ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102
44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు
‘’మానవుడు ఎగరటం అసాధ్యమే కాదు ,తర్క విరుద్ధమైనది ‘’అని ‘’మనిషి ఎగరాలంటే కొత్త లోహాన్నిలేక ప్రకృతిలో కొత్త శక్తిని కనిపెట్టాలి ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పాడు ప్రముఖ ఖగోళవేత్త ప్రొఫెసర్ సైమన్ న్యు కాంబ్ .ఒక వేళ అలాంటి యంత్రాన్నికనిపెట్టినా ,అది కూలి నడిపే పైలట్ ను తప్పక చంపేస్తుంది,స్పీడ్ తగ్గించి నా ,దిగేటప్పుడు చచ్చిన శవం లా నేల కూలుతుంది అని ఆయన అభిప్రాయం .ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తూ ఆయన 1903లో రాసి ప్రచురించాడు .ఇదే సమయం లో రైట్ సోదరులు కిట్టీ హాక్ లో విమానం తయారు చేసి గాలిలోఎగిరెట్లు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం ,అతత్కాన్ని తర్క హేతుబద్ధం చేసి చూపించారు .ఒక పావు శతాబ్దం లో గతకాలపు జాగ్రఫీ కి చెందిన భావనలన్నీ విప్లవాత్మకం గా మారిపోయి రవాణా లో విమానయుగపు కొత్త శకం ఆవిర్భ వించింది .దీనికి 500సంవత్సరాలకు పూర్వం ప్రఖ్యాత చిత్రకారుడు సైంటిస్ట్ ,మేధావి లియొనార్డో డావిన్సి తాత్కాలిక౦గా ఎగిరే యంత్రాన్ని డిజైన్ చేశాడు .ఆ తర్వాత రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టటానికి వందేళ్ళ ముందు మనుషులు బెలూన్ల సహాయం తో గాలిలోకి ఎగరటం నేర్చారు .గాలికంటే తేలికైన యంత్రాన్ని కనిపెట్టినా దాన్ని నియంత్రించలేక పోయారు .చరిత్రలో మొట్ట మొదటి సారిగా రైట్ సోదరులు గాలికంటే చాలా బరువైన సుస్థిరమైన ,నియంత్రణలో ఉండే గాలి యంత్రాన్నితయారు చేసి ఎగిరారు .
1932లో కేట్టిహాక్ లో ఏర్పాటు చేసిన స్మ్రుతి చిహ్నం పై విమానానికి కారకులైన వారి గురించికాక ‘’భయం లేని స్పష్టమైన ,అజేయమైన విశ్వాసం ‘’అని రాశారు ఈ విమానం తో ప్రసిద్దులయ్యేదాకా వారుమధ్యతరగతి పౌరులని ,వ్యాపార వేత్తలని ,వారికి వైమానిక శాస్త్రం హాబీ అని అని మాత్రమె అందరికి తెలుసు .వీరి తండ్రి మిల్టన్ రైట్ ఇండియానాలో లాగ్ కేబిన్ లో పుట్టాడు .యునైటెడ్ బ్రదర్న్ ఇన్ క్రైస్ట్ కు బిషప్ అయ్యాడు .అయిదుగురు సంతానం లో సోదరులకు ఇద్దరు పెద్దన్నయ్యలు ,రూక్లిన్ ,లోరిన్ ,ఒక సోదరి కేధరిన్ఉన్నారు .విల్బర్ రైట్ 16-4-1867న ఇండియానా లోని మేల్విల్లీ లో పుట్టాడు .చిన్నవాడు ఆర్విల్లీ రైట్ 19-8-1871న ఒహాయో లోని డేటన్ లో పుట్టాడు .ఇదే తర్వాత వీరి కుటుంబ ఆవాసం అయింది . ఇక్కడే సోదరుల అన్యోన్యత సుస్థిరమై అజేయమై నిలిచింది .వారి క్లాస్ రూమ్ అస్థిరం గా ఉండేది .14ఏళ్ళ వయసులోనే విల్బర్ స్కూల్ వదిలేశాడు .ఆర్విల్లీ పైక్లాస్ చదివాడుకాని డిప్లొమా పొందేదాకా లేడు.ఇద్దరికీ కాలేజి చదువు యావే లేదు .ఎడిసన్ ,ఫోర్డ్ లలాగా వీరికీ పెద్దగా విద్య,శిక్షణా లేవు.పని చేస్తూ నేర్చుకోవటం వీరి కలవాటైనది .
