మండు వేసవి తాపం తీర్చిన చినుకు జల్లు
ఎండలుమెండు గా కాస్తున్న నడి వేసవిలో భానుప్రతాపం నలభై కి పైగా ఉన్న కాలం లో 11వసంతాలు పూర్తి చేసుకొని 12వ ఏట అడుగు పెట్టిన చినుకు మే నెల ప్రత్యేక సంచిక కురిపించిన చిటపట చినుకులలో రెండు రోజులు చదివి తడిసి ముద్దయ్యాను .ఒక సంక్షిప్త విజ్ఞాన సర్వస్వమని పించింది .శ్రీ నండూరి వారి ప్రత్యేక శ్రద్ధకు జోహార్లు .184పేజీలతో ,25వైవిధ్య కధలు ,6సమీక్షలు ,14విశ్లేషణాత్మక వ్యాసాలు ,25కవితలు ,,చారిత్రిక పరిశోధక బ్రహ్మ శ్రీ పి.విపరబ్రహ్మ శాస్త్రి గారి తో శ్రీ పన్నాల భట్టు గారి ముఖా ముఖీతో ‘’అందమైన ఎటో కొత్తస్వరం కోసంఎదురు చూస్తున్నచేపకళ్ళ చిన్నదాని ముఖ చిత్రం తో ప్రత్యేక చినుకు ‘’ సంపాదకులు ఆశించినట్లు కొత్త స్వరం వినిపించింది .
శ్రీ జొన్న విత్తులవారి ‘’ఝరి’’కద పత్రికకే తలమానికం .ఆ రచనా ఝరిలో కొట్టుకు పోతాం .అంత పకడ్బందీ గా ఉంది .నేటివిటీ వసంతమై విరిసింది .శ్రీ రామా చంద్ర మౌళి వినిమయ సంస్కృతీ మేక్ అండ్ సేల్స్ పై రాసిన కదా బాగుంది .మనిషి తనను సామాజిక రుగ్మతల నుండి కాపాడుకోవాలని హితవు చెబుతూ ,ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజ్ రీ ఇమ్బర్స్ మెంట్ నిలయాలయ్యాయని చదువు చెప్పరని ,అక్కడి రాంకులు ,డిస్టింక్షన్లు బోగస్ అని నిర్మొహమాటంగా చెప్పారు .చదువే ధైర్య స్తైర్యాలిచ్చి జీవితాన్నిస్తు౦దన్నారు .మనం మనకోసం సమాజం కోసం దేశం కోసం బతకాలన్న సత్యాన్ని చెప్పారు .చనిపోదామనుకొన్న ప్రేమికులు చివరికి కలిసే జీవించాలని నిర్ణయి౦చుకొన్నకద శ్రీమతి సత్యవతి గారి ‘’కలిసే ప్రయాణం .దేశం లో ,కాలం లో కొత్త నీరు ప్రవహిస్తుందని విహారి కధలో చెప్పగా ,నారాయణ్ మలయాళీ కధకు శ్రీ స్వామి తెలుగు సేత బాగుంది చక్కని వ్యంగ్యమూ ఉంది .సామాన్య కిరణ్ కద ఒక అభాగ్యు రాలైన విధి వంచిత వ్యధ .తనకోసం వచ్చే విటుల్ని ‘’కుక్కలు కాదు ఇంకేవో ‘’అనటం ,వేశ్య రేప్ చేయబడితే ఎవరూ పట్టించుకోక పోవటం నేటి సమాజ స్థితికి అద్దంపట్టింది .సొల్లు అదే నండీ సెల్లు అదే బాబూ ‘’ఊసు ‘’కోసం రేపటి జనరేషన్ ఎలా పుట్టటానికి తయారై లోకం లోకి వస్తారో చెప్పే శ్రీమతి జ్యోతిష్మతి సరదా కత,గిరిజన స్కూల్ కోసం ఉన్న భూమిని ప్రభుత్వానికి అర్పించి తిండిలేక తన నేలమీదే తాను పరాయివాడైన బూగన్న కద కళ్ళు తెరిపిస్తాయి .వేదగిరి రాంబాబు రాసిన అందం కధలో మానసిక అందం గొప్పదని చాటారు. పలమనేరు ,బాలాజీ ప్రేమకధ చిలిపిగా సాగితే ,మిధ్యాహ్న భోజనమైన మధ్యాహ్న భోజనం కద ఓబుల్ రెడ్డి రాశారు .