నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )
96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937)
వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో 62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు –
‘’నిర్బీజాది సమాధి స౦ స్థితపాదం నీవార శూకోపమం –నిష్పాపం నిగమాంత వేద్య నిలయం నిర్లేపకం నిర్గుణం
నిర్ద్వంద్వం నిరుపద్రవాత్మక పదంనిర్వాణ దీపం నిజం –బ్రహ్మానంద సరస్వతీ గురు పదం మోక్షప్రదాం భజే ‘’
రెండవ రచన –‘’శ్రీ దత్త పూజా గీత కదంబం ‘’లో దత్తాత్రేయ స్వామి పూజా విధానాన్నిపాటలతో శ్లోకాలతో వివరించింది ..వివిధ రాగాలతో తాళాలతో అందులో 42 గేయాలున్నాయి .మధ్యమావతి రాగం జంప తాళం లో రచన –
‘’లాలీతి జగురమర లాలనాస్త్వాం దత్తా-నారదస్త్వేకదాశ్రీ బ్రహ్మ సదసి –లోహ చణా౦కాభ్యూష పాక పరిశీలా –అత్రిజాయపతి వ్రతేతి ప్రససం’’
1926లో ‘’శ్రీ శంకర భగవత్పాదాచార్య పూజా విధి ‘’రచించింది .ఇందులో షోడషోపచార పూజా విధానం ఉన్నది .చివరికి శంకరాచార్య పై అస్టోత్తరం రాసింది .ధ్యాన శ్లోకం –
‘’భాష్యం వామకరే నిధాయ పరతిస్చిన్ముద్రయా బోధితం –ప్రాక్కుండీవరదండ శిష్య సహితం పద్మాసనస్తం ప్రభుం –ఫాలె భస్మధరం సుధాకర నిభం రుద్రాక్ష హారాన్ గలే-శ్రీమచ్చంకర పూజ్య పాదమనిశం ధ్యాయామ్యహం సద్గురుం ‘’
ఇవి కాక అనేక దేవీ దేవతలపై స్తోత్రాలు రాసింది. ‘మహా గ్రహ గాయత్రి ‘’పై పుష్పమాలికా బంధం ‘’రాసింది –
హంసస్తాం సత్య సందామ గజగ నిగమ దారతాస్వరస్తాం-గాయత్రీం యజ్నయజ్నాం సురనర వరదాం పంకజం కంబు కంఠీ౦
సావిత్రీం విశ్వ విద్యాం శ్రుతిమతి గతిదాం దేవా సౌవర్ణ వర్నాం—వందేహం దేవ దేవీం విమల మణి మయీం కుంద సౌందర్య దంతం ‘’హనుమాయమ్మ బంధ కవిత్వంలోనూ నిష్ణాతురాలని ఈ శ్లోకం తెలియ జేస్తోంది .
