శ్రీ శంకరం లోక శంకరం -2
ఎలా ఉన్నాడు శంకరుడు ?’’వేద విద్య లో బ్రహ్మకు సమానం .వేదాంత ఉపనిషద్విద్య లో బృహస్పతి .వేద కర్మ వ్యాఖ్యానానికి జైమినిమహర్షి తో సరి జోడు .వేద తత్వ మూలానికి వ్యాస భాగవానులే .మూర్తీభవించిన వేద వ్యాసుడే శ్రీ శంకర భాగవత్పాదులవారు ‘’అన్నారు విద్యారణ్య స్వామి .8ఏళ్ళ వయసులో కపిల మహర్షి రాసిన సాంఖ్యశాస్త్రాన్నీ ,పతంజలి రచించిన యోగ శాస్త్రాన్నీ ఔపోసన పట్టిన ప్రజ్ఞా మూర్తి .భట్ట పాదుల వార్తికాన్ని అవగాహన చేసుకొన్నవాడు .అద్వైత సుఖాన్ని పొంది ,వేద సారాన్ని ఒక చేతిలో ,జ్ఞాన సముద్రాన్ని రెండవ చేతిలో ధరించి ,ఎదుటివారి వాదనలోని స్కాలిత్యాన్ని అంటే దోషాలలాంటి ముళ్ళనుతీసివేసే ప్రజ్న కలిగి ఉన్నాడు అంటారు మాధవ విద్యారణ్యు లు .చంద్రుడూ,శ0కరుడూ అమృతాన్నే ఇస్తారట .చంద్రుడు కాంతి రూపం లో ఇస్తే ఈబాల శంకరుడు వేదాంత భావనా రూపంగా కాంతి నిచ్చాడట . చంద్రుడు నక్షత్ర కాంతిని హరిస్తాడు .ఈ శంకర ముఖ చంద్రుడు సజ్జనుల తేజస్సును పెంచుతాడట.
శంకర ఫాల భాగం పై ధరించే మూడు విభూతి రేఖలు గంగా ,యమునా సరస్వతీ నదుల పవిత్ర త్రివేణీ సంగమం .అవి మూడు వేదాల శిరస్సులనే ఉపనిషత్తుల వ్యాఖ్యానాలనే మూడు కీర్తులుగా భాసిస్తున్నాయన్నారువిద్యారణ్యు లు .అజ్ఞా నారణ్యం లో భార్యా ,పిల్లలు అనే కార్చిచ్చు మంటల చేత తపిస్తున్న జనానికి ,ఆత్మ విద్య ను ఉపదేశించటానికి శ్రీ మేధా దక్షిణా మూర్తియే ,మౌన ముద్ర వదిలి శ్రీ శంకరాచార్యులుగా అవతరించారట .శంకర యతీశ్వరునికి ,కైలాసవాసి పరమేశ్వరునికి పోలికలతో పాటు ఒక ముఖ్య భేదం కూడా ఉందట .భగవత్పాదులు వైదిక మార్గాన్ని అనుసరించి యజ్న యాగాదులు చేస్తూ చేయించారు .కాని పరమ శివుడు మామగారైన దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళకుండా భార్యకు అవమానం జరిగిందని తన వీరభద్రావతారం తో దక్ష యజ్న వినాశనం చేయించాడు అని చమత్క రించారు మాధవ విద్యారణ్య స్వామి .శంకరుడు అనే హిమవత్పర్వతం నుండి బయలుదేరిన ‘’వాక్కు ‘’అనే గంగా ప్రవాహం ,దుస్టవాదాలను హరించి ‘’వైదిక పంటలు ‘’పండించింది .శ్రీ శంకర వాక్ పరిమళాన్ని పచ్చ కర్పూరం అప్పుగా తెచ్చుకొందట .కస్తూరి పరిమాణం గా గ్రహించిందట .కుంకుమ పువ్వు కొనుక్కోన్నదట .ఇదంతా చూసి మంచిగంధం ఏకంగా తస్కరించిందని విద్యారణ్య చమత్కారం .
