భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2
దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్తం లో వర్ణించాడు మహర్షి భరద్వాజుడు .
‘’త్వంగ దుత్తు౦గ రంగ ద్వరాంగోద్ధతా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం
చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦ ననర్త స్వయం భవానీ పతిః’’
శివుని శిరసుపై ఉత్తుంగ మందాకినీ నదీ తరంగాలు నాట్యానికి అంగంగా ,తాండవం లో శివుడు తల ఎగురవేసినపుడు ,ఆ గంగా నదీ బిందువులు ఆకాశం లో వ్యాపించి నక్షత్రాల ఆకారాన్ని పొందేట్లుగా శివుడు నాట్యం చేశాడు .
ఇప్పుడు అవే కల్ప వృక్ష పుష్పాక్రుతి ధరించినట్లు కవి అదేవృత్తం లో వివరించాడు
‘’దేవ ముక్తాగతం కల్ప పుష్పజం –ద్రాక్సవర్ణం సమాలింగితు మ్మంత కాత్
ఉత్పపత్యాదరా ద్గాంగ బిందూత్కరే –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతే ‘’
భవనీపతి శివుడు నర్తిస్తుంటే దేవతలు కల్ప వృక్ష మాలను శివునిపై విసిరారు .అది కిందకు వస్తుంటే తమతో సమాన రంగు కలిగి ఉన్నదన్న సంతోషాదరాలతో శివ జటాజూటం లో ఉన్న గంగ బిందు సముదాయం పైకి ఎగిరి ఆహ్వానం పలికినట్లు వాటితో కలిసి అదే పుష్పాల ఆకృతి దాల్చినట్లు నట్లు శివుడు నాట్యమాడాడు .దేవతలే అంతఘనకార్యం చేస్తే ప్రక్కనున్న అమ్మవారు ఊరు కొంటు౦దా?ఆమె నీలోత్పలమాల వంటి తన చూపులమాలను ఆయన వక్షస్థలం లో వేసిందట –ఆ వైనం తిలకిద్దాం –
‘’అచ్ఛ వక్షః స్థలా లంబి నీలోత్పలం –స్రక్షు ద్రుక్షూ త్పలాక్ష్యా మహీ భ్రుద్భువా
అర్పితా స్వేవ మానంద్య వ్రుత్తోత్సవే –సం ననర్త శ్రీ భవానీ పతిః’’
స్వచ్చమైన శివ వక్షస్థలం పై నల్లకలువ మాలలైన కంటి చూపులతో పార్వతి అభినందన పూర్వకంగాఅర్పించేట్లు చూడగా రెట్టించిన సంతోషం తో శివుడు గొప్పగా నర్తించాడు .ప్రదోష కాలం లో శివుడు చేస్తున్న ఈ తాండవం ఆయన తెల్లటి వక్షస్థలం పై అర్ధాంగి పార్వతీదేవి అభినందన పూర్వకం గా చూసిన చూపులు నీలోత్పల మాలలుగా అర్పి౦పబడి భాసించాయి అని భావం .
ఈ శివ తాండవాన్ని చూసి ధన్యులు కావాలని సకల దేవాతలూ అక్కడికి వచ్చేశారు .ఎవరికి వచ్చిన విద్య వారు ప్రదర్శిస్తూ శివ నాట్యానికి తోడ్పడుతున్నారు .సరస్వతీ దేవి మొదలైన దేవతలు అన్నిభాషలలో భవానీపతిని స్తోత్రాలతో కీర్తిస్తున్నారు .
‘’ఎకతో భారతీ ముఖ్య దేవీ స్తుతీ –రన్యతో భారతీః శబ్ద భేదాక్రుతిః
సర్వతో భారతీః కామ మాకర్ణయన్ –సంననర్త స్వయం శ్రీ భవానీ పతేః’’
ఒకవైపు సరస్వతీ దేవి మొదలైన దేవతల స్తోత్రాలు ,మరో వైపు శబ్ద భేదాల ఆకృతులతో వివిధ భాషలను ,అన్ని వైపులనుంచి ,అన్నివిధాల వాక్కులు స్వేచ్చగా వింటూ భావానీపతి స్వయం గా ఆనందంగా నృత్యం చేస్తున్నాడు .
ఇప్పుడు సరస్వతీ పుత్రుని శివతాండవ వర్ణన లోకి తొంగి చూద్దాం –
‘’అలలై బంగారు –కలలైపగడపు –బులుగుల వలెమ –బ్బులు విరిసి’’నాయి .శివతాండవ శివ లాస్యాలను చూసి ఏమానందము ఇలాతలమున ‘’అను కొంటున్నారు .పక్షులు వేదగానం ,హైమవతి నూపుర నాదం తోడైనాయి .