97-పిల్లల మర్రి వేంకటపతి సూరి
‘’రాజేశ్వరవిలాస మహాకావ్యం’’ రాసిన పిల్లల మర్రి వేంకటపతి సూరి నాగ లింగ సోమయాజి కుమారుడు .కౌశిక గోత్రం .దీనిని భాగాపురం అంటే హైదరాబాద్ వాసులు బ్రాహ్మణ దంపతులైన గౌతమ గోత్రీకులు లక్ష్మీనారాయణ నాగమాంబ లకుమార్తే మహా రాజ్ఞి రాజేశ్వర భూపతికి అంకితమిచ్చినది .మహా కావ్యమనే పేరేకాని ఇది అలంకార శాస్త్రం .అందులో 12పత్రాలేఆచార్య బిరుద రాజు వారికి లభించాయి .అవికూడా వరుసలో లేవు ..దొరికిన దానిలో వంశ ప్రకరణం అలంకార ప్రకరణం న్యాయ ప్రకరణం ఉన్నాయి .మొదటి అధ్యాయం లో మొదటి అంకం అన్నాడు ఇది నాటకానికి వర్తించేది .కద విషయానికి వస్తే
సాకేత రాజసోదరులు నిజాముల్- ముల్క్ చేత ఓడింప బడ్డారు .రాజ సోదరుల పౌరుష పరాక్రమాలను బాగా వర్ణించాడు కవి –
‘’సూరాస్సాహసికా స్త్రయసమానాధిక ప్రావీణ్య వంతో ధను –ర్విద్యాయాం రాజ వాజీ రాజిస్త సంపత్తి ప్రశేనాశాతాః
సాకేత నగరే వినోదాన కదాలాపోర్నిశా యాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయన్యధ్యాదితేయద్రుమాః’’
తరువాత యువరాజు రాజేశ్వరుని అతని భార్యను వర్ణించాడు .అలంకార ప్రకరణం లో ఉపమాలంకారం తో ప్రారంభించాడు .సంబందాతిశయోక్తి వర్ణన చేశాడు .చివరిది న్యాయ ప్రకరణం
హైదరాబాద్ భాగ్యనగరంగా లేక భాగ నగరం గా ఉన్నప్పటి రచన ఇది .ఈ వంశపు మొదటి రాజు నిజాముల్ ముల్క్ .
98-చెన్న మాధవుని వెంకట రామ రాజు (1840-1910)
యల్లమ రాజు అని పిలువ బడే వెంకట రామ రాజు భరద్వాజ గోత్రానికి చెందిన పెరుమాళ్ళురాజు కొడుకు .1840లో వరంగల్ జిల్లా బచ్చన్నపేట లో పుట్టి 1910లో మరణించాడు క్రిష్ణభక్తుడు కనుక ఆఊరిలో గొప్ప కృష్ణాలయం నిర్మించాడు .ఆలయం లోని పల్లకీ వంటివి నిజాం రాజు కానుకగా అందించాడు .రాజు మంచి గుర్రపు రౌతు .కత్తి బల్లెం ఉపయోగించటం లో గొప్ప లాఘవం ఉన్నవాడు .సైన్యాధికారి నుంచి కత్తి లాక్కొని చేతిలోని బల్లెం ఆధారంగా పోల్ వాల్ట్ లాగా కోట లోకి దూకాడని కధలు గాధలు చెప్పుకొంటారు .’’సూర్య నారాయనియము అంటే చంపు ‘’రాశాడు తెలుగులో కేశవ శతకం చేశాడు .-కొన్ని మచ్చుకి –
‘’శ్రీరామః ప్రదిశోచ్చమం స భవతాం హంస స్తుతో ద్వాధ్వాశాః –సత్యానంద కరస్సుర గవరడో గోరాజ సంసేవితః
కృష్ణోననంత మనోజ్ఞా భోగ రుచిరా సాద్ధర్మ భ్రుద్విగ్రహః –భానీరేజ పదస్తితౌ బుధ గురు స్సంస్తుత్య దామాధవః ‘’
దేవతా స్తుతి –
‘’విద్యాప్రదం సురజ్జేస్త పూజితాంఘ్రి పయోరుహం –ప్రత్యూహద్వా౦త సప్తశ్వాం నమామి హయ కంధరం ‘’
కదా ప్రారంభ శ్లోకం –‘’పరేరయోధ్యా మధురాచ మానవే రస్తి ప్రపూర్నా వాసు సన్చయయాఐర్యుతా –సుహస్తి జాతేతిపురీ మహోజ్జ్వలా భాసాల దుర్గేశ్చ విరాజితా భువీ ‘’