శంకరా ద్వైతం లో విశిష్టత ఏమిటి ?పూర్వం అరణ్యాలలో మహర్షులు మాత్రమే ఆత్మ జ్ఞానం టో అద్వైత సుఖాన్ని దర్శించారు .అందుకే అది అంతా ‘’ఆరణ్యకం ‘’అయింది .గౌతమ బుద్ధుడు దాన్ని జనసామాన్యం లోకి తెచ్చాడు .కాలక్రమంలో అది భ్రస్టు పట్టింది .శంకరాచార్య వచ్చి అద్వైతాన్ని మళ్ళీ నిల బెట్టారు .అందుకే వివేకానందస్వామి ‘’నైతిక దృక్పధం లో బుద్ధుడు ,శాస్త్రీయ దృష్టిలో శంకరుడు అద్వైతాన్ని నిలబెట్టారు ‘’అన్నాడు .శంకరాద్వైతం లో మరో విశిష్టత ఉంది .క్షుద్ర దేవతారాధన చేసే కాపాలికుల విశ్వాసాలను భద్ర పరిచింది .అద్వైత దైవం ‘’సమస్వరూపుడు ‘’.సర్వం ఆయనే .సర్వాన్నీ ఆయన గా చూడటమే అద్వైతం .
శంకర భగవత్పాదులు ఒక విజ్ఞాన సర్వస్వం .వాదనా సామర్ధ్యానికి పరాకాష్ట .జ్ఞాన సాగరం ఆయన .వైరాగ్య హిమవన్నగం .సంస్కృత వాజ్మయానికి మహా గొప్ప ప్రచారకులు .ఆయన స్తోత్రాలు అమృత ధార.జ్ఞాన గంగాస్నాన ఫలాన్నిస్తాయి .జీవన్ముక్తి సాధకాలు .అంతటి ప్రతిభా ప్రజ్ఞామూర్తి మళ్ళీ జన్మించనే లేదు .వ్యాసమహర్షి సాక్షాత్తు విష్ణు మూర్తి అయితే శంకరాచార్య అపర శంకరుడే .భగవంతుడిచ్చిన ఆయుర్దాయం 8ఏళ్ళు మాత్రమే.అగస్త్యాది మహర్షులిచ్చింది మరో 8 ఏళ్ళు .అంటే 16 ఏళ్ళకే జీవితం చాలించాల్సి ఉంటుంది .మరి ఈలోపలే ఎన్నో అద్భుతాలు సాధించారు .తల్లి ఎప్పుడు మనసులో తలుచు కొంటె అప్పుడే ఆమెదగ్గరకు వచ్చి వాలుతానని తల్లికి వాగ్దానం చేసి ,సన్యాసియై సరైన గురుని అన్వేషిస్తూ కాలినడకన కాలడి నుండి బయల్దేరారు .నర్మదా నదీ తీరం లో కొండపై ఒక గుహలో శ్రీ గోవింద భగవత్పాదులు ఉన్నారని తెలుసుకొని దర్శించటానికి శంకరులు చేరారు .చూడగానే ‘’ఎవరు నువ్వు?అని ప్రశ్నించారు గౌడ పాదులనే, గోవింద భగవత్పాదులు .అయన వేద ,ఉపనిషత్తుల ను శిష్యులకు నేర్పుతూ బహుళ కీర్తి నార్జించారు .సాక్షాత్తు శుక మహర్షి అవతారం .అప్పుడు శంకరాచార్య –
‘’మనో బుధ్యహంకార చిత్తానినా-న శోత్రం న జిహ్వా , నచ ఘ్రాణ,నేత్రే –నచ వ్యోమ భూమి ర్న తేజో ,న వాయు-శ్చిదానంద రూపం శివోహం శివోహం ‘’అని జవాబు చెప్పారు శంకరులు .భళా అనుకోని,ఈయన కోసమే తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పి’’స ప్రాంగ శంకర స శంకర ఏవం సాక్షాత్ ‘’అని శిష్యునిగా స్వీకరించారు గోవిందులు .ఒక రోజు అర్ధ రాత్రి హోరు గాలి ,వానతో నర్మదా నది విజ్రుమ్భించి పొంగి గుహలోకి నీరు చేరే స్థాయికి చేరింది గురువు గాఢ నిద్రలో ఉన్నారు .శంకరులు ఓంకార జపం చేస్తూ నర్మదా స్తుతి చేస్తూ కాలం గడిపారు .