ రష్యామిలిటరీ సలహాదారులనుండి సహాయం ,సూచనలు తీసుకోవచ్చునని కమ్యూనిస్ట్ విధానం లో కౌమిటాంగ్ ను పునర్నిర్మించ వచ్చని అనుకొన్నాడు .పరిస్థితులు తీవ్ర రూపం దాల్చటంతో,తన స్థానాన్ని పదిల పరచుకోవటానికి హిం సామార్గం ,మూక హత్యలు తప్పని సరైనాయి .విద్యార్ధులు ,వర్కర్లు దీన్ని ఆమోదించినా రాజకీయ నాయకుల నుండి భూస్వాములనుండి ,మిగిలిన కన్జర్వేటివ్ లనుండి మద్దతు లభించలేదు ,
చైనా రెండు ప్రాంతాల్లో ఎన్నో ఆట౦కాలేర్పడ్డాయి .ఉత్తరాన ,పెకింగ్ ,యాన్గ్ ఛీ లోయ లోనూ యుద్ధాలు జరుగుతున్నాయి .చియాంగ్ కై షేక్ సహాయంతో సేన్ స్వయంగా సంఘర్షణ కి దిగాడు .ఫ్రెంచ్ ఒడంబడికలేర్పడ్డాయి ,విచ్చిన్నమైనాయి .కొత్త ఒడంబడికలు ,వెన్నుపోట్లు అరుగుతూనే ఉన్నాయి .తీవ్ర పరిస్తితులలో శత్రువులు మిత్రులు అందరు కలిసి సన్యట్ సేన్ నే ప్రజా నాయకత్వం వహించమని కోరారు .ఇది అవాస్తవమైనదని తెలుసుకొన్నాడు .కాని అంగీకరించక తప్పలేదు .పెకింగ్ కు బయల్దేరి వెళ్లేముందు అనారోగ్యం తో ఉన్నాడు .
తనకు ఇన్ఫ్లుఎంజా వచ్చిందని ,లివర్ జబ్బు దీనికి కారణమని గ్రహించాడు .1925లో పెకింగ్ చేరే సరికి విపరీతమైన జ్వరం ,వచ్చి పల్స్ బీట్ 120ఉంది .కేన్సర్ అని అనుమానించారు .నెలాఖరికి పల్స్ బీట్ ఇంకా పెరిగిపోయి గుండె తట్టుకోలేని స్థితి వచ్చింది .చివరికి ఆపరేషన్ తప్పని సరైతే,అప్పటికే కేన్సర్ చాలా ముదిరి పోయిందని తేలింది .బాధ తగ్గించ టానికి అల్ట్రా వయొలెట్ కిరణ చికిత్స ,నిద్రమాత్రలు వాడారు .కాని ఆశ కనిపించలేదు .ఊపిరి పీల్చటం కష్టమై పోతున్నా నోటినుండి ‘’స్వేచ్చ ,ఐక్యత ‘’అనే పదాలు పదే పదే వచ్చేవి ఆ స్వాతాంత్ర్య ప్రియుడి నోటినుండి.డాక్టర్ వెల్లింగ్ టన్ క్లూ హాస్పిటల్ లో చేర్చారు .అక్కడే 12-3-1925న సన్యట్ సేన్ మరణించాడు .
సేన్ ప్రారంభించిన విముక్తి ఉద్యమం ఆయన తో ఆగి పోలేదు .అనేక సివిల్ వార్ ల తర్వాత 1946లో చియాంగ్ కై షేక్ ఆధ్వర్యం లో జాతీయ ప్రభుత్వమేర్పడింది .ఇదీ ఎక్కువ కాలం లేదు .ప్రభుత్వ గౌరవం క్రమగా పతనమై పోయింది .అంతర్యుద్ధాలు అవినీతి అశాంతి పెరిగి ,ఇంతకంటే ఏ ప్రభుత్వమొచ్చినా బాగుండుననిపించింది .1949లో జాతీయ ప్రభుత్వం కూలిపోయి అక్టోబర్ లో మావ్ సే టుంగ్ చైర్మన్ గా ‘’కొత్త కమ్యూనిస్ట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’’ అవతరించింది .ఏడాది తర్వాత చియాంగ్ కై షేక్ ,అతని సైన్యం కొన్ని దీవుల మీద మాత్రమె అధికారాన్ని కలిగి ,ఫార్మోజా ను ప్రధాన కార్యాలయం చేసుకొన్నారు .అమెరికా సాహాయం తో ముఖ్య భూభాగాన్ని ఆక్రమించుకొనే ఉద్దేశ్యం లోచైనా కమ్యూనిజాన్ని నీరు కార్చేశారు .చివరికి ఏమౌతుందో తెలియదుకాని ఇదంతా చైనా రిపబ్లిక్ పిత సన్యట్ సేన్ మొదటి చివరి కల .
చైనా జాతి పిత గా సన్యట్ సేన్ ను ఆరాధిస్తారు చైనాలోనూ ,తైవాన్ లోను .చైనా విప్లవ వీరులలో సేన్ అగ్రగామి .ఆయన పేరుమీద అనేక వీధులు విద్యసంస్తలున్నాయి .ఆయనకు నివాళి గా చైనీస్ కల్చరల్ రినైసేన్స్ ను ఆయన జన్మదినం నవంబర్ 12న ఏర్పాటు చేశారు .అమెరికాలోని న్యూయార్క్ లోఉన్న సెయింట్ జాన్ యూని వర్సిటీలో సన్యట్ సేన్ మెమోరియల్ హాల్ ను ఆయన గౌరవార్ధం నిర్మించారు .ఆయన శత జయంతిని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో చైనా యువత ఘనంగా నిర్వహించారు .ఆయన జీవితంపై సినిమాలు నాటకాలు ఒపెరాలు .టివి షోలు వచ్చాయి .ఆయన పేరిట ప్రత్యెక స్టాంప్ లను విడుదల చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-16-ఉయ్యూరు