99-వీటూరి వెంకట రామ శాస్త్రి (20శతాబ్దం )
భారద్వాజ గోత్రీకులు పద్మాంబ ,నాగేశ్వర శాస్త్రి ల కుమారుడు రామ శాస్త్రి .శ్రీకాకుళం జిల్లా యలమంచిలి తాలూకా కోరుప్రోలు వాసి .20వ శాతాబ్దప్రారంభం వాడు .వేదశాస్త్ర పండితుడు. తెలుగు సంస్కృతాలలో కవిత్వం చెప్పాడు .ఉర్లాం వేద పరీక్షలలో ఎన్నో బహుమతులు ,సత్కారాలు పొందాడు .జ్యోతిష శాస్త్ర౦ లోనూ దిట్ట .సంస్కృతం లో ‘’హరి స్తోత్రం ‘’రాశాడు .హైమవతీపరిణయమూ రాశాడంటారు కాని అలభ్యం .-
‘’శ్రస్తా కైశ్యాదివ జలధర్రాత్తస్తతో నేత్ర యుగ్మం –మాటసా ద్వంద్వ త్తవను చ దశాత్మ ధారా సా విరేజుః
100-చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి
రెడ్డి శాస్త్రిగా పేరున్న చెరుకూరి వెంకట రెడ్డి శాస్త్రి వేంకటకవి వెంకాంబ ల పుత్రుడు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు ,అల్లుడు .గురువుగారితో మంత్రం శాస్త్ర వ్యాకరణాలలో సమాన పాండిత్యం ఉన్నవాడు .శాస్త్రిగారమ్మాయి విశాలమ్మను వివాహమాడి అల్లుడయ్యాడు రెడ్డి శాస్త్రి .ఇక్కడ రెడ్డి అనేది గౌరవ వాచకం ..
రెడ్డి శాస్త్రి సంస్కృతం లో ‘’గీతా గిరీశం ‘’ను గీత గోవిందం మాదిరి రాశాడు .ఉమామహేశ్వరుల ప్రణయ లీలా వృత్తాంతమే ఇది .దీన్నీ శిష్యుడు జయంతి కామేశం ముద్రించాడు .-కొన్ని శ్లోకాలు –
‘’ఇక్షు గ్రామ కులాగ్రయ వెంకట కవేః పుత్రః పవిత్రః కృతీ –వెంకమామ్బోదర శుక్తి మౌక్తిక మణిరశ్రీ వెంకటార్యస్సుదీః
చక్రే గీత గిరీశ కావ్య మధునా యో గీత గోవింద కృత్ –ప్రాగాస్సీజ్జయదేవ ఇత్యాభిదాయా లీలాం శివస్యోజ్వలాం ‘’
చివరి శ్లోకం –
మణి కాచవత్ప్రసిద్దో జయ దేవ గ్రంధ మత్కృత గ్రందో –మద్గ్రందోదార్య స్సయాదాదునికై రర్ధ గౌరవా భావాత్ ‘’
ఇదికాక ‘’శైవ శతకం ,నవగ్రహాస్టకం’’లతోబాటు కొన్ని చాటువులు కూడా రాశాడు .-రుచికి కొన్నిచాటువులు – ,
‘’మానస గోపాలేశం భజనా క్ర్యశ్రయోపి గోపాలేశం –యస్మిన్ గోపాలేశం ప్రాపర్షి గణ శి స్శ్రాయో పిగోపాలేశం ‘’
రవయోరి శైల పవయే తమోపహ చ్చవయేరూపాయ కవయే నమోస్తుతే –న వయేత్ సర్వ శివాయేన సంయుత ద్రువయోడితాత్మ భవ యేశ శోభయా ‘’
పంచ దశి స్త్రోత్రం లో రెడ్డి శాస్త్రి మామగారి శ్లోకానికి పూరణ చేశాడు –సరదాగా మామా అల్లుళ్ళ సవాల్ చూద్ద్దాం –
మామ సర్వమంగళశాస్త్రి –‘’సవిదా ద్దితయ సమత్వం రంభాయుగలస్య సంభావత్యేవ –ఊర్ధ్వా ముదన్చిత మూలం తద్యుగలం చేహ్వ ర్హీనాం ‘’
దీనికి అల్లుడు రెడ్డి శాస్త్రి గారి పూరణ – అంబ తవోరుద్వి తయ౦ రంభాయుగమేవ జఘన పులినో త్ధం-వేణీ యమునా వేగా దధరీకృత మపి చ సంహ తచ్చదనం ‘’.