తండ్రి క్రిస్టియన్ మినిస్టర్ అయినా కుర్రాళ్ళ చేష్టలను నిరుత్సాహ పరచలేదు .ఆరేళ్ళప్పుడే ఆర్విల్లీ ఇంకో కుర్రాడితోకలిసి పాత ఎముకలను ఏరి ,ఎరువుల ఫాక్టరీకి అమ్మి డబ్బు సంపాదించాడు .11వ ఏట తోటి ఆటగాళ్లకు గాలిపటాలు తయారు చేసి అమ్మి డబ్బు పోగేశాడు .పనికి రాని లోహపు ముక్కల్ని ఏరి ,జంక్ డీలర్ కు అమ్మి సొమ్ము చేసుకొనేవాడు .చర్చ్ ప్రచురణ కాగితాలను మడతలు పెట్టి సాయం చేసేవాడు .నాలుగేళ్ల పెద్దవాడైన ఆల్బర్ ఆర్విల్లీ తోకలిసి సృజనాత్మక పనులు చేసేవాడు మొట్టమొదటిసారిగా ఇద్దరూకలిసి బాల్ బేరింగ్ లకోసం చెక్క సాధనం (వుడేన్ లేత్)తయారు చేశాడు .12వ ఏట ఆర్విల్లీ ప్రింటింగ్ పై అభిరుచి చూపిస్తే ,విల్బర్ ప్రెస్ తయారు చేయటం లో సాయం చేశాడు .18వ ఏట నే పబ్లిషర్ అవతారమెత్తాలని అర్విల్లీ నిర్ణయించుకొని ‘’వెస్ట్ సైడ్ న్యూస్ ‘’ను ప్రారంభించి పడమటి తీరం లోని ప్రజల వ్యారస్తుల ప్రయోజనాలకోసమే ప్రచురిస్తున్నానని ప్రకటించాడు.ప్రజల ,నైతిక బౌద్ధిక ,ఆర్ధిక అభి వృద్ధిలపై తన పత్రిక ద్రుష్టి సారిస్తుందని హామీ ఇచ్చాడు .దీనిలో మొదట రాసిన వాడు ఎలివేటర్ బాయ్ అయిన ఒక నీగ్రో పాల్ లారెన్స్ డన్బార్ .ఇతను తర్వాత ‘’లిరిక్స్ ఆఫ్ లౌలీ లైఫ్ ‘’తో ప్రసిద్ధి చెందాడు .కొన్నేళ్లలో రైట్ సోదరులు’’ దిమిడ్జేట్,దిఈవెనింగ్ ఐటెం ,స్నాప్ షాట్స్ ‘’అనే చిన్న వార పత్రికలు తెచ్చారు .నీగ్రోలకోసం దన్బార్ఎడిటర్ గా ప్రారంభించిన ‘’ది టాట్లేర్’’ను ముద్రించారు .భాగస్వామ్యం ,అనుభవం తో ఇది బాగా ఆభి వృద్ధి చెందింది .ఒకరికొకరు అర్ధం చేసుకొంటూ చేయి చేయి కలిపి సోదరులు ముందుకు పోతున్నారు .ఎవరి సాయం లేకుండానే దూసుకుకు పోతున్నారు .ఇద్దరికీ పెళ్లి సంగతే పట్టలేదు .వారిజీవితాలలో తాత్కాలిక ప్రేమ వ్యవహారాలూ లేనేలేవు .ఇద్దరు పరస్పరం సహకరించుకొంటూ గొప్ప ముందడుగే వేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-16-ఉయ్యూరు