అంతే నర్మద శాంతించింది దిశ మార్చుకొని తరలిపోయింది . .తెల్ల వారేసరికి అంతా ప్రశాంతం గా ఉంది .ఈ విషయం శిష్యులు గురుదేవులకు తెలియ జేశారు .మహా ప్రసన్నులై నాలుగు మహావాక్యాలు ,ఉపనిషత్తులు బోధించి వాటికి వ్యాఖ్యానం రాయమని ఆదేశించారు .అలానే చేశారు శిష్య శంకరులు .గౌదపాడులున్న ఈ క్షేత్రం లో ఓంకారేశ్వర శివుడున్నాడు .అందుకే ఇది ఓంకార క్షేత్రమైంది .ఇక్కడి జ్యోతిర్లింగం’’ మామలేశ్వర జ్యోతిర్లింగం’’ గా ప్రసిద్ధం .రెండుకొండల నడుమ ఈ క్షేత్రం ఓంకారాకృతిలో కనిపించటం మరో విశేషం .
గురువు ఆజ్ఞను ఔదల దాల్చి శంకరులు ప్రస్తాన త్రయం అంటే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత లకు మహా భాష్యం రాశారు .బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ శిష్యులకు వివరిస్తుంటే వ్యాసభగవానుడు శిష్య రూపం లో వచ్చి వింటూ వాదిస్తూ 8రోజులు ఉన్నాడు .చివరి రోజు శిష్యుడొకడు ఆయన వ్యాసర్షి అని తెలియ జేస్తే అమాంతం పాదాలపై వాలి పోయారు శంకరులు .ఆప్యాయంగా లేపి కౌగిలి౦చు కొనిఅద్భుతమైన వ్హాఖ్యానం చేశాడని శంకరులను వ్యాసుల వారు అభినందించారు .16వ ఏడు దాటి పోతోందని తెలిసి కాశీలో ప్రాణ త్యాగం చేయాలనుకొన్న శంకరులకు వ్యాసభగవానుడు దర్శన0 అనుగ్రహించి ఆయనతో చాలా పని మిగిలి పోయిందని తాను మరొక 16సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తున్నానని జన్మించిన దానికి సార్ధకం చేసుకోమని చెప్పాడు .
కాశీలో భట్ట పాదుడు చుట్టూ ఊక పేర్చుకొని దహనం చెందే ప్రయత్నం చేస్తున్నప్పుడు శంకరులు అటుగా వెడుతూ విషయం తెలుసుకొని ఆయన సాక్షాత్తు కుమార స్వామి అవతారమని కనుక ఆత్మ త్యాగం వద్దని చెప్పి శిష్యునిగా స్వీకరించి వార్తికం వ్రాయమని కోరారు. అలానే చేశాడు భట్ట పాదుడు .నర్మదా నదీ తీరం లోని మాహిష్మతీ పట్టణం లో ఉన్న కర్మిస్టి,జ్ఞానమార్గానికి వ్యతిరేకి అయిన మండన మిశ్రుని వాదం లో ఓడించి శిష్యుని చేసుకొని ,ఆయన భార్య ఉభయ భారతి తననూ ఓడించాలని కోరితే ‘’కామ శాస్త్రం ‘’లో తనను ఓడించ మని కోరింది. గడువు కోరి మరణించిన అమరుక మహారాజు శరీరం లో పరకాయ ప్రవేశం చేసి అంతఃపుర స్త్రీలతో శృంగారం అనుభవించి ఆ విద్యలో అఖండుడు అని పించుకొని అమరుక కావ్యం రాసి ,మళ్ళీ తన శరీరం లో ప్రవేశించి ఉభయ భారతిని కామ శాస్త్రం లో వాదం తో ఓడించి ఆమెను మళ్ళీ బ్రహ్మ లోకానికి వెళ్ళేట్లు చేశారు శంకరులు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-16-ఉయ్యూరు