తులసిగురించి చెప్పిన శ్లోకం –
‘’తులసి చత్వరే భాతి కలశీకృత తమ౦టపే –కు లసీమంతి నీదత్త జలశీకర వర్దితా ‘’
సమకాలీన కవి గొర్తి సాంబ మూర్తి పార్దివలింగం తో శివార్చన చేసినప్పుడు మామా అల్లుళ్ళు కలిసి చెప్పిన శ్లోకం –
‘’శ్రీ గొర్తి సాంబ మూర్తేః కోర్తిః కార్తిక యుడు స్ఫురన్మూర్తిః –నర్తి తమార్తిక మూర్తే సార్తహరాల్లబ్ద కామ సంపూర్తేః’’.
101-శతావధాని వరుకూరు వెంకట శాస్త్రి (19-20శతాబ్దం )
పూర్వపు నిజాం పాలనలో గుల్బర్గా జిల్లాలో సూరాపురం లో జన్మించి బేదార్లు అనబడే తెలుగు నాయక రాజుల కాలం లో 19శతాబ్ది చివరనుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించాడు వరుకూరు వెంకట శాస్త్రి .కవి సార్వ భౌమ బిరుదాంకితుడు. తెలంగాణా ప్రభువుల ప్రాపకం లో వృద్ధి చెందాడు .అనేక శతావధానాలు చేసి శతావధాని అయ్యాడు ..సంస్కృతం లో ‘’పాండవాశ్వమేద చంపు ‘’రాశాడు .శరత్ ఋతు వర్ణన-
‘’శారదారంభ విలోల శుభ్ర జల దవ్రాతా౦త రేషు స్ఫురత్ –హరి నీల ప్రతిమాన సూక్ష్మ జలముకపంజాః పరం జజ్జలుః
కల శంభో నిదివార్ధితేషువిపులేషూర్మి వ్రజేషు స్థితా –రమణీయా ఇవ వారిజాసన గురోశ్యామా అభి వ్యక్తితః ‘’
102-శత జిత్ కవి (1770)
వెంకట పండితుని కొడుకు ,వీరరాఘవుని మనవడు శత జిత్ కవి .భరద్వాజ గోత్రం గూటాల కు చెందిన సామసాఖ వాడు. గోదావరి జిల్లా పట్టి సీమ లో ఉన్నాడు .’’శృంగార సంజీవన భాణం’’రాశాడు .దీనిని ఏలూరు సంతాన గోపాల స్వామి చైత్రోత్సవాలలో ప్రదర్శించేవారు .నూజివీడుప్రభువు మేకా వెంకట నృసింహ అప్పారావు ఆస్థాన కవి .దీన్ని 24-7-1797న రాశాడు .కనుక కాలం 1770అవచ్చు .ప్రారంభ శ్లోకం –
‘’యద్వక్ష రసజ్నదారాణాం యన్నాభిః సూతికాగృహం –పుత్రజ్ఞయా భవాత్కి౦జిత్తేజోస్తు చ సతాం ముదే’’
ఉపోద్ఘాతం లో పూర్వీకుల చరిత్ర చెప్పుకొన్నాడు .కవిపూర్వీకులు తమిళులని ,గోదావరిజిల్లాకు వలస వెళ్ళారని గూటాలలోగూటం లాగా పాతుకు పోయారని ,తండ్రి తమిళుడు ,తల్లి ఆంద్ర అని ,తెలుగు సంస్కృతాలలో పాండిత్యం ఉన్నదని ,కనుక తనకు తమిళం రాలేదని చెప్పాడు .కవి వారసులు ఇప్పటికీ గూటాలలో ఉన్నారు ..
నాలుగవ గీర్వాణ౦ సర్వం సంపూర్ణం
మనవి –గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 వ భాగం దీనితో సంపూర్తి .దీనికి ఆధారం ముందే చెప్పినట్లు కీ శే ఆచార్య బిరుదరాజు రామ రాజు గారు ఇంగ్లీష్ లో రచించిన ‘’కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టుసాంస్క్రిట్ లిటరేచర్ ‘’అని మరొక్క మారు మనవి చేస్తున్నాను .అందులో ఇంకా రాయాల్సిన కవులు కొందరు మిగిలిపోయినా ఈ 102మందితో ఆపేస్తున్నాను .ఇందులో కవి రచనలు అన్నీ రాజు గారు యధాతధంగా నాగర లిపి లోనే రాశారు ..నాకున్న సంస్కృత పరిజ్ఞానం అత్యల్పమైనది .కొంతలోకొంత హిందీ వచ్చుకనుక ,మా తండ్రిగారు మృత్యుంజయ శాస్త్రిగారు మాకు సెలవులలో కుమారసంభవ శాకు౦తలాలు సంత చెప్పారు కనుక ఏదో మిడి మిడి జ్ఞానం తో ఆ సంస్కృతాన్ని అర్ధం చేసుకొని కూడబలుక్కుని చదివి ,తనువూ మనసు ఏకం చేసి అతి ప్రయాసపడి తెలుగు లిపి లో రాశాను .నికి పూర్తి న్యాయం చేశానని నేను అనుకోను .నా అవగాహనా లోపం కొండంత ఉండవచ్చు .కాని నా పూనిక స్వచ్చమైనది కనుక లాగించేశా .ఇందులో దోషాలన్నీ నావి గుణాలన్నీ ఆచార్య బిరుదరాజు వారివి అని మరొక్కమారు వినయంగా తెలియ జేస్తున్నాను .ఈ పుస్తకాన్ని నాకు సద్గురు శివానందమూర్తిగారి కుమారులు శ్రీ బసవరాజు గారి నుండి తెప్పించి అందజేసిన నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ఋణం తీర్చుకోలేనిది .వారికి కృతజ్ఞతా శతం .
మొదటి గీర్వాణం లో -146 మంది కవుల గురించి రాసి ,ఈ మన్మధ ఉగాదికి ముద్రించి శ్రీ మైనేనిగారికి అంకితమిచ్చి ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిందే .శ్రీ మాడభూషి క్రిష్ణమాచారియార్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’ను కొని నాకు పంపించి చదివి౦పజేశారు మైనేని వారు .దీని ఆధారం గా రెండవ గీర్వాణం అంతర్జాలం లో రాయటం ప్రారంభించి 254మంది సంస్కృత కవులపై రాయగలిగాను .అంటే రెండుభాగాలలోని మొత్తం కవులు 400అయ్యారు .అవధాన సరస్వతి ,ఆత్మీయులు శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ‘’సంస్తూయం ‘’పంపారు .దీనిలో స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల కవులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ ఉంది .దీన్ని ఆధారంగా చేసిమూడవ గీర్వాణంమొదలు పెట్టి 118మంది గీర్వాణ కవుల గురించి రాసి సంఖ్యను 518కి చేర్చాను .నాలుగవ గీర్వాణం లో 102మంది సంస్కృత కవుల గురించి రాశానని ఇంతకూ ముందే పై పేరాలో తేలియ జేశాను .అంటే దీనితో సంఖ్య ‘’620 ‘’అయిందన్నమాట .ఇందులో కొందరు కవులు పునరావృత్తం గా వచ్చారు .వారి వివరాలు అప్పుడు వారి జీవిత చరిత్రలు అసంపూర్తిగా లభించికాని ,లేక నేను రాస్తున్నహదావిడిలో రిపిటీషన్ పట్టించుకోక కాని జరిగి ఉండచ్చు .అందుకని వారిని సుమారు 20మంది గా లెక్కించి తీసేసినా నికరంగా 600మంది కవులపై రాసిన అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను. నిజంగా ఇదొక బృహద్ద్గ్రంధం గా వెలువడాల్సిన అవసరం ఉంది .పుస్తకరూపం గా వస్తుందనే ఆశతో రాసింది కాదని మనవి. నా సంతృప్తి కోసమే రాసింది .వీరి గురించి రాయాలికనుక రాసినవి .అంతే.
అంకితం –మొదటి భాగాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి వారికి తెలియ కుండా ఆన్ లైన్ గా అ౦కితమిచ్చాను .ఇప్పుడు కూడా ఈ మూడు గీర్వాణాలలోని474మంది గీర్వాణ కవుల గీర్వాణాన్ని మళ్ళీ వారికి తెలియకుండా వారి అనుమతి కోరకుండా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికే మనః పూర్వకంగా ఆన్ లైన్ గా అంకితమిస్తూ ,నా ఈ సాహసాన్ని మన్నించే విశాల హృదయం వారికి ఉందని భావిస్తూ ,వారికంటే అర్హులు లేరని పూర్తిగా నమ్ముతూ ,వారి అంగీకారాన్ని అర్ధిస్తున్నాను .వారి సౌజన్యం మహా దొడ్డది .అంతటి వారు నాకు మహా మిత్రులైనందుకు అది నా అదృష్టంగా భావిస్తాను .
రెండవ గీర్వాణ౦ తర్వాత పరిచయమైన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం మరువ రానిది .ఎందరో మహా కవుల గురించిన వివరాలు, వారి జీవిత చరిత్రలు ,వారి ఉద్గ్రంధాలు నాకు పంపి చదవ జేసినఆత్మీయులు .ఎందరో కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో మాట్లాడే అవకాశం కల్పించి ,వారి దర్శన భాగ్యమూ కలిగించిన సహ్రుదయులుశ్రీ శాస్త్రిగారు .’’ప్రసాద్ గారూ !మేమెవరం చేయలేని గొప్ప సాహసాన్ని చేసి ఇంతమంది కవుల గురించి రాస్తూ ,అందరికి అందుబాటుగా చేస్తూ చరితార్ధత సాధించారు .మిమ్మల్ని చూస్తే మాకు గర్వంగా ఉంది ‘’అని ప్రోత్సహించిన వారి సౌజన్యం మరువ రానిది .
మరో మనవి – ఈ మధ్య డా .రామడుగు వెంకటేశ్వర శర్మగారితో ఫోన్ లో మాట్లాడి గీర్వాణంఅభ్యుదయాన్ని వారి చెవిన వేసినపుడు మహా సంతోషించి ‘’అయ్యా దుర్గాప్రసాద్ గారూ !గీర్వాణం రెండవ భాగం ఎప్పుడు ముద్రిస్తారు ?’’అని ఆసక్తి కనబరచారు .అది అంత తేలికైన పని కాదని వినయంగా చెప్పాను .అయినా నా మనసులో ఒక భావన ఉంది .ఈ 474మందిలో పూర్తి జీవిత చరిత్ర ఉండి,వారి రచనలపై సమగ్ర విశ్లేషణ ఉన్న వారిని ,అటు పూర్వకవుల నుండి ఇటు ఆధునిక కవుల నుండి ఎంపిక చేసి అన్ని రచనా ప్రక్రియలు అందులో ఉండేట్లు చూసి ఒక 200మంది’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2’(’రెండవ భాగం) గా తెస్తే బాగుంటుంది అని .దీనికి ముందుకు వచ్చేవితరణ శీరులైన సహృదయ ప్రాయోజకులు (స్పాన్సర్స్) ఎవరైనా ఉంటె తెలియ జేయమని సరసభారతి సహృదయ ఆహ్వానం పలుకుతోంది .
ఇప్పటిదాకా నన్నూ ,సరసభారతిని ఆదరించి ప్రోత్సహించి న సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను .-
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-16-ఉయ్యూరు