‘’పలికెడు నవెప –క్షులు ప్రాబలుకులో –కల హైమవతీ –విలసన్నూపుర-నినాదములకు –న్నను కరణ౦బులో’’అన్నట్లున్నాయి .పార్వతికి గీర్వాణి భారతి అలంకారం చేస్తోంది .శివుడికి బ్రహ్మ సకలాభరణాలతో అలంకరిస్తున్నాడు .భ్రు౦గాలు గొంతు సవరిస్తున్నాయి .ఇది మహదానందం –‘’ఒహోహోహో –యూహాతీతం –బీయానందం –బిలాతలంబున ‘’అని ఉప్పొంగిపోయి రాశారు సరస్వతీ పుత్రులు .ఆర్యా ప్రాణేశుడు చేసే నాట్యాన్ని చూడటానికొచ్చిన ఆల మృగాలు పరవశించి ఆనంద బాష్పాలు రాలుస్తుంటే ‘’విశ్వేశ్వరుని అడుగులు కడగటానికా ?’’అన్నట్లు ఉందట .రంగం సిద్ధమై౦ది కనుక కవి శివుని సంసిద్ధం కమ్మని కోరుతున్నాడు –
‘’నీ నృత్తములో నిఖిల వాజ్మయము –తానము మరియు గానము గాగను –తాండవింపగాదరుణం బైనది –ఖండే౦దుధరా గదలుము నెమ్మది ‘’అన్నాడు .
తాండవ నృత్య కేళీ విలాసం
‘’తలపైని చదలేటి యలలు దా౦డవ మాడ –నలల త్రోపుడుల గ్రోన్నెల పూవు గదలాడ –మొనసి ఫాలము పైన ముంగురులు చెరలాడ –గను బొమ్మలో మధుర గమనములు నడయాడ –గనుపాప లో గౌరీ కసి నవ్వు చిందింప –గను చూపులను తరుణ కౌతుకము జు౦బింప-గడగి మూడవ కంట కటి నిప్పులు రాల –గడు నేర్చి పెదవిపై గతిక నవ్వులు వ్రేల –ధిమి దిమిధ్వని సరిదిరి గర్భములు తూగ-నమిత సంరంభ హాహకారములు రేగ –ఆడేనమ్మా శివుడు –పాడెనమ్మా భవుడు ‘’ఇలా ఉద్ధృతంగా శివుడు తాండవం చేస్తున్నాడని మహాద్భుతంగా ,అనుభవైక వేద్యంగా శ్రీ పుట్టపర్తి వారు వర్ణించారు .ఆ తాండవం లో మనలనూ భాగ స్వాములను చేశారు .అదీ వారి రచనా నైపుణ్యం .
ఇప్పుడు భరద్వాజ శివుడు ఏం చేస్తున్నాడో చూడాలి –
‘’చంచలాభాసితా కా౦చ నా౦చద్రుచా –చంచలా భాసితా వ్యోమ యాతా జటాః
చంచలా భాసితా వేవ భాసీ దధత్ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
బంగారపు పవిత్ర కాంతి చేత అంటే లక్ష్మీదేవి చేత ,ఆకాశాన్ని చేరిన జడలు మెరుపుల చేత ప్రకాశ మానమైనాయి.ఇలా చంచలా భాసితమైన రెండు కాంతులను ధరించి శివుడు బాగా నర్తించాడు
లక్ష్మీ దేవికి చంచల అనిపేరు ఒక చోట స్థిరంగా ఉండదు .కాని విష్ణు మూర్తి వక్షస్థలం పైన మాత్రం స్థిరంగా ఉండిపోతుంది .అయినా చంచలమైనది అనే అప్రతిష్ట మాత్రం ఆమెను వదలలేదు .శివుడికి కాంచన ఉత్తరీయం లేదు .ఆయనకున్నది పులి తోలు ఉత్తరీయమే .కాని నాట్య సమయం లో శివుని శరీరకాంతి బంగారు కాంతి అంటే చంచల కా౦తిగానే అనిపించింది .నాట్యం లో తలపైకి ఎగరేసినపుడు శివుని జటాజూటం ఆకాశాన్ని అంటింది .నీలాకాశపు మెరుపు తీగలచేత యెర్రని జడలు ప్రకాశించాయి .ఇలా రెండుకాంతులు చంచలాలే .అవి శివునికి గొప్ప ఉత్తేజం కలిగించి బాగా నాట్యం చేయటానికి దోహదమైనాయని కవి భావన .
ఇప్పుడు శివుని నాట్య శబ్దాల విశేషాలను వర్ణిస్తున్నాడు భరద్వాజ మహర్షి –
‘’తక్క తో ధిక్క తోతౌ తధా తైతధై-తోంగ దద్మాంగ దిన్నర్త శబ్దాన్ముహుః
ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
నాట్యం లో వచ్చే ‘’తక్కతాది’’ శబ్దాలను ఉచ్చరిస్తూ నవ్వుతూ ముఖాన్ని వికసింప జేస్తూ శివుడు నాట్యమాడాడు .ఇదంతా లయ విన్యాసానికి చెందిన కసరత్తు .ఇక రాగ విన్యాసాన్ని వివరించ బోతున్నాడు మహర్షి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-16-ఉయ్యూరు .