సాధువును మోసం చేసిన ముగ్గురు కుర్రాళ్ళు పోలీసుల చేతిలో ధర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ పొందటం విష్ణుతో పాటు సాధువూ ఎస్సై చేతిలో చావటం ఒళ్ళు గగుర్పొడిచేట్లు రాశారు అద్దేపల్లి ..దేవ పుత్రది ఛిన్న కధే కాని పెద్దమనసున్న అవ్వ కద.’’ఆయమ్మ కంటిలో ఆకులను నమిలి మింగి రసాన్ని ఊదితే అంటూ ముట్టూ లేదు ఇప్పుడేమిటి తమ్బాకులు మీదికి ఇసిరేసి౦దేమి ‘’అని మనవడు అడిగితె అవ్వ ‘’దాన్ని ‘’వైద్దికం’’అంటారు దానికి దోషం లేదు ‘’అన్న అవ్వ గొప్ప మనసు ను దర్శింప జేస్తాడు . . మిగిలిన కధలూ బాగానే నడిచాయి అలరించాయి .
కవితలలో అడిగోపుల అండమాన్ జైలు లో ‘’ఒక గది హింస ఇంకొక గదికి తెలియదు ‘’అన్నారు .శివారెడ్డి ‘’దేవుడు కూడా లేని వాళ్ళం ‘’అని అనాధతో అనిపిస్తాడు .దేశాన్ని ప్రేమించి దానికోసం పాటు పడే వాడుంటే అడ్రస్ చెప్పమన్నారు దాస్ .తొలకరి కన్నీరు హృదయం లోకి ఇంకిందట లక్ష్మీ రాధికకు .వెంకట రెడ్డి ‘’ఆలోచనలు ‘’లో ‘’వ్యక్తిత్వం అంటే జీర్ణించుకొన్న అలవాట్లే ‘’.దేశానికి తలపాగా లాంటి,జాతి కడుపు ఆకలి తీర్చే రైతన్న కనిపించటం లేదు కారణం భూగోళం ఆకలి పుండుగా మారటమే ‘’అని రవీంద్ర ,అంటే, కాశ్మీర్ ముఫ్తీ కి హైమవతి కుంకుమ పూల హారం వేశారు .’’నువ్వు గుమ్మం లో ఎదురవ్వడం కాదు –బ్రతుకంతా తోడవటం ముఖ్యం ‘’అనగల సత్తా పాటిబండ్ల రజనిది.ఒంగిన ఆకాశం వంకకే తన పయనమని ,ప్రతిక్షణం ప్రతీక్షణం స్వప్నాల సుమ వాటికలో కోర్కెల కొమ్మకు పూచిన పుష్పం లా శిధిలమై ,శీర్ణమై రాలి పోతాను నీ ముందు ‘’అన్న సూర్య ప్రకాష్,’’నాన్న పై ఖండువా ,నా దుఖాన్ని అదిమి పెట్టే అధారమయింది ‘’అన్న నాగ రాజ లక్ష్మి అభినందనీయులు .స్వేచ్చ విలువ లింకన్, మహాత్ముడు ,,మండేలాలకే తెలుసు అంటాడు శ్రీ హస్త .’’అతడు ఎదురై నాలో అలజడిని ,అలల జడిగా మారుస్తాడు .నేను అప్రయత్నంగా అక్షరమైతే ,అతడు నా ముందు అద్దమై నిలబడుతాడు ‘’’అన్నమాటలు ’నల్లా ఇరికే ‘’గా ఉన్న రోహిణి కుమార్ భావుకత .అరసవిల్లి కృష్ణ ప్రోజ్ పోయెం ,’’దూరం గా జలపాతం కనిపిస్తుందేమోనని సూర్యుడు చెట్ల భుజాలెక్కి చూస్తున్నాడు ‘’అన్న ఆంజనేయ కుమార్ ఎండాకాలం కవితలు కొత్త స్వరమే పూరించాయి .’’వెలుతురు సోకని మరణ మార్గాల ద్వారా –కాంతి అడుగుల విత్తనాలు నాటి వద్దాం ‘’అని రాసిన మెర్సీ అభినందనీయురాలు .తతిమ్మా కవితలూ ఎన్నదగినవే .
భట్టుగారి పరబ్రహ్మ శాస్త్రి గారితో ఇంటర్వ్యు ఆయన ప్రతిభను చాటింది ‘’ఆసేతు హిమాచల పర్యంతం ‘’అనే కాన్సెప్ట్ ను తెచ్చి రుజువు చేసినవాడు సముద్ర గుప్తుడు అంటారు శాస్త్రిగారు .చారిత్రిక పరిశోధనా పరమేశ్వరులాయన . అశోక్ కుమార్ రూప విమర్శ సమగ్రమై విశేషంగా ఉంది .జయకాంతన్ కధల్లో మానవీయతను మధురాంతకం దర్శిస్తే ,రాజి రెడ్డి వైబ్రేటింగ్ వాక్యాలు ,ఫ్లెక్సిబుల్ గా సాగి రూపొందించిన శిల్పమే అది అని ,ఆయన వాకింగ్ ,డాన్సింగ్ కలిసిన రచయితగా లక్ష్మీ నరసయ్య చూపాడు .రాచపాలెం రెడ్డిగారి పునర్మూల్యాంకనం యెంత అవసరమో చదివితే తెలుస్తుంది .సాహిత్య చరిత్ర నిర్మాణం లో మణిపూస శ్రీమతి సుసర్ల నరసాంబ గురించి కాత్యాయిని గారు ఎన్నో విషయాలు తవ్వి తీశారు .కడియాల వార్షిక ‘’కవితా వికాసం ‘’వారి ప్రతిభా ,నిష్పక్ష పాతాలకు నిదర్శనం .ఒకప్పుడు ఆంద్ర ప్రభలో శ్రీ వాత్సవ ఇలాగే రాయటం జ్ఞాపక మొస్తుంది .అమ్మల౦దరికి వందనాలు ఉమా గారు చేస్తే ,,సామ్యుల్ బెకెట్ అసంగత నాటక విశేషాలను ఆడెపు లక్ష్మీ పతి తనదైన శైలిలో సమగ్రంగా వివరించారు .క.వ.న.శర్మ గారి ఐజాక్ అసిమోవ్ జీవిత చిత్రణ మంచి స్థాయిలో ఉంది. మిగిలిన వ్యాసాలూ జాగ్రత్తగా చదవ దగినవీ అధ్యయనం చేయ దగ్గవికూడా .
కొత్త స్వరాన్ని వినిపిస్తానన్న సంపాదకుడి ఆశయాలకు అనుగుణం గా చినుకు ఆస్థాన కవి, రచయిత గాయకులైన గుమ్మా ,వెన్నా ,జాన్సన్ ,లంకె, సశ్రీ ,బృందావనం ,రామ తీర్ధ ,జగద్ధాత్రి మొదలైన వారు పాతవారే అయినా కొత్త స్వరాలూదారు .చినుకుకు కొత్తదనం చల్లదనం ,పరిమళం అద్దారు కొన్ని వడగళ్ళ చినుకులూ కురిపించారు .ఇందులో శిమ్మన్న గారు లేక పోవటం వెలితిగా ఉంది .వంద రూపాయల ఈ ‘’ప్రత్యేక చినుకు ‘’వేసవి హృదయ తాపాన్ని తీర్చే చల్లని చినుకుల ఝరి.
గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-16-ఉయ్యూరు